నేనూ మా ఆవిడ విజిటర్స్ రూంలో ఆందోళనగా కూర్చుని ఉన్నాం.
నా నుదుటిపైన చిరు చెమట. నా కాళ్ళు చేతులు కాస్త వణుకుతున్నాయి.
మా ఆవిడ గంభీరంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
మా వాడి గురించి మిస్టర్ నూతన్ ఏం చెబుతాడో అని మాకు భయంగా ఉంది.
నూతన్ గారి గదిలోకి వెళ్ళేముందు వరకు కూడా మా వాడు ఏమీ పట్టనట్టు, రెండు కౌంటర్ల అవతల ఓ కాబిన్లో కూర్చుని చేతిలో సెల్లు, చెవిలో ఇయర్ ఫోన్‌తో వాడి లోకంలో వాడున్నాడు.
సమస్య వాడిది కాదన్నట్లుగా ఉన్నాడు.
మరిప్పుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోందో ఏమో….. ఆయన ఏం చెబుతున్నాడో, వీడేం వింటున్నాడో… నాకేం అర్ధం కావడం లేదు.
ఇంతకీ మేమిక్కడ ఎందుకున్నామో మీకు తెలియదు కదూ? ఇదంతా మా అబ్బాయి కిరణ్ చలవే. అసలేం జరిగిందంటే……
* * *
కిరణ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఈ మధ్య వాడి ప్రవర్తనలో ఏదో తేడా కనబడుతోంది. పొద్దున్నుంచి కాలేజికి బయల్దేరే దాకా బాగానే హుషారుగా ఉంటాడు.
పొద్దున్న పూట మా వాడు కాలేజికి, నేను ఆఫీసుకి, మా ఆవిడ స్కూలికి దాదాపుగా ఒకేసారి బయల్దేరుతాం. మద్యాహ్నం మూడింటికి మా వాడు కాలేజి నుంచి తిరిగొస్తాడు. మా ఆవిడ ఇంటికొచ్చేసరికి నాలుగవుతుంది.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం మా ఆవిడ ఇంటికొచ్చేవరకు కిరణ్ ఏదో పోగొట్టుకున్నవాడిలా, శూన్యంలోకి పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడట.
మా పక్కింటావిడ గమనించి, మా ఆవిడకి చెప్పింది. మొదట మా ఆవిడ పట్టించుకోలేదు.
కానీ పక్కింటబ్బాయి కూడ ఓ సారి అన్నాడట – “ఆంటీ! కిరణ్ ఏదోలా ఉంటున్నాడాంటీ. ఏదేదో గొణుగుతూ ఉంటాడు. చేతి బొటన వేళ్ళు నొక్కుతున్నట్లుగా పైకి, క్రిందకి ఆడిస్తూ ఉంటాడు… చూసే వాళ్ళకి అవేవే పిచ్చి సైగల్లా, రోడ్డు మీద వెడుతున్న అమ్మాయిలకి చేస్తున్న సైగల్లా అనిపిస్తాయి. ఎందుకైనా మంచిది, మీరు ఒక సారి అడిగి చూడండి” అన్నాడట.
మా ఆవిడ నాకు చెప్పింది.
“సరే, ఈ శనివారం నీకు సెలవేగా. ఇంట్లోనే ఉంటావుగా. వాడిని గమనిస్తూ ఉండు. ఏదైనా తేడాగా ఉంటే అప్పుడాలోచిద్దాం” అన్నాను.
శనివారం గడిచిపోయింది. ఆదివారం నాడు నేను కూడా ఏ పని పెట్టుకోకుండా ఇంట్లోనే ఉన్నాను.
“కిరణ్, నా ఫోన్ ఇవ్వు. నేను మా కొలీగ్‌తో మాట్లాడాలి” అంది మా ఆవిడ లోపలి గదిలోంచి.
నేను హాల్లో పేపర్ చదువుకుంటున్నాను. కిరణ్ పలకలేదు.
వాడు బాల్కనీలో కూర్చుని, వాళ్ళమ్మ సెల్ నుంచి ఎవరికో ఎస్. ఎం. ఎస్ పంపిస్తున్నాడు, చెవిలో ఇయర్‌ఫోన్. బహుశా ఎఫ్. ఎం ఛానెల్లో పాటలు వింటున్నట్లున్నాడు.
నా సెల్ కొంచెం పాత మోడల్‌ది. దాంట్లో ఎఫ్. ఎం లేదు, పాటలు రావు. అందుకే మా వాడు దాన్ని ముట్టుకోడు.
