వాన దొంగ కథకి మూలం ఓ పోర్చుగీసు కథ. మూల కథని పోర్చుగీసు భాషలో Teolinda Gersão రాసారు. 1974 విప్లవం తరువాత పోర్చుగల్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన రచయిత్రులలో ఈమె ఒకరు. వివిధ స్థాయిలలో అధ్యాపకురాలిగా పనిచేసిన గెర్సావో, 1995 నుంచి తన పూర్తి సమయం రచనలకే కేటాయించారు. ఆమె రచనలకు అనేక అవార్డులు లభించాయి. ఆవిడ రచనలు వివిధ భాషలలోకి అనువాదమయ్యాయి.

ఈ కథని ఆంగ్లంలోకి Ms Margaret Jull Costa అనువదించారు. ఈమె పోర్చుగీసు, స్పానిష్ భాషలలో పేరుమోసిన అనువాదకురాలు. ఈమె రాసిన స్పానిష్ నవల ‘జేవియర్ మేరియస్’ ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్దమైంది. 1992లో ఈమె పోర్చుగీసు ట్రాన్స్‌లేషన్ ప్రైజ్‌ని సంయుక్తంగా గెలుచుకున్నారు. ఈ కథ ఆంగ్లానువాదం ‘The Woman who stole the rain’ అనే పేరుతో www.wordswithoutborders.org అనే సాహిత్యక వెబ్‌సైట్ లో అక్టోబరు 2007లో ప్రచురించబడింది. ఆంగ్లానువాదంపై సర్వహక్కులు ఈ వెబ్‌సైట్ వే. ఈ వెబ్‌సైట్ ఎడిటర్ గారి అనుమతి పొంది ఈ కథని నేను తెలుగులోకి అనువదించాను.

ఇక కథాంశానికొస్తే, వెనుకబాటుతనమున్న చోట మూఢనమ్మకాలుంటాయని, ప్రపంచంలోని ఏ దేశమైనా ఇందుకు మినహాయింపు కాదని ఈ కథ చెబుతుంది. అజ్ఞానం చలామణీ అయ్యే చోట తమ కష్టాలకు వేరేవారిని బాధ్యులను చేయాలనుకునే మనస్తత్వాన్ని ప్రజలు కలిగి ఉంటారని, అందువల్లే బాణామతి, చేతబడి లాంటి సంఘటనలు జరుగుతాయనే నిజాన్ని ఈ కథ వ్యక్తం చేస్తుంది. అభివృద్ధి అంటే ఖరీదైన హోటళ్ళు, విలాసవంతమైన బస, ఖండాంతర విమాన ప్రయాణాలు మాత్రమేనని భావించే వారి అభిప్రాయాలను పటాపంచలు చేస్తుందీ కథ. అభివృద్ధి చెందిన ప్రాంతమైనా, వెనుకబడిన ప్రాంతమైనా పెద్దల దౌర్జన్యాలకు బలయ్యేది బడుగులు, బలహీనులు, స్త్రీలేనన్న సత్యాన్ని ఈ కథ మరో సారి గుర్తుచేసి మనసుని బరువెక్కిస్తుంది.