వాన దొంగ

ఏప్రియల్ 11, 2008

నేను లిస్బన్‌కి తరచూ వచ్చి వెడుతూంటాను. నెలకోసారి కాకపోయినా, కనీసం ఆరు వారాలకొకసారైనా వెడతాను. అక్కడికి వెళ్ళడానికి విమానం ఎక్కుతాను. నా చిన్న తనంలో మా తల్లిదండ్రులు బ్రెజిల్‌లో ఉండడం వల్ల, నాకు ఇక్కడి భాషతో ఇబ్బంది ఎదురవలేదు. దుబాసీ అవసరం లేకుండా నెట్టుకొచ్చేస్తున్నాను.
ఈ నగరం కూడ నాకు బాగానే తెలుసు. మనం తరచూ వెళ్ళే ప్రదేశాలన్నీ మనకి బాగా తెలుసనిపిస్తాయి. కానీ లోతులకెడితే అక్కడి ప్రతీ వస్తువు కొత్తగా ఉండి మనకి పరాయితనాన్ని గుర్తుచేస్తాయి.
అందుకే లిస్బన్‌లో ఎదురయ్యే అనూహ్యమైన సంఘటనలు సహజంగానే నన్ను ఆశ్చర్యపరచవు. నేను వాటికి సిద్ధమయ్యే ఉంటాను. అందుకే నేనెప్పుడూ బసచేసే ఫైవ్ స్టార్ హోటల్ ఓవర్‌బుక్ అయిపోయిందని తెలిసినప్పుడు, పైగా మా ఆఫీసు వాళ్ళు ముందుగానే డబ్బు కట్టి నా కోసం బుక్ చేసిన గదిని మరొకరికి ఇచ్చేసారని తెలిసినప్పుడు కూడా నాకు ఆశ్చర్యం కలగలేదు. హోటల్ మానేజరు తమ పొరపాటుకి సిగ్గు పడ్డాడు. క్షమించమని ఎన్నోసార్లు అడిగాడు. తప్పు తనది కానప్పటికీ, నా సమస్యకో పరిష్కారం చూపాడా మానేజరు. ఇంక అదనంగా డబ్బేమీ చెల్లించక్కర్లేకుండా, హోటల్ చివరి అంతస్తులో ఉన్న ‘స్యూట్’ లో నాకు బస ఏర్పాటు చేస్తానన్నాడు. దాన్ని దేశాధినేతలకి మాత్రమే ఇస్తారట!
నాకు నవ్వొచ్చింది. హోటల్ వాళ్ళ అసమర్థతకి, నాకు దక్కిన అదృష్టానికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. దేశాధినేతలకీ, వారి పరివారానికి, అధికార బృందానికి లేదా తమ బ్యాంకు ఖాతాల నిల్వల కారణంగా ప్రముఖులుగా పరిగణింపబడే వ్యక్తులకు మాత్రమే ఇచ్చే సువిశాలమైన విడిది ఇప్పుడు నాకు దక్కింది. క్రీడలు, సినిమాలు, వర్తక వాణిజ్యాలు, రాజకీయాల వంటి వివిధ రంగాలలోని గొప్పవాళ్ళతో ఈ స్యూట్‌లోని ప్రతీ వస్తువు తాము అందించే విలాసాలు, కల్పించే అభిరుచి, సౌకర్యాల గురించి మౌనంగా మాట్లాడినట్లే, నాతోనూ మాట్లాడాయి. బాల్కనీలు వాళ్ళకోసం తెరచుకున్నట్లే నాకోసం కూడా తెరచుకుని తళుకుబెళుకుల నగరాన్ని నాకు చూపించాయి.
‘పర్వాలేదే’ అని అనుకున్నాను. ఇక బస విషయాన్ని పక్కన బెట్టి నా ఇతర పనులపై దృష్టి సారించాను. రెండు రోజులు త్వరగా గడిచిపోయాయి. ప్రతీ రోజు గంటల తరబడి మీటింగులు, డిన్నర్లు. బయటే భోంచేసి, ఆలస్యంగా వస్తుండడంతో స్యూట్‌ని పరిశీలించే అవకాశం లేకపోయింది. పొద్దున్నే మాత్రం కాస్త వీలు చేసుకుని, విలాసమైన నా బసని కలయదిరిగాను. అద్భుతమైన జాకూజీ మసాజ్ చేయించుకున్నాను. అందమైన గాజు పలకల మధ్య నిలబడి షేవింగ్ చేసుకున్నాను. ఓ చిన్న సైజు స్విమ్మింగ్‌పూల్ లాంటి బాత్ టబ్‌లో స్నానం చేసాను. బ్రేక్‌ఫాస్ట్‌ని బాల్కనీలో సర్వ్ చేయమని పురమాయించాను. ఆ తర్వాత తీరికగా తయారై సామాన్లు సర్దుకోసాగాను. అప్పటికింకా సమయం తొమ్మిదిగంటల ఐదు నిమిషాలే. నేనెక్కాల్సిన విమానానికి చెకిన్ పదిగంటల ఇరవై నిమిషాలకి. నేనున్న హోటల్ నుంచి ఎయిర్‌పోర్టుకి టాక్సీ లో ప్రయాణం పావుగంట కంటే ఎక్కువ పట్టదని నాకు తెలుసు.