మా ఆవిడ సెల్ ఫోన్ కొత్తది. ఈ మధ్యే కొనుక్కుంది….నిజానికి తను కొనుక్కుంది అనే కన్నా, మా వాడు తనకి కావాల్సిన ఫీచర్లున్న ఫోన్‌ని కొనిపించాడు వాళ్ళమ్మ చేత అనచ్చు.
మా ఆవిడ “కిరణ్… నా ఫోనివ్వు…..” అంటూ ఇంకోసారి గట్టిగా పిలిచింది. ఊహూ, వాడికి వినబడలా.
చివరికి నేను లేచెళ్ళి వాడి భుజం మీద చెయ్యేసి గట్టిగా కుదిపాను.
“అమ్మ ఫోన్ అడుగుతోంది, వినబడడం లేదా?” అన్నాను.
వాడు నాకేసి ఎగాదిగా చూసాడు. కళ్ళు నన్ను చూస్తున్నా, చేతివేళ్ళు కీబోర్డు మీద టకటకలాడుతున్నాయి. ఏంటన్నట్లు సైగ చేసాడు.
నాకు చిర్రెత్తింది. వాడి చెవిలోంచి ఇయర్‌ఫోన్ తీసేస్తూ, ‘అమ్మ ఫోన్ అడుగుతోంది… వినబడడం లేదా…..” అన్నాను.
“వినబడలేదు….” అంటూ మా వాడు రెండో చెవిలోంచి ఇయర్‌ఫోన్ తీసేసాడు.
తర్వాత సెల్ స్విచ్ఛాఫ్ చేసి, అందులోంచి ఓ సిమ్ కార్డు బయటకు తీసాడు. వాడి పుస్తకం పక్కనున్న ఇంకో సిమ్‌ని అందులో వేసి, మళ్ళీ స్విచ్ ఆన్ చేసి, ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళమ్మకి ఇచ్చాడు.
గూట్లో ఇంకో సిమ్ కనబడింది. వాడికిన్ని సిమ్‌లు ఎక్కడివో నాకర్ధం కాలేదు. అదేమాట వాడినడిగాను.
“కొనుక్కున్నాను”
“నీకన్ని డబ్బులెక్కడివి….?”
“నువ్వే ఇచ్చావుగా……”
“నేనిచ్చానా?” ఆశ్చర్యపోయాను.
కొత్త సిమ్ కనీసం రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది. నేను కొన్నప్పుడు ధర అదే. మరి నేను వీడికి సిమ్ కోసం ఎప్పుడూ అంత డబ్బు ఇవ్వలేదు.
ఏదో దాస్తున్నాడనిపించింది.
“సిమ్ కార్డ్ ఎంతరా….?” అడిగాను.
“నోకామో సిమ్ పదిహేను రూపాయలు నాన్నా… కొత్త కంపెనీది. ముప్పై రూపాయలతో రీఛార్జి చేయిస్తే…. వంద రూపాయల టాక్‌టైం ఇచ్చారు. పైగా నెలకి ఐదొందలు ఎస్. ఎం. ఎస్‌లు ఫ్రీ……”
“మరి ఆ గూట్లో సిమ్ ఏంటి?”
“అది వాటర్టెల్ వాళ్ళది. ఆ సిమ్ కూడా పదిహేను రూపాయాలే. మా ఫ్రెండ్స్‌కి చాలా మందికి ఇదే కంపెనీ కనెక్షన్స్ ఉన్నాయి. వాటర్టెల్ నుంచి వాటర్టెల్కి ఫోన్లు ఫ్రీ. వేరే మొబైల్‌కి అయితే సెకనుకి అరపైసా మాత్రం ఛార్జ్ చేస్తారు. పైగా వీళ్ళు మొదటి ఐదొందల ఎస్. ఎం. ఎస్‌లకు డబ్బులు తీసుకోరు…..” మా వాడి గొంతులో ఉత్సాహం.
నేను అవాక్కయ్యాను. మొబైల్ ఫోన్ల రంగంలోకి కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయని విన్నాను కానీ, ధరలింత తక్కువగా ఉన్నాయని నాకు తెలియదు.
“అది సరే, నీకు అన్ని ఎస్. ఎం. ఎస్‌లు పంపించాల్సిన అవసరం ఏముంటుంది?”
