ఆకాశంలో ఓ పెద్ద ఉరుము ఉరిమడంతో, ఎర్విన్ ఉలిక్కిపడ్డాడు. కదలకుండా తను ఉన్న రేకుల గదినంతా భయం భయంగా కలయజూసాడు. అక్కడ అతడు తప్ప మరెవరూ లేరు. బలంగా ఊపిరి పీల్చుకుని, నెమ్మదిగా వదిలాడు. సరిగ్గా, సూర్యోదయానికి ముందుగా – చలి, ఆకలిబాధిస్తుండగా, అతడికి ఈ గది కనిపించింది. అప్పటికే అతడు పూర్తిగా అలసిపోయాడు. ఆ గదిలోని గడ్డి వల్ల కలిగిన వెచ్చదనం, అప్పటివరకు తీసిన కునుకు అతడి చలిని, బడలికని కాస్త దూరం చేసాయి. అయితే అతడి ఆకలి మాత్రం తీరలేదు. ఆ పూట భోజనం లభిస్తుందన్న నమ్మకం కూడ లేదతనికి. పైగా తినడానికి ఏమైనా వెదుక్కోడం అతడికి మరీ ప్రమాదం!
ఉత్తర అమెరికాకి త్వరగా చేరుకోడమే ప్రస్తుతం అతడి ఏకైక లక్ష్యం. ఉత్తరాది సైనికులు బానిసలకు స్వేచ్ఛని ప్రసాదిస్తున్నారని, వారిప్పుడు ఇటువైపే వస్తున్నారని ఎర్విన్ విన్నాడు. గత మూడు రాత్రులుగా ఉత్తర రాష్ట్రాల వైపు ప్రయాణం చేస్తున్నా, నీలిదుస్తుల ఉత్తరాది సైనికుల జాడ లేదు. ఇంతలో మరో ఉరుము ఉరిమింది. దాంతో పాడు వర్షం కూడ మొదలైంది. తన ప్రయాణం కొనసాగించాలా లేక వాన వెలసేవరకు ఇక్కడే ఆగాలా అనేది ఎర్విన్ తేల్చుకోలేకపోయాడు. ఇంతలో అతడికేవో మాటలు వినిపించాయి.
” ఇక్కడో గది ఉంది, గురువుగారు!” అని అంది ఓ గొంతు.
“అమ్మయ్య! తల దాచుకోడానికి కాస్తంత చోటు దొరికింది. ..” గురువుగారి గొంతు పలికింది.
గది పక్కగా ఓ బండొచ్చి ఆగింది. ఆ చప్పుడు విని ఎర్విన్ గడ్డిలో దాక్కున్నాడు.
” వాన పెరుగుతోంది. తడిసిపోతాం…” అని లోపలికి వస్తున్న ఇద్దరు వ్యక్తులలో ఒకతను అన్నాడు. చూడడానికి ఆయన మత గురువులా ఉన్నాడు.
” ఈ వాన వల్లే, ఉత్తరాది సైనికులు ఇటు రావడం ఆలస్యమైతోందేమో?” అని అన్నాడు ఇంకో వ్యక్తి.
మత గురువు తన టోపిని తీసి గట్టిగా విదిలించి, దాన్ని అక్కడి గోడకు ఉన్న ఓ మేకుకి తగిలించాడు. బాగా పొడగరైన ఆతడికి సుమారుగా యాభై సంవత్సరాల వయసుండచ్చు. అతడి సహచరుడు మాత్రం పొట్టిగా, లావుగా ఎర్రటి రంగులో ఉన్నాడు. అతడి గడ్డం ఇప్పుడిప్పుడే నెరుస్తోంది.
” ఆక్రమణదారులకి, మనకి మధ్య రక్షణగా మన దక్షిణాది సైనికులు ఉన్నారు. ఇక వాతావరణం నుంచి మనకు ఎటువంటి సాయమూ అక్కరలేదు….” చెప్పాడు మతగురువు.
” వాతావరణం మనకి హానిచేయదు” అన్నాడు పొట్టి వ్యక్తి.
