“మీరు చెప్పేది నిజమే. ఆయన హక్కుని నేను కాదనడం లేదు. అయితే వీడిని చంపకూడదు. వీడిని చూస్తే బాగా పనికొచ్చేవాడిలా ఉన్నాడు. వీడు విలువైన ఆస్తి…..” అని అంటూ, ” వీడిని మీరు చంపబోవడం లేదు కదా?” అని మేజర్‌ని అడిగాడు జెబ్. మేజర్ లేదన్నట్లుగా తలూపాడు. ఎర్విన్ కళ్ళు పెద్దవి చేసి, నోరెళ్ళబెట్టివీరి సంభాషణని వింటున్నాడు.
” మీరేం చేస్తారో చేయండి..” అని అన్నాడు జెబ్ మేజర్ తో. కాని మేజర్ కొంచెం కూడ కదల్లేదు. వాళ్ళిద్దరికేసి చూస్తూ, “గుణపాఠాలు నేర్పడంపై నాకు నమ్మకం లేదు. ఈయువకుడికి నేనే పాఠం నేర్పబోడం లేదు.. ” అని అన్నాడు. జెబ్, మతగురువు మేజర్ కేసి విస్మయంగా చూసారు.
” మేజర్,మీరు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు. వీడేమో పారిపోతున్న బానిస. దక్షిణాది రాష్ట్రాల చట్టాల ప్రకారం బానిసలు పారిపోడం నేరం! పారిపోడానికి సహాయం చేయడం కూడ నేరమే… ” అని అన్నాడు మతగురువు హెచ్చరిస్తునట్లుగా.
“దక్షిణాది రాష్ట్రాల చట్టాల గురించి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు” అని పొడిపొడిగా జవాబిచ్చాడు మేజర్. జెబ్ చిరాగ్గా ముఖం పెట్టి, ” ఒక వేళ వీడు ఉత్తరాది సైనికుల కంటబడితే, వాళ్ళువీడికి నీలిదుస్తులు తొడిగి, చేతికో తుపాకి ఇచ్చి మన దక్షిణాది వాళ్ళని చంపమని పంపుతారు… ” అని చెప్పాడు మేజర్‌తో. మేజర్ సమాధానం చెప్పలేదు.
మతగురువు తన మృదువైన గొంతుతో, ” మేజర్, వీడిని మీరైనా క్రమశిక్షణలో పెట్టండి. లేదా మమ్మల్ని పెట్టనివ్వండి. కనీసం వీడి యజమాని పేరైనా తెలుసుకుని, వీడిని ఆయనకి అప్పగించాలి” అని అన్నాడు మేజర్ తో. మేజర్ ఇంకా మౌనంగానే ఉన్నాడు.
“మీకేమైంది?” అంటూ జెబ్ మేజర్‌కేసి దూసుకుపోయాడు. వెంటనే మేజర్ కత్తి దూసాడు. దాంతో జెబ్ వెనక్కి తగ్గి, ” మీకు పిచ్చి పట్టింది” అని అన్నాడు.
“దక్షిణాది రాష్ట్రాల కు చెందిన అధికారి, ఓ పారిపోతున్న బానిసకి రక్షణ కలిపించడం నేనెన్నడు చూడలేదు..” అని అన్నాడు మతగురువు వెటకారంగా.
” మీరిద్దరూ చాలా వాటిని చూసి ఉండరు” అని వ్యంగ్యంగా అంటూ, ” గెటీస్‌బర్గ్ పోరాటంలో మీరెపుడైనా పాల్గొన్నారా?” అని అడిగాడు మేజర్. వాళ్ళిద్దరూ లేదన్నట్లుగా తలూపారు.
” అంటే మనుషులు ఫిరంగులవైపుకి నడవడం మీరెన్నడూ చూడలేదన్న మాట. రణరంగంలోని వైద్య శిబిరంలో క్షతగాత్రులకు చికిత్స చేయడం చూసారా? కనీసం గాయపడిన గుర్రాల ఆక్రందనలైనా విన్నారా? ” ప్రశ్నించాడు మేజర్ ఆవేశంగా.