“జాతీయ స్థాయి పాటల పోటీలో ఉన్న తెలుగబ్బాయిని తర్వాతి రౌండ్‌కి పంపాలా, మామిని టివిలో సినిమా అవార్డుల పోటీ జరుగుతోంది, ఉత్తమ నటుడి కేటగిరీలో మా బాసుని గెలిపించాలా? శుక్ర శనివారాల్లో రాత్రి 9.30 గంటలకి వచ్చే ప్రోగ్రామ్‌లో పాల్గొనాలంటే వాళ్ళడిగే ప్రశ్నలకి సమాధానం పంపాలా? మనకిష్టమైన పాటలు డౌన్లోడ్ చేసుకోడానికి, నచ్చిన పాటల్ని కాలర్ట్యూన్గా మార్చుకోడానికి… ఐశ్వర్యా రాయ్‌ని, అభిషేక్ బచ్చన్‌ని లండన్‌లో కలుసుకునే అవకాశాన్ని పొందడానికి, మా ఖలేజా చూపించి కుమ్మేయడానికి… ఇంకా చాలా వాటికి ఎస్. ఎం. ఎస్‌లు కావాలి”
“కుమ్మేస్తావా? ఎవరిని? కాలేజి గొడవల్లో తలదూరుస్తున్నావా?అలాంటి పిచ్చి వేషాలేం వేయకు”
“అబ్బా, అది కాదు నాన్నా, ప్రిన్స్ మహేష్‌బాబుతో కలిసి ఓ ఫైటింగ్ సీన్లో నటించే అవకాశం కోసం ఎస్. ఎం. ఎస్ చేయాలి…”
నాకు ఏమీ అర్థం కాలేదు.
కాస్త తేరుకున్నాకా, ” ఇటువంటి ఎస్. ఎం. ఎస్లకి ఛార్జిలు ఎక్కువట కదా” అని అడిగాను.
“అవును. ఫ్రెండ్స్‌తో మాటలు తగ్గించి, ఫ్రీ ఎస్. ఎం. ఎస్‌లు వాడుకుని టాక్‌టైం బాలన్స్ మిగుల్చుకుంటాం… ఆ డబ్బుని ప్రీమియం రేట్లు వర్తించే ఎస్. ఎం. ఎస్లకి ఉపయోగించుకుంటాం….” అన్నాడు మా వాడు రహస్యాన్ని వివరిస్తున్నట్లుగా.
“చాలు చాలు సంబరం, ఇంక చదువు….” అంటూ అక్కడినుంచి కదిలాను.
ఉన్నట్లుండి మా వాడు మూడీగా అయిపోయాడు. క్లాసు పుస్తకాలు చదువుతున్నాడనేగాని, ధ్యాస దాని మీద లేదని తెలుస్తోంది.
చేతి బొటనవేళ్ళని అదోలా ఆడిస్తున్నాడు. వాడిలో వాడే ఏదో గొణుక్కుంటున్నాడు. మా ఆవిడ కూడా ఈ విషయం గమనించింది.
“చదువులో ఏమైనా ఒత్తిడిని ఎదుర్కుంటున్నాడేమో….” అన్నాన్నేను అమాయకంగా.
“మన వెధవేమీ రెసిడెన్షియల్ కాలేజిలో చదవడంలేదు, ఐ. ఐ. టికి ప్రిపేరవడం లేదు…. వాడు చదువుతున్నది సి. ఇ. సి గ్రూపు. ఒత్తిడులు, గిత్తిడులు ఏమీ ఉండవు…. హాయిగా చదువుకోవచ్చు…. అయినా వాడికి ఇంగ్లీషులో తప్ప, మిగిలిన వాటిలో మార్కులు బాగానే వస్తున్నాయి. మాట్లాడడం బానే మాట్లాడుతాడు, రాయడంలోనే బోలెడు స్పెల్లింగ్ మిస్టేక్సట……” అంది మా ఆవిడ.
వాడి చదువు మీద మా ఆవిడ ఒక కన్నేసి ఉంచినందుకు నాకు సంతోషం కలిగింది.
మాలాంటి మధ్య తరగతి కుటుంబాలలో పిల్లల చదువుపై తల్లిదండ్రులలో ఎవరో ఒకరు దృష్టి పెట్టాలి.
“వీడిని మరింత గమనించాలి” అంది.
నేనూ అంగీకారంగా తలూపాను. అప్పట్నించి మా ఇంట్లో ‘ఆపరేషన్ అబ్జర్వేషన్’ మొదలైంది.
