అయితే అనూహ్యంగా, రెండు రోజుల తర్వాత ఆ అమెరికా కంపెనీ ప్రతినిధులు సుబ్బారావు ఆఫీసుకి ఫోన్ చేసారు. రాష్ట్రం లోని చెత్తనంతా క్వింటాళ్ళ లెక్కన కొంటామని, తగిన ధర చెల్లించగలమని చెప్పారు.”అంత చెత్తని మీరేం చేసుకుంటారు?” అడిగాడు ఎస్. ఓ.
“ప్రాసెస్ చేసి ఎరువుగా మార్చుకుంటాం”
” సర్లెండి, మీరు ఏం చేసుకుంటే మాకెందుకు? అప్లికేషన్ పెట్టండి. టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్సు పంపిస్తాం. ఒప్పందం కుదిరాకా, చెత్తని పంపిస్తాం” వాళ్ళు అంగీకరించారు. వెంటనే అప్లికేషన్ పంపారు. తర్జనబర్జనల తర్వాత ప్రభుత్వం ఒప్పుకుంది. అంతే, ఒక్కసారిగా రాష్ట్రం లోని డంపింగ్ యార్డ్ లకి, చెత్త కుప్పలకి మోక్షం కలిగింది. కంటైనర్ల నిండా చెత్తతో విమానాలు, నౌకలు అమెరికా కి ప్రయాణమయ్యాయి. రెండు నెలల్లో హైదరాబాదు అత్యంత పరిశుద్ధమైన నగరంగా మారిపోయింది.
ఓ రోజు సుబ్బారావు బావమరిది అమెరికా నుంచి ఫోన్ చేసాడు.
“ఏం బావా? మీ చెత్త సమస్య తీరిందా?”
“ఆ, మీ కంపెనీ దయవల్ల”
“అలా అనకు బావా, మీ దయ వల్లే, దివాళా అంచున ఉన్న మా కంపెనీ కోలుకుంది. పైగా నాకు ప్రమోషన్ కూడా దొరికింది”
“అదేంట్రోయ్”
“అవును బావా, మీ దగ్గరనుంచి చెత్తని తక్కువ ధరకి కొని, బ్రిటన్‌లో ఇంకో కంపెనీ ఎక్కువ ధరకి అమ్ముతున్నాం”
“అంత చెత్తని వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు?”
“బావా, వాళ్ళు చెత్త నుంచి ఇటుకల లాంటి ‘బిటుబ్లాక్’ తయారు చేస్తున్నారు. అవి కాంక్రీటుకు ప్రత్యామ్నాయం. పైగా తక్కువ ఖర్చుతో కాంక్రీటు కన్నా ధృడమైన పదార్దం సిద్ధం చేసుకుంటున్నారు. వాటినే మళ్ళీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇళ్ళ నిర్మాణానికి అమ్ముతున్నారు. మీ చెత్త వలన అందరికీ లాభమే కలిగింది. అది సరే గానీ, ఈ వివరాలని బయటకు పొక్కనీకు. జాగ్రత్త. ఇక ఉంటా….”
“సరేలేరా..” అంటూ ఫోన్ పెట్టేసాడు సుబ్బారావు.
* * *
అయితే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ఓ టి.వీ ఛానెల్ వాళ్ళు ఈ రహస్యాన్ని బహిర్గతం చేసారు. మన ప్రయోజనలను విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టడం సబబేనా అంటూ ఎస్. ఎం. ఎస్ ఓటింగ్ పెట్టిందా ఛానెల్. అమెరికా కంపెనీ దాసోహమంటున్నామంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. అసెంబ్లీని స్తంభింపచేసాయి. అవకాశం కోసం ఎదురుచూసే నాయకులు ఉద్యమానికి సిద్ధమయ్యారు.
అధికార పార్టీ ముఖ్య నేత బావమరిది స్వయంగా ఈ ఉద్యమానికి నేతృత్వం వహించసాగాడు. ఇది ప్రజా ఉద్యమమని, ఇందులో రాజకీయాలకు తావు లేదని ప్రకటన చేసాడు.
“చెత్త మనది, సొత్తు ఇంకొకడికా? వీల్లేదు”, “చెత్త ఎగుమతులు ఆపండి, రాష్ట్రాన్ని రక్షించండి” అనే నినాదాలతో హైదరాబాదులో ప్రారంభమైన కొత్త ఉద్యమం రాష్ట్రమంతా వ్యాపించింది. దీని ధాటికి ఇతర ఉద్యమాలన్నీ వెనుకబడ్డాయి.
