“నాన్నా, రాజా హరిశ్చంద్రుడెవరు?” అంటూ హఠాత్తుగా నన్ను అడిగాడు అమిత్. నేనేమో టీ తాగుతూ, దినపత్రిక చదువుకుంటున్నాను. నిజానికది చాలా చిన్న ప్రశ్న. “అతడు సత్యసంధుడు, నిజాయితీపరుడైన రాజు” అని జవాబు చెప్పబోయి మానుకున్నాను. ఎందుకంటే ఇటువంటి జవాబులు నిజం, నిజాయితీ లాంటి అంశాలపై మరిన్ని ప్రశ్నలకు దారి తీస్తాయి. అప్పుడు నేను – “నువ్వు ఎప్పుడు నిజమే చెప్పాలి, నిజాయితీగా ఉండాలి” లాంటి నిబంధనలు విధించాలి. అమిత్‌కిప్పుడు ఆరేళ్ళు. ఆ వయసు పిల్లలకి విషయాలు బాగా గుర్తుంటాయి. కాబట్టి నాకు ఇబ్బంది కలిగించని జవాబు చెప్పాలని నిశ్చయించుకున్నాను. ఈ
ప్రయత్నంలో నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు.
వాడు భవిష్యత్తులో నా గురించి నిజం తెలుసుకుంటాడు. కాని వాడు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే లోకంలో నాలాంటి వాళ్ళే ఎక్కువ. నన్ను వేలెత్తి చూపించేవారెవరు ఉండరు. అలాంటప్పుడు నేనేందుకు సిగ్గుపడాలి? నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తే పోలా? వాడు పెద్దయ్యాక అర్ధం చేసుకుంటాడు. నేను ప్రయత్నించాననడానికి దేవుడే సాక్షి!