మా ఆపరేషన్ మొదలై వారం గడిచింది. వాడిని శ్రద్ధగా గమనించడం మాకు శనాదివారాలలో తప్ప మాములు రోజులలో కుదరడం లేదు.
మా వాడు రాత్రిళ్ళు టివి చూస్తూ, హాల్లోనే పడుకుంటాడు. శనివారం రాత్రి వాడేదో గట్టిగా కలవరిస్తుంటే నాకు మెలకువొచ్చింది.
‘హైదరాబాద్‌కా నెంబర్ వన్ ఎఫ్. ఎం…..’ ‘ఇది చాలా హాట్ గురూ…’ ‘వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా’ ‘విను వినిపించు లైఫ్ అందించు’ ‘ఆడండి ఊంగలీ క్రికెట్…’ ’5555372455కి ఎస్. ఎం. ఎస్ చేయండి… షరతులు వర్తిస్తాయి…’ ‘వాకా…..వాకా….వాకా…..’ ‘వువుజెలా వువుజెలా’ ……అంటూ ఏమిటేమిటో గొణుగుతున్నాడు. కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్ధం కాలేదు.
వాడిని నిద్ర లేపాను. ‘ఏంట్రా.. పీడకలలేమయినా వచ్చాయా? ఏవేవో గొణుగుతున్నావ్…” అన్నాను.
“అబ్బా, పో నాన్నా, మంచి నిద్రని పాడు చేసి పీడకలలంటావేంటి?” అంటూ వాడు ముసుగు పెట్టి పడుకున్నాడు. ఆ తర్వాత నాకు నిద్ర పట్టలేదు.
పొద్దున్నే మా ఆవిడ అరుపులకి నాకు మెలకువొచ్చింది.
“నా ఫోన్ నాకివ్వు కిరణ్. ఈ రోజు నాకు దాంతో చాలా పనులున్నాయి. నీ సిమ్ వేసుకోవద్దు….” అని మా ఆవిడ అంటోంది.
“కాసేపేనమ్మా…. కాసేపేనమ్మా…” అని కిరణ్ బ్రతిమాలుతున్నాడు.
“కుదరదన్నానా?” అంటోంది మా ఆవిడ.
“పోనీ నా ఫోన్లో వేసుకోరా నీ సిమ్”.
“నాన్నా నీది డొక్కు ఫోన్, అందులో ఎఫ్. ఎం రాదు”
“నీకు ఫోన్ ఎందుకురా, మాట్లాడుకోడానికా లేకపోతే, పాటలు వినడానికా?”.
“అన్నిటికీ నాన్నా, పాటలు వినాలి, ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవాలి, ఎస్. ఎం. ఎస్‌లు పంపించాలి….. నువ్వేమో నాకో లేటెస్ట్ మొబైల్ కొనమంటే కొనవు…..”
“నువ్వడిగిన మోడల్ ఫోన్ ఎనిమిది వేలు…. ఇప్పడది నీకవసరం లేదు….”
కిరణ్ ఎంత బ్రతిమాలినా మా ఆవిడ ఫోన్ ఇవ్వలేదు.
వాడి ముఖం మాడిపోయింది. ఒక్క క్షణంలో వాడిలో ఎంతో కోపం…వాడిలో ఓ అపరిచితుడు కనపడ్డాడు.
ఏదో గొణుక్కుంటూ వెళ్ళి టివి ముందు కూర్చున్నాడు. పళ్ళు కొరుకుతూ… రిమోట్‌తో ఛానెళ్ళను ఇష్టం వచ్చినట్లు మారుస్తున్నాడు.
మా ఆవిడకి సైగ చేసాను. తను కూడా చూస్తున్నానంటూ తలూపింది.
కొంత సేపయ్యాకా, టివి కట్టేసాడు. వెళ్ళి వాడి స్టడీ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వాడిలో వాడే ఏదో పాడుకుంటూ, చేతి బొటనవేళ్ళని ఆడిస్తూన్నాడు.
కాసేపయ్యాక టిఫిన్ సిద్ధం చేసి మా ఆవిడ నన్నూ, వాడిని పిలిచింది. ఎంత పిలిచినా వాడికి వినబడలేదు. చివరికి విసుక్కుంటూ లేచెళ్ళి టిఫిన్ పళ్ళెం వాడి టేబుల్ మీద పెట్టింది.
“ఏరా, ఎన్ని సార్లు పిలిచాను, వినబడడం లేదా?” అంది.