” మేజర్, వాటికీ ఇప్పుడీ బానిసకి క్రమశిక్షణలో పెట్టడానికి ఏమిటి సంబంధం?” అని అడిగాడు జెబ్ విసుగ్గా.
” ఇదంతా బాధించడం, ప్రాణాలు తీయడానికి సంబంధించినది. ఇప్పటి వరకు జరిగిన అకృత్యాలు చాలు. ఈ విధంగా మీరు ఒకరిని అనవసరంగా బాధించడం నేను చూడలేను…” బదులిచ్చాడు మేజర్.
” మీరు పొంతన లేని విషయాలు మాట్లాడుతున్నారు మేజర్. ఈ బానిస ఒకరి వ్యక్తిగత ఆస్తి. వీడికేమైనా అది మనకనవసరం. పోతే రణరంగం లో ఏం జరుగుతోందనేది అందరికి అవసరం. దక్షిణాది రాష్ట్రాల ఉద్ధరణ……….”
మతగురువు ఇంకా తన మాటలను పూర్తి చేయక ముందే – మేజర్ వ్యంగ్యంగా నవ్వి, ” ఉద్ధరణా, దక్షిణాది రాష్ట్రాలను ఉద్ధరించడం గురించి మీరు నాకు చెబుతున్నారా?” అంటూ కత్తిని వాళ్ళకేసి గురిపెట్టి వారివైపు నడిచాడు. వాళ్ళిద్దరూ బెదరిపోయి భయంతో వెనుకడుగు వేసారు.
” శాంతించండి మేజర్. ఇప్పటికే మీరు చాలా యుద్ధాలు చేసి ఉంటారు. అందుకే తరచూ కత్తి దూయడం అలవాటైనట్లుంది..” అన్నాడు జెబ్.
” హూ. యుద్ధాలు! మీ లాంటి ఉన్మాదులే నా లాంటి అమాయకులని యుద్ధాలకి పంపుతారు. మేమేమో మీకోసం యుద్ధాలు చేస్తుంటే, మీరేమో హాయిగా తోటలలో కూర్చుని ఉంటారు. లేదా వేదికలపై నుంచి గొణుగుతూంటారు. ఇప్పటి దాక జరిగిన రక్తపాతం చాలదన్నట్లు మీకింకా యుద్ధాలపై మోజు తీరలేదు. ఈ యువకుడిని చావగొట్టి తిరిగి తన యజమాని వద్దకు పంపాలని మీ కోరిక. అతడికి ఏమైనా మీకు బాధ లేదు..” ఆవేశంగా అన్నాడు మేజర్.
” మీకు పిచ్చెక్కినట్లుంది. లేకపోతే పారిపోతున్న ఈ నల్లవాడిని ఎందుకు సమర్ధిస్తారు?” అన్నాడు జెబ్.
“అతడి కేసి చూడండి” అన్నాడు మేజర్, ఎర్విన్ కేసి వేలు చూపిస్తూ. వాళ్ళిద్దరూ మేజర్ కేసే చూడసాగారు.
” అతడి కేసి చూడమ న్నాను” ఈ సారి కాస్త గట్టిగా చెప్పాడు మేజర్. వాళ్ళిద్దరూ ఎర్విన్ కేసి చూసారు.
” ధరించినవి చింకి దుస్తులు. కనీసం కాళ్ళకి చెప్పులైనా లేవు. అర్ధాకలితో ఉన్నాడు. దొరికిపోతే ఏం జరుగుతుందో అతడికి బాగా తెలుసని నా అభిప్రాయం! అయినా తెగించి పారిపోయాడు. ప్రమాదాన్ని ఆహ్వానించాడు. ఇదే మన దక్షిణాది రాష్ట్రాల కర్తవ్యాన్ని తెలుపుతోంది. కాదా? తెలివైన వాడెవడూ ఇటువంటి దుస్థితిని కోరుకోడు – ఊహకి కూడ అందని దుర్భర పరిస్థితులలో ఉంటే తప్ప” అన్నాడు మేజర్.
“వీడసలు మనిషే కాదు. కేవలం ఓ బానిస” అని అన్నాడు జెబ్.
