Archive for జనవరి, 2008

నిజమైన మనిషి

అసలే వేసవి కాలం! పగలంతా ఉక్కపోత తోనూ, చెమటతోను చికాకుగా ఉంటోంది. నిన్న రాత్రి ‘కాజువాలిటీ’ విభాగమంతా ‘ట్రామా’ కేసులతో కిటకిటలాడిపోయింది. నాకు జరిగిన అన్యాయానికి నా ముఖం పాలిపోయింది. మా సీనియర్ డాక్టర్లు, అధిపతులు హాయిగా గుర్రు పెట్టి నిద్ర పోతుంటే, క్రింది స్థాయికి చెందిన నా లాంటి జూనియర్ డాక్టర్లు నలిగిపోతుంటాం. రోగులను పరీక్షించడం, ఆసుపత్రిలో చేర్చుకోడం, కేస్ షీట్ రాయడం, రోగ పరీక్షలు చేయడం, కుట్లు వేయడం….. ఇవన్నీ ప్రతీ రాత్రి తప్పవు. మళ్ళీ తెల్లారగానే తాజాగా తయారై వచ్చే మా అధిపతుల ఆదేశాల కోసం సిద్ధంగా ఉండడంతోటే మా సమయమంతా సరిపోతుంది. నాకు దొరికే కాస్త సమయమల్లా ఓ అరగంట సేపు మాత్రమే. ఓ కప్పు టీ తాగి బట్టలు మార్చుకుని రావడానికి సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ రౌండ్స్‌కి వెళ్ళాలి. ఇది కూడా దాదాపు కట్టు బానిసత్వమే!
ఈ పూట నాకు డ్యూటీ లేదు. ఇంటికి వెడదామని బస్ స్టాపు వైపు నడిచాను. జనంతో కిటకిటలాడుతున్న ఓ సిటీబస్‌లో కి చొరబడి, మెట్ల దగ్గర నిలుచున్నాను. బస్సు కదిలింది. జనాలు ఒకరినొకరు తోసుకుంటున్నారు. మోచేతులతో నెట్టుకుంటున్నారు. ఒక వైపు మురికి, చెమట, జిడ్డు, కంపు…. మరోవైపు కాలి వేళ్ళు తొక్కేసే ప్రయాణీకులు, దురుసుగా ప్రవర్తించే కండక్టర్! రెండు స్టాపుల తర్వాత జనం కొద్దిగా పలచబడ్డారు. నేను లోపలికి వెళ్ళగలిగాను. కండక్టర్ గట్టిగా ఈల వేసి ‘లోపలికి రండి’ అని అరుస్తున్నాడు. ఇంతలో అదృష్టవశాత్తు రెండు వరుసల అవతల, నాకో ఖాళీ సీటు కనిపించింది. నా మెడలో వేలాడుతున్న స్టెతస్కోపు నాకు కాస్త వెసులుబాటు కల్పించింది. సీటులో కూర్చోబోతూ, ఎందుకో ప్రక్క సీటు ప్రయాణీకుడికేసి చూసాను. అతడో కుష్టురోగి. చూపులకు జుగుప్సగా, వికారంగా ఉన్నాడు. అతడు స్థానిక దినపత్రికలో కుంభకోణాలకు, మోసాలకు సంబంధించిన వార్తలను చదువుతున్నాడు. బహుశా చూపు ఆనడం లేదేమో, పేపరుని చాలా దగ్గరగా పెట్టుకుని చదువుతున్నాడు. నేను ఒక్కసారిగా వెనుకడుగు వేసాను. ఈ కురూపి, రోగిష్టి పక్కన నేనెలా కూర్చుంటాను?
బస్సు మధ్యగా ఉన్న రాడ్ ని పట్టుకుని, ఆ సీటుకి ముందుగా నిలబడ్డాను. యథాలాపంగా నా దృష్టి కుష్టురోగి చదువుతున్న పేపరు ముందుపేజిపై పడింది. రాసక్రీడలు సాగిస్తూ, సాక్షాధారాలతో సహా పట్టుపడ్డ ఓ మంత్రిగారి గురించి వార్త పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురితమైంది. ఫోటోలతో సహా ముద్రించి ఉన్న ఆ వార్తని చదవడానికి కాస్త కిందకి వంగాను. నాకంత ఆసక్తిని కలగజేసిన ఆ వార్తేంటో చూద్దామని అతడు పేపరుని తిరగేసాడు. తర్వాత తన పక్క సీటు ఖాళీగా ఉండడం చూసాడు. నాకేసి అదోలా చూసి మళ్ళీ పేపరు చదవడంలో నిమగ్నమైపోయాడు.
