Posts filed under 'చదివిన పుస్తకాలు'

ఆనాటి వాన చినుకులు

ప్రముఖ సినీదర్శకుడు వంశీ రాసిన కధాసంకలనమిది. ఎమెస్కో వారు 2003 జనవరిలో దీన్ని ప్రచురించారు. ఈ పుస్తకం లో 17 కధలున్నాయి.  వీటిల్లో మూడింటికి సంగీతం ఇతివృత్తం, మరో రెండిటికి కవిత్వం నేపధ్యం. మూడు కధలు వ్యక్తిగత సదసత్సంశయంలోచి ఆవిర్భవించినవి. మిగిలిన కధలన్నీ, మనుషులని, జీవిత మర్మాలని పరిశీలించిన అనుభవాల్లోంచి పుట్టినవి. గోదావరి, దాని చుట్టుపక్కలా ఉండే ఊర్లు, వాటి అందాలు దాదాపుగా ప్రతీ కధలోను దృశ్యీభూతమవుతుంటాయి. అన్ని కధలు బాగున్నప్పటికీ, నాకు 6 కధలు బాగా నచ్చాయి.

‘బాచి ‘ కధలో ప్రధాన పాత్రతో జీవితమంటే ఏమితో చెప్పిస్తారు వంశీ. ” విశాల దృక్పధమే జీవితం, సంకుచితతత్వమే మృత్యువు, స్వార్ధపరత్వమే సర్వనాశనం, ఇదే జీవిత సత్యం”

‘ధారావాహికం ‘ కధలో ప్రధాన పాత్ర - అమాయకులైన గిరిజనులను వాళ్ళల్లో ఒకడిగా కలిసిపోయి, లౌక్యంగా, దీర్ఘకాల ప్రణాళికల్తో మోసం చేసినతీరు చదివితే గిరిజనుల పట్ల జాలేస్తుంది

‘ఆకు పచ్చని ఙాపకం ‘ కధని ఓ అద్భుతమైన వాక్యంతో ప్రారంభించారు వంశీ. ‘జీవితం అంటే చాలా ఇష్టం జయరామారావుకి ‘ ఈ ఒక్క వాక్యం తొనే ఆ పాత్ర తీరుతెన్నులు పాఠకులకి అర్ధమైపోతాయి. మనసుకి నచ్చని విధంగా బ్రతుకుతున్నా, రాజీపడిపోయి జీవితం గడిపేసే ఎందరికో ప్రతిరూపం జయరామారావు.

‘ఆనాటి వాన చినుకులు ‘ కధలోని సినీ దర్శకుడు - భావుకత అనేది విద్యాధిక్యత వల్ల,పాశ్చాత్య కళాకారుల పనిని అధ్యయనం చేయడం వల్ల, ఎందరో కవులు, కవయిత్రులు అందించిన ఆహ్లాదాన్ని జీర్ణం చేసుకుంటేనే అలవడుతుందని - అభిప్రాయపడతాడు.  రిక్షా గోపాలం పరిచయం అయ్యాక, నిజమైన భావుకత్వం అంటే ఏమిటో గ్రహిస్తాడు. ‘ ఒక మనిషి భావుకుడు కావాలంటే ఏవీ చదవక్కర్లేదు నాలాగా. ఏది వినక్కర్లేదు నాలాగా. మరేది పరిశీలించక్కరలేదు నాలాగా. భావుకుడు తయారు కాడు. జన్మిస్తాడు. మదిలో స్పందన, ప్రకృతి లోంచి ఘనీభవించిన ఆ స్పందన ఙానం. అది ఉంటే భావుకత అనాలి ‘  అంటూ కధని ముగిస్తారు వంశీ. 

‘మంచి పుస్తకాలలోనే కాదు, చెడ్డ పుస్తకాలలోను ఎంతో కొంత మంచి ఉంటుంది. కాబట్టి, మంచీ చెడు విభజన లేకుండా చదూకుంటూ పోడమే ‘ అంటాడు శాస్త్రి “అలా అన్నాడు శాస్త్రి ” కధలో.
‘రాసిన వాడు చిన్నవాడైనా, పెద్ద వాడైనా సరే, ఎవరు రాసారు అని కాకుండా, ఏం రాసారు అని చూడండి, ఆలోచించండి… స్పందించండి ‘ అంటూ లబ్ద ప్రతిష్టుల రచనల పట్ల వెర్రి వ్యామోహంతో కొట్టుకుపోతూ, మంచిగా రాసే కొత్తవాళ్ళని పట్టించుకోని జనాలపై చురకలు వేసారు వంశీ.
చదవదగ్గ పుస్తకం!


2 comments జూన్ 26, 2007


Blog Stats

ఇటీవలి జాబులు

ఇటీవలి అభిప్రాయములు

Madhu Janjur on “అమృత వర్…
Krant hi on నా గురించ…
కొల్లూ… on విచారగ్రస్…
phani pradeep on విచారగ్రస్…

వర్గములు:

Blogroll

ఖజానాలు