” మూర్ఖంగా మాట్లాడకు. మన రక్తం వలెనే ఇతడి నెత్తురు కూడ ఎరుపే. ఇతడు కూడ మీలా, నాలా నొప్పికి, బాధకి స్పందిస్తాడు..” అన్నాడు మేజర్.
” మేజర్! ఒక దక్షిణాది వాడిగా మీకు మీ బాధ్యత ని గుర్తు చేయడం మాకు తప్పని సరి” అన్నాడు మతగురువు.
” బాధ్యతా? బాధ్యతల గురించి నాకు చెప్పడానికి మీరెవరు? మర్యాదగా ఇక్కడినుంచి కదలకపోతే, ముక్కలు ముక్కలుగా నరుకుతాను..” అని అరిచాడు మేజర్. వాళ్ళిద్దరు హతాశులయ్యారు.
“బయటకు పొండి..” అంటూ మేజర్ కత్తి పట్టుకుని వాళ్ళవైపు నడిచాడు. వెంటనే వాళ్ళిద్దరు వర్షం లోకి పరిగెత్తారు. మేజర్ కత్తి దించకుండా గుమ్మం దగ్గర నిలుచున్నాడు. వాళ్ళ బండి బయల్దేరేవరకు కదలకుండా అక్కడే నిలుచున్నాడు. తర్వాత గట్టిగా ఊపిరి పీల్చి, కత్తిని ఒరలో పెట్టేసాడు.
జరుగుతున్న ఈ ఘర్షణ నంతా కదలకుండా చూస్తున్న ఎర్విన్, మేజర్ కేసి దృష్టి సారించాడు. గుమ్మం దగ్గరనుంచి లోపలికి వచ్చి, అలసటగా ఉండడంతో కళ్ళు నులుముకున్నాడు మేజర్.
” ధన్యవాదాలు మేజర్” అన్నాడు ఎర్విన్ మెల్లగా.
మేజర్ ఎర్విన్ ని ఎగాదిగా చూసి, ” ఆకలేస్తోందా?” అని అడిగాడు.
” అవును. పిచ్చాకలి” అని బదులిచ్చాడు ఎర్విన్. మేజర్ తన సంచిలోంచి ఓ రొట్టె ముక్కల కట్ట తీసి, ” పెద్ద రుచిగా ఉండదు. కాని సైనికులకి నచ్చుతుందంటే, నీకు కూడ నచ్చుతుంది. నీ ఆకలి తీర్చుకో” అంటూ దాన్ని ఎర్విన్ కి అందించాడు.
” కృతజ్ఞుడిని” అంటూ ఆ రొట్టెలని అందుకున్నాడు ఎర్విన్. అతడు తింటున్నంత సేపు మేజర్ గుమ్మం కేసి చూస్తూ నిలుచున్నాడు. ఎర్విన్ తినడం పూర్తి కాగానే, మేజర్ అతడివైపు తిరిగి కత్తి దూసాడు. ఎర్విన్ అదిరిపోయాడు.
” కంగారు పడకు. నేనో పటం గీయబోతున్నాను….” అంటూ మేజర్ నవ్వాడు. తర్వాత బూటు కాలితో క్రింద గడ్డిని జరిపి, మట్టిని చూపాడు. ” మనం ఇక్కడ ఉన్నాం” అంటూ, ఉత్తరం వైపు ఓ గీత గీసి, ” ఈ దారినే ముందుకు వెడితే, నదికి ఆవలితీరాన ఉత్తరాది సైనికులు ఉన్నారు. అర్ధమైందా?” అని అడిగాడు. ఎర్విన్ అర్ధమైందంటూ తలూపాడు.
