తవ్వకాలింకా జరుగుతున్నాయి. అడవులని నరికేసారు, పర్వతాలని తొలిచేసారు. నగరాలని, గ్రామాలని నేలమట్టం చేసేసారు. నదుల్లోని నీళ్ళని, ఎడారులలోని ఇసుకని తోడేసారు. ఎక్కడ తవ్వినా, అక్కడ మట్టి మాత్రమే కనపడుతోంది. ఆ మట్టి – మెత్తగా, గట్టిగా, జారుడుగాను, ఇసుకతోను, పాలిపోయినట్లు, నల్లగాను, ఎర్రగాను, తెల్లగాను, పొరలు పొరలుగా – ఒక రకం నుంచి ఇంకో రకానికి పోలికే లేకుండా కాలనుగుణంగా, వాతావరణానికి తగ్గట్టుగా మారుతోంది. ప్రతి పొరకి ఒక రంగు, ఒక రకం, ఒక రూపం ఉన్నాయి. కొన్ని చోట్ల పర్వతాల వరుసక్రమం, ఇంకొన్ని చోట్ల లోతైన చీకటి సొరంగాలు, మరికొన్ని చోట్ల నోరు తెరచుకున్న అగ్నిపర్వతాలు, గట్టి, మెరుపుతో కూడిన ఖనిజాలు. తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు వీటి గురించి ఎవరూ ఏ మాత్రం ఊహించనుకూడా లేదు. భూమి ఆవిర్భవించిన తర్వాత జరుపుతున్న మొదటి తవ్వకంగా జనాలు భావించారు. తమకు లభించిన వాటికి పెద్దగా ప్రాముఖ్యత లేదని అనుకున్నారు.
ఈ తవ్వకాలలో దొరికిన ఎముకలను ఒకచోట చేర్చి, మానవ కంకాళాన్ని రూపొందించాలని ప్రయత్నం జరుగుతోందక్కడ. మానవ అస్థిపంజరాన్ని రూపొందించేందుకు లెక్కలేనన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురయ్యాయి. పైగా దొరికిన ఎముకల కొలత, రూపం ఆధారంగా వాటి వయసుని నిర్ధారించడం చాలా కష్టమైన పని. ఈ విషయం ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. బహుశా ఈ ఎముకలు, భూమి అంత పురాతనమైనవేమో.
ఎముకలని గుట్టగా పోసారు. కంకాళపు ఎముకలనన్ని ఒకచోట చేర్చి చూస్తే, ఆ రూపం భయంకరంగా తోచింది. ముఖంలోని ఎముకలని సరిజేస్తే, దవడ ఎముకలు కదిలిపోతున్నాయి. దవడ ఎముకలని సరిజేస్తే, కపాలం వింతగా కనపడుతోంది. ఎంతో శ్రమకోర్చి, మెడకొంకులని జోడిస్తే, భుజం పక్కటెముకలు, కపాలం ఎముకలు కదిలిపోతున్నాయి. చేతి ఎముకలని చేరిస్తే, భుజం ఎముకలు జారిపోతున్నాయి. ఇక వెన్నెముకని నిలబెట్టడం ఎంత జటిలమో చెప్పనే అక్కరల్లేదు. వెన్నెముకలోని కీళ్ళు ఒక దానితో ఒకటి కలవడం లేదు. దాంతో వాటి వరుసక్రమం సరిగా కుదరడం లేదు. ఛాతి ఎముకలు, పక్కటెముకలు వెన్నెముక కీళ్ళకి దూరంగా ఉన్నాయి. తుంటి ప్రాంతాన్ని పొత్తి కడుపుని కలిపితే, తొడ ఎముకలు చెదిరిపోతున్నాయి. ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ, మానవ కంకాళాన్ని రూపొందించడం పూర్తవలేదు.