* * *

ఆ సంఘటన జరిగి చాలా కాలమైంది. మొదటిసారి నాకు లంచం ఇవ్వజూపిన వ్యక్తిపై గట్టిగా కేకలు వేసి, తిట్టిపోసాను. అతడిపై మాటల తూటాలు పేల్చాను. కరెన్సీ నోట్ల కట్ట పెట్టి ఉన్న కవరుని అతడి ముఖంపైనే విసిరికొట్టాను. బంట్రోతుని పిలిచి సెక్యూరిటీ గార్డును పిలవమని చెప్పాను. సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రాగానే, “ఈ మనిషిని బయటకి తోసేయ్యండి. మళ్ళీ ఆఫీసులోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తే, కాళ్ళు చేతులు విరగ్గొట్టండి” అంటూ ఆదేశాలు జారీ చేసాను. ఇదంతా నేను చేసిందే. ‘కాశ్యప్’ గారిని బయటకు తరిమేసింది నేనే.
ఓ వారం తర్వాత నా పై అధికారి ‘శర్మ’గారు నన్ను ఆయన ఆఫీసుకు రమ్మని కబురు చేసారు. నేను వెళ్ళేసరికి ఆయన ఎదురుగా కాశ్యప్ గారు కూర్చుని ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న విధానం చూస్తూంటే, వాళ్ళిద్దరికి చాలా రోజులుగా స్నేహం ఉన్నట్లుంది.
“రావోయ్! ఈయన కాశ్యప్ గారు” అంటూ చెప్పుకొచ్చారు శర్మగారు. నేను తలూపాను. నాకు ఆయనను కొత్తగా పరిచయం చేయనక్కరలేదు.
” ఈయన జిల్లా లోని ప్రముఖమైన ప్రభుత్వ కాంట్రాక్టర్లలో ఒకరు. గతంలో ఒకసారి ఎం . ఎల్. ఎ గా కూడా పని చేసారు…” అంటూ చెప్పారు శర్మగారు. కాశ్యప్ గారు నాకేసి చేయి జాచి షేక్‌హ్యండ్ ఇవ్వబోయారు. నేను సందేహించాను. చేయి తగిలించానా లేదా అన్నట్లుగా తగిలించాను.
“గత వారంలో జరిగిన సంఘటన గురించి కాశ్యప్ గారు నాకు చెప్పారు. నువ్వు కొత్తగా వచ్చావని, నీకిక్కడి పద్దతులు తెలియవని నేను సర్ది చెప్పాను. ఆయన టెండరును నేను ఆమోదిస్తున్నాను. ఆయన జరిగినదంతా మరిచిపోతానని చెప్పారు. భవిష్యత్తులో నువ్వు ఆయనకి సహకరిస్తావని ఆశిస్తున్నాను….” అంటూ చెప్పారు శర్మగారు. నేను కాశ్యప్ గారి కేసి చూసాను. ఆయన చిన్నగా నవ్వుతున్నారు. ఆ నవ్వులో నాకు హేళన గోచరించింది. తర్వాత కాశ్యప్ గారు బయల్దేరుతానంటూ లేచారు. శర్మగారు కూడా లేచి ఆయన సాదరంగా సాగనంపడానికి గుమ్మం దాక వెళ్ళారు.
నేను స్థాణువులా నిలుచుండిపోయాను. నా మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు! గుమ్మం దగ్గర నుంచి వచ్చిన శర్మగారు, ” ఏవోయ్, ఇంకా ఏమైనా సందేహాలున్నాయా?” అని అడిగారు. ” లేవుసార్” అంటూ నేను గొణిగాను.
బరువుగా ఉన్న ఓ కవరును నాకేసి తోస్తూ, ” ఇదినీ కోసమే. కాశ్యప్ గారు నీకిమ్మన్నారు” అని చెప్పారు శర్మగారు. మౌనంగా దాన్ని అందుకుని, బయటకు నడిచాను.
ఏదో ఒక రోజు ఈ కధంతా నేను అమిత్‌కి చెప్పాల్సి ఉంటుంది. వాడు అర్ధం చేసుకుంటాడు. పరిస్థితుల ప్రభావం వలనే, నేను రాజీ పడ్డానని గ్రహిస్తాడు. ఈ లోపల వాడికి నేను కల్పించే అదనపు సౌకర్యాలు (బహుశా విలాసాలేమో) – డిజైనర్ దుస్తులు, చేతి గడియారాలు, కంప్యూటర్ గేమ్స్, కార్లు, సెల్ ఫోన్, ప్రముఖ నగరాలలో సెలవలు గడపడం వంటివి వాడికి అలవాటైపోతాయి. ‘రేబాన్’, ‘బెన్నెటన్’, ‘ఫోర్డ్’, ‘రోలెక్స్’ వంటి పేర్లు వాడినోట సులువుగా ఆడతాయి. అవన్నీ తనకి చిరపరిచితాలైనట్లు, పాత స్నేహితులైనట్లు మాట్లాడగలుగుతాడు. ఏనాటికైనా నిజం తెలిస్తే, వాడు తన అవకాశాలను బేరీజు వేసుకోవాల్సివస్తుంది. ఈ సౌకర్యాలను వాడు వదిలిపెట్టలేడు. బహుశా వాడు కూడా దీనికి లొంగక తప్పదు. ఇది మరో తరం పాటు కొనసాగవలసిందే.

* * *

“నాన్నా, రాజా హరిశ్చంద్రుడెవరని అడుగుతుంటే చెప్పవేం?” అంటూ అమిత్ విసుగ్గా ప్రశ్నించాడు. ఇంతలో నా సెల్ ఫోన్ మ్రోగింది.
“హరిశ్చంద్రుడు మన చుట్టం కాదు” అని వాడికి జవాబు చెప్పేసి సెల్‌ఫోన్లో మాట్లాడడానికి పక్కకి వెళ్ళిపోయాను.  అవతల లైన్లో ఉన్నది కాశ్యప్‌గారు మరి.

ఆంగ్ల మూలం: కార్తీక్ వెంకటేష్

(ఈ కథ ది.20 సెప్టెంబర్ 2006 నాటి నవ్య వారపత్రికలో ప్రచురితం)