“నిజంగానే వినబడడం లేదమ్మా”
“సరేలే, ఎప్పుడూ ఆ బొటనవేళ్ళలని ఎందుకలా పైకి కిందకి ఆడిస్తావు?”
“బొటనవేళ్ళని ఆడించడమేంటి? నేను మాములుగానే ఉన్నా”
“వీడికేదో అయ్యింది….” అంటూ మా ఆవిడ నా దగ్గరికి వచ్చింది.
నేనప్పపుడు పున:ప్రసారమవుతున్న ఓ టివి షోని యమా సీరియస్‌గా చూస్తున్నాను.
ఆ కార్యక్రమంలో మన సమస్యలకు తగిన సలహాలిస్తారు. వెంటనే నాకో ఆలోచన తట్టింది.
“పోనీ మన ముగ్గురం కలిసి ఈ ‘జీవితం గుర్రం బండి’ కార్యక్రమానికి వెళితే ఆ యాంకరమ్మ ఏదైనా మంచి పరిష్కారం చెబుతుందేమో?”.
మా ఆవిడ నాకేసి కొరకొరా చూసింది. ఆ చూపులకి నేను తలదించుకున్నాను.
“ఇలాంటి మాటలు మీరు సరదాగా అంటారో, లేదా నిజంగానే అంటారో అర్ధం కాదు” అని అంది.
మళ్ళీ తనే మాట్లాడుతూ, “వీడికి వినికిడి సమస్యేదో వచ్చినట్లుంది. పైగా నరాల బలహీనత కూడా తోడయినట్లుంది. ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి” అంది.
వీలైనంత తొందరలో, ఓ మంచి డాక్టర్‌కి చూపిద్దామని అన్నాను. సరేనంది మా ఆవిడ.
ఆ మర్నాడు మా ఆవిడ వాళ్ళ బంధువులింట్లో పెళ్ళంటూ ఊరెళ్ళింది. రెండు రోజుల దాకా రాదు.
సెల్‌ఫోన్ లేకపోయే సరికి పాపం మా వాడికి కాలు చెయ్యి ఆడడం లేదు. తెగ చికాకు పడిపోతున్నాడు.
చివరికి అయిష్టంగానే నా సెల్ తీసుకున్నాడు.
వాడిని చూస్తుంటే నాకు దిగులెక్కువైపోయింది. ఏం చేయాలో పాలుపోడం లేదు. సమయానికి సలహా ఇవ్వడానికి మా ఆవిడ కూడా ఊర్లో లేదు.
పరిష్కారం ఏదైనా చెబుతాడేమోనని మా ఫ్రెండ్ రఘు వాళ్ళింటికి వెళ్ళాను.
వాడు వరండాలో కూర్చుని పేపరు చదువుకుంటున్నాడు. అక్కడున్న ఓ కుర్చీలో కూర్చుని నా సమస్యని ఏకరువు పెట్టాను.
వాడు గట్టిగా నవ్వి నన్ను లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళమ్మాయి, వాళ్ళబ్బాయి ఇద్దరూ మావాడిలానే మొబైల్ ఫోన్ల నుంచి ఎస్. ఎం. ఎస్‌లు పంపిస్తున్నారు. వాళ్ళావిడ తన మొబైల్లో ఎవరితోనో మాట్లాడుతోంది.
“చూసావుగా, ఇక్కడా అదే సమస్య. మీ వాడు కూడా సెల్‌ఫోన్‌కి అడిక్ట్ అయ్యాడని అర్థమవుతోంది. ఎప్పుడూ చెవిలో ఇయర్‌ఫోన్ పెట్టుకుని ఉండడం వల్ల ఒక్కోసారి సరిగా వినబడదు. పైగా, ఎస్. ఎం. ఎస్‌లు పంపించి పంపించి చేతిలో మొబైల్ లేనప్పుడు.. వేళ్ళని అలా ఆడించడం మీ వాడికి అలవాటైనట్లుంది. అంతే. డోన్ట్ వర్రీ. దీనికో పరిష్కారం ఉంది” అంటూ ఓ క్షణం ఆపాడు.
నాకంటికి వాడప్పుడు వరాలిచ్చే దేవుడిలా, సమస్యలు తీర్చే మంత్రదండం ఉన్న మునిలా కనిపించాడు.
ఆతృత ఆపుకోలేక, “అదెంటో చెప్పు మరి….” అన్నాను.