ఎన్నెన్నో ప్రయత్నాలు చేసారు, వేర్వేరు కార్యాచరణలని పరిశీలించారు, మానవ కంకాళాన్ని తయారు చేయడానికి కొత్త పద్దతులు ప్రయోగించారు. ఈ సారి వికారమైన కంకాళం తయారైంది. దాన్లో మానవ కంకాళానికి సంబంధించిన లక్షణాలేవీ కనపడలేదు. మానవ కంకాళం ఒక్కో కాలంలో ఒక్కో రకంగా ఉంటూ, కాలక్రమంలో మార్పులకు లోనయిందేమో.
ఈ వికారమైన కంకాళాన్ని సునిశితంగా పరిశీలిస్తే, మానవ అస్థికలతో పాటు కొన్ని మానవేతర అస్థికలు కూడా కలిసిపోయాయని తెలిసింది. మనుషుల ఎముకలని, ఇతర ఎముకలని వేరు చేయడం సులభమైన పని కాదు. మొదటి జీవుల గురించి, వాటి ఎముకల రూపం గురించి తెలిసినది తక్కువ. మొదట మానవేతర జీవులుగా ఉన్నవి క్రమంగా మానవులుగా మారాయా? లేక మొదట మానవలుగా ఉండి తర్వాత మానవేతర జీవులుగా మారాయా? అనాదికాలంలోనే మానవ, మానవేతర అస్థికలలో తేడాలు నశించి, అవి ఒకేలా మారిపోయాయి.
ప్రతీ ఎముకని పరీక్షించారు, వేరు చేసారు. కానీ మానవేతర జీవుల ఎముకలుగా భావిస్తున్నవి నిజంగానే మానవేతర జీవుల ఎముకలేనా అనేదాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేకపోయారు. దీనిపై అభిప్రాయబేధాలొచ్చాయి, వాదోపవాదాలు జరిగాయి. వాస్తవంలో మానవ, మానవేతర జీవుల ఎముకల మధ్య వైవిధ్యం అనేది అర్ధం లేనిది.
మానవ కంకాళాన్ని రూపొందించలేకపోడంతో, తవ్వకాలు అసంపూర్తిగా జరిగినట్లు, సేకరించిన ఎముకలు సరిపోవని గ్రహించారు.
తవ్వకాల జోరుని పెంచారు. భూమి లోతులనుంచి ఎన్నో ఎముకలు సేకరించారు. వీటితో మానవ కంకాళాన్ని రూపొందించడానికి మళ్ళీ ప్రయత్నం చేసారు. ఎంతో నైపుణ్యంతోను, చాతుర్యంతోను ప్రతీ ఎముకని దాని స్థానంలో ఉంచారు. వెన్నెముక కీళ్ళని స్వస్థలాలో ఉంచడం అంత తేలికైన విషయం కాదు, అయినా బాగానే కష్టపడ్డారు. అంతే శ్రమించి, ఛాతి ఎముకలని, పక్కటెముకలని జోడించారు. కపాలం ఎముకలని, ముఖాన్ని దవడని జతచేయడంలో అత్యంత శ్రద్ధ కనపరిచారు. చివరగా, మానవ కంకాళం రూపుదిద్దుకుంది. కానీ ఈ కంకాళం ఎంతో సేపు నిలవలేదు. కొన్ని ఎముకలు వాటి స్థానంలోంచి కదిలిపోయాయి, ఫలితంగా కంకాళం కుప్పకూలింది.
ఇదెంతో తత్తరబాటుకి, అవమానానికి కారణమైంది. వేలాది ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి, వేలాది సిద్ధాంతాలు ప్రకటితమయ్యాయి. ఎన్నెన్నో సందేహాలు, మరెన్నో ప్రాతిపదికలు తెరమీదకి వచ్చాయి.
తవ్వకాలు మరింత లోతులకి వెళ్ళాయి. ఇంకా ఎన్నో ఎముకలను సేకరించారు. కంకాళాన్ని రూపొందించడానికి కొత్త పద్దతులు, క్రొంగొత్త విధానాలు ఉపయోగించారు. తాజా సమాచారాన్ని, తాజా పరిజ్ఞానాన్ని, విశేషానుభవాలను మిళితం చేసారు.