ఆ సమయంలో హఠాత్తుగా అక్కడ నాతో పాటు మరెవరో ఉన్నారని నాకు అనిపించింది. తలుపుని సగం తెరచి చూసాను. ఇద్దరు నల్లజాతి స్త్రీలు నా పక్క గదిని ఊడుస్తూ కనిపించారు. బహుశా వాళ్ళు మరో వైపునుంచి ఈ స్యూట్‌లోకి ప్రవేశించి ఉంటారు. ఎన్నో బెడ్ రూంలను, డ్రెస్సింగ్ రూంలను, సిట్టింగ్ రూంలను శుభ్రం చేసి ఉంటారు. వాళ్ళ వద్ద ఉన్న ఓ చిన్న తోపుడుబండిలో వాక్యూం క్లీనర్లు, డస్టర్లు, డిటర్జెంట్లు, సబ్బులు, ఉతికిన తువ్వాళ్ళు ఉన్నాయి. వాళ్ళని నేను చూడడం ఇప్పుడే తటస్థించింది.
వాళ్ళని నేను వెళ్ళిపోయాక, మళ్ళీ రమ్మని చెబుదామని అనుకున్నాను. కాని అంతలో మనసు మార్చుకున్నాను. ఎలాగు ఇంకాసేపట్లో ఇక్కడినుంచి వెళ్ళిపోయేవాడినేకదా! అయితే లగేజీ తీసుకుని వెళ్ళిపోయే ముందు కాసేపు వీధిలో నడక కొనసాగిద్దామనుకున్నాను. వెనక్కి తిరిగి, వార్డ్‌రోబ్ వైపు నడిచాను. నా బట్టలు తీసుకుని సర్దుకోడం మొదలుపెట్టాను.
ఇంతలో నాకు వాళ్ళ మాటలు వినబడ్డాయి. వాళ్ళలో ఒకామె ఎక్కువగా మాట్లాడుతోంది. రెండో స్త్రీ అప్పుడప్పుడు ఏవో ప్రశ్నలు వేస్తూ, శ్రద్ధగా వింటోంది. వారి గొంతులు, మాట తీరు వేరువేరుగా ఉన్నాయి.
“వాన! అదంతా వాన వల్లే జరిగింది” ఒకామె చెబుతోంది.
నా బ్లేజరుని సూట్‌కేసులో పెట్టుకున్నాను. కోటుని, లోదుస్తులని లోపలపెట్టాను. ఓ చొక్కాని మడతపెట్టుకుంటూ వాళ్ళ మాటల్ని వింటున్నాను.
“వర్షమే దానికి కారణం”, ఆమె మళ్ళీ చెప్పింది. తిరిగి చెప్పసాగింది.
“చాలా కాలం వరకు మా ప్రాంతంలో వర్షాలు కురవలేదు. అన్నీ నాశనమైపోయాయి. చెట్లు, పిట్టలు చచ్చిపోసాగాయి. ఈ పక్షుల కళేబరాల చుట్టూ జనాలు అడ్డదిడ్డంగా నడిచారు”
నేను ఇంకో చొక్కాని కూడ మడతపెట్టి, రెండింటిని సూట్‌కేసులో సర్దుకున్నాను. దాన్ని మూసేసి రకరకాల అంకెలతో కూడిన కోడ్‌ని ఉపయోగించి తాళం వేసాను.
“అన్నీ ఎండిపోయాయి. నీళ్ళు లేకపోడం వల్ల నేలపైన పగుళ్ళు ఏర్పడ్డాయి. పశువులు చచ్చిపోసాగాయి. జనాలు మరణిస్తున్నారు. పిల్లలు జీవం కోల్పోతున్నారు. వాగులు ఎండిపోయాయి. చెట్లు ఆకులు వడలిపోయాయి. చెట్లు మోడులయ్యాయి…..”
నేను తలుపు చాటునుంచి ఓరగా చూసాను. ఇప్పటిదాక మాట్లాడుతున్న ఆమె తుడవడం ఆపేసింది. రెండో స్త్రీ కూడ తుడవడం ఆపేసి ఆమెకేసే చూడసాగింది. ఆ క్షణంలో అక్కడున్న డిటెర్జెంట్లు, సబ్బులు, తువ్వాళ్ళు తమ ఉనికిని కోల్పోయాయి.
ఈ సారి ఆమె మరింత గట్టిగా మాట్లాడసాగింది. లేదంటే నేను వాళ్ళ వైపు తిరిగడం వల్ల ఆమె మాటలు నాకు గట్టిగా వినబడుతున్నాయేమో!