” నేను అదే అనుకుంటున్నాను” అని అన్నాడు మతగురువు.
ఎర్విన్ వీళ్ళ మాటలు వింటూ, గడ్డిలో కదలకుండా దాక్కుని ఉన్నాడు. అతడికి వాళ్ళకి మధ్య 15 అడుగుల దూరం కూడ లేదు. ఉత్తరాది సైనికులు దగ్గరలోనే ఉన్నారనే వార్త వినేసరికి అతడికి ఉత్సాహం కలిగింది. కాని దొరికిపోతాననే భయంతో కదలకుండా ఉండిపోయాడు.
” ఈ యుద్ధం త్వరగా ముగిస్తే బాగుండు. బీభత్సం సృష్టిస్తోంది…” అని అన్నాడు పొట్టివ్యక్తి.
” ఏదో చప్పుడవుతోంది. విను…” అన్నాడు మతగురువు చేయి పైకెత్తి.
రేకులపై టపటపా పడుతున్న వాన చినుకుల చప్పుడు కన్నా పెద్దగా గుర్రం గిట్టల శబ్దం వినపడింది. వెంటనే ఒక రౌతు తన గుర్రంతో సహా ఆ గదిలోకి వచ్చాడు. అతడు పొడగరి. అతడు ధరించిన బూడిద రంగు దుస్తులను బట్టి, అతడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సైనికాధికారని తెలుస్తోంది. అక్కడున్న మత గురువుని, పొట్టి వ్యక్తిని పలకరించాడు. వారిద్దరూ బదులిచ్చారు.
” అమ్మయ్య! బూడిద రంగు దుస్తుల సిపాయిని చూస్తే, ఆందోళన తగ్గి, హాయిగా ఉంది…” అని నవ్వుతూ, ” ఉత్తరాది సైనికుల సంగతులు ఏమిటి మేజర్?” అని ప్రశ్నించాడు పొట్టి వ్యక్తి.
బదులుగా మేజర్ నవ్వి, ” మీరు ఉత్తర దిశగా వెడితే గాని, ఈ రోజు నీలిదుస్తుల సైనికులని చూసే అవకాశం లేదు. బహుశా అది అంత సరైన ఆలోచన కాకపోవచ్చు” అని అన్నాడు.
పొట్టి వ్యక్తి తలూపాడు. ” నిజమే! అది అంత సరైన ఆలోచన కాదు. నన్ను మీకు పరిచయం చేసుకోనివ్వండి. నా పేరు జెబ్ జాన్సన్. ఇక్కడికి దక్షిణ దిశగా నాకు తోటలు ఉన్నాయి. ఇక, నా మిత్రుడి పేరు క్లెమ్ కోలన్. ఈ యన మత గురువు……” అని మేజర్ తో చెప్పాడు.
“మీరు పరిచయం అవడం నాకెంతో సంతోషంగా ఉంది. నా పేరు ఆండ్రూ విల్కిన్స్” అని చెప్పాడు మేజర్.
” మీరు ఏ ప్రాంతం వారు మేజర్?” అని అడిగాడు జెబ్.
” వర్జీనియా” అని చెప్పాడు మేజర్.
” గొప్ప ఊరు” అంటూ మెచ్చుకున్నాడు జెబ్.
” నాకా ప్రాంతాన్ని సందర్శించే భాగ్యం కలగలేదు. కాని గొప్ప ఊరని విన్నాను” చెప్పాడు మతగురువు. అతడి మాటలెంతో మృదువుగా ఉన్నాయి. ఆ మార్ధవం ఏళ్ళ తరబడి వేదికలపైనుంచి ప్రసంగించడం వల్ల వచ్చిన అలవాటు. తన ముఖంలో ఎటువంటి భావాలు లేకుండా తలాడించాడు మేజర్. ఈ ముగ్గురు మాట్లాడుకుంటుడగా, మేజర్ గుర్రం వెళ్ళి ఎర్విన్ దాక్కున్న గడ్డివామిలోంచి తన నోటికి చిక్కినంత గడ్డిని దొరకపుచ్చుకుంది. దాంతో గడ్డివామి నుంచి దుమ్ము పైకి లేచింది. ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా తుమ్మకుండా ఉండలేక పోయాడు ఎర్విన్. ఆ శబ్దానికి గుర్రం కూడ సకిలించింది.
