Archive for ఫిబ్రవరి, 2008

వృక్ష ప్రేమికుడు

“కుదరదు. నేను ఒప్పుకోను …” అంటూ నా హోటల్ ముందున్న చెట్టుని నేను గట్టిగా చుట్టేసుకున్నాను. ప్రభుత్వం విస్తరించిన రోడ్డు పక్కనే నా హోటల్ ఉంది. ఈ రోడ్డులో ఉన్న ఇరవైకి పైగా పచ్చని చెట్లని కొట్టేసి రోడ్డును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోడ్డు ఇక్కడికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఐటి పార్కుకి దారి తీస్తుంది. జనాలు నా చుట్టూ మూగారు.

“ఈ చెట్టు నరకాలంటే ముందు నన్ను చంపండి. ఆ తర్వాతే మీరు చెట్టు మీద చెయ్యి వేయగలరు…” అన్నాను.
“అవును ముందు మమ్మల్ని చంపండి” గుంపులోంచి చాలామంది అరిచారు.
కార్పొరేషన్ అధికారికి ఏం చేయాలో పాలుపోలేదు. ఈ ప్రతిఘటన అతడు ఊహించలేదు.
“సార్, ప్లీజ్, జరగండి. లేదంటే పోలీసులని పిలవాల్సి ఉంటుంది” అన్నాడు.

“పిలవండి. మేమూ సిద్ధమే! ఈ వీధిలోని చెట్లను కొట్టేయడానికి మేము ఒప్పుకోం. కొన్ని దశాబ్దాలుగా ఈ చెట్లు ఇక్కడే ఉన్నాయి . ఈ రోడ్డుని ఎన్నో సార్లు విస్తరించారు కాని చెట్లని ఎప్పుడూ కొట్టేయలేదు. ఇప్పుడు కూడా వీటిని మేము కొట్టేయనివ్వం…” దృఢంగా చెప్పాను నేను.
కాసేపటికి పోలీసులు వచ్చారు. కాని ప్రజాబలం ముందు వారు నిలవలేకపోయారు. దాదాపుగా మా పేట పేటంతా అక్కడే ఉంది. మా అందరిదీ ఒకే సంకల్పం. ఏది ఏమైనా మా వీధిలోని ఆ ఇరవైకి పైగా చెట్లని కాపాడుకోడం!

పోలీసు అధికారులు కారణం తెలుసుకోవాలనుకున్నారు.
“సార్. అర్థం చేసుకోండి. రోడ్డుని విస్తరిస్తున్నది మీ కోసమే. రద్దీ తగ్గి, రోడ్డు విశాలమవుతుంది. మీ పేట వాళ్లంతా లాభపడతారు. ఇది ప్రజాశ్రేయస్సు కోసమే! ఎంతో మంది రైతుల నుంచి ప్రభుత్వం ఐటి పార్కు కోసం భూమి సేకరించింది. మీలాంటి ఎందరో పౌరులు (రైతులు) దేశాభివృద్ధికోసం తమ పొలాలపై హక్కులను స్వచ్ఛందంగా వదులుకున్నారు. వాళ్లని ఆదర్శంగా తీసుకోండి. ఐటి పార్కులాంటి ప్రాంతాలకు రోడ్లు వేసేటప్పుడు కొన్ని చెట్లని నరకడం తప్పనిసరి! తమ భూముల నిచ్చిన ఆ రైతులు చేసిన త్యాగంతో మీ స్వార్థాన్ని పోల్చుకోండి …” అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేసాడు ఎస్.పి.
నేను చిన్నగా నవ్వి “అయ్యా, ఈ రోడ్డుని ఎందుకోసం, ఎవరికోసం విస్తరిస్తున్నారో నాకూ తెలుసు, మీకూ తెలుసు. అందుకని ఈ విషయం పైన ఇంక వాదన అనవసరం! ఈ చెట్లని కొట్టేయడానికి మేము ఒప్పుకోం! ఇందులో వ్యక్తిగత ఆసక్తి ఏమీ లేదు. ఈ సామాజికాంశం మనందరికి సంబంధించినది. మీరు కూడా మాకు తోడ్పడాలి…” అన్నాను. ఎస్.పి. మౌనంగా ఉండిపోయాడు.

ప్రభుత్వం నిర్మిస్తున్న ఐటి పార్కు చాలా పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాంతంలోని రైతుల నుంచి సుమారు వంద ఎకరాలకి పైగా భూమిని సేకరించి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. ఇప్పుడా ఐటి పార్కుకి నేరుగా, సులువుగా చేరడానికి వీలుగా అనేక ప్రాంతాలలో రోడ్లను విస్తరిస్తోంది ప్రభుత్వం.
కాని అసలు నిజం వేరే ఉంది. పరిపాలనా వ్యవహారాలలో లోపాయికారిగా ఉండే కార్యకలాపాలు నాకు తెలుసు. సుమారుగా ఐదేళ్ల కిందటి వరకు మా ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో వ్యవసాయ భూములుండేవి. అవి సాగుకి పనికి రావడం లేదని, రాజకీయ నాయకులు వాటిని రైతుల నుంచి చవక ధరలకు కొనేసారు. ఇప్పుడు ఐటి పార్కు పేరుతో ఇంకొంత మంది రైతుల నుంచి అధికారపూర్వకంగా భూములను సొంతం చేసుకున్నారు. పాపం! ఆ రైతులకి మీడియాలో మిత్రులు లేరు, మీటిం గులు పెట్టి వారి సమస్యలు చెప్పే ఎగువ మధ్య తరగతి ప్రతినిధులు లేరు. దాంతో వారు ప్రభుత్వం ఒత్తిడికి లొంగక తప్పలేదు.

ఐటి పార్కు వచ్చేస్తోందనే సాకు చూపి రాజకీయ నాయకులు తమ వందలాది ఎకరాల భూముల విలువను అమాంతం పెంచేసుకున్నారు. కోట్లకు పడగలెత్తారు.
ఇప్పుడు రోడ్డు విస్తరణ చేపట్టి ఆ భూముల విలువను మరింత పెంచడమే వారి ఉద్దేశ్యం!
ఎస్.పి.కి ఇదంతా తెలుసు. ఆయన కూడ ఐటి పార్కుకి చేరువలో కొంత స్థలం కొనుక్కున్నాడు. ఎప్పటికైనా తగిన లాభం వస్తుందని.
మరిక ఆయనేం మాట్లాడతాడు? తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయాడు.
కొంత సేపటికి పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది వెనుదిరిగారు. మర్నాడు మా ఆందోళన గురించిన వార్త, నేను చెట్టుని కౌగిలించుకున్న ఫోటో దాదాపు అన్ని దినపత్రికలలోనూ వచ్చా యి. మా ఇంటికి, నా సెల్‌కి నా ఇంటర్వ్యూ కావాలంటూ టీవీ ఛానెళ్ల వాళ్లు ఫోన్లు చేశారు.

   ***
మర్నాటి రాత్రి విశ్రాంతిగా ఇంట్లో పడక కుర్చీలో కూర్చుని, “ఏమైంది? కాంట్రాక్టరు ఏమన్నాడు?” అని మా ఆవిడను అడిగాను.
నేను మా ఊరి చివర ఉన్న నా పొలాలలో ఓ పెద్ద హోటల్ నిర్మించదలచాను. నాకు తెలిసిన ఓ కాంట్రాక్టరుని ఆ స్థలాన్ని పరిశీలించమని కోరాను. దానిని బట్టి మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చని నా ఉద్దేశ్యం.
“మన ఫాం హౌస్ లోని అన్ని చెట్లూ కొట్టేయాల్సి ఉంటుందని చెప్పాడు”
“అది సరే. నేల, అప్రోచ్ రోడ్డు … లాంటి విషయాల మాటేంటి? వాటి గురించి ఏమీ చెప్పలేదా?’ అనడిగాను.
“ఆయన మీరు చెట్టుని కౌగిలించుకున్న ఫోటో చూసినట్లున్నాడు. మీకు చెట్లను నరకడం ఇష్టం ఉండదన్న ఉద్దేశ్యంతో ఇక్కడ కనీసం 30-40 చెట్లని కొట్టేయాల్సి ఉంటుందని సందేహిస్తున్నాడు…” నా భార్య వివరించింది.

“అదేం మాట. ఇక్కడ చెట్లు వేరు. అక్కడి చెట్లు వేరు. వ్యాపారావకాశాలకీ, సామాజికాం శాలకీ ముడి పెట్టకూడదు.” అన్నాను.
“ఏ విధంగా? వ్యాపారావకాశాలంటే ఏమిటి?”
“వ్యాపారావకాశం అంటే మనకి సానుకూలమై, మనకు లాభం చేకూర్చేది! నా సొంత స్థలంలో చెట్లని కొట్టేసి హోటల్ కట్టుకుంటే అది నాకే లాభం. పైగా అది నా వ్యక్తిగత ఆస్తి విషయం. అందులో ఎవరైనా ఎలా తల దూరు స్తారు…”
“మరి సామాజికాంశం అంటే?”
“సామాజికాంశం అంటే మనకి ప్రతికూలమై, మనం నష్టపోయేదన్నమాట! మన హోటల్ ముందున్న చెట్టు కొట్టేస్తే మన కస్టమర్లకి పార్కింగ్ స్థలం పోతుంది. జనం రావడం తగ్గి వ్యాపారాన్ని పోగొట్టుకుంటాం! అర్థమైందా?”
నా భాష్యానికి మా ఆవిడకి నోటమాట రాలేదు.

ఆంగ్లం: శ్రీరాజారాం బాలాజీ

(ఈ కథ ది. 17 ఫిబ్రవరి 2008 నాటి ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితం)


7 comments ఫిబ్రవరి 23, 2008

Previous Posts


Blog Stats

ఇటీవలి జాబులు

ఇటీవలి అభిప్రాయములు

Madhu Janjur on “అమృత వర్…
Krant hi on నా గురించ…
కొల్లూ… on విచారగ్రస్…
phani pradeep on విచారగ్రస్…

వర్గములు:

Blogroll

ఖజానాలు