అమృత వర్షిణి
గోవర్ధన గిరీశం…. స్మరామి అనీశం….. గోవర్ధన గిరీశం….
తొలివేకువ చలిని ఛేదిస్తూ, ఆ స్వరం నన్ను మేల్కొలిపింది. గోవర్ధనగిరిధారికి హిందోళరాగంలో వందనమర్పించే కీర్తనది. దోమతెరని తొలగించి, మంచం మీదనుంచి కిందకి దిగాను. వంటింట్లోంచి గిన్నెల శబ్దాలు వినిపిస్తున్నాయి. రేవతికి తెల్లవారుజామునే లేవడం అలవాటు. అప్పుడే వంట ప్రయత్నాలు మొదలుపెట్టేసినట్లుంది. గతులను సక్రమంగా పాటిస్తూ, చక్కటి నైపుణ్యంతో పాడుతున్న ఆ కీర్తన కొనసాగింది. నా మనసు ఆ గానం వెనువెనకే తిరుగుతోంది. ఆ ఆలాపన నా అంతరంగాన్ని మృదువుగా తాకింది. పాడుతున్నది ఎవరై ఉంటారా అని ఆలోచించాను. బహుశా ఈ మధ్యే కొత్తగా మా పక్కింట్లోకి వచ్చిన వాళ్ళేమో!
చిన్నప్పటి నుంచి నాకు సంగీతమంటే ఇష్టం. కానీ చాలా ఆలస్యంగా నేర్చుకున్నాను. చదువు పూర్తయ్యి ఉద్యోగం వేటలో ఉన్నప్పుడు సంగీతం పై దృష్టి సారించాను. వర్ణాల వరకు నేర్చుకున్నాను. ఏవో కొన్ని కీర్తనలను పాడగలను. తర్వాత బ్యాంకులో ఉద్యోగం రావడంతో క్రమంగా సంగీతం మరుగునపడి, నా గుండెలోతులలోకి…..అట్టడుగుకి చేరింది.
రేవతికి సంగీతం అంటే అసలేమాత్రం ఆసక్తి లేదు. సినిమా పాటలని మాత్రం అప్పుడప్పుడు వింటుందంతే. శాస్త్రీయ సంగీతమంటే మరీ వెగటు. టి.వి. లో ఏదైనా శాస్త్రీయ సంగీత కార్యక్రమం వస్తుంటే చటుక్కున టి.వి. కట్టేస్తుంది లేదంటే ఏదోక నెపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను మనస్పూర్తిగా పాడుకోగల స్థలం మా ఇంట్లో ఏదైనా ఉందంటే అది బాత్ రూం ఒకటే! నేను పాటలో లీనమై బాత్‌రూంలో ఎక్కువసేపు గడిపితే, రేవతి గట్టిగా తలుపుని బాదేస్తుంది. “నాకు చాలా అవసరం” అంటుంది. అంతే! గానాన్ని, స్నానాన్ని ఒకేసారి ముగించి బయటపడతాను.
“త్వరగా రడీ అవ్వండి. లేదంటే రైలు అందదు” అంటుంది ముఖానికి నవ్వు పులుముకుంటూ.
“పాడుకోడం నేరమా?” అంటూ నేను వాదిస్తాను. తను గొణుక్కోడం మొదలుపెడుతుంది.
“మీరు మీకున్న సెలవలన్నీ వాడేసుకున్నారు. ఫిలిం ఫెస్టివల్, కవితా గోష్టులు, యూనియన్ మీటింగులు….. వీటి పేరు చెబితే చాలు.. మీకు మైకం కమ్మేస్తుంది. సెలవు పెట్టేస్తారు. ఇలా అయితే ఎలా? జీతం పూర్తిగా రాదుగా? ఏం తింటాం?” అని అంటుంది.
“రేవతీ, గత పది పన్నెండేళ్ళుగా మనం చేస్తున్నది ఇదేగా? వండుకోడం తినడం….”
“అంటే తప్పంతా నాదేనంటారు?”
