సుబ్బారావుకి ఉన్నట్లుండి దురద పుట్టింది. వంటికి కాదండోయ్! మనసుకి. పది మంది తనని గుర్తించాలనీ, పొగడాలనే తాపత్రయం ఎక్కువైపోతోంది. క్రిందటి నెలలో వాళ్ళ దూరపు బంధువొకాయనకి ‘పర్యావరణ మిత్ర’ అనే అవార్డు వచ్చినప్పటి నుంచి అతడికి మనశ్శాంతి కరువయింది. అప్పటి నుంచి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆఫీసులోనేమో తన సెక్షన్ లో తప్ప తనని గుర్తు పట్టేవాళ్ళు లేరు, ఇంటి దగ్గరేమో కనీసం రెండిళ్ళ అవతలి వాళ్ళకైనా సుబ్బారావు ముఖం కూడా తెలియదు.
రాత్రి భోజనం అయ్యాక, తన అభిమాన డైలీ సీరియల్ సైతం చూడకుండా, సోఫాలో దిగాలుగా కూర్చున్న సుబ్బారావుని
” ఏమైందండి? అలా ఉన్నారు?” అని అడిగింది వాళ్ళావిడ సరళ.
” ఏం చేస్తే నాక్కూడా పేరొస్తుందో అని ఆలోచిస్తున్నాను ” నిట్టూరుస్తూ అన్నాడు సుబ్బారావు.
“ఇప్పటికే కాలనీ ప్రెసిడెంట్ గా ఉన్న తలనొప్పులతో చస్తుంటే, మీ గొడవేంటండీ బాబూ? ఈ రోజు సాయంత్రం కాలనీలోని ఆడవాళ్ళంతా మనింటి దగ్గర గొడవ చేసారు. దాని గురించి మీకే మాత్రం పట్టదు”
” ఎందుకట గొడవ, చెత్త తీయించడం గురించేనా?”
“అవును. మీకు చేతనైతే దాన్ని పరిష్కరించండి. అప్పుడు మీకు కూడ బోలెడు పేరు ప్రతిష్టలొస్తాయి”
“మంచి ఆలోచన సరళా, రేపట్నించే ప్రయత్నాలు మొదలుపెడతాను” ఉత్సాహంగా చెప్పి, నిద్రకి ఉపక్రమించాడు సుబ్బారావు.
వాళ్ళ కాలనీలో సమస్య వీధులలో పేరుకుపోతున్న చెత్త. కాలనీల నుండి చెత్త సేకరించకపోవడం, తమ ప్రాంతాలలో చెత్తని ‘డంప్’ చేయడాన్ని శివారు ప్రాంతాల ప్రజలు వ్యతిరేకించడం వల్ల చెత్త నిల్వలు పెరిగిపోయాయి. ప్రజలు ఫిర్యాదు చేస్తుంటే “మాకు సంబందం లేదు, చెత్త తరలించే బాధ్యత కాంట్రాక్టర్లది, వాళ్ళని అడగండి”అని అంటున్నారు మునిసిపల్ శాఖాధికారులు.
ఈ కారణంగా పౌరులకీ, మునిసిపల్ సిబ్బందికి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదీ కాలనీ వాసుల ఆందోళనకి కారణం.

* * *

హైదరాబాదు నగరమంతా ఉద్రిక్తంగా ఉంది. మత కలహాలేం జరగలేదు. కాని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అసలు విషయం తెలియనివారికది చాలా చిన్న సమస్యగా తోస్తుంది. కానీ సమస్య తీవ్రత తెలిసినవారు మాత్రం భయపడుతున్నారు. ఈ చెత్త కుప్పలు మరీ ఎక్కువైపోవడం వల్ల ప్లేగు వంటి వ్యాధులు సోకవచ్చని, చెత్త నుండి వెలువడే విషవాయువులు ప్రజలని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చని కేంద్రం హెచ్చరించడంతోనూ, మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు ఉండడం తోను రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది.
ముఖ్యమంత్రి సంబంధిత అధికారులందరితోను సమావేశం ఏర్పాటు చేసాడు. ‘చెత్త నిర్వహణ’, మురికినీటిని శుద్ధి చేయడం’ కోసం తీసుకోవలసిన చర్యలతో తగిన ప్రణాళికను రూపొందించి, వారం రోజులలో పనులు మొదలు పెట్టాలని ఆదేశించాడు. సమావేశం ముగిసాక, ఉన్నతాధికారులు ఈ ఆదేశాలను తమ క్రింది సిబ్బందికి బదలాయించారు.