” ఊరు మనదిరా, చెత్త మనదిరా; వాడ మనదిరా, తుక్కు మనదిరా…” అనే పాటలతో నగరం హోరెత్తిపోయింది. సుబ్బారావు పేరు రాష్ట్రమంతా మారుమ్రోగిపోయింది. చాలా ఊర్లకి వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వవలసి వస్తోంది. అతడి ఇంటర్వ్యూలు, అతడితో ముఖాముఖి కార్యక్రమాలనెన్నో ప్రసారం చేసాయి టి.వీ ఛానెళ్ళు. అంతే. సుబ్బారావు వీర పాపులర్ అయిపోయాడు.
ఎన్నికల సమయం కావడంతో, రాజకీయం మరీ వేడెక్కింది. చెత్తని ప్రభుత్వమే కొనాలని, దానికి తగిన మద్దతు ధర చెల్లించాలని ఓ పార్టీ డిమాండు చేసింది. ఇంకో పార్టీ మరో అడుగు ముందుకేసి తాము అధికారంలోకి వస్తే, చెత్తని ప్రజల నుంచి నేరుగా కొంటామని, అవసరమైతే ప్రజల ఇంటి దగ్గరే డబ్బు చెల్లిస్తామని ప్రకటించింది. దాంతో ప్రజలు చెత్తని బయట పారేయడానికి వెనుకాడుతున్నారు. వేరే రాష్ట్రాలలో ఉండే బంధువుల ఇళ్ళ నుంచి చెత్తని పార్శిళ్ళలో తెప్పించుకుని నిల్వ చేస్తున్నారు జనాలు. చెత్త
ఏరుకోడానికి ఎవరైనా వెడితే తరుముతున్నారు. ఓ కంపెనీ చెత్తని కనీసం మూడురోజుల పాటు కుళ్ళిపోకుండా ఉండేలా ఓ పిచికారీ మందు తయారు చేసింది. రాష్ట్రం అల్లకల్లోలమైపోయింది.
ముఖ్యమంత్రికి చిర్రెత్తి ఓ విచారణా సంఘాన్ని నియమించాడు. వాళ్ళు త్వర త్వరగా విచారించి, దీనికంతటికీ మూలకారణం సుబ్బరావని తేల్చి, అతడిని సస్పెండ్ చేయాలని సూచించారు. అయితే ప్రజల క్షేమం కోరే తానా సలహా ఇచ్చానని సుబ్బారావు విన్నవించుకోగా, కనికరించి వదిలేసారు. మన శాస్త్రవేత్తలు అటువంటి పరికరాలని కనిపెట్టేవరకు, అమెరికా కంపెనీకి ఎగుమతులు ఆపేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మళ్ళీ నగరం, రాష్ట్రం చెత్తతో కళకళలాడసాగాయి. నెల రోజుల తర్వాత, కొన్ని వాన్లు మూడురోజుల కొకసారి వచ్చి అన్ని చోట్ల చెత్తని కొంటున్నాయి. సుబ్బారావు వాళ్ళ కాలనీ సమస్య, అతడి కీర్తి కాంక్ష రెండూ తీరాయి. అయితే, సామాన్య ప్రజలకి తెలియని రహస్యం – బినామీ పేరుతో అధికార పార్టీ ముఖ్య నేత బావమరిది, నగరం శివార్లలో చెత్త నుండి విద్యుత్తు తయారుచేసే ప్లాంటు పెట్టడం!
కొసమెరుపు ఏంటంటే తెలుగు ప్రజలకి సుబ్బారావు చేసిన సేవలను గుర్తించిన ప్రతిపక్ష పార్టీ, అతడిని నగర మేయర్ పదవికి పోటీచేయించాలని ప్రతిపాదించడం!
( ఈ కథ ది. 14 నవంబరు 2007 నాటి నవ్య వారపత్రికలో ప్రచురితం)
నవంబరు 16, 2007 at 4:57 పూర్వాహ్నం
కథ చాలా బాగుంది. మొదటి భాగం చదివాక రెండో భాగం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేలా చేసింది.
నవంబరు 16, 2007 at 6:19 అపరాహ్నం
బాగుందండి కథ, హాస్యాత్మకంగా.