“నేనలా అనలేదు”
“అనక్కర్లా. చిన్న పిల్లలకి సైతం మీరేం చెప్పదలచుకున్నారో అర్ధం అవుతుంది”
“నువ్వు నేను మాట్లాడిని ప్రతి మాటకి కొత్త అర్ధాలు తీస్తావు. బహుశా నీకు అందులో ఆనందం ఉన్నట్లుంది”
“పోన్లెండి. నాకు ఆ ఆనందాన్నైనా దక్కనివ్వండి. లేకపోతే జీవితం విసుగ్గా ఉంటుంది”
“నేనా దానికి కారణం?”
ఇలా కొనసాగుతుంది మా వాదన. నిజానికి మా ఇద్దరికీ తెలుసు - ఇది ఏ ఒక్కరి తప్పు కాదని! మా ఇద్దరి మధ్య మానసిక విభేదాలు కూడా ఉన్నాయి. అవే మా ఇంట్లో పసిపిల్లల ఏడుపు వినే అదృష్టాన్ని మాకు దూరం చేసాయి ( ఆ ఏడుపు మాకు సంగీతంలా ఉండేదేమో). ఇద్దరినీ ఒకరిని ఒకరు నిందించే హక్కు లేదు. అయినా నోరు ఊరుకోదు. అనవసరమైన విషయాలన్నింటినీ పట్టించుకుంటుంది. కొత్త గాయాలను చేస్తుంది. పాత గాయాలను తిరిగి రేపుతుంది. ఆ గాయాలు మానేవరకు మా మధ్య నిశ్శబ్దం కొనసాగుతుంది. ఒకటి రెండు రోజుల పాటు ఇద్దరం మాట్లాడుకోం.
దూరంగా వంతెన పై రైలు వెడుతోంది. నా అంతరంగాన్ని తరచి చూస్తే నేను విన్న ఆ కీర్తన నాలో ఇంకా ప్రతిధ్వనిస్తోంది. స్వరాలు తరంగాలై నాకు ఆనంద విహ్వలతని కలిగిస్తున్నాయి.
స గ మ ద ని సా ……
మా పక్కిల్లు చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది. దాంట్లోకి అద్దెకి ఎప్పుడు దిగారో, వాళ్ళ గురించి నాకేమీ తెలియదు. కానీ ఆ గాయని పడుచుపిల్లని మాత్రం చెప్పగలను. బహుశా ఆమె వయసు 20-25 సంవత్సరాల మధ్య ఉండచ్చు. ఆమె రూపురేఖలు కూడా ఆమె స్వరంలా చక్కగా ఉంటాయేమో? ఎలా ఉంటుందా అమ్మాయి? ఆమెకో ఆకృతినివ్వడానికి ప్రయత్నించాను. నాకు తెలిసిన అందమైన మోడళ్ళ, సినీతారల, ఇటీవలే మా ఆఫీసులో చేరిన ఓ కొత్త అమ్మాయి ముఖాలు నా కళ్ళ ముందు కదలాడాయి.
నా హృదయంలో ఏదో అలజడి…. చాలా ఏళ్ళుగా లోలోపల అణిగిపడున్నదేదో బయటపడాలన్న ఆరాటం…
‘కడుపు నిండుగా ఉన్నా, రుచులు నోరూరిస్తాయి…” అని ప్రముఖ కవి కుమరన్ ఆశన్ అన్న మాటలు గుర్తొచ్చాయి.
ఉదయం పూట నాకెప్పుడూ హడావుడి తప్పదు. ఎనిమిది గంటల రైలందుకోవాలి. అందులో వెళ్ళలేకపోతే, బస్సులు పట్టుకుని వెళ్ళాలి. పావుగంటకి పైగా ఆలస్యమవుతుంది. రాత్రి పూట ఎప్పుడూ తొమ్మిది గంటలకన్నా ముందు ఇంటికి రాలేను. అది కూడా రైలు టైం ప్రకారం నడిస్తేనే. ఈ ఉరుకుల పరుగుల ప్రయాణం నన్ను వేరే దేనిమీదా దృష్టి నిలపనీదు.