ఆఫీసయ్యాక, సుబ్బారావు ఎక్కిన ‘సెక్రటేరియట్ – మల్కాజిగిరి ఆఫీస్ స్పెషల్’ బస్సు టాంకుబండ్ మీదుగా వెడుతోంది. హుస్సేన్ సాగరంతా చెత్తతోను, దుర్గంధంతోను నిండి ఉంది. టాంకుబండ్ మొదలునుంచి చివరివరకు అందరూ ముక్కు మూసుకుని కూర్చున్నారు. ఇదేమీ పట్టని సుబ్బారావు, సెక్షన్ ఆఫీసర్ తనకు అప్పజెప్పిన కొత్త బాధ్యతని గురించి ఆలోచిస్తూ ఇల్లు చేరాడు. తను వ్యక్తిగతంగా చేద్దామనుకున్న పనినే, అధికారికంగా అప్పజెప్పేసరికి సుబ్బారావు ఆనందానికి అంతులేకుండా పోయింది.
విషయమంతా భార్యకి హుషారుగా వివరించాడు.
” ఇప్పుడింతకీ ఏం చేయాలనుకుంటున్నారు?” అడిగింది సరళ.
“రాష్ట్రం మొత్తం మీద మునిసిపాలిటీలలోను, కార్పోరేషన్లలోను మొత్తం ఎంత చెత్త తయారవుతోంది?వాటిని ఎలా నిర్వహిస్తున్నాం? ఏం చేస్తే ప్రజల ఆరోగ్యానికి ముప్పు తప్పుతుంది? వగైరా వివరాలతో రెండు రోజుల్లోగా ఓ రిపోర్టు తయారు చేసి మా ఎస్. ఓ కి అందివ్వాలి”
” ఓహో, అంత తేలికైన విషయం కాదు”
ఇంతలో కాలేజి ఫీజు గురించి తండ్రిని డబ్బులడుగుదామని అక్కడికొచ్చిన వాళ్ళబ్బాయి రాజు ” ఏంటమ్మా, తేలికైన విషయం కాదంటున్నావు? దేని గురించి?” అని అడిగాడు.
ఆంధ్ర ప్రదేశ్ మొత్తంలో ఒక రోజులో ఎంత చెత్త తయారవుతుందో లెక్క కావాలంటూ సరళ వివరించింది.
“అంతేనా గూగుల్ లో సెర్చి చేస్తే సరి” అంటూ వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేసి, ఇంటర్ నెట్‌లో వెదకసాగాడు రాజు. కాసేపయ్యాక తిరిగివచ్చి, ‘నాన్నా, ఏ సైట్ లోను అటువంటి వివరాలేవీ లేవు. పోనీ సమాచార హక్కు చట్టం క్రింద అడగవచ్చేమో కనుక్కో..” అని అన్నాడు.
అసలే కంగారుగా ఉన్న సుబ్బారావుకి ఈ సలహాతో మరింత చిర్రెత్తింది.
“నువ్వు నోరుమూసుకోరా. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నీ ఫీజు సంగతి రేపు చూద్దాం” అంటూ లేచి ఫోను దగ్గరికి వెళ్ళాడు. కాని రాజుఅక్కడినుంచి కదలలేదు.
సుబ్బారావు తనకి తెలిసున్న కాంట్రాక్టర్లందరికి ఫోన్ చేసాడు. ఎలాగైతేనేం, తనకి కావలసిన వివరాలు ఉజ్జాయింపుగానైనా రాబట్టాడు.
“ఇంతకీ ఒక రోజులో మన రాష్ట్రం మొత్తం మీద ఎంత చెత్త వస్తోందండి?” సరళ అడిగింది ఆసక్తిగా.
“రాష్ట్రంలోని మునిసిపాలిటీల నుంచి, కార్పోరేషన్ల నుంచి ఒక రోజులో సుమారుగా 11,24,000 కిలోల చెత్త వస్తోంది”
ఆ సంఖ్య విని కళ్ళు తేలేసింది సరళ.
“అమ్మయ్య. చెత్త ఎంత తయారవుతోందో తెలిసింది. ఈ చెత్తని సరిగా నిర్వహించక పోవడం వల్ల గాలి విషపూరితం అవుతోందట. ఇక గాలి లోని కార్బన్ డై ఆక్సైడ్ తగ్గించే మార్గం ఏదైనా వెదకాలి…” అన్నాడు సుబ్బారావు.