ఆ విలేఖరి చేసిన పరిశోధన చాలా ఆసక్తికరంగా ఉంది. కాని కుష్టురోగి పేపరుని తిరగేయడంతో కాస్త అంతరాయం కలిగింది. జరిగిన అంతరాయానికి నేను చింతించాను. సాటి ప్రయాణీకుడు చదువుతున్నాడన్న ఆలోచననైనా లేకుండా పేపరు తిప్పేయడం నాకు చికాకు కలిగించింది. నా తెల్లకోటు, స్టెతస్కోపు అతడి పై ఏ ప్రభావం చూపినట్లు లేవు. మళ్ళీ ఏకాగ్రత తెచ్చుకుని ఆ వార్త చదవడానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. ఇంతలో ఏదో స్టాపు వద్ద బస్ ఆగింది. కొద్దిమంది దిగితే, రెండింతల మంది ఎక్కారు. ఇక నగరంలో బస్సులే లేవా అని నాకు సందేహం కలిగింది. హఠాత్తుగా కుష్టురోగి పేపరు చదవడం ఆపాడు. దాన్ని జాగ్రత్తగా మడతపెట్టి, పట్టుకుని సీట్లోంచి లేచాడు. “హమ్మయ్య! దేవుడు నా మొర ఇప్పటికి ఆలకించాడు. వీడి బాధ వదిలింది” అనుకుంటూ ఆ కుష్టురోగి వెళ్ళడానికి దారి ఇచ్చాను. అతడు నన్ను దాటుకుని వెడుతుంటే, అసహ్యంతో తల తిప్పుకున్నాను. అతడి చూపులు ఓ క్షణం పాటు నా తెల్లకోటు పైన, స్టెతస్కోపు పైన నిలిచాయి. కొద్దిగా వెనక్కి తిరగి తను ఖాళీ చేసిన సీటుని చూసాడు. దాంట్లో కూర్చోవలసిందిగా నాకు సైగ చేసాడు. ‘నన్నిక భరించనవసరం లేదు’ అనే భావన అతడి చూపులో ప్రస్ఫుటమైంది. ఏదో చెప్పాలనుకుని పెదాలను కొద్దిగా కదిలించాడు. కాని అంతలోనే ఆ ప్రయత్నాన్ని మానుకుని తన చేతిలోని దినపత్రికని సీటు మీద పరిచాడు. నేను నిర్ఘాంతపోయాను. అతడేమీ మాట్లాడకపోయినా, అతడి ఉద్దేశ్యాన్ని నేను గ్రహించాను. ” ఇప్పుడు సుఖంగా కూర్చోండి డాక్డర్! జబ్బులకి దూరంగా ఉండండి. సాటి మనుషుల వేదనకి, బాధలకి స్పందించకండి. ఒకప్పుడు ఎంతో ఉన్నతాశయాలు కలిగి నిస్వార్ధమైనదిగా పేరొందిన మీ వృత్తకి కళంకం వచ్చినా పట్టించుకోకండి. హాయిగా ఏకాంతంగా కూర్చుని, ఈ పేపరు చదువుకోండి” లాంటి భావాలు అతడి ముఖంలో కదలాడాయి.
బస్సు ఒక్క కుదుపుతో ఆగింది. ఆ కుష్టురోగి దిగిపోయాడు. సీటు మీద అతడు పరిచిన దినపత్రిక మాత్రం అక్కడే ఉంది. ఒక్కసారిగా ఏదో తెలియని వ్యధ నన్ను ఆవహించింది. నిస్సత్తువగా అనిపించింది. ఓ వైద్యుడిగా నాకు ఉండాల్సిన ఓర్పు కరుణ లేనప్పుడు, రోగుల పట్ల ఆదరణా జాలి, దయా సానుభూతి చూపలేనప్పుడు, వృత్తి ధర్మాన్ని పాటించలేనప్పుడు నేను పొందిన శిక్షణకి అర్ధమేముంది? ఐదేళ్ళ పాటు మెడికల్ కాలేజిలో చదివినా పొందలేని అనుభవాన్ని ఈ రోజు ఈ రద్దీగా ఉన్న బస్సులో పొందగలిగాను.
జీవితం గురించి, అస్వస్థత గురించి నాకు ఈ రోజు అర్ధమైంది. ఓ ఉన్నతమైన వృత్తికి ప్రతినిధులుగా ఉన్నా మా మెడికోలం ముసుగులు ధరించి ఉన్నామని గ్రహించాను. కాని నన్ను నేను తెలుసుకున్నాను.
ఆ కుష్టురోగి చిన్న చర్యతో తోటి ప్రయాణీకుడికి కూర్చోడానికి చోటివ్వడమే కాకుండా, ‘సాటి మనుషులకు మీ మనసులోను కాస్త చోటివ్వండి’ అనే సందేశాన్ని అందించాడు.
మనిషి మేధస్సు ఎదగడానికి వేలవేల ఏళ్ళు పట్టిందని తెలుసు. మనిషి రాతియుగం నాటి ఆదిమమానవుడి స్థాయి నుంచి, విజ్ఞానం సంపాదించిన నేటి నాగరిక మానవుడిగా మారడానికి చాలా కాలం పట్టింది. కాని నా తోటి రోగిష్టి ప్రయాణీకుడు నా కోసం తన సీట్లో దినపత్రికని పరిచి, నన్ను కూర్చోమని నిశ్శబ్దంగా సైగ చేసిన క్షణంలోనే ‘నిజమైన మనిషి’ అయ్యాడు. నేను, ఇంకా మనలో చాలా మంది చేరని మనిషి పరిణామ దశ అది…..!
ఆంగ్ల మూలం: డాక్టర్ అరుణాచలం కుమార్
( ఈ కథ ది.11 ఆగస్టు 2006 నాటి తేజా వారపత్రికలో ప్రచురితం)


Add comment జనవరి 25, 2008

Previous Posts


Blog Stats

ఇటీవలి జాబులు

ఇటీవలి అభిప్రాయములు

Madhu Janjur on “అమృత వర్…
Krant hi on నా గురించ…
కొల్లూ… on విచారగ్రస్…
phani pradeep on విచారగ్రస్…

వర్గములు:

Blogroll

ఖజానాలు