తప్పనిసరి బదిలీల కారణంగా ఉద్యోగులు దూరప్రాంతాలకి వెళ్ళాల్సొస్తుంది. నాకూ తప్పలేదు. ఈ నియమం రైల్వేలకే లాభదాయకం. సీజన్ టికట్ల ఆదాయం పెరుగుతుంది. కానీ బ్యాంకుకి, ఉద్యోగులకి ఏం లాభం? ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉంటారు. అది ఖాతాదారుల సేవలపై ప్రభావం చూపుతుంది. అదృష్టవశాత్తు రేవతిని మా ఇంటి దగ్గరి బ్రాంచిలోనే కొనసాగించారు. బహుశా ఇంకొన్ని రోజులక్కడే ఉంచచ్చు.
నేనా రాత్రి ఇంటికొచ్చేసరికి, రేవతి బ్యాంకు నుంచి తెచ్చుకున్న ఫైళ్ళతో కుస్తీ పడుతోంది. పనిభారం! వేలంవెర్రిగా కంప్యూటర్లని కొనేసి, ఉద్యోగుల సంఖ్యని కుదించడంతో అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులలోనూ ఇదే పరిస్థితి. ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతే, పనిభారం పెరిగి వాళ్ళ వెన్నెముకలు విరిగిపోతాయి. కానీ బ్యాంకులలో పై అధికారులకీ, ఎగ్జిక్యూటివ్‌లకి వెన్నెముకలే లేకపోడంతో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవు. ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలు పేదరికం బారిన పడుతున్నారు.
భోజనాలు పూర్తయ్యాయి. రేవతి పడగ్గదిలో పక్క సర్దుతోంది.
“పక్కింట్లోకి ఎవరో వచ్చినట్లున్నారు. ఎవరేంటి?” అని అడిగా.
“ఎవడికి తెలుసు?” అంది రేవతి. ఆ మాటలలో ‘ ఈ విషయం నాకనవసరం’ అనే ధోరణి వ్యక్తమైంది.
“పొద్దున్న వాళ్ళింట్లోంచి ఏదో అలికిడి విన్నాను”
“ఈ విషయాలన్నీ పట్టించుకోడానికి నాకు తీరికలేదు. మీకు తెలుసు - నేను ఆఫీసునుంచి రాగానే నేరుగా ఇంటి పనుల్లోకి దిగుతానని! దీనకి తోడు మా బ్రాంచిలో ఇన్‌స్పెక్షన్ జరుగుతోంది…..”
నేనేమీ మాట్లాడలేదు. తన నుంచి ఏ సమాచారం రాదని గ్రహించాను. బెడ్‌రూం లైట్ ఆర్పేసాను. గాఢమైన అత్తరు సువాసన శరీరాన్ని తాకింది. శృంగారం ఓ మొక్కుబడిగా తయారవడం బాధ కలిగిస్తోంది.
* * *
మర్నాడు ఆదివారం. కాలనీవాసుల సౌకర్యార్ధం రేవతి బ్యాంకు ఆదివారం కూడా పనిచేస్తుంది. రేవతి వెళ్ళగానే, పేపరు తిరగేస్తూ కూర్చున్నాను. మొదటి పేజిలో అమెరికా అధ్యక్షుడు బుష్ నవ్వాడు. ఆ దేశానికి ఓ వ్యసనంగా తయారైన యుద్ధాన్ని ప్రతిబింబిస్తున్న వికటాట్టహాసమది. ఇంకో వార్త అమెరికా పట్ల జపాన్ లొంగుబాటు ధోరణి బయటపెట్టింది. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పక్షాలలోని లుకలుకలపై ఇంకో వార్త! ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోడాన్ని మసాలా అద్ది అందించింది ఇంకో వార్త. రచయితలు ఒకరిపై మరొకరు బురదజల్లుకుంటూ, కోర్టు కేసులు పెట్టుకున్న వైనాన్ని ఇంకో వార్త ప్రస్తావించింది. ఇవన్నీ ఆధునిక ధోరణులు…….!