“అప్పుడు గ్రామస్తులు చర్చించడం మొదలుపెట్టారు. ఈ కాటకానికి ఎవరో ఒకరు కారణమవ్వాలి కదా. కొందరు నేరాన్ని గ్రామం శివార్లలో ఉండే ఓ ఆవిడ మీద మోపారు. కొందరేమో ఆవిడ నిరపరాధన్నారు. ఖచ్చితంగా ఎవరీకీ తెలియదు. క్షామం కొనసాగింది. గ్రామం నశించసాగింది.చివరికి ఓ మాంత్రికుడిని పిలిపించారు. అతడు హోమగుండం వెలిగించి అందులో ఏవో మూలికలు వేసాడు. తాగల్సింది తాగుతూ రాత్రంతా ఎవరికీ అర్ధం కాని మంత్రాలేవో గొణుగుతూ కూర్చున్నాడు. తెల్లారగానే గ్రామ పెద్దలు అతడి వద్దకు చేరారు. వర్షం కురవకపోడానికి కారణం ఆమేనని మంత్రగాడు తేల్చాడు. గ్రామస్తులందరికీ వినబడేలా, ‘ ఆవిడ వర్షాన్ని కాజేసింద’ని బిగ్గరగా అరచి చెప్పాడు. తమ కర్తవ్యమేమిటో గ్రామ పెద్దలకి బోధపడింది. కొంతమంది ఆవిడ పట్ల సానుభూతి చూపించారు. గ్రామం చివర్లో ఒంటరిగా ఉంటున్న ఆవిడని వదిలేసి ఆమె భర్త ఎప్పుడో పారిపోయాడు. కొన్నాళ్ళ క్రితం కొడుకు చనిపోయినప్పుడు ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళలో నీళ్ళు ఇంకిపోయాయి. ఎండిపోయిన బావిలా తయారైందావిడ. జీవితం పట్ల ఆశ కోల్పోయి, జీవచ్చవంగా మారిపోయింది. ఎవ్వరితోనూ మాట్లాడక, ఏకాకిగా ఉండసాగింది. అప్పుడప్పుడు మూల్గుతూ, ఒక్కోసారి గట్టిగా అరుస్తూ… విచిత్రంగా ప్రవర్తించసాగింది…..”
ఓ క్షణం పాటు ఆపి, మళ్ళీ చెప్పడం కొనసాగించింది.
“చుట్టని వెలిగించి, పొగ వదులుతూ, ‘ ఆవిడే కారణం! ఆవిడ వర్షాన్ని కాజేసింది’ అని నిర్ధారించాడు మంత్రగాడు. అయితే అక్కడున్న ఎవరూ ఆమెని చంపాలనుకోలేదు. పైగా మంత్రగాడు కూడా ఆమెని చంపడాన్ని వ్యతిరేకించాడు. గ్రామ పెద్దలు, మంత్రగాడు, ఇతర గ్రామస్తులు ఓ చెట్టు కింద కూల బడ్డారు. ఏం జరుగుతుందో చూద్దామని వేచి చూస్తున్నారు. కాలం స్తంభించి నట్లయ్యింది…”
ఈ కథని చెబుతున్నామె మాట్లాడడం ఆపింది. వింటున్న స్త్రీ నోరెళ్ళబెట్టి చూస్తోంది. తర్వాతేమైందో తెలుసుకోవాలనే కుతూహలం ఆమె లో వ్యక్తమవుతోంది.
“అప్పుడో యువకుడు లేచాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి తాడోపేడో తేల్చుకొస్తానన్నాడు” ఆమె చెప్పడం మళ్ళీ ఆపింది. వాళ్ళిద్దరూ కథ తీసుకెళ్ళిన మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. నేను తలుపుని మరింత జరిపి వాళ్ళనే గమనించసాగాను. అయితే వాళ్ళు నన్ను చూడకుండా జాగ్రత్త పడ్డాను.
ఈ కథ చెబుతున్నామె లావుగా ఉంది. ఆమె ముఖం గుండ్రంగా ఉంది. కళ్ళజోడు ధరించి ఉంది. ఆమె గొంతు గంభీరంగా ఉంది. కథ చెప్పేడప్పుడు హావభావ విన్యాసాలు చేస్తోంది. కథానుగుణంగా స్వరాన్ని, ముఖకవళికలను మారుస్తోంది. అలా చేస్తున్నప్పుడు కథలోని ప్రతీ పాత్రా తానే నన్నట్లు వ్యవహరిస్తోంది. కథ వింటున్న స్త్రీ సన్నగా ఉంది. ఆమె ఇంకా చిన్న పిల్లే. తలపై ముసుగు వేసుకుని ఉంది. కాస్త అస్థిమితంగా ఉన్నట్లు కనపడుతోంది.