అయితే కంకాళాన్ని రూపొందించడం ఎక్కడ తప్పు జరుగుతోందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఏ ఎముకని తప్పుగా పెడితే మొత్తం కంకాళం అంతా దెబ్బతింటోందో తెలియడం లేదు. ఒక్కోసారి లోపం ముఖం ఎముకలని, కపాలం ఎముకలని కలపడం లో ఉందేమోననిపిస్తోంది. మరోసారి వెన్నెముకలో కీళ్ళ అమరికలోనో, లేదా కాళ్ళ ఎముకల అమరికలోనో లేదా భుజాల ఎముకల అమరికలోనో లేదంటే తుంటి ఎముకల అమరికలోనో దోషం ఉండి ఉంటుంది.
మానవ అస్థి పంజరంలోని అన్ని ఎముకలు ఒకే పద్దతిలో అమరడం లేదు. వాస్తవానికి వాటన్నింటిని రకరకాల పద్దతులలో ఒక చోట చేర్చి, కంకాళాన్ని రూపొందించారు. ఫలితంగా వేర్వేరు కీళ్ళు ఏర్పడ్డాయి. ఒక కీలు అన్ని వేళలా కదిలితే, మరొకటి ఒక్కసారి మాత్రమే కదులుతోంది. కొన్ని కీళ్ళు మెలితిరిగితే, మరికొన్ని కుంచించుకుపోతున్నాయి, ఇంకొన్ని సాగుతున్నాయి. కొన్ని కదలడం లేదు, మరికొన్ని అటు ఇటు తెగ కదులుతున్నాయి. కీళ్ళ నిర్మాణం, అమరిక వాటి పనులు, కదలికల ఆధారంగా జరిగింది. మానవ కంకాళంలోని ఎముకలలో, కీళ్ళలో ఏదో విశిష్టమైన సమతూల్యత ఉంది, అదే మొత్తం కంకాళాన్ని స్థిరంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
మానవ కంకాళ నిర్మాణ శాస్త్రాన్ని మరోమారు ఉపయోగించారు. ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా ఎముకలని పరీక్షించారు, విశ్లేషించారు. రూపాలని, ఆకారాలని, రకాలని విస్త­­ృతంగా పరిశీలించాకా, అన్ని ఎముకని చక్కని నైపుణ్యంతో అమర్చి కంకాళాన్ని రూపొందించారు. అయితే ఈ సారి కూడా ఎముకల మధ్య సామరస్యం కుదరలేదు. కపాలం మెడ పై ఉండట్టేదు, దవడ ఎముకలు ముఖంలో ఉండడం లేదు, చేతుల ఎముకలు భుజాలకి సరిపోడం లేదు. వెన్నెముక కీళ్ళు, ఛాతి ఎముకలు, పక్కటెముకలు వాటి స్థానాలలో ఉండక, ఒకదానికొకటి సంబంధం లేకుండా వేలాడుతున్నాయి. తుంటి ఎముకలు, కాలి ఎముకలు ఒకదాన్ని మరొకటి అంగీకరించడం లేదు. మోచిప్ప ఎముకలు, మడమ ఎముకలు, మణికట్టు ఎముకలు, అరచేతి ఎముకలు, వేళ్ళ ఎముకలు…… ఇవన్నీ ఒకదానితో మరొకటి కలిసిపోయాయి, వాటినిప్పుడు వేరు చేయడం కష్టం.
క్లిష్టమైన, జటిలమైన పరిస్థితి ఏర్పడింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలోని అన్ని పద్దతుల ప్రయత్నించి, విఫలమయ్యారు. అన్ని విశ్వాసాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలు, తత్వశాస్త్రాలు విఫలమై, నీరుగారిపోయాయి.
నేటికీ సంపూర్ణ మానవ కంకాళాన్ని నిర్మించడం పూర్తికాలేదు.

* * *
ఉర్దూ మూలం: మహమూద్ షాహిద్ ఆంగ్లం: ఫాహిమ్ జావైద్

(ఈ కథ చినుకు మాసపత్రిక ఏప్రిల్ 2009 సంచికలో ప్రచురితం)