ఆదివారం అనుబంధంలో రెహ్మాన్ దర్శకత్వం వహించిన ఓ డాక్యుమెంటరీ ఫిలిం గురించి రాసారు. గత ఫిలిం ఫెస్టివల్‌లో గుండె బరువెక్కించే ఆ డాక్యుమెంటరీని నేను చూసాను. ఎండోసల్ఫాన్ అనే క్రిమి సంహారక మందు కసర్‌గోడ్ జిల్లాలోని అనేక గ్రామాలలో మిగిల్చిన విషాదాన్ని గురించి ఆ డాక్యుమెంటరీ చెబుతుంది.
గత కొన్నేళ్ళుగా కసర్‌గోడ్ జిల్లాలో జీడిపప్పు పెంపకంలో ఎండోసల్ఫాన్‌ని విపరీతంగా పిచికారీ చేస్తున్నారు. ఎన్నో దేశాలు ఈ క్రిమి సంహారకమందుని నిషేధించాయి. ఇక్కడ మాత్రం ప్రభుత్వం అనుమతితో వాడుతున్నారు. నేల ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా వ్యాపించి ఈ విషం అనేక గ్రామాలలోని ప్రజల జీవితాలతో చెలగాటమాడింది. కాన్సర్ వ్యాపిస్తోంది. గర్భస్రావాలు, నెల తక్కువ పిల్లల ప్రసవాలు సాధారణమైపోయాయి. ఎంతో మంది పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారు. ఆరోగ్యవంతులైన యువతీ యువకులు కూడా ఒక్కసారిగా ఉన్నట్లుండి పక్షవాతానికి గురై, ఆకుకూరలా వడలిపోతున్నారు.
ఈ వార్త నాకా డాక్యుమెంటరీలోని దృశ్యాలను గుర్తుచేసింది. సమాజంలోని నిస్సహాయుల ఆక్రందనలు నన్ను వెంటాడసాగాయి. పేజీ తిప్పి, వానల గురించి చదువుతుంటే ఆ బాధనుంచి కాస్త తేరుకున్నాను.
‘ సుధామయి సుధానిధం…….‘
మళ్ళీ అదే గొంతు! నా గదిలోకి చొచ్చుకొచ్చింది. ఈ సారి అమృతవర్షిణి రాగంలో! వార్తల నుంచి నా దృష్టి మరలింది. ఆ గొంతు ఎవరిదో తెలుసుకోవాలన్న ఆతృత నన్ను నిలవనీయలేదు.
కొన్ని క్షణాల్లో నేను వాళ్ళ గుమ్మం ముందున్నాను. కాలింగ్ బెల్ కొట్టాను. కానీ అప్పటికే ఆ గానామృతం ఆగిపోయింది. కళ్ళ జోడు ధరించిన ఓ నడివయసాయన తలుపు తీసాడు.
“ఎవరు?” అని అడిగాడు.
“నేను మీ పక్కింట్లో ఉంటాను. మిమ్మల్ని పరిచయం చేసుకుందామని వచ్చాను” చెప్పాను.
“సంతోషం! రండి. లోపలికి రండి.” అంటూ లోపలికి పిలిచి కుర్చీ చూపించాడాయన. “నేను కూడా వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నా” చెప్పాడు.
“మీరు ఎక్కడి నుంచి వచ్చారు?”
“కసర్‌గోడ్ నుంచి! నేను కోపరేటివ్ డిపార్టుమెంటులో పని చేస్తాను. ఇక్కడికి అడిగిమరీ బదిలీ చేయించుకున్నా”
“మీ ఫామిలీ?”
“ఒక్కర్తే కూతురు. భార్య చాలా కాలం క్రితమే చనిపోయింది” చెప్పాడు. కాసేపు మా మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది.
“అమ్మాయ్.. అమీనా” అంటూ కూతురిని పిలిచాడాయన. తలుపు వెనకనుంచి ఓ ముఖం కనిపించింది. మళ్ళీ చూడాలనిపించే ముఖమది.
