“మేమేంజ్‌మెంట్ గుర్తించే లోపే ఈ నిజం చెప్పడం మంచిదా? అసలు నేను నిజంగా తప్పు చేసానా?”అని చరణ్ తనలో తానే ప్రశ్నించుకున్నాడు.  తను చేసింది తప్పో…..కాదో అతనికి అర్ధం కావడం లేదు.
అతంకి ఆందోళనగా ఉంది. ఆఫీసులో సూట్‌కేస్, కిట్ అప్పజెప్పాడు. జరిగిన సంగతి ఎవరికీ తెలియదు. ఇంటికొచ్చేసాడు. ఆఫీసునుంచి ఫోనేమీ రాలేదు. చరణ్‌కి టెన్షన్ పెరిగిపోతోంది.
ఏమీ తేల్చుకోలేకపోతున్నాడు. తనకిచ్చిన స్టాక్ లోంచి వస్తువులు తగ్గాయి. వాటిని సంస్థ కోసం ఉపయోగించినట్లు ఆధారాలు లేవు.  ఉద్యోగం ఊడిందంటే రోడ్డున పడడం ఖాయం. పైగా ఈ మధ్యే పెళ్ళయింది. చరణ్‌కి తలనొప్పి మొదలైంది. భార్య ఇంచ్చిన కాఫీ తాగుతూ ఆలోచనల్లోకి జారుకున్నాడు.

 * * *

చరణ్‌ది దిగువ మధ్య తరగతి కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. మేనమామ చేసిన ఆర్ధిక సహాయంతో ఇంటర్ వరకు చదవగలిగాడు. బట్టల కొట్లో, పచారి కొట్లో రెండేళ్ళ పాటు పనిచేసాడు. మేనమామ మిత్ర్రుడొకరు సహాయం చేస్తే ‘మేల్ హెల్త్ అసిస్టెంట్ ‘ పోస్ట్ కోసం శిక్షణ పొందాడు. ప్రభుత్వోద్యోగం దొరుకుతుందేమోనని కొంత కాలం వేచి చూసాడు. అమ్మకి వయసు మీరుతోంది. మేనమామకి కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నాయి. చరణ్ అందరికీ భారమౌతున్నాడు.
అతడి అదృష్టమో ఏమో, ఆ ఊర్లో ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన ఓ కార్యక్రమంలో హెల్త్ వర్కర్ గా చరణ్‌కి ఉద్యోగం దొరికింది. ఒక ఏడాది గడిచిపోయింది. చరణ్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడంలోను, ఆరోగ్యం పట్ల గ్రామీణులలో అవగాహన పెంచండంలోను నైపుణ్యం సాధించాడు. అయితే ఆ కార్యక్రమం ముగియడంతో, ఆ సంస్థ వాళ్ళు తమ ఆఫీసుని మూసేసారు. సంస్థ యజమానికి చరణ్ పనితీరు నచ్చి, ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. హైదరాబాదులో ఒక వ్యక్తిని కలుసుకోమన్నాడు.  

తన బయోడేటా కాపీలు తీసుకుని హైదరాబదు చేరాడు. ఆయన  చరణ్‌ని తనకి తెలిసిన వారి వద్దకు పంపారు. వారు వెంటనే ఉద్యోగం ఇవ్వకపోయినా, ‘మళ్ళీ కలవండి ‘ అనే వారు. ఇలా ఆర్నెల్లు గడచిపోయాయి. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. మావయ్యని అడగాలంటే సిగ్గుగా ఉంది. అతనిలో నిస్పృహ పెరిగిపోయింది. 
ఈ తరుణంలో నగరంలోని ఒక కార్పోరేట్ ఆసుపత్రి తమ ‘ఎమర్జెన్సీ సర్వీసుల ‘ టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేస్తే ఏ సమయంలోనైనా అత్యవసరమైన వైద్య సేవలందిస్తామని ప్రకటించింది. అవసరమైన వారు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే సుశిక్షుతులైన సిబ్బంది మోపెడ్‌పై సంఘటనా స్థలానికి వచ్చి ప్రధమ చికిత్స చేస్తారు. ఈ లోపల అన్ని పరికరాలు ఉన్న ఆంబులెన్స్ వచ్చి గాయపడిన వారిని తామ ఆసుపత్రికి తీసుకువెడుతుంది. ఇలా మోపెడ్‌పై తిరిగే పదిమందిలో ఒకడిగా చరణ్ ఎంపికయ్యాడు. కొన్నాళ్ళు ఉద్యోగం చేసాకా, “హమ్మయ్య, పర్వాలేదు జీవితంలో కాస్త స్థిరపడుతున్నాను” అని అనుకున్నడు చరణ్. మరదలిని పెళ్ళి చేసుకుని, మల్కాజిగిరిలో కాపురం పెట్టాడు. అంతా సాఫీగా సాగిపోతోందనుకుంతున్న తరుణంలో…….