” ఏంటా శబ్దం?” ప్రశ్నించాడు మతగురువు.
” అక్కడ ఎవరో ఉన్నట్లున్నారు” చెప్పాడు జెబ్. మేజర్ కత్తి దూసి, గడ్డివామి వైపు కదిలాడు. అక్కడికి చేరి, “మర్యాదగా బయటకి రండి. మీకేం ప్రమాదం లేదు” అని అన్నాడు.
ఎర్విన్ మరింత లోపలికి దాక్కోడానికి ప్రయత్నిస్తూ, మేజర్ కంట పడ్డాడు. “బయటకు రా” అంటూ మేజర్ ఎర్విన్ చేయి పట్టుకుని బయటకు గుంజాడు మేజర్.
“నేను ముందే చెప్పానా, ఎవరో ఉన్నారని! చూడబోతే బానిసలా ఉన్నాడు” అన్నాడు జెబ్ నవ్వుతూ. మతగురువు కూడా అంగీకారంగా తలూపుతూ, ” వీడు పారిపోతున్న బానిసఅని నేను పందెం కాస్తాను. లేకపోతే ఇలా దాక్కోవలసిన అగత్యం లేదు” అని అన్నాడు.
ఎర్విన్ వణుకుతూ, మేజర్ కాళ్ళమీద పడ్డాడు. మేజర్ తన కత్తిని ఒరలో పెట్టుకున్నాడు.
” నీ యజమాని ఎవర్రా?” అని ఎర్విన్‌ని అడిగాడు జెబ్. ఎర్విన్ భయం నిండిన కళ్ళతో అతడికేసి చూసాడు.
” నేను నిన్నో ప్రశ్న అడిగాను. నీకు వినయ విధేయతలుంటే, బహుశా సరిగ్గా సమాధానం చెప్పేవాడివేమో!” అని కోపంగా అన్నాడు జెబ్. ఈసారి కూడ ఎర్విన్ మౌనంగానే ఉండిపోయాడు. “వీడికి పెద్దమనుషులని గౌరవించడం తెలిసినట్లు లేదు” ఆని అన్నాడు మతగురువు.
” నా ప్రశ్న కి జవాబు చెప్పు….” అంటూ జెబ్ ఎర్విన్ కేసి దూసుకుపోయాడు. వెంటనే మేజర్ ఎర్విన్ కి జెబ్‌కి మధ్య గా వచ్చి నిలబడ్డాడు. జెబ్ వచ్చి మేజర్‌ని గుద్దుకుని ఆగాడు.
” క్షమించండి మేజర్! నేనీ బానిసకో గుణపాఠం నేర్పాలనుకున్నాను…” అని అన్నాడు జెబ్.
” ఆ అవసరం ఏమీ లేదు…..” అని చెప్పాడు మేజర్ స్థిరంగా. జెబ్ నిర్ఘాంతపోయాడు. ” మీరు ఏమంటున్నారో నాకర్ధం కాలేదు” అని అన్నడు జెబ్.
” ఇతడికి మీరు గుణపాఠం నేర్పాల్సిన అవసరం లేదని నేనన్నాను” చెప్పాడు మేజర్.
” మీ ఉద్దేశ్యమేమిటో నాకర్ధం కాలేదు” అన్నాడు జెబ్.
” బహుశా, స్వయంగా మేజర్ గారే వీడికి గుణపాఠం నేర్పాలనుకుంటున్నారేమో. ఉత్తరాది సైనికులతో పోరాడుతున్నందువల్ల ఆయనకా హక్కు ఉంది” అన్నాడు మతగురువు.

(ఇంకా ఉంది)