” ఆ యువకుడు ఆవిడ గుడిసెకి వెళ్ళాడు. ఆవిడ పట్ల ప్రేమని వ్యక్తం చేసాడు. కబుర్లు చెప్పాడు. ఆమెని ఎలాగొలా లొంగదీసుకున్నాడు. రాత్రంతా ఆమెతో గడిపాడు. తనివితీరలేదంటూ ఆవిడని మరోసారి ఆక్రమించుకున్నాడు. తర్వాత ఆమెని దగ్గరికి తీసుకుంటునట్లు నటిస్తూ, బిగ్గరగా కౌగిలించుకుని ఆవిడకి ఊపిరాడకుండా చేసాడు. ఆపైన గొంతు పిసికేసాడు. ఆవిడ శవాన్ని మోసుకుంటూ వచ్చి గ్రామం మధ్యలో పడేసాడు. గ్రామస్తులందరూ మౌనంగా శవం చుట్టూ ప్రదక్షిణ చేసారు.”
ఓ క్షణం పాటు చెప్పడం ఆపిందామె. నుదుటిపై పట్టిన చెమటని అరచేత్తో తుడుచుకుందామె.
“సరిగ్గా అప్పుడే వాన పడడం ప్రారంభమైంది. పెద్ద వాన!”
వాళ్ళిద్దరూ మౌనంగా ఒకరికేసి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. తల అడ్డంగా విదిల్చి, గట్టిగా నిట్టూర్చారు. తిరిగి తమ పనిలో నిమగ్నమయ్యారు.
వీళ్ళ కథలో పడి ఎంత సమయం గడచిపోయిందోనని నేను నా చేతి గడియారం కేసి చూసుకున్నాను. ఏడు నిమిషాలు! పెద్ద నష్టమేమీ లేదు. ఇంకా బోలెడు సమయం ఉంది. కాని నాకదే అసౌకర్యంగా అనిపించసాగింది. లేచి సూట్‌కేస్ అందుకుని, తలుపుని గట్టిగా చప్పుడు చేస్తూ వాళ్ళని దాటుకుంటూ బయటకు నడిచాను. హఠాత్తుగా ప్రత్యక్షమైన నన్ను చూసి వాళ్ళిద్దరూ ఉలిక్కిపడ్డారు. ఏదో దయ్యాన్ని చూసినట్లు ‘ ఆ..’ అని అన్నారు. ‘గుడ్ మార్నింగ్’ అని వాళ్ళతో చెప్పి, లిఫ్ట్ వైపు నడిచాను.
‘చెకిన్ పది ఇరవైకి’ అనిఅనుకున్నాను లిఫ్ట్ బటన్ నొక్కుతూ. లిఫ్ట్ కిందకి దిగుతుండగా జరిగిన సంఘటనని పునరావలోకనం చేసుకున్నాను. నేను విన్న ఆ స్త్రీల సంభాషణ నన్ను వెంటాడింది. సాధారణంగా నేను వేరే వాళ్ళ మాటలు రహస్యంగా వినను. నాకు అలాంటివి నచ్చవు. ఈ నాటి ఈ సంఘటన యాదృచ్ఛికంగా జరిగింది.
నేను మరో సారి గడియారం చూసుకుంటూ, ఎంత సమయం కోల్పోయానో; ఇక్కడినుంచి యూరప్‌లో నేనుండే నగరానికి చేరడంలో ఎన్నినిమిషాల పాటు ఎడబాటు కలిగిందోనని మనసులోనే లెక్క వేసుకున్నాను.
అయితే విమానం ఎక్కి కూర్చున్నాకా, నా మనసు విభిన్నంగా ఆలోచించసాగింది. నేను లిస్బన్‌లో రెండు రోజులు వైభవంగా గడిపాను. మాములు గది రేటుతో నమ్మశక్యం కాని విడిదిలో బస చేసాను. పదిహేను గదుల స్యూట్, అతిపెద్ద బాల్కనీలు, స్విమ్మింగ్ పూలంత బాత్ టబ్….అద్భుతం! కానీ ఓ తలుపు తీయగానే, నేను ఆఫ్రికాను చూసాను. ఆఫ్రికాలోని కొంత భాగం యధాతధంగా….చీకటిగా…. వెనుకబాటుతనంతో… నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఏడు నిమిషాల పాటు నేను, ఖచ్చితంగా ఏడు నిమిషాల పాటు నేనో దట్టమైన అడవిలో తప్పిపోయాను.
నాలో నేనే నవ్వుకున్నాను. ఇదంతా ఎవరికైనా చెప్పాలనుకున్నాను. నా తోటి ప్రయాణీకుడితో గాని, లేదా నాకు విస్కీ సర్వ్ చేసిన స్టెవార్డెస్ తో గాని ఈ కథని పంచుకోవాలనుకున్నాను. వాళ్ళు నన్ను వెర్రివాడిలా చూస్తారు. తాగి వాగుతున్నానని అనుకుంటారు. కాని నేను తాగి లేను, వెర్రివాడిని అసలే కాను. చిన్నగా నవ్వుకుంటూ, సీట్‌లో వెనక్కిజారాను. నాలో ఏమీ తేడా లేదు. బహుశా లిస్బనే ఒక వింత నగరం కావచ్చు.