ఒక యాక్సిడెంట్ కేసుకి హాజరయ్యాడు చరణ్. గాయపడిన వ్యక్తికి ప్రధమ చికిత్స చేసాడు. తమ ఆంబులెన్స్ రాగానే ఆసుపత్రికి పంపాడు. తన షిఫ్ట్ ముగిసింది. డ్యూటీ హాండోవర్ చేసి ఇంటికి బయల్దేరాడు. ఇంతలో రోడ్డు మీద వేగంగా వెడుతున్న  ఓ యువకుడి బైక్ డివైడర్‌ని ఢీ కొట్టింది. ఆ యువకుడికి దెబ్బలు తగిలాయి. చరణ్ వెంటనే తన బండి ఆపాడు. సూట్‌కేస్ కిట్ లోని మందులతో ఆ యువకుడికి ‘ఫస్ట్ ఎయిడ్’ చేసాడు. కాలికి చిన్న చిన్న దెబ్బలే తగిలినా, చేతికి మాత్రం ఫ్రాక్చర్ అయినట్లు గ్రహించాడు. 
“మీకు ఇంకా కొంచెం ట్రీట్‌మెంట్ అవసరం. మా ఆంబులెన్స్ కి ఫోన్ చెస్తాను. మా హాస్పిటల్‌కి వెడదాం” అని అతనితో చెప్పాడు చరణ్. 
“వద్దండీ. మా ఆఫీసు వాళ్ళు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు. మాకు మా పానెల్ హాస్పిటల్ ఉంది. అక్కడైతే మేమేమీ డబ్బు కట్టక్కర్లేదు. ఫస్ట్ ఎయిడ్ చేసినందుకు థాంక్స్” అంటూ తన మొబైల్ నుంచి బంధువుకి ఫోన్ చేసి పిలిపించుకుని వెళ్ళిపోయాడా యువకుడు. చరణ్ చూస్తూండిపోయాడు. బండి నడుపూతూ పర్యవసానాల గురించి ఆలోచించసాగాడు.
” కేసు ఆసుపత్రికి రాలేదు. కాబట్టి ఫస్ట్ ఎయిడ్‌కైన ఖర్చు నన్నే పెట్టుకోమంటారేమో? ఒక కేసు పోగొట్టానని మెమో ఇచ్చి జీతం కట్ చేస్తారేమో? లేకపోతే మొత్తానికే ఉద్యోగంలోంచి తీసేస్తారేమో” ఇలాంటి ఆలోచనలు అతడిలో భయాన్ని కలిగించాయి. ఈ విషయాని ఆఫీసులో చెప్పాలో వద్దో తేల్చుకోలేకపోతున్నాడు.   

 * * *

ఇంతలో అతడి సెల్ ఫోన్ మోగడంతో వర్తమనంలోకి వచ్చాడు. హాస్పిటల్ నుంచేమోనని అనుకున్నాడు. కానీ అది రాంగ్ నెంబర్. తను చేసింది సరైందో కాదో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాడు. వృత్తిధర్మం ప్రకారం తప్పే. అధికారులకి తెలియకుండా అఫీసు వస్తువులు వాడడం, వాటి లెక్కలు చెప్పకపోడం నిస్సందేహంగా నేరమే. కానీ మానవతా ధర్మం ప్రకారం తను చేసింది నూటికి నూరు పాళ్ళు సక్రమమే.
వాళ్ళమ్మ గారు నూరిపోసిన ‘ధర్మో రక్షితి రక్షిత: ‘ అన్న సూక్తిని గుర్తు చేసుకున్నాడు. సంగతంతా భార్యకు చెప్పాడు.
“అనవసరంగా బెంగ పడకండి. మీరు మంచి పనే చేసారు. అయినా కచ్చితంగా ఎదురవుతుందో లేదో తెలియని ప్రమాదాన్ని గురించి భయపడకండి” అంటూ ధైర్యం చెప్పిందామె.
జరిగిన సంగతంతా ఆఫీసులో చెప్పేసి, అవసరమైతే డబ్బులని తన జీతంలోంచి కట్ చేసుకోమని చెప్పాలని నిర్ణయించుకున్నాడు చరణ్. ఇప్పుడతడి మనసు కుదుటబడింది.

సామాజిక సేవలు ప్రైవేటీకరించబడ్డాక, ఇకపై తోటి వారి గురించి కన్నీళ్ళు కార్చాల్సివచ్చినా అందుకు ఖరీదు లెక్క వేసుకుని ఎవరికి వారే భరించుకోవలసి వస్తుందేమో!

(ఈ కథ 6 నవంబర్ 2005 నాటి ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం)