ఎవరు ఏమైపోతే మాకేం?
ఏప్రియల్ 18, 2008
ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న వర్షాలు పేదలు, గూడు లేని అభాగ్యులని శిక్షిస్తూ, ఒక్కసారిగా ఉదృతంగా వచ్చాయి. ఈ జడివానల ధాటికి తలవంచి, సూర్యుడు ఎక్కడో దాక్కున్నాడు. ఎటు చూసినా తడి, చెమ్మ. అయితే ఈ వానలు ‘సాఖి’ ఉత్సాహాన్ని మాత్రం నీరు కార్చలేక పోయాయి. ఆమె వంటింట్లో పొయ్యి వెలిగించడానికి ప్రయత్నిస్తోంది. ఇంట్లో మిగిలిన ఆ గుప్పెడు బియ్యాన్ని వండి, పిల్లలకి కనీసం తలా ఒక ముద్ద అన్నమైనా పెట్టి నిద్రపుచ్చాలని ఆమె తపన. వానలో తడిసిన కర్రపుల్లలని పొయ్యిలోకి తోస్తూ, నిప్పు రాజేయడానికి గుండెల నిండా ఊపిరి పీల్చుకుని గొట్టంలోంచి గట్టిగా గాలి ఊదుతోంది. అంత చిన్న పని సైతం ఇప్పుడామెకి భగీరధ ప్రయత్నమైంది.
వీపుకి కట్టుకున్న ఆమె చిన్న కొడుకు ఏడుపు ఆపడమే లేదు. అంత పనిలోను ఆమెకి నవ్వొచ్చింది. వాడిని సముదాయించలేదు, నిప్పు రాజేయడం ఆపనూ లేదు! ఆమె లేచి ఓ బకెట్ లోంచి ధాన్యం పొట్టు కొంత తీసి పొయ్యిలో వేసింది. ఓ చిన్న కర్రపుల్లకి నిప్పంటించి, ధాన్యం పొట్టుపై పడేసింది. ఆ వేడికి కర్రపుల్లల్లోని తేమ ఆవిరైపోయింది. క్రమంగా మంట పెద్దదై అన్ని కర్రలనూ అంటుకుంది. సాఖి చిన్నగా నిట్టూర్చి, మసిబారిన ఓ అల్యూమినియం వంటపాత్రని పొయ్యిపై పెట్టింది.
టప్…టప్… టప్
చినుకులు తుప్పు రేకులమీద పడి, క్రిందకి జారి సాఖి ఉంచిన బకెట్లు, గిన్నెలు, తపేళాలలో తిన్నగా పడుతున్నాయి. పొయ్యి వెలిగించే ప్రయత్నంలో ఉండి, ఆమె గిన్నెలలో చేరిన నీటి సంగతి గమనించలేదు. పాత్రలన్నీ నిండిపోయి, నీళ్ళు నేల మీదకి కారుతున్నాయి. వర్షం వల్ల అసలే చెమ్మగా ఉన్న నేల ఈ నీటి ప్రవాహంతో మరింత చిత్తడిగా మారింది. ఆమె గబగబా లేచి ఆ పాత్రలలోని నీటిని బయట పారబోసి, గిన్నెలని యధాస్థానంలో ఉంచింది. తర్వాత ఓ పాత గుడ్డతో నేలను తుడిచింది. ఇంతలో బయటనుంచి ఎవరో ఆమెని పిలిచారు.
“అక్కా, సాఖి అక్కా”
ఆ గొంతు ఎవరిదో పోల్చుకోలేక, చేస్తున్న పనిని ఆపి మరింత శ్రద్ధగా వినడానికి ప్రయత్నించింది.
“అక్కా, సాఖి అక్కా, ఈ పూట తొందరగా నిద్రపోయావా ఏంటి?”
ఈ సారి ఆమె ఆ గొంతుని పోల్చుకుంది. ఆమెకి తమ్ముడి వరసయ్యే ‘ అనౌ’ ది ఆ గొంతు.
“లేదు. మెలకువగానే ఉన్నాను. వంటింట్లో ఉన్నాను. గడియతీసే ఉంది. లోపలికిరా”
అనౌ లోపలికి వచ్చాడు. సాఖి నేలను తుడవడం ఆపి, ఒక పాత వెదురు స్టూలుని తెచ్చి వేసింది. తన ఇంటి పరిస్థితి పట్ల ఆమెకి సిగ్గుగా ఉంది.
“నువ్వు వస్తావని ఊహించలేదు. మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. పైగా వేళ కాని వేళ! ఏమిటి విషయం?” అని అడిగింది.
