తిరిగి మేము డ్రాయింగ్ రూంకి వచ్చాం. ఆ గదిలో ఎలాంటి అలంకరణ ఉండాలో ఆమె చెప్పసాగింది. ఇంటీరియర్ డెకరేషన్‌లో ఆమెకి బాగా అవగాహన ఉన్నట్లుంది. ఈ రంగంలో కొత్తగా వచ్చిన మార్పులన్నీ ఆమె కి అవగతమే. ఆమెకి కావలసినవన్నీ ఒకటొకటిగా చెబుతూ, డ్రాయింగ్ రూం, లివింగ్ రూం, డ్రెస్సింగ్ రూం, డైనింగ్ హాల్, కిచెన్, పిల్లల గది….. అన్నీ చూపించింది. బెడ్ రూం లోకి రాగానే ఆమె ముఖంలో మార్పు కనపడింది. క్షణాలలో సర్దుకుని ఆమె మాములు స్థితికి వచ్చేసింది. ఆ గదికి కావల్సిన అలంకరణ గురించి చెప్పసాగింది.
” ఈ గది స్వర్గాన్ని తలపింపజేయాలి. ప్రతీ వస్తువు అత్యంత కళాత్మకంగా ఉండాలి. గదులు వేరైనప్పటికీ, వాటి అలంకరణలో తేడా ఉన్నప్పటికీ, వాటి మధ్య సారూప్యం ఉండి తీరాలి” చెప్పిందామె.
గదిలోంచి బయటకు నడుస్తూ, “గుర్తుంచుకోండి! నాకు అనాకారితనమంటే రోత” అని అందామె యధాలాపంగా.
“మిసెస్ అష్రాఫ్, అవన్నీ నాకొదిలేయండి. మీరు నిశ్చింతగా ఉండండి. అన్నీ మీరనుకున్నట్లుగానే జరుగుతాయి” అని చెప్పాను నేను ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.
ఆమెకి కావలసిన డిజైన్లని, అలంకరణలనీ ఓ కొలిక్కితేవడానికి చాలా కాలం పట్టింది. ఆమెని తృప్తి పరచడం కష్టం. ఆమె తరచూ మనసు మార్చుకుంటుంది. ఆమె ఆలోచనలకి రంగు, రూపు ఇవ్వడానికి చాలా శ్రమించాల్సివచ్చింది. ఎట్టకేలకు పనులు మొదలు పెట్టడానికి ఆమె అనుమతించింది. రెండు మూడు నెలల వరకు పని చురుగ్గానే సాగింది. ఆమె మా పనిలో కలగజేసుకోడం మాకు ఇబ్బందులు కలిగించింది. ఆమె రోజుకో మారు చేసే ఫిర్యాదులు నాకు విసుగనించేవి.
ఆమెకి ఓ అంతులేని సమస్యల చిట్టానే ఉన్నట్టుంది – కిచెన్‌లో టైల్స్ సమతలంగా లేవని, డైనింగ్ టేబుల్ కుర్చీలు ఠీవిగా లేవని, లివింగ్ రూంలో రంగుల కలబోత ఆకర్షణీయంగా లేదని, పిల్లలగదిలో అంటించిన వాల్ పేపర్ వారి మానసిక పరిస్థితికి అద్దం పట్టేలా లేదని, డ్రాయింగ్ రూంలోని ఫాల్స్ సీలింగ్ ఎత్తు ఎక్కువైందని, డ్రెస్సింగ్ రూంలోని అలమారలు, వార్డ్ రోబ్ అంత ఆకట్టుకోడం లేదని, బెడ్ రూంలో అమర్చిన అద్దాలు సరైన కోణంలో లేవని, స్విమ్మింగ్ పూల్ వద్ద దీపాల వరుస సరిగా లేదని….. ఇలా!
నేనామెకి విడమరచి చెప్పాను – పనంతా ఆమె అంగీకరించిన పద్దతిలోనే జరుగుతోందనీ, ఇలా ఆమె తరచూ కలుగజేసుకుంటే మరింత ఆలస్యమవుతుందని! ప్రతీ పనికి ఓ పద్దతి, సూక్ష్మత ఉంటాయంటే వినదాయె. ఆమె ప్రవర్తన అమర్యాదకరంగాను, రాజీ లేకుండాను ఉంటోంది. కొన్ని సార్లు మా సిబ్బంది పై కూడా అరవసాగింది.
