చాలా రోజుల తర్వాత, ఓ మంచి కవిత చదివాను. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి కవిత -కళ్ళం – 11 మే 2009 నాటి ఆంధ్ర జ్యోతి దినపత్రికలో వివిధ పేజిలో ప్రచురితమైంది.
ఈ చిన్న కవితలో గ్రామీణ ప్రాంతాలఓ, వ్యవసాయ రంగంలో, మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను ఆర్ద్రంగా చిత్రించారు.
వెంకటరామిరెడ్డి గారు మంచి కథకులని తెలుసు. అయితే నేను ఆయన కవితలు తక్కువగా చదివాను.
ఆంధ్ర జ్యోతిలో ఈ కవిత మిస్సయిన వారి కోసం ఇక్కడ రాస్తున్నాను. చదవండి.

 కళ్లం

ఏదో ఒకరీతి గింజలు రాలగొడితే చాలు-
జీవితాన్ని పంట కళ్లం చేసేంత ఓపిక ఎవరికుందని!
తొలికోడి కూతకీ ఎద్దుల గాడికీ మధ్య
మనిషి వాసన లేదు- ట్రాక్టర్ కమురు కంపు తప్ప
పేడతో అలికిన కళ్లానికీ పంట కంకులకూ మధ్య
నూర్పిళ్ల పొలికేకల్లేవు- మిషన్ దబాయింపులు తప్ప
తూరుపెత్తే చేటలుండవు.
చేటపొలి విసరే చేతులుండవు
చేత ముద్దబెట్టే ఇల్లాలుండదు.
ఇల్లాలి కొంగు నిండా గింజలుండవు
దండెకట్టు వుండదు. చెత్త తొక్కిళ్లు ఉండవు
పశువుల బంతి వుండదు.
వృత్తి పనివాళ్ల కదలికలుండవు
పంట- ధాన్యంగా మారే అపురూప దృశ్యానికి
ఇప్పుడు కళ్లం రంగస్థలం కానే కాదు
ఏదో ఒకరీతి గింజలు రాలగొడితే చాలు-
కళ్లమంత హృదయాలు ఇక్కడ ఎవరికున్నాయని!
పదహారు చేతుల వ్యవసాయం ఇప్పుడు
రెండు చేతుల కింద లొంగిరాక
రైతు బతుకు గిలగిల కొట్టుకొంటోంది
సంకటి ముద్దల శ్రమ సౌందర్యం కాస్తా
డబ్బు కాగితాల అంచుల రాపిడికి
గాయాల పాలై విలవిల గింజుకొంటోంది
గట్టుమీద పచ్చని పిలుపుల్లేక
వానచుట్టాలు నేలకు దిగటం లేదు
వత్తి నాళాలకు చమురందక
బోరుబావి జలదీపాలు వెలగటం లేదు
కళ్లు మూసుకు పోయిన కంకుల నుదుటి మీద
వ్యవసాయ ఆయుర్థాయం రాయబడి వుంది
ఏదో ఒకరీతి గింజలు రాలగొడితే చాలు-
పచ్చి పేడగంప బరువున్న మానవసంబంధాల్ని
ఎవడు మోస్తాడని!
గొడకింద పసలగాడీ, దొడ్డిలో గడ్డివామీ
చేలల్లో పచ్చిగడ్డీ, కడుగునీళ్ల తొట్టీ, దాణా బుట్టీ-
ఎద్దుల్లేకుంటే ఇవేమీ అఖ్కర్లేదు గదా!
కమ్మరి కుమ్మరి మాలా మాదిగా వడ్రంగీ చాకలీ
పండిన గింజగింజలో వాటాదారులైన కులవృత్తులన్నీ-
కళ్లం లేకుంటే యీ స్వరాలేవీ పల్లెలో నిలవవు గదా!
పిచ్చుకలకు గింజలు దొరకవు. చీమలకు నూకలు రాలవు
నాణ్యమైన కంకులు వచ్చి మిద్దెదంతెలకు వేలాడవు
ఏదో ఒకరీతి గింజలు రాలగొడితే చాలు-
గాదెలు గరిసెల్ని ఏ కొంప నిలబెట్టుకొందనీ
మనిషి అస్తిత్వమంతా అతని జేబులోనే వొదిగింతర్వాత

(- సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి)

కొత్తదుప్పటి కథల సంకలనం లోని రైతు కథల సారమంతా ఈ కళ్ళం కవితలో ఉందని నాకనిపించింది. మీరేమంటారు?