“ఈ మధ్య ‘మోసియాలజి’ ఆనే శాస్త్రం ఒకటి చలామణిలోకి వచ్చింది. మొబైల్ ఫోన్ టెక్నాలజీని అతిగా వాడడం వలన ఎదురయ్యే సామాజిక సమస్యలని తెలిపే శాస్త్రమన్న మాట. అదృష్టవశాత్తు మన ఊర్లో నూతన్ అనే మోసియోలజిస్ట్ ‘మొబైలోలజీ కేఫ్’ అనే పేరుతో ఒక సూచనలు-సలహాల కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. మా పిల్లలని అక్కడ చూపించాకే కాస్త నయమయ్యారు….” అంటూ మోసియాలజీ గురించి మరిన్ని వివరాలు, ఆసలహా కేంద్రం అడ్రసు చెప్పాడు.
మా ఆవిడ ఊర్నుంచి వచ్చాక, మోసియాలజీ గురించి, నూతన్ గారి గురించి రఘు చెప్పిన వివరాలన్నీ తనకి చెప్పాను.
“అయితే, ఆయనని వెళ్ళి కలుద్దాం, ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. డాక్టర్ అయితే ఏంటి, ఇంకొకరైతే ఏంటి? మన వాడు మాములుగా అయిపోతే అంతే చాలు” అంది మా ఆవిడ.
రెట్టించిన ఉత్సాహంతో నేను నా సెల్ నుంచి మొబైలోలజీ కేఫ్ నెంబరుకి ఫోన్ చేసి “నూతన్ గారితో అపాయింట్మెంట్ కావాలి” అన్నాను.
“పది రోజుల దాకా సార్ అపాయింట్మెంట్స్ లేవు. కావాలంటే అతర్వాత తేదీ నాటికే బుక్ చేస్తాను” అంది రిసెప్షనిస్టు.
“అలాగే కానివ్వండి” అన్నాను, చేసేదేం లేక.
ఈ పది రోజులు క్షణమొక యుగంలా గడిచింది. ఆ రోజు రానే వచ్చింది.
నిర్ణీత సమయానికి మేము బయల్దేరుతుండగా, ఎక్కడి నుంచో దూరంగా ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం… ఈనాడే ఎదురవుతుంటే….’ అనే పాట వినబడింది.
“ఆహా, శుభ శకునం” అనుకుంటూ మేము ముగ్గురం ఆటోలో నూతన్ గారి ఆఫీసుకి వెళ్ళాం. మేమెళ్ళే సరికి అక్కడ కొండవీటి చాంతాడంత క్యూ ఉంది.
రిసెప్షన్లో నా పేరు చెప్పి, టోకెన్ తీసుకుని, ఫీజు కట్టి మా వంతు కోసం ఎదురు చూడసాగాం.
మిస్టర్ నూతన్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చిన జనాల సంఖ్య రెండు వందలకి పైనేట, రిసెప్షనిస్ట్ చెప్పింది.
కేఫ్ అంటే నేనేదో రెండు గదులు, ఓ చిన్న కాబిన్ లాంటివి ఊహించుకున్నాను, కానీ అది ఓ పెద్ద మేడలో ఉంది.
నూతన్ గారు పైన అంతస్తులో ఉంటారు. క్రింద రిసెప్షన్, విజిటర్స్ రూం ఉన్నాయి. అవి కాక, నలభై దాక చిన్న చిన్న క్యూబికల్స్ ఉన్నాయి.
ఆ నలభై కాబిన్లు జనాలతో కిటకిటలాడిపోతున్నాయి. అక్కడున్న వాళ్ళల్లో చాలా వరకు యువతీ యువకులే ఉండడంతో నాకు ఆశ్చర్యం కలిగింది.
రిసెప్షనిస్టుని వివరాలు అడిగాను.
“కాసేపు ఉండండి సార్…వీళ్ళ కాయితాలు పైకి పంపించాకా, మీ సందేహాలు తీరుస్తాను……” అందా అమ్మాయి.
ఓ పావుగంట తరువాత, హడావుడి కొంచెం తగ్గింది. విజిటర్స్ రూంలోంచి మళ్ళీ వెళ్ళి రిసెష్పనిస్టుని కలిసాను.
కస్టమర్స్‌తో ఎలా నడుచుకోవాలో ఆ అమ్మాయికి బాగా శిక్షణ ఇచ్చినట్లున్నారు.
