“నాన్నా, ఈ గులాబీ రంగు టెడ్డీ బేర్ చాలా బాగుంది కదా! మనం తీసుకుందామా?” అడిగింది నా కూతురు.
“వద్దు సింధూ, నీకు ఇంతకంటే పెద్ద బొమ్మ కొనిస్తాను. సరేనా?” అని అన్నాను నేను.
“ఊహు! నాకు పెద్ద బొమ్మలంటే భయం! నాకిదే కావాలి” అంది సింధు. ఆ బొమ్మ ఖరీదు 795 రూపాయలు.
మేగజైన్లలో బొమ్మలు వేసుకుని బ్రతికే నాలాంటివాడికది చాలా పెద్ద మొత్తం. అలా అని మేమేమి పస్తులుండడం లేదు. ‘అన్నం ‘ సమస్యే కాదు… మిగతావే!
మా తోటి ఉద్యోగి పెళ్ళి సందర్భంగా ఏదైన బహుమతి కొందామని ఈ కొట్టుకి వచ్చాను. వస్తూ వస్తూ, సింధుని కూడా తీసుకు రావడం పొరపాటైపోయింది. సింధు ఇంకా ఆశగా ఆ బొమ్మనే పట్టుకుని ఉంది. నిజాయితీగా ఉండడమే సింధు దగ్గర బాగా పనిచేస్తుందని నాకు తెలుసు.
“సింధు పాపాయి, దీని ధర చూసావా? 795 రూపాయలు. అంటే అయిదు రూపాయలు తక్కువ ఎనిమిదివందలన్న మాట. నాన్న పర్సులో ఎన్ని రూపాయలున్నాయో చూడు…..అరవై రూపాయలే ఉన్నాయి. కాబట్టి ఈ బొమ్మని మనం ఇప్పుడు కొనుక్కోలేము. కానీ నీ పుట్టిన రోజు నాటికి తప్పకుండా కొనిస్తాను. వచ్చే నెలలోనే కదా, సరేనా”
“ఒట్టు?”
“ఒట్టు” అంటూ మాటిచ్చాను.
మరుసటి రోజు సాయంత్రం నేను ఆఫీసునుంచి రాగనే, సింధు గబగబా ఎదురొచ్చి నా కాళ్ళను చుట్టేసుకుంది.
“నాన్నా, ఇంక 29 రోజులే…” అని అంది.
“దేనికమ్మా?” అని అడిగాను.
“నా పుట్టిన రోజుకి! గులాబీ రంగు టెడ్డీ బేర్ మన ఇంటికి రావడానికి” ఉత్సాహంగా చెప్పింది సింధు.
ప్రతీ సాయంత్రం నేను ఇంటికి రాగానే రోజుల సంఖ్య గుర్తు చేయడం సింధుకి అలవాటుగా మారింది.
సింధు పుట్టిన రోజు నాటికి ఆ టెడ్డీ బేర్‌ని కొనాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎలా? ప్రతీ నెలా నాకు కొంత అదనపు పని దొరుకుతుంది. ఏదైన ప్రత్యేక సంచిక కానీ, లేద దినపత్రికలో కలర్-సప్లిమెంట్ గనీ లేద కనీసం కేలండర్ లేద పోస్టర్‌లకు సంబంధించిన ఆర్ట్ వర్క్ అయినా దొరుకుతుంది. వాటి ద్వారా వచ్చే కొద్దిపాటి అదనపు ఆదాయంతో మా కుటుంబంలో చిన్న చిన్న సంతోషాలు – పిక్నిక్ లేదా సినిమాకి వెళ్ళడం లేదా మాలో ఎవరికైనా ఒక జత కొత్త బట్టలు కొనుక్కోడం-వంటివి తీర్చుకుంటాం. ఈ సారి అలాంటి పని ఏదైన దొరీకితే, వచ్చే ఆ డబ్బుతో సింధుకి టెడ్డీ బేర్ కొనాలని అనుకున్నాను. కానీ ఈ నెలలో అలాంటి అవకాశమేదీ కనిపించడం లేదు.
సింధు పుట్టిన రోజు నాడు చాలా భారమైన మనసుతో నిద్ర లేచాను. టెడ్డీ బేర్ కొనడాంకి డబ్బు లేదు. ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలనుకున్నాను. టిఫిన్ కూడా తినకుండా తొందరగా బయల్దేరాను. సింధు నిద్ర పోతోంది. సింధు గదిలోంచి నిశ్శబ్దంగా జారుకుందామనుకుంటూ బయటకు వస్తుంటే, సింధు దుప్పటిలోంచి ముఖం బయట పెట్టి, “నాన్నా, నాకు శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయావు” అని అంది.
“నా చిట్టి తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు” అని గొణుగుతూ, పాప నుదుటిపైన చిన్నగా ముద్దు పెట్టుకున్నాను. నా కళ్ళ నీళ్ళు పాప ముఖం పైకి జారకుండా జాగ్రత్త పడ్డాను. గదిలోంచి బయటకు వచ్చేస్తుండగా, “నాకు తెలుసు నాన్నా, నువ్వీ రోజు నాకు గులాబీ రంగు టెడ్డీ బేర్ తెస్తావు. నీ కోసం ఎదురు చూస్తూంటాను” అంది సింధు. మౌనంగా ఆఫీసుకుకి బయల్దేరాను.
సాయంత్రమైంది. ఇంటికి వెళ్ళేముందు, మా సబ్ఎడిటర్‌ని కలిసి ఎనిమిది వందలు అడ్వాన్సు అడుగుదామని నిశ్చయించుకున్నాను. నెలాఖర్లో నా జీతంలో తగ్గించుకోమని చెబుతాను. కొన్ని నెల వారి ఖర్చులను తగ్గించుకోవలసి వస్తుంది. అయినా పరవాలేదు.
నా అవసరాన్ని సబ్ ఎడిటర్ కి వివరించాను. అయితే అనూహ్యంగా ఆయనో ప్రతిపాదన చేసారు.
“చూడు, నువ్వు అడ్వాన్స్ అడుగుతున్నావు. నేనేమో నీకు అదనపు ఆదాయం వచ్చే మార్గం సూచిస్తున్నాను. ఈ మూడు కథలకి నువ్వు బొమ్మలు వేయాలి. నీకు తొమ్మిది వందలు ఇస్తాను. కాని ఈ బొమ్మలు ఈ రోజు రాత్రి ప్రెస్‌కి వెళ్ళిపోవాలి. అంటే నువ్వు ఇప్పటికిప్పుడు, ఇక్కడే కూర్చుని బొమ్మలు గీసివ్వాలి. నీలాంటి సమర్ధుడికి అదేమంత కష్టమైన పని కాదులే. మహా అయితే రెండు గంటలు పడుతుంది. నువ్వు ఎనిమిది గంటలకల్లా డబ్బుతో వెళ్ళిపోవచ్చు. నీ కూతురు పుట్టిన రోజుని ఘనంగా జరుపుకోవచ్చు. ఏమంటావు?” అని అడిగారాయాన.
నాకు గత్యంతరం లేదు.
నిజమైన చిత్రకారుడెవ్వరూ కాల పరిమితికి లోబడి మంచి బొమ్మలు గీయలేడు. పనిలో నిమగ్నమవగానే, నేను సమయం గురించి, సింధు పుట్టిన రోజు గురించి, టెడ్డీ బేర్ గురించి పూర్తిగా మరిచిపోయాను. పని ముగించుకుని, డబ్బు తీసుకుని బయటపడేసరికి సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటిపోయింది.
(ఇంకా ఉంది)