“నాన్నా, ఓ ఐడియా. అమెరికా మావయ్య వాళ్ళ కంపెనీ ఆ మధ్య ఏదో పరికరం కనిపెట్టింది కదా.. అదేమైనా మనకి ఉపయోగపడుతుందేమో మావయ్యని అడుగుదాం… ” అన్నాడు రాజు.
“నిజమేరోయ్. పద. నెట్‌లో చూద్దాం మావయ్య ఆన్ లైన్‌లో ఉన్నాడేమో. ఉంటే వివరాలు కనుక్కుందాం” అంటూ లేచాడు సుబ్బారావు. ముగ్గురు కంప్యూటర్ దగ్గరికి చేరారు. అదృష్టవశాత్తు రాజు వాళ్ళ మావయ్య ఆన్ లైన్‌లో ఉన్నాడు. ఛాటింగ్ చేసి తనకి కావలసిన వివరాలు కనుకున్నాడు సుబ్బారావు.
“రేపొద్దున్న మా ఆఫీసునుంచి మా బాస్ తో మాట్లాడిస్తాను. మీకు రాత్రవుతుందిగా పరవాలేదా” అడిగాడు సుబ్బారావు.
” బిజినెస్‌కి అవకాశం ఉందంటే, అమెరికావాళ్ళకి రాత్రికి పగలుకి పెద్ద తేడా ఉండదు బావా. నో ప్రాబ్లమ్. నువ్వు మా ఆఫీసుకి ఫోన్ చెయ్యి. నేనొక ఈ-మెయిల్ ఐడి ఇస్తాను. దానికి ఇప్పుడే మెయిల్ చెయ్యి….” చెప్పాడు బావమరిది.
అతడికి ధాంక్స్ చెప్పి, అతడిచ్చిన ఐడికి తన సమస్యని వివరిస్తూ మెయిల్ పంపాడు సుబ్బారావు.

* * *

మర్నాడు ఉదయం ఆఫీసుకి వెళ్ళగానే తను సేకరించిన సమాచారాన్ని ఎస్. ఓ కి వివరించాడు సుబ్బారావు. 12 గంటలకి అమెరికా కంపెనీతో వీడియో కాన్ఫరెన్సు పెడితే, ఆ పరికరం ఎలా పనిచేస్తుందో ‘డెమో’ చూపిస్తారని చెప్పాడు. చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. ముఖ్యమైన అధికారులందరూ సమావేశమయ్యారు. అమెరికా కంపెనీ ప్రతినిధులు లైన్లోకి వచ్చారు. తాము కొత్తగా రూపొందించిన పరికరం పనిచేసే విధానాన్ని తెరపై చూపించారు. ఆ పరికరంలో ఓ రసాయనాన్ని పోసి, దాన్ని కార్బన్ డై ఆక్సైడ్‌ ఎక్కువగా ఉన్న ఓ గదిలో ఉంచారు. ఆ పరికరం వాతావరణం లోని కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చేసుకుని, ద్రవీకృతంగా
మార్చుకుని, కార్బన్ డై ఆక్సైడ్ లేని వాయువుని బయటకి వదిలింది.
“అద్భుతం! ప్రస్తుతం మనకి కావలసింది ఇలాంటి పరికరమే” అని అరిచాడు ఎస్. ఓ. ఉన్నతాధికారులు కూడ అంగీకరించినట్లే కనపడ్డారు. ఏ సంగతి త్వరలోనే చెబుతామంటూ కాన్ఫరెన్సు ముగించారు. సుబ్బారావు, ఇతర అధికారులు హాయిగా నిట్టూరుస్తూ, ‘అమ్మయ్య’ అని అనుకున్నారు. ఈ విషయమంతా ఆరోగ్య శాఖా మంత్రికి, ఆర్ధిక శాఖా మంత్రికి నివేదించారు. అయితే సుబ్బారావు ఊహించినట్లుగా ఈ వ్యవహారం ఇక్కడితో ముగియలేదు. చెత్తలో ఎక్కువగా ఉండేది మీథేన్ వాయువని ఆరోగ్య శాఖ, హైదరాబాదు నగరంలోని ప్రతీ ఇంటకి లేదా రాష్ట్రం మొత్తానికి ఆ పరికరం అందించాలంటే తమవల్ల కాదని ఆర్ధిక శాఖ ఈ ప్రతిపాదనకి అడ్డుచెప్పాయి. వేరే మార్గాలు చూడాలంటూ మునిసిపల్ శాఖ ని కోరాయి. సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.
 (సశేషం)