బహుమతి కొనడానికి గబగబా కొట్టుకి వెళ్ళాను. కాని అది అప్పటికే మూసేసి ఉంది. నిస్పృహగా ఇంటివైపు నడిచాను. ఇల్లు చేరిన మరుక్షణమే నా భార్య సింధు గురించి చెప్పుకొచ్చింది.
“పాపమండి! గుమ్మం దగ్గర చప్పుడైనప్పుడల్లా మీరేననుకుని బయతకు పరిగెత్తుకొచ్చింది. సాయంత్రం నుంచి ఏమీ తినలేదు. ‘నాన్న టెడ్డీ బేర్ తీసుకొస్తారు. అప్పుడు నేను నాన్నా, టెడ్డీ బేర్ కూర్చుని ఒకేసారి తింటాము..’ అని అంది. ఇప్పుడే పడుకుంది”
నాకు బాధా, జాలీ కలిగాయి. అన్నం తినాలనే కోరిక నశించింది. కాంప్లిమెంటరీ కాపీగా వచ్చిన ఓ పత్రికని నిరుత్సాహంగా తిరగేయసాగాను. అందులో ఏవో పోటీ ఫలితాలు ప్రకటించారు. విజేతలకు బహుమతి విలువకు సరిపోయే గిఫ్ట్ కూపన్లు ఇస్తామనీ, వాటిని కొన్ని ఎంపిక చేసిన కొట్లలో ఇచ్చి, తమకు కావలసిన వస్తువులు తీసుకోవచ్చని తెలిపారు. వెంటనే నాకో ఉపాయం తట్టింది. ఓ చార్టుపైన, కొట్లో చూసిన టెడ్డీ బేర్ బొమ్మని చిత్రించాను. దానికి చక్కగా గులాబీ రంగు వేసాను. అయితే అలవాటుగా బొమ్మ కింద నా సంతకం చేసేసాను.

మా ఆవిడ కొన్న చాక్లెట్ల బాక్సు తీసుకుని, సింధుని నిద్ర లేపసాగాను. నా గొంతు వినగానే సింధు లేచి కూర్చుంది.
“సింధు పాపాయీ, మళ్ళీ ఇంకోసారి నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఇదిగో చాక్లెట్లు, ఇదిగో టెడ్డీ బేర్, రేపు గానీ లేదా మరో రోజు గానీ ఈ గిఫ్ట్ కూపన్‌ని తీకుకెళ్ళి కొట్లో అంకుల్‌కి ఇస్తే,నీకు నిజం టెడ్డీ బేర్ ఇచ్చేస్తారు…” అని చెప్పాను.
“నాన్నా,ఈ బొమ్మని నువ్వే వేసావు కదూ?” అడిగింది సింధు. నేను తలూపాను.
అంతకుముందే నేను మా ఆవిడకి నా పధకం వివరించాను. సింధు ఎప్పుడైతే కొట్టుకి వెళ్ళి నిజం టెడ్డీ బేర్‌ని తీసుకోవాలనుకుంటుందో ఆ రోజు మా ఆవిడ సింధుకి తెలియకుండా, కొట్టు యజమానికి ఆ బొమ్మ ఖరీదు చెల్లిస్తుంది. ఆయనేమో సింధు గిఫ్ట్ కూపన్ ఇవ్వగానే నిజం టెడ్డీ బేర్‌ని ఇచ్చేయాలన్నమాట.  ఇదీ నా ఆలోచన.
సింధు చార్టు మీద వేసిన ఆ బొమ్మని చూసి చాల సంబరపడింది. దాన్నే తదేకంగా చూస్తుండిపోయింది.
“నాన్నా, ఇది దాదాపు మనం కొట్లో చూసిన బొమ్మ లానే ఉంది. థాంక్స్ నాన్నా, ఇంత మంచి బొమ్మని ఇచ్చావు” అని అంది. 

మరుసటి రోజు సాయంత్రం ఆఫీసునుంచి రాగానే టెడ్డీ బేర్ గురించి మా ఆవిడని అడిగాను.
“ఎందుకో ఏమో సింధు ఆ టెడ్డీ బేర్ గురించి అడగలేదు” చెప్పింది మా ఆవిడ.
నాకు ఆశ్చర్యం వేసింది. నేనే స్వయంగా సింధుని ఆ కొట్టుకి తీసుకువెళ్ళి, బొమ్మని కొనిస్తే మంచిదేమో అని అనిపించింది.
“సింధు పాపాయీ,మనం ఆ కొట్టుకి వెళ్ళి నిజం టెడ్డీ బేర్ తెచ్చుకుందామా?” అని అడిగాను.
సింధు నన్ను చూస్తూ ఆలోచించసాగింది.
కాసేపయ్యాక, “నేను మనసు మార్చుకున్నాను నాన్నా. నువ్వు వేసిన ఈ బొమ్మ చాలా బావుంది. ఇంత మంచి బొమ్మని షాపంకుల్‌కి ఎందుకు ఇవ్వాలి? వద్దు. నాకు ఆ గులాబీ రంగు టెడ్డీ బేర్ వద్దు. నువ్వు వేసిన ఈ బొమ్మే కావాలి. ప్రపంచంలోని ఏదిచ్చినా, దీన్ని మాత్రం నేను వదులుకోను…..” అని చెప్పింది స్థిరంగా.
ఈ సమాధానం వినగానే నాకెంత సంతోషం వేసిందంటే…… అంతర్జాతీయ పోటీలలో నా చిత్రానికి ప్రధమ బహుమతి వచ్చినా కూడా నేనంతగా సంబరపడనేమో!
ప్రపంచంలో ఉన్న అన్ని గులాబీ రంగు టెడ్డీ బేర్‌లని కొనేసి, నా చిన్నారి యువరాణి పాదాల వద్ద ఉంచాలని నాకు బలమైన కోరిక కలిగింది.
(తమిళ, ఆంగ్ల మూలం: వరలొట్టి రంగసామి)
(ఈ కథ 2 జూలై 2006 నాటి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితం)