నేను చిన్నప్పుడు నది ఒడ్డున ఉండే ఓ గ్రామంలో మా తాతయ్యగారింట్లో ఉండే దాన్ని. వారి పశువులను కాసే కన్హా నా ప్రియమిత్రుడు. పశువులను మేపడానికి వెళ్ళేడప్పుడు కన్హాతో పాటు నేనూ వెళ్ళేదాన్ని. ఎందుకంటే అతడి చొక్కా జేబుల్లో తినుబండారాలు ఉండేవి. పక్షులని వేటాడడానికి ఉండేలు ఉండేది. పశువులు మేత మేస్తుంటే, మేమిద్దరం నది ఒడ్డున మట్టిలో ఆడుకునేవాళ్ళం. మా ఇద్దరికీ ఇష్టమైన ఆట ‘టార్జాన్’. మా శరీరాలను అరటి ఆకులతోను, పూల తోను కప్పుకునే వాళ్ళం. కన్హా టార్జాన్ అయితే, నేను జేన్ వేషం కట్టేదాన్ని. కన్హా చేపలని గాని పిట్టలని కాని వేటాడి తెస్తే నేను పళ్ళు ఏరుకొచ్చేదాన్ని. భోజన సమయంలో మేము తెచ్చుకున్న వాటిని సమానంగా పంచుకుని విందు చేసుకునే వాళ్ళం. కొన్ని సార్లు యుద్ధాలు జరిగేవి. ఎందుకంటే మా ఊర్లో కన్హా ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది టార్జాన్లు ఉండేవారు. వాళ్ళంతా కన్హా కంటే చాలా పెద్దవాళ్ళు. బలవంతులు. అందుకని సాధారణంగా మేమే లొంగిపోయి సంధి కుదుర్చుకునే వాళ్ళం.
డిసెంబరు నెల చివరి రోజులవి. వరి పంట కోత కొచ్చింది. ధాన్యం ఇంటికి చేరినప్పుడు వాటిని ఇంటి ఆవరణలో ఆరబెట్టేవాళ్ళం. ఆ సమయంలో ధాన్యం గింజల కోసం, ఎండు గడ్డి కోసం పక్షులు మా ఇళ్ళ పైకప్పులపై వాలేవి. చక్కటి కుహూరావాలు చేసేవి. ఇవన్నీ ‘టెట్’ పండుగ వస్తోందనడానికి సూచనలు. పిల్లలకు కొన్ని రోజులపాటు సెలవలు, వేటగాళ్ళకు చేతినిండా పని. ఈ పండుగలలో మాకు వేట మాంసంతోనూ, ఉడికించిన గుడ్లతోను విందు జరిగేది. మేమే ఆతృత ఆపుకోలేక ఉడికీ ఉడకని గుడ్లని పగలకొట్టుకుని నోట్లో కుక్కేసుకునేవాళ్ళం. వాటి రుచి అమోఘం.
కన్హా పళ్ళకోసం చెట్లెక్కినపప్పుడు కొన్ని సార్లు గూళ్ళలో పక్షుల గుడ్లు కనబడేవి. ఒక రోజు కన్హా నా కోసం పరిగెత్తుకొచ్చాడు. ‘గిజిగాడి గూడు చూసాను. నీక్కూడా చూపిస్తాను రా..’ అంటూ నన్ను నది ఒడ్డున ఉన్న ఓ పెద్ద కొబ్బరి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ చెట్టు చిటారు కొమ్మ మీద ఎండు గడ్డి తో అల్లిన అందమైన గూడు కనపడింది. మేమిద్దరం దాన్ని చూస్తూ ఉండిపోయాం.
ఇంతలో అక్కడికి మరో కొత్త టార్జాన్ వచ్చాడు. మా ఇద్దరి చెవులు పట్టుకుని ‘మర్యాదగా ఇక్కడినుంచి పొండి, ఈ పక్షి నాది’ అని అన్నాడు. మేము చేసేదేం లేక మా చెవులను రుద్దుకుంటూ దూరంగా వెళ్ళి నిలుచున్నాం. కొత్త టార్జాన్ తన నాటు తుపాకీని పొగరుగా పక్షి గూటికేసి గురిపెట్టడాన్ని మేము నిరాశగా చూసాం. అయితే ఆ సమయంలో పక్షి తన గూట్లో లేదు. దాని కోసం ఎదురుచూసి విసిగిపోయాడు కొత్త టార్జాన్. ‘పక్షి కనపడితే నన్ను పిలవండి. అర్ధమైందా?’ అంటూ అక్కడి నుంచి కదిలాడు. కొన్ని నిమిషాలు గడిచాయి. ఈ కొత్త టార్జాన్ కి కావలసింది పక్షి మాత్రమేనని కన్హాకి అర్ధమైంది. కష్టపడితే, ఆ అందమైన గూడుని తాను దక్కించుకోవచ్చునని కన్హాకి తోచింది. అటూ ఇటూ చూసాడు. తనని ఎవరూ చూడడం లేదని నిర్ధారించుకున్నాక గబగబా చెట్టు ఎక్కాడు. గూటిలోకి తొంగి చూసాడు. అక్కడ రెండు గుడ్లు ఉన్నాయి. వాటిని నాకు చూపేంతలోపే తల్లి పక్షి అక్కడికి రావడం చూసాం. కన్హా గూటిని చెట్టు కొమ్మల్లో దాచేసాడు. ఆ పక్షిని తరమడానికి నేను కన్హా గట్టిగా అరవసాగాం. ఆ పక్షి వేటగాడి చేతిలో చావాలని మేము కోరుకోడం లేదు. కాని అది కొబ్బరి చెట్టు చుట్టూ ఎగురుతూ అరవసాగింది. ‘తన పిల్లల కోసం వెదుకుతున్నట్లుంది’ అన్నాడు కన్హా. ఇంతలో ‘ఢాం’ అంటూ తుపాకీ పేలిన చప్పుడు వినిపించింది. మేమిద్దరం ఉలిక్కిపడ్డాం.
కాని తూటా పక్షికి తగలలేదు. ‘ఢాం’ అంటూ మరోసారి తుపాకీ పేలింది. అయితే ఈ సారి కూడా పక్షి తప్పించుకుంది. కాని మళ్ళీ మళ్ళీ కొబ్బరి చెట్టు చుట్టూ గుండ్రంగా తిరుగుతూ తన గూడుని వెదుక్కోసాగింది. ‘ఢాం’ అని తుపాకీ మరోసారి పేలింది. జరుగుతున్న ఘోరం చూడలేక మేమిద్దరం కళ్ళు మూసుకున్నాం. నాకు ఏడుపు ఆగడం లేదు. మేం కళ్ళు తెరచేసరికి ఆశ్చర్యంగా ఆ పక్షికి ఏమీ కాలేదు. గాయపడకుండా ఇంకా ఎగురుతునే ఉంది.
“పో పో! ఇక్కడి నుంచి పారిపో. లేకపోతే నిన్ను చంపేస్తాడు’ అంటూ కన్హా పెద్దగా అరవసాగాడు. మేమిద్దరం గట్టిగా అరుస్తూ, పిచ్చిగా గెంత సాగాం. పెద్ద టార్జాన్‌కి కోపం వచ్చింది. మమ్మల్నిద్దరినీ చెరో గుద్దు గుద్ది తన దారిన తాను పోయాడు. కన్హా గబగబా చెట్టెక్కి, గూడుని కొమ్మ మీద పెట్టేసాడు. కాని సరిగ్గా ఇంతకు ముందున్న స్థలంలో మాత్రం పెట్టలేకపోయాడు. తర్వాత చప్పట్లు కొడుతూ ‘ ఇదిగో నీ గూడు. వెనక్కిరా’ అంటూ ఆ పక్షిని పిలవసాగాడు.
మా సదుద్దేశ్యాన్ని అర్ధం చేసుకోలేక, ఆ పక్షి కొబ్బరి చెట్టు చుట్టూ ఎగురుతునే ఉంది. ‘నీకేం కాదు. నీ గూడు భద్రంగా ఉంది’ అంటూ కన్హా అరవసాగాడు. ఆతడి కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. బహుశా గిజిగాడు కూడా అలసిపోయినట్లుంది. దాని కూతలు బలహీనంగా వినబడుతున్నాయి. అది మరింత పైపైకి వెళ్ళిపోయింది.
‘ వెళ్ళొద్దు. వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే నీ పిల్లలను ఎవరు చూస్తారు?’ అంటూ కన్హా అరవసాగాడు. తాతయ్య మమ్మల్ని వెదుక్కుంటూ వచ్చేవరకు మేము ఆ పక్షి కోసం ఎదురుచూస్తునే ఉన్నాం. తాతయ్యని చూస్తూనే, ‘రేపు నేను పనిలోకి రానండి’ అని చెప్పాడు కన్హా. ‘ ఏం? ఎందుకని?’ అడిగారు తాతయ్య.
‘ ఈ రోజు గిజిగాడు తన పిల్లలను వదిలి వెళ్ళిపోవడానికి నేనే కారణమయ్యాను. ఇదివరకు మా అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు ‘తల్లీ బిడ్డలని విడదీసిన పాపం ఏడు జన్మలకి గానీ పోదని మా అమ్మమ్మ అత్త తో అనడం నేను విన్నాను. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి’ అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు కన్హా. తాతయ్య కన్హా తల నిమిరారు. ‘మీ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోలేదు. ఉద్యోగ రీత్యా మీకు దూరంగా ఉంటోంది. ఈ టెట్ పండగకి ఇంటికి వస్తుంది. ఏ తల్లి కూడ తన పిల్లలను కావాలని వదిలేయదు. తల్లీ పక్షి కూడా అంతే. రేపొద్దున్న ఆ పక్షి తన గూడు కోసం, తన పిల్లల కోసం తిరిగి వస్తుంది. నా మాటల మీద నమ్మకం లేకపోతే రేపొద్దున్న ఇక్కడికి వచ్చి చూడు’ అని నచ్చజెప్పి మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళారు తాతయ్య.
మర్నాడు పొద్దున్నే మేమిద్దరం కొబ్బరిచెట్టు దగ్గరికి వెళ్ళాం. గిజిగాడు తన గూట్లో కూర్చుని ఉంది. మా ఆనందానికి అంతే లేదు. నోటికి వచ్చిన పాటలు పాడుతూ, గెంతులు వేసాం. ‘టెట్ పండగకి అమ్మ వస్తుంది’ అంటూ కన్హా హుషారుగా ఉన్నాడు. పండగ కోసం మేమిద్దరం ఎదురుచూసినంతగా మరెవరూ ఎదురుచూసినంతగా మరెవరూ ఎదురుచూసి ఉండరేమో. కన్హా వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింది. మా అమ్మ మాత్రం రాలేదు. ఇప్పుడు, పెద్దయ్యాక – నాకు మరణం అంటే ఏమిటో తెలిసింది. కానీ ఇప్పటికీ కొత్త సంవత్సరం వచ్చినప్పుడల్లా ‘అమ్మ వస్తే బాగుండు’ అని ఎదురుచూస్తునే ఉన్నాను.
(ఈ కథ ప్రజాశక్తి దినపత్రికలో 14, 21 డిసెంబరు 2005 తేదీలలో ప్రచురితం)