అనౌ ఏమీ మాట్లాడలేదు. స్టూలు మీద కూర్చుని గదంతా పరికించి చూసాడు. వాన చినుకులు కారుతున్న ఒకే ఒక రేకుల గదిని తమ ఇల్లని చెప్పుకోడం ఎవరికీ గర్వంగా ఉండదు. సాఖి ఆ గదిలోనే ఒక మూల వంట చేస్తోంది. మరో మూల ఇద్దరు పిల్లలు! ఆడ పిల్లకి సుమారు ఐదేళ్ళు ఉండచ్చు. ఆ పిల్ల తన పెద్ద తమ్ముడితో పాటు కూర్చుని ఉంది. అమాయకమైన చూపులతో పిల్లలిద్దరూ అతిధిని దీనంగా చూస్తున్నారు. వెంటనే వారి కళ్ళలోని ఆకలిని పసిగట్టాడు అనౌ. అక్క వీపుపై ఉన్న మరో పిల్లాడిని గమనించాడు.
“అయితే నీకు ముగ్గురు పిల్లలన్న మాట! కానీ వీళ్ళ కోసం నేనేమీ తీసుకురాలేదు….”
“పర్వాలేదులే. రోజంతా ఏదో ఒకటి నములుతూండడం తప్ప వీళ్ళకి వేరే పనేం లేదు. ఇప్పుడే ఓ పాకెట్ బిస్కట్లు లాగించారు. అయినా వీళ్ళకి ఎప్పుడూ ఆకలే…..”
అందంగా అబద్ధమాడినా, పిల్లలకి కనీసం రెండు పూటలైనా తిండి పెట్టలేని తన అశక్తతని, పేదరికాన్ని లోలోపలే తిట్టుకుంది సాఖి.
సాఖి భర్త ‘టోనూ’ ట్రక్ డ్రైవర్. గౌహతి నుంచి ఇంఫాల్ వరకు సరుకుల లోడ్ తీసుకుని నేషనల్ హైవే పైన తిరుగుతూంటాడు. టోనూ బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. పెళ్ళయి ఎక్కడో దూరంగా కాపురం చేసుకుంటున్న ఓ అక్క తప్ప టోనూకి వేరే బంధువులెవ్వరూ లేరు. ఇటు తనవైపు కూడ సాఖికి ధనవంతులైన చుట్టాలు లేరు. ఆమె అమ్మానాన్నలకి రెక్కాడితేగాని డొక్కాడదు. ఆమె తమ్ముళ్ళింకా చదువుకుంటూనే ఉన్నారు.
భర్త సంపాదించే కొద్దిపాటి జీతంతోను బ్రతకడం కష్టంగానే ఉంది. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే కావడంతో సాఖి బయట పనులకి వెళ్ళలేకపోతోంది. అలా అని ఆమె ఖాళీగా ఉండదు. ఇంటి చుట్టూ చిన్న పాదులు వేసి, తోటలా చేసింది. ఆకు కూరలు,కూరగాయలు పండించి, ఇంటి ఖర్చుని కొంతైనా తగ్గించగలిగింది. స్వెటర్లు అల్లుతూ కొద్దో గొప్పో సంపాదిస్తుంది. కానీ ఈ వానలకి తోట పాడైపోయింది. చలికాలం రావడానకి ఇంకా చాలా రోజులున్నాయి కాబట్టి స్వెటర్లకి ఆర్డర్లేమీ లేవు. భర్త ఇచ్చే ప్రతీ పైసాని జాగ్రత్తగా లెక్కిస్తుంది సాఖి.
నేషనల్ హైవే మీద ఎంతో కాలంగా కొనసాగుతున్న ఓ ‘రాస్తారోకో’ వల్ల టోనూ ఆదాయం కుంటు పడడమే కాక, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని సరుకులైతే మార్కెట్లోంచి మాయమైపోయాయి. ఎంత ధర పోసైనా కొనుక్కోగలిగే వాళ్ళకి మాత్రం నల్లబజారులో దొరుకుతున్నాయి.
“నేను ఇప్పుడే గౌహతి నుంచి బస్‌లో వచ్చాను. ఈ రాస్తారోకో వల్ల రెండు గంటలకి పైగా ఆలస్యమైంది. స్టేట్ బోర్డరు దగ్గర పోలీసు ఎస్కార్టు కోసం ఎదురుచూడడం వల్ల మరీ ఆలస్యమైంది. అక్కడే బావ కలిసాడు. పాపం ఆ ప్రాంతంలో చిక్కుకుపోయి రెండు రోజులవుతోందట! నీ గురించి పిల్లల గురించి బెంగ పెట్టుకున్నాడు” చెప్పాడు అనౌ.
” ఎప్పుడొస్తాడట?”
” తెలీదు. కనీసం 50-60 ట్రక్కులు ఆగిపోయి ఉన్నాయి. పోలీసులు ఒకసారి నాలుగు లేదా ఐదు ట్రక్కులకి రక్షణనివ్వగలరు. పైగా ప్రయాణీకుల బస్సులకి ప్రాధాన్యతనిస్తున్నారు….”
” ఈ రాస్తారోకో ఇంకా ఎన్నాళ్ళు? తమ స్వార్ధపరమైన కోర్కెల కోసం ప్రజలని ఎంతగా ఇబ్బందుల పాలు చేస్తున్నారో! ఎవరు ఏమైపోతే మాకేం అని అనుకునే దుర్మార్గులు….”
“దేవుడికే తెలియాలి, ఈ రాస్తారోకో ఎప్పటికి ముగుస్తుందో. కాని ఒకటి మాత్రం చెప్పగలను - ఇప్పట్లో మాత్రం ఆపరు…” అంటూ రెండు వంద రూపాయల నోట్లు తీసి సాఖికి అందించాడు.
“బావ ఈ డబ్బులు నీకివ్వమన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చాను”
సాఖి ముఖం వెలిగిపోయింది. డబ్బు చేతిలో ఉంచుకుని అనౌకి కృతజ్ఞతలు చెప్పింది.
“నాకు డబ్బివ్వడానికి నువ్వంత దూరం నుంచి వచ్చావు. నేను నీకు కనీసం ఓ కప్పు టీ కూడ ఇవ్వలేకపోతున్నాను. ఏమనుకోకు”
“పర్వాలేదు. అయినా ఇది టీ తాగే సమయం కాదు. ఇప్పటికే ఆలస్యమైంది. మా ఇంట్లో నా కోసం ఎదురుచూస్తూంటారు…” అంటూ అనౌ లేచి వడివడిగా బయటకు కదిలాడు.
* * *
అనౌ వచ్చి వెళ్ళాకా, రెండు రోజులు గడిచిపోయాయి. మూడో రోజు సాయంకాలమైంది. మరో రోజు కూడా ముగిసిపోతోంది. కానీ టోనూ ఇంకా ఇంటికి చేరలేదు. సాఖి మనసంతా అశాంతిగా ఉంది. పెరట్లోని తులసి మొక్క ముందు మోకాళ్ళ పై కూర్చుని ఓ చవకరకం అగరబత్తిని వెలిగించింది. పెద్ద పిల్లలిద్దరూ మౌనంగా తల్లి వెనకాల చేరారు. చిన్నాడు అమ్మ వీపుకే వేలాడుతున్నాడు. వెలిగిన అగరబత్తిని నేలకి గుచ్చి, పక్కనే ఓ దీపాన్ని వెలిగించింది. ధూపం పరిమళం ఆ ప్రాంతాన్ని పవిత్రం చేసింది. కుటుంబమంతా కలసి సాయంత్రపు ప్రార్ధనని పూర్తిచేసారు. ఎన్నాళ్ళ నుంచో కొనసాగుతున్న ఈ సాంప్రదాయాన్ని సాఖి ఇప్పటికీ పాటిస్తుంది.
ప్రార్ధన ముగించి కళ్ళు తెరవగానే తమ ఇంటి వైపు ఎవరో రావడం కనిపించిందామెకు. లేచి నిలుచుంది. దగ్గరయ్యే సరికి ఆ ఆకారం ఆమెకి సుపరిచితమే! ఆ వచ్చింది ‘ ఎబోంచా’. టోనూ అసిస్టెంటు. టోనూతో పాటు లారీలో ఊళ్ళు తిరుగుతూంటాడు.
అతడు ఒంటరిగా రావడం, అతడి ముఖంలో ఆందోళన చూసి కంగారు పడింది సాఖి.
వణుకుతున్న గొంతుతో….”వదినా” అని మాత్రం అనగలిగాడు ఎబోంచా. ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కాని మాటలు పెగలడం లేదు.
” ఏమైందో చెప్పు! మీ అన్న ఎక్కడ?”
ఎబోంచా ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత శక్తి కూడదీసుకుని, ” ఓ దుర్వార్త మోసుకొచ్చా వదినా! అన్నకి యాక్సిడెంటయ్యింది” అని చెప్పాడు.
” ఏంటి యాక్సిడెంటా? దెబ్బలు బాగా తగిలాయా? ఇప్పుడెలా ఉన్నాడు?” ఆతృతగా అడిగింది సాఖి
“అన్న మనకిక లేడొదినా… పైకెళ్ళిపోయాడు….” అంటూ భోరుమన్నాడు ఎబోంచా.