                                                                                 * * *

పోర్చుగీసు మూలం: Teolinda Gersão                       ఆంగ్లం: Ms Margaret Jull Costa

Entry Filed under: నా అనువాదాలు. .

3 Comments Add your own

  • 1. రాజేంద్ర  |  ఏప్రియల్ 11, 2008 at 5:58 అపరాహ్నం

    కానీ ఓ తలుపు తీయగానే, నేను ఆఫ్రికాను చూసాను.

    ఈ వాక్యానికీ,అనువాదానికీ అక్షరలక్షలు ఇవ్వొచ్చు…

  • 2. Sujatha  |  ఏప్రియల్ 12, 2008 at 4:07 అపరాహ్నం

    సోమ శంకర్ గారు,
    మీ అనువాదం అదిరింది. ధనికొండ హనుమంత రావు గారు అనువదించిన మొపాసా కథల్ని చదువుతుంటే, యే ఫీలింగ్ కలిగిందో, అదే ఫీలింగ్ ఈ కథ చదువుతుంటె కలిగింది.అత్యంత ఖరీదైన సూత్ లో ఉండి, అతి దీన గాధని దర్శించడం….చాలా బాగుంది. మరెన్నో మంచి కథలు అనువదించాలని కోరుకుంటున్నా!

  • 3. Satya  |  ఏప్రియల్ 16, 2008 at 2:35 పూర్వాహ్నం

    సోమశంకర్ గారు,
    మీ అనువాదం చాల బాగుంది.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

ఇటీవలి జాబులు

ఇటీవలి అభిప్రాయములు

Madhu Janjur on “అమృత వర్…
Krant hi on నా గురించ…
కొల్లూ… on విచారగ్రస్…
phani pradeep on విచారగ్రస్…

వర్గములు:

Blogroll

ఖజానాలు