ఇంకా పూర్తిగా సాయంకాలం అవలేదు. కానీ వాటి పార్టీ అప్పుడే మొదలైపోయింది.దోమలు గుంపులుగా చేరి ఆబగా నా రక్తం జుర్రుకుంటున్నాయి.కొత్తగా మరికొన్ని దోమలు వచ్చివాలుతున్నాయి. తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా, రేపన్నదే లేదన్నట్లుగా యధేచ్చగా కుట్టేస్తున్నాయి. నాకు చికాకుగా ఉంది. ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. ‘నిజమే ఇక వీటికి మరో రోజంటూ ఉండదు ‘ అనుకుంటూ ఫట్, ఫట్ అంటూ చేతులతో నా తలపై ఉన్న దోమలని చరిచాను. మొదటి దెబ్బకి మూడు, రెండో దెబ్బకి రెండు చచ్చి ఊరుకున్నాయి. వాటి కళేబరాలతో నా తొడ యుద్ధ భూమిని తలపిస్తోంది. కానీ పశ్చాతాప్త పడడానికి నేనేమీ అశోకుడిని కాను.

పైకి చూస్తూ,” ఓ భగవంతుడా, ఎందుకయ్యా, ఇలాంటి జీవులను సృష్టించావు?” అని అడిగాను. పదిహేను నిమిషాలు గడిచినా పై నుంచి జవాబేం రాలేదు. ‘సరే, వీటి సంగతి నేను తేల్చుకోవలసిందే ‘ అనుకున్నను.
ఇతర ప్రాజెక్టులలానే ఇది కూడా పరిశోధనతోనే మొదలవ్వాలి. వెంటనే నేను మా పునే నగరం లోని ఫెర్గూసన్ కాలేజి రోడ్లో ఉన్న బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళాను. అక్కడి లైబ్రేరియన్ని, ‘దోమలపై ఏదైనా పుస్తకం ఉందా? ‘ అని ఆంగ్లేయుల యాసలో అడిగాను. “మా దగ్గర ఇంగ్లీషు అంశాలపై బ్రిటీషు వారు రాసిన పుస్తకాలే ఉంటాయి. ఇంగ్లాండ్ లో దోమలు లేవు కాబట్టి వాటిపై పుస్తకలేవి ఇక్కడ ఉండవు” చెప్పిందావిడ. ఆమెలో పూర్తి భారతీయత ఉట్టిపడుతోంది. నేను అదే ప్రశ్నని మళ్ళీ అడిగాను. అధమ జీవులపై ఆరాలు తీస్తున్న నా అజ్ఞానానికి ఆవిడ నొచ్చుకుంది. బహుశా నా ప్రశ్నని మొత్తం ఇంగ్లాండ్ కే అవమానంగా భావించిందేమో.

“ఇంగ్లాండ్ లో దోమలుండవు” అని కటువుగా పలికి సంభాషణని ముగించింది. నాకు కాస్త నిరాశ కలిగింది. దోమ కాట్లతో నిండిన నా భుజాలని ఎగరేసి, అక్కడి నుంచి బయటపడ్డాను. నా అమ్ములపొదిలో ఇంకో బాణం ఉంది. పూనే యూనివర్సిటికి చెందిన జయకర్ లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ బోలెడన్ని దోమలు! నాకు కావల్సిన పుస్తకాలు ఇక్కడ కచ్చితంగా దొరుకుతాయనే నమ్మకం కలిగింది. ‘ ఈ అంశం మీద ఇక్కడ తన్నుల కొద్ది సమాచారం దొరకవచ్చు ‘ అని అనుకుంటూ వెళ్ళి లైబ్రేరియన్ని కలిసాను.
రిటైర్మెంట్‌కి దగ్గర్లో ఉన్న ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ… ” ఏ జాతి దోమలపై పుస్తకాలు కావాలి? ఆఫ్రికా జాతివైతే, ఎ3 వరుసలో చూడండి. ఇండోనేసియా-మలేసియా సంతతివైతే ఎస్8 వరుసలో ఉంటాయి. డి2 వరుసలో దక్షిణ అమెరికా జాతి దోమల గురించిన పుస్తకాలున్నాయి…” చెప్పుకొచ్చారాయన.  

“కానీ నాకు భారతీయ దోమలపై పుస్తకాలు కావాలి” అని గొణుగుతూ, “చూడడానికి ఎంతో శాంతియుతంగా, అధ్యాత్మికంగా కనపడుతూ, సూదులతో గుచ్చినట్లుగా కుట్టే మన దోమలపై ఏవైనా పుస్తకాలుంటే ఇవ్వండి” అని అన్నాను.
నా ప్రశ్నకి జవాబుగా ఫట్, ఫట్‌మనే శబ్దం వినిపించింది. లైబ్రేరియన్ చేతులు అలవాటుగా పైకి లేచి, తలమీద ఎగురుతున్న దోమలపై దాడి చేసాయి. ఓ దోమ చచ్చిపడింది. దాన్ని చూడగానే నాకు ప్రాణం లేచొచ్చింది.
“ఇలాంటి దోమలపైనే నాకు పుస్తకం కావాలి” చెప్పాను. ఆయన తల అడ్డంగా ఊపారు. “ఇండియన్ అనోఫిలిస్ పై రీసెర్చ్ చేస్తున్న ఏకైక స్కాలర్, పరిశోధనల కోసం అస్సాం వెళ్ళి, అక్కడ మలేరియా బారినపడి ఇటీవలే మరణించాడు” అని చెప్పారు.

నాకు ఆశ్చర్యం కలిగింది. ‘పరిశోధనల కోసం అస్సాం దాకా వెళ్ళాలా? మా ఇంటికొస్తే సరిపోయేది కదా! బోలెడన్ని దోమల్ని ఉచితంగా సేకరించుకుని ఉండేవాడు కదా! ‘ అని అనుకున్నాను. తలపై ముసురుతున్న దోమల్ని అదిలిస్తూ, అక్కడి నుంచి బయటపడ్డాను.   
 (ఇంకా ఉంది)