నా సందేహాలు తీర్చే క్రమంలో వాళ్ళ కేఫ్ గొప్పతనాన్ని బయటపెట్టింది, “మా సార్ అమెరికాలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇండియాలో ఉన్న అతి కొద్ది మంది మోసియాలజిస్టులలో సార్ ఒకరు” అంది.
“విన్నాను” అని అంటూ, “ఆయన సమస్యని ఎలా పరిష్కరిస్తారు? ” అడిగాను.
“అవన్నీ మేము బయటకి చెప్పకూడదు సార్, అవి మా ట్రేడ్ సీక్రెట్స్..” అందా అమ్మాయి.
“ప్లీజ్…. కాస్త చెప్పండి. నేనెవరికి చెప్పను….” అన్నాను.
“ఇక్కడ సలహాతో పాటు, మొబైల్ ఫోన్లని అద్దెకిస్తాం. మీ సిమ్ అందులో వేసుకుని, కావల్సినంత సేపు వాడుకోవచ్చు. ఇక్కడున్న ప్రతీ కాబిన్లోను, ఇయర్ఫోన్లున్న లేటెస్ట్ మొబైల్ ఫోను ఉంది. నూతన్ గారిని కలవడానికి వచ్చిన వాళ్ళని గంటకింత చొప్పున డబ్బులు కట్టి ఆ కాబిన్ లోని మొబైల్ ఫోన్‌ని వాడుకోమంటాం. వాళ్ళని చూసారా? కొంత మంది ఎస్. ఎం. ఎస్‌లు పంపుకుంటుంటే ఇంకొంత మంది పాటలు వింటున్నారు. కొంతమంది తాము అప్పటి దాక తాము పంపిన, తమకొచ్చిన ఎస్. ఎం. ఎస్‌లను డిలీట్ చేసి, మొబైల్ ఫోన్‌ని తరువాతి వ్యక్తి కోసం సిద్ధం చేస్తున్నారు” అంది.
నిజమే, మరికొంత మంది తమ వంతు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నూతన్ గారి సలహాలు, సూచనలు తీసుకున్న వాళ్ళు కూడా కాబిన్ల వద్ద చేరుతున్నారు.
“కాని ఇలా చేయడం వలన, వీళ్ళ వ్యసనం మరింత పెరుగుతుందేమో?” అన్నాను.
“అదేం కాదు. ఆర్ధిక శాస్త్రంలోని ‘క్షీణోపాంత ప్రయోజన సూత్రం’ అనే దాన్ని ఇక్కడ వర్తింజేస్తారు మా సార్”.
“ఏంటది?”
“థీరీ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటి! ఆ సిద్ధాంతాన్ని సార్ టెక్నిక్స్‌లో ఉపయోగిస్తారు. మేము ‘పెరుగుట విరుగుట కొరకే’ అనే సూత్రాన్ని నమ్ముతాం. మా సార్ టెక్నిక్స్‌తో ఎక్స్ట్రీమ్గా ఉన్న వాళ్ళు, నార్మల్‌గా మారిపోతారు. సార్ చెప్పిన టెక్నిక్స్‌ని పాటిస్తూ, మొబైల్ వాడడంలో ఏ ఇబ్బంది ఉండదు. ”
మా సమస్య పరిష్కారమవబోతోందనే విశ్వాసం నాకు కలిగింది. జనాలు చాలా మంది ఉన్నా, ఓపికగా కూర్చున్నాం.
ఓ నలభై నిముషాల తర్వాత, మాకు పిలుపు వచ్చింది. నూతన్ గారికి మా సమస్యంతా వివరించాం.
“ఏం పరవాలేదు, ఇలాంటి వాళ్ళని చాలా మందిని నేను సరిచేసాను. అంతా సర్దుకుంటుంది’ అని భరోసా ఇస్తూ, మా వాడిని లేటెస్ట్ మొబైల్స్ గురించి, ఎస్. ఎం. ఎస్‌ల గురించి ఏవేవో ప్రశ్నలడిగారు. మావాడు ఉత్సాహంగా జవాబులిస్తున్నాడు.
కాసేపయ్యాక, ‘మీ అబ్బాయితో నేను ఏకాంతంగా మాట్లాడి ‘కౌన్సిలింగ్’ చేయాలి, మీరు కాసేపు క్రింద వెయిట్ చేయండి’ అంటూ నన్ను మా ఆవిడని క్రింద విజిటర్స్ రూంలో కూర్చోమన్నారు నూతన్.