ఆమె ప్రవర్తన పట్ల విసుగేసి, ఆమె భర్త అష్రాఫ్ షేక్ గారిని సంప్రదించదలచాను. ఆయనని ముందెన్నడు కలవలేదు. కాని ఆయన పేరు విని ఉన్నాను. నగరంలోని గొప్ప వ్యాపారవేత్తలలో ఆయన ఒకరు. నిస్సందేహంగా ఆయనకి తీరిక ఉండదు. మాకు అడ్వాన్సుగా ఇచ్చిన చెక్కు మీద ఆయన సంతకం చూసాను. చాలా హడావుడిగా చేసినట్లుంది.
ఎన్నో సార్లు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. నాకు మిసెస్ అష్రాఫ్ అడిగిందల్లా చేయక తప్పలేదు. ఆమె విభిన్నమైన అభిరుచి, అహగాహన మనస్తత్వం నిస్సందేహంగా గొప్పవే. కాని చీటికి మాటికి మా పనిలో కలగజేసుకోడం నాకు చికాకు తెప్పించేది. మా సిబ్బంది కూడా ఆమె పట్ల విసిగిపోయారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏడాది పట్టింది.
ఆ ఇంటి గృహప్రవేశం అట్టహాసంగా జరిగింది. నన్ను కూడా పిలిచారు. ఓ ఖరీదైన బహుమతి పట్టుకుని నేనా ఫంక్షన్ కి హాజరయ్యాను. ఎంతో మంది లబ్దప్రతిష్టులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక రాజకీయవేత్తలు, ….. ఇంకా గొప్పగొప్పవాళ్ళెందరో హాజరయ్యారు. మిసెస్ అష్రాఫ్ నన్ను సాదరంగా ఆహ్వానించింది. ఆమె చాలా సంతోషంగాను, ప్రశాంతంగాను కనిపించింది. చిరునవ్వుతో బహుమతినందించాను. ఆమె ధన్యవాదాలు తెలిపి, తన భర్తని చూపిస్తూ ” మా వారు అష్రాఫ్ షేక్” ఆని నాకు చెప్పి, “వీరు షాజాద్ డెకరేషన్ కంపెనీ యజమాని, ఇంటీరియర్ డిజైనర్ షాజాద్ గారు” అంటూ నన్ను ఆయనకు పరచయం చేసింది. నేనిదే మొదటి సారి ఆయనను చూడడం.
ఆయన స్నేహ పూర్వకంగా నవ్వారు. నాకు షేక్ హాండిస్తూ, ” మీ పనితీరు అద్భుతంగా ఉంది” అని చెప్పారు.
“అంతా మీ అభిమానం” అన్నాను నేను. మా మధ్య సంభాషణ జరుగుతున్నంత సేపు నేను ఆయనకేసి ఆశ్చర్యంగా చూస్తునే ఉన్నాను. ఇంత అనాకారి మనిషి మిసెస్ అష్రాఫ్‌కి భర్తంటే నమ్మలేకుండా ఉన్నాను.
చిక్కటి నలుపు, బట్టతల, జీవం లేని పెద్ద కళ్ళు, దట్టమైన పొడుగాటి ముక్కు, ఎత్తు పళ్ళు…. ఆయన స్థూలకాయం పై ఖరీదైన సూటు చూడడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంది. నేను మిసెస్ అష్రాఫ్‌కేసి నా చూపులను సారించాను. ఆమె ముఖం మాడిపోయింది. ఒక్కసారిగా తల తిప్పేసుకుంది. వెంటనే ఓ అతిధితో మాటలు కలిపి హఠాత్తుగా బిజీ అయిపోయింది. ఆమె నన్ను తప్పించుకోవాలని చూస్తోందని నాకు తెలుసు. శిధిలమైన అంతరంగాన్ని అందంగా అలంకరించి, ముస్తాబు చేయాలనే నిరంతర తపన ఆమెది. కాని ఆ ప్రయత్నంలో ఆమె ఓడిపోయి, విరిగిన గుమ్మటంలా డొల్లగా కనిపిస్తోంది.
ఉర్దూ మూలం: మహమూద్ షాహిద్
(ఈ కథ ది 28 అక్టోబర్ 2007 నాటి వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం)
నవంబరు 7, 2007 at 8:08 పూర్వాహ్నం
బాగుంది కథ, దానితో పాటు మీ శైలి.