“మంచిది. నీకు అక్కడికి చేరడానికి రెండు మూడు గంటలు పడుతుంది. నది ఇలా ఉంది.” అంటూ నేల మీద వంకరగా గీతలు గీసాడు మేజర్. ” ఇక్కడ నదిని దాటడం సులువు. కొంచెం దూరంలో దక్షిణాది సైనికులు ఉన్నారు. నువ్వు వాళ్ళ కంటబడితే ప్రమాదం. కాబట్టి వాళ్ళు వెళ్ళేవరకు చెట్లలో దాక్కో. వాళ్ళు అక్కడ మహా ఉంటే ఓ అరగంట సేపు ఉంటారు. ఆ తర్వాత నువ్వు తప్పించుకోడానికి కావలసినంత సమయం దొరుకుతుంది” అంటూ, ” నేను చెప్పేది స్పష్టంగా ఉందా?” అని ఎర్విన్ ని అడిగాడు.
“అర్ధమైంది” అంటూ మేజర్ చెప్పిన గుర్తులన్నింటిని తిరిగి చెప్పాడు ఎర్విన్.
“సరే, వర్షం తెరిపిస్తోంది. ఇక మనం బ యల్దేరడం మంచిది. లేకపోతే వాళ్ళు తిరిగి వచ్చినా వస్తారు” అని అన్నాడు మేజర్. ఎర్విన్ తలూపాడు. మేజర్ తన గుర్రం కళ్ళెం పట్టుకుని బ యటకు చూడసాగాడు. ” వాళ్ళిద్దరిలో ఎవరో ఇక్కడ తన రగ్గు ని మరచిపోయారు. నీకు కావాలంటే తీసుకో” అని అన్నాడు.
” వద్దు మేజర్. అది దొంగతనమవుతుంది” అని అన్నాడు ఎర్విన్. మేజర్ తృప్తిగా తలాడించి, బయటకు వెళ్ళి గుర్రం ఎక్కి..” నీకు మేలు కలుగు గాక” అని అన్నాడు.
” మీకు కూడ మేలు జరగాలని నా కోరిక మేజర్! పైగా ఈ యుద్ధం ఒకటి. మీకు విజయం ప్రాప్తించు గాక” అని అన్నాడు ఎర్విన్.
మేజర్ చిన్నగా నవ్వి ” మేమీ యుద్ధంలో గెలవకపోవచ్చు” అని అన్నాడు.
” అలా అనకండి మేజర్” అని అన్నాడు ఎర్విన్. మేజర్‌కి కూడ ఏదో ఒక మేలు జరగాలనేది అతడి ఉద్దేశ్యం.
“మాకు ఓటమి తప్పదు. జరిగేది అదే! మనం భిన్నమైన మార్గాలలో ఉన్నాం. నా ప్రయాణం అధోముఖం. నీది పై పైకి! తరతరాలుగా శారీరకంగాను, నైతికంగాను పతనమైన వ్యవస్థకి నేను రక్షణగా ఉన్నాను. నువ్వేమో ప్రగతి పధంలో దూసుకుపోతున్నావు. మనుషులే తప్ప బానిసలు ఉండని రోజు వైపు నీ పయనం సాగుతోంది. నేను గతాన్ని. గతించక తప్పదు. నువ్వు భవితవి. జీవించవలసినవాడివి……” అని చెప్పాడు మేజర్ ప్రశాంతంగా. ఎర్విన్ మేజర్ నే చూస్తూండిపోయాడు.
” నీ పేరేమిటి?” అని అడిగాడు మేజర్. తన పేరు చెప్పాడు ఎర్విన్.
” ఎర్విన్, నీకు శుభం కలుగు గాక” అని చెప్పి, మేజర్ తన గుర్రాన్ని దౌడు తీయించాడు. తన దృష్టి నుంచి మేజర్ కనుమరుగయ్యేదాక చూసి, ఎర్విన్ అడవిలోకి గబగబా పరిగెత్తాడు.
* * *
ఆంగ్ల మూలం : డాన్ స్టాకార్డ్. మూల కథ పేరు Southern Comfort. తెలుగు అనువాదం “సాహిత్య ప్రస్థానం” త్రైమాసిక పత్రికలో ప్రచురితం
డిసెంబరు 27, 2007
డిసెంబరు 28, 2007 at 12:36 పూర్వాహ్నం
సోమ శంకర్ గారు కథ చాలా బాగుందండి. మంచి కథ అనువదించి అందించినందుకు ధన్యవాదములు.