* * *
ఇదీ ఇప్పటిదాక జరిగినది… హఠాత్తుగా విజిటర్స్ రూంలోని టి.వి. సౌండ్ పెరిగిపోవడంతో, ఆలోచనల్లోంచి బయటపడుతూ, వర్తమానంలోకి వచ్చాను.
నా దృష్టి టివిలో వస్తున్న ఓ ప్రకటనపైకి మళ్ళింది.
‘మాకు ఎస్. ఎం. ఎస్ చేయండి, కలర్ టివి బహుమతిగా గెలుచుకోండి. షరతులు వర్తిస్తాయి’ అని చెబుతూ, ఓ తేలికైన ప్రశ్నని టివి తెరపై చూపించారు.
“జవాబు సులువుగా చెప్పగలిగే ఈ ప్రశ్నకి ఎంతో మంది ఎస్. ఎం. ఎస్‌లు పంపుతారు. బహుమతులను పొందాలనే ఉబలాటంలో చాలామంది షరతులను మర్చిపోతుంటారు. బోలెడు డబ్బు తగలేస్తారు, ఇదీ కూడా ఓ రకంగా జూదమే..” అని అంది మా ఆవిడ.
నిజమేనన్నట్లు తలూపాను. అటువంటి వాళ్ళపై జాలిపడ్డాను. మా అబ్బాయి కూడా అటువంటి వాళ్ళలో ఒకడని గుర్తొచ్చి మనసు చివుక్కుమంది.
టి.వి.లో ప్రకటనలు అయిపోయి, పాటలు వస్తున్నాయి. ‘జుంజుం మాయా..జుంజుం మాయా..ప్రేమిస్తినే ఇంతటి హాయా..’ అనే పాట వినబడింది.
ఆ పాట లోని ‘మాయ’ అనే పదం నన్ను బాగా ఆకర్చించింది.
‘ఎస్. ఎం. ఎస్‌లు అదే…సంక్షిప్త సందేశాలు ఏం మాయ చేస్తాయో కదా’ అనుకున్నాను.
సంక్షిప్త సందేశాల మాయ – ఈ పదాలని ఎస్. ఎం. ఎస్. పరిభాషలో రాయాలంటే సం. సం. మాయ అని రాయచ్చా?
అప్రయత్నంగా, నా నోట ఆ పాటకి పేరడీ వెలువడింది….’సం సం మాయా….. సం సం మాయా… మెసేజ్ పంపిస్తేనే ఇంతటి లాసా…..”
అయితే, నా గొంతు విని అందరూ దడుసుకుంటారని, నాలో నేనే పాడుకున్నాను.
‘సం సం మాయా…సం సం మాయా’ ఈ పదాలు నన్ను వదలడంలేదు. నా బుర్రలో తిష్ట వేసుకున్నాయి.
ఇంతలో నాకో సందేహం వచ్చింది.
‘అవును… వీటిని మొబైల్లో టైప్ చేయాలంటే ఎలా? some some maya? లేక sum sum mayaa? లేక sam sam maaya?…..’
ఏమో! మా వాడిని అడగనా? లేదా మిస్టర్ నూతన్ని అడిగితే మంచిదా?
ఇంతలో మా వాడు క్రిందకి వచ్చాడు. వాడిలో ఏదో కొత్త ఉత్సాహం!
“ఏరా, నూతన్ గారు ఏం చెప్పారేంటి?” అన్నాను కుతూహలం ఆపుకోలేక.
“ఓహ్. చాలా చెప్పారు. అవన్నీ నీకు అర్ధం కావు నాన్నా. టెక్నాలజీ విషయంలో నువ్వు చాలా వీక్. అమ్మకి చెబుతాలే. చివర్లో మాత్రం… సంస్కృత శ్లోకం….’అతి సర్వత్ర….’ అనేదో చెప్పారు…. నువ్వు, అమ్మా ఇంటికి వెళ్ళిపొండి. నేను కాసేపు ఇక్కడుండి వస్తాను…..” అంటూ అక్కడి కాబిన్స్ వైపు నడిచాడు.
(సమాప్తం)
(ఈ కథ చిత్ర మాసపత్రిక జూన్ 2011 సంచికలో ప్రచురితం.)
సం..సం…మాయ
జూన్ 1, 2011 కొల్లూరి సోమ శంకర్ చే
miru hasya pradhanam ga rasaro ledu kani, gundelu pindese bada matram kanipinchindi, alage prati taram ilanti marpulato poratam chesinde, anta mana manchike ani saripettukovalemo …..