సాఖికి ఒక్కసారిగా తలతిరిగింది. నేల మీద కూలబడిపోయింది. ఎబోంచా చెబుతున్నదేది ఆమె చెవికెక్కడం లేదు.
“పోలీసు జీపుల వెంటే మా ట్రక్‌ని నడిపాం. అన్న నడుపుతున్నాడు. నేను పక్కనే కూర్చుని ఉన్నాను. కొండదారిలో ఒక మలుపు దగ్గర అడవిలో కొందరు దాక్కుని మా మీదకి రాళ్ళు విసిరారు. రాళ్ళ దెబ్బలకి లారీ అద్దాలు పగిలిపోయాయి. ఓ రాయి తగిలి అన్నకి కాసేపు కళ్ళు కనిపించలేదు. అంతే లారీ అదుపు తప్పి, ఓ పెద్ద లోయలోకి జారిపోయింది. ఇదంతా నాకు స్పృహ తప్పకముందు జరిగిన సంఘటన……
నేను కళ్ళు తెరిచేసరికి జిల్లా ఆసుపత్రిలో మంచంపై ఉన్నాను. లారీ ఓనరు, కొంతమంది పోలీసులు ఉన్నారక్కడ. ఓ పోలీసు నా స్టేట్‌మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాతే చెప్పారు - ఆ ప్రమాదంలో అన్న చనిపోయాడని!”
సాఖి ఇంకా దిగ్భ్రాంతి స్థితిలోనే ఉంది. ఎబోంచా చెప్పేదేమీ వినడం లేదు. పొంగివస్తున దుఃఖోద్వేగాన్ని అణచుకోడానికి ప్రయత్నిస్తోంది. ఆమె మానసిక స్థితిని గమనించని ఎబోంచా ఇంకా చెప్పుకుపోతున్నాడు.
“నాకు ప్రధమ చికిత్స చేసి, చిన్న చిన్న గాయాలకు పట్టీలు వేసారు. నీకీ వార్త తెలియజేయమని ఓ జీపులో ఇక్కడికి పంపారు. అధికారులింకా అక్కడే ఉన్నారు. ఏవో కాయితాల పనులు పూర్తిచేసి, శవపరీక్ష అయ్యాక అన్న శరీరాన్ని తీసుకొస్తారట. వాళ్ళు ఏ క్షణంలోనైనా రావచ్చు….”
తండ్రిని కోల్పోయిన పిల్లలని దగ్గరికి తీసుకుని హత్తుకుంది సాఖి. ఆమె వీపు పై పిల్లాడు ఏదో అర్ధమైనట్లుగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అలా ఎంత సేపు ఉండిపోయిందో ఆమెకి తెలియలేదు. అప్పటికే చాలా చీకటి పడింది. కొంత సేపటికి ఓ వాహనం వచ్చి ఇంటి ముందు ఆగింది. దాని హెడ్ లైట్ల వెలుగులో ఎబోంచా ఇంకా అక్కడే నిలబడి ఉండడం కనపడింది. కొన్ని క్షణాల తర్వాత ఓ వ్యక్తి లాంతరు పట్టుకుని లోపలికి వచ్చాడు. ఆ వెనుకే నలుగురు మనుషులు తెల్లటి వస్త్రంలో కప్పిన శవపేటికని మోసుకొచ్చారు. ఏ మాత్రం చప్పుడు చేయకుండా, నిశ్శబ్దంగా క్రిందకి దించారు. వాళ్ళల్లోంచి ఒకరు, టోనూ ముఖాన్ని చూడడానికి వీలుగా, శవంపై గుడ్డని కొద్దిగా తొలగించారు. ఆ లాంతరు వెలుతురులో టోనూ ముఖం ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉంది.
కాసేపటి తర్వాత, ఆ స్మశాన నిశ్శబ్దాన్ని ఆమె పెద్ద కొడుకు భగ్నం చేసాడు.
” అమ్మా , నాన్నెందుకు పెట్టెలో పడుకున్నాడు?”
మణిపూరి, ఆంగ్ల మూలం: తయేన్‌జమ్ బిజోయ్‌కుమార్ సింగ్
(ఈ కథ చినుకు మాసపత్రిక ఏప్రిల్ 2008 సంచికలో ప్రచురితం)
Entry Filed under: నా అనువాదాలు. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
kasturimuralikrishna | ఏప్రియల్ 18, 2008 at 3:48 పూర్వాహ్నం
good story.somehow,the message is a bit obscure.translation is wonderful.
2.
surya | ఏప్రియల్ 19, 2008 at 11:00 పూర్వాహ్నం
human element touch my hart…
3.
Satya | ఏప్రియల్ 24, 2008 at 2:58 పూర్వాహ్నం
Good translation.