“మన పక్కింట్లో ఉంటారమ్మా. బ్యాంకులో పనిచేస్తున్నారు” అంటూ ఆమెకి నన్ను పరిచయం చేసి మళ్ళీ సంభాషణ కొనసాగించాడు. ఆమె బయటకి వచ్చింది. నా చూపులు ఆమె ముఖం దాటి క్రిందకి వచ్చాయి. అంతే ఒక్క క్షణం పాటు విస్మయానికి గురైయ్యాను. కొంతసేపటి వరకు నాకేమీ గుర్తులేదు. ఏదో కోల్పోయిన భావన…! నేను స్పృహ లోకి రాగానే నాకు కనిపించిందేంటో అర్ధమైంది.
అమీనా చక్రాల కుర్చీలో కూర్చుని ఉంది. ఆమె పాదాలలో చలనం లేదు.
నా ఆలోచనలని గ్రహించినట్లుగా, ఆయన చెప్పాడు - “మా అమ్మాయి జబ్బువల్లే నేను బదిలీ కోరుకున్నాను. ఇక్కడికి వస్తే మంచి వైద్యం లభిస్తుందన్న ఆశ…!”
“ఏం జరిగింది?”
“నడుము క్రిందనుంచి పక్షవాతం! హఠాత్తుగా వచ్చింది” చెప్పాడాయన నిట్టూరుస్తూ.
నా కళ్ళ ముందు రెహ్మాన్ డాక్యుమెంటరీ దృశ్యాలు కదలాడాయి. మా పక్కింటి వాళ్ళు కూడా కసర్‌గోడ్ నుంచే వచ్చారు! ఈ ఆలోచనే నా గుండెని పిండేసింది, రక్తాన్ని మరిగించింది.
“మా అమ్మాయి బాగా చదువుకునేది. చిన్నప్పటినుంచి సంగీతమన్నా, నాట్యమన్నా చాలా ఇష్టపడేది. మా పాపని గొప్ప కళాకారిణిగా చూడాలన్నది మా ఆవిడ కోరిక. తను చనిపోయే ముందు కూడా - ” ఏవండీ, మనలో శాస్త్రీయ సంగీతం అబ్బిన వాళ్ళెవరూ లేరు. అమ్మాయిని మనం ప్రోత్సాహించాలి” అనేది. ప్రొఫెసర్ రామనాథన్ అనే సంగీతం మాస్టారితో కూడా మాట్లాడాను. కానీ ఇంతలో…..” అని చెబుతూ నిట్టూర్చాడాయన. మళ్ళీ ఆయనే మాట్లాడుతూ…”బి. ఎ. ఫస్ట్ క్లాసులో పాసయ్యింది. ఏం చేస్తాం? మేము సంతోషంగా ఉండడం ఆ దేవుడికే ఇష్టం లేదు…” అన్నాడు.
“వైద్యం ఎలా జరుగుతోంది?”
“గత రెండేళ్ళుగా ఎంతో మంది వైద్యులను సంప్రదించాను. కానీ ఏం లాభం లేకపోయింది. అందుకే ఇక్కడికి వచ్చి స్పెషలిస్టులని కలవాలని నిర్ణయించుకున్నాను”
అమీనా కల్పించుకుంటూ, “నాన్నా… ఆయన మొదటిసారిగా మనింటికి వచ్చారు. తాగడానికేమీ ఇవ్వవా?” అని అంది.
“అయ్యో,నా మతిమండ….” అంటూ ఆయన లోపలికి వెళ్ళాడు. ఆమెతో ఏదైనా మాట్లాడాలనుకున్నాను. కాని నాకు నోరు పెగల్లేదు.
గరళాన్ని దిగమింగినప్పటికీ, అమృతాన్ని కురిపిస్తున్న ఈ ధీరతో నేనేం మాట్లాడగలను?
(సమాప్తం)
మలయాళం: ఎం.కె. చాంద్‌రాజ్ ఆంగ్లం: సుధీర్
Add comment జులై 15, 2008