ఆలోచనల్లో నిమగ్నమై నడుస్తున్న నేను చూసుకోకుండా ఓ సన్యాసిని ఢీ కొట్టాను. నల్లటి దుస్తులలో ఉన్న ఆ సన్యాసి చేతిలో చిలుం ఉంది. భుజానికి తాడు కట్టిన ఓ మట్టి పాత్ర వేలాడుతోంది. సన్యాసి నాకేసి పరీక్షగా చూసి, “ఏదో సమస్యతో బాధపడుతున్నట్లున్నావు నాయనా?” అని అన్నాడు. నా సమస్యని అయనకి విన్నవించుకున్నను. ఆయన ముఖంపై చిరునవ్వు విరిసింది. నా సమస్య అర్ధమైందన్నట్లు తలూపుతూ, ఏం కంగారు పడద్దని భరోసా ఇచ్చాడు. తన దుస్తులలోంచి వింత పదార్ధమేదో బయటకి తీసాడు.
“గురు దేవులు ‘హాజీ మలాంగ్ ‘ అన్ని సమస్యలని పరిష్కరిస్తారు” అని అన్నాడు. అతడేమంటున్నాడో నాకర్ధం కాలేదు. ఆ వింత పదార్ధానికి నిప్పంటించాడా సన్యాసి. ఏదో వింత పరిమళం చూట్టూ వ్యాపించింది. అంతే! చుట్టు పక్కలా ఎగురుతున్న దోమలన్నీ క్రిందకి రాలిపోసాగాయి. నాలో ఉత్సుకత పెరిగిపోయింది.
“ఇదేం ధూపం స్వామీ?” అని అడిగాను.
“ధూపమూ కాదు, నైవేద్యమూ కాదు! ఇది శ్రేష్టమైన గంజాయి. మానాలిలోని పొలాల్లో పండినది…” చెప్పాడు సన్యాసి.
“ఇది దోమలను చంపుతుందా?” అపనమ్మకంగా అడిగాను.
సన్యాసి బడలికగా నవ్వాడు. “ఇప్పుడు చూడు. దోమల సంగీతం లేదు. కాట్లు లేవు” అంటూ ఒక క్షణం పాటు ఆపాడు. మళ్ళీ తనే మాట్లాడుతూ, “ఈ దోమలని చూడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నయో! గుర్తుంచుకో. అవి చావలేదు. కేవలం నిద్రపోతున్నాయంతే. నీకేం ఇబ్బంది లేదు కదా?” అని అడిగాడు. మౌనమే నా సమాధానమయ్యింది. ఆ సన్యాసి సాంగత్యం వల్లనేమో, గత పది నిమిషాలుగా నా కళ్ళు అపారమైన దయని కురిపిస్తున్నాయి.
ఇంతలో దూరంగా మోటర్ సైకిల్‌పై వస్తున్న ఓ పోలీసు అధికారి కనపడ్డాడు. అతడిని చూడగానే సన్యాసి ముఖం మాడిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు సిద్ధపడ్డాడు.
“పైగా ఈ పద్దతి పూర్తిగా అహింసాత్మకమైనది. దోమలతో సహా అందరూ సంతోషంగా ఉంటారు. ఎవరూ చావరు. జై హాజీ మలాంగ్..” అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడా సన్యాసి.
నేను కూడా అక్కడినుంచి హడావుడిగా బయల్దేరాను. నాకో పక్క నిరాశగానూ, మరో పక్క ఉల్లాసంగాను ఉంది. ఇదంతా ఆ ధూపం మహత్యమే కాబోలు!
మర్నాడు సోమ వారం. ‘ఈ దోమల సంగతి అటో ఇటో తేల్చేయాలి ‘ అనుకుంటూ ఆఫీసుకి సెలవు పెట్టేసాను. ఈ సారి చట్టబద్ధంగా దోమలని చంపాలనుకున్నాను. సూపర్ మార్కెట్లో దొరికిన అన్ని రకాల దోమల మందులని వాడి చూసాను. ఇవేవి నాకు ఉపశమనం కలిగించలేకపోయాయి. ‘చోఢోమాస్ ‘ ఆయింట్మెంట్ నా వంటికి బంకలా అతుక్కుపోయి, అదో రకమైన వాసన వేసింది. ‘హిట్ అండ్ మిస్ ‘ స్ప్రే నాకు తలనొప్పిని కలిగించింది. కాయిల్స్ వెదజల్లే పొగకి ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఇక లాభం లేదనుకుని దోమల పీచమణచడానికి మరిన్ని కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నాను.
ఈ అంతర్గత శత్రువుని నాశనం చేయడానికి సైన్యం తప్పకుండా ఏదో ఒక వ్యూహం పన్నే ఉంటుందనుకున్నాను. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మస్కిటో కాలేజీలోని మస్కిటోలజీ విభాగం అధిపతిని కలుసుకున్నాను. ఆయన గదిలోని అన్ని కిటికీలకి జాలీలు అమర్చి ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని సాహసవంతమైన దోమలు ఎంతో తెగువతో గదిలోకి జొరబడి,ఆయన చెవుల వెనుక ఎగురుతున్నాయి. అప్పటికే ఆయన చెవులు దోమ కాట్లతో ఎర్రబడి ఉన్నాయి.
ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా నేను నేరుగా విషయంలోకి వచ్చేసాను.
“సార్! ఈ దోమలని ఎలా ఎదుర్కోడం?” అని ప్రశ్నించాను. ఆయన కిళ్ళీ నములుతూండడంతో నా ప్రశ్నకి జవాబివ్వలేకపోయారు.
ఇంతలో ఫట్, ఫట్‌మనే శబ్దం వినిపించింది. ఆయన తన చేత్తో తన ముఖాన్ని చరచుకున్నారు. ఒక శత్రువు రాలిపోయింది. నా ప్రశ్నకి జవాబు దొరికింది. నాకు నా కర్తవ్యం బోధపడింది. స్వశక్తిని నమ్ముకోడమే మేలని గ్రహించాను. ఆయన నోరు తెరచి జవాబు చెప్పేసరికి నేనా గదిలోంచి బయటకు వచ్చేసాను. ఇంటికి చేరాక, అన్ని క్రీములు, స్ప్రేలు, కాయిల్స్‌ని బయటపడేసాను. చేతులకి కొబ్బరి నూనే రాసుకుని, సాయంత్రం కోసం ఎదురుచూడసాగాను.
(ఆంగ్ల మూలం: డా.అజిత్ హరిసింఘాని)
(ఈ కథ ఫిబ్రవరి 2006 నాటి విపుల మాసపత్రికలో ప్రచురితం. ఈ కథకి నేను పెట్టిన పేరు “దోమల పాలిట యమరాజు”. కాని విపుల ఎడిటర్‌గారు దాన్ని “యమరాజు” గా మార్చి ప్రచురించారు. ఒకసారి ప్రచురితమైన కథకి పేరు మార్చడం నాకిష్టంలేదు అందుకే అదే శీర్షికని ఉంచాను. )