“సార్, మిమ్మల్ని కలవాలని ఓ స్త్రీ వచ్చారు. పేరు మిసెస్ అష్రాఫ్” ఇంటర్ కమ్ లో చెప్పింది నా సెక్రటరీ లిల్లీ.
‘మిసెస్ అష్రాఫ్?’ ఈ పేరే కొత్తగా ఉంది నాకు. ‘బహుశా కొత్త క్లయింట్ కావచ్చు’ అని అనుకున్నాను. “సరే, ఆవిడని కూర్చోమను” అని లిల్లీ కి చెప్పి నా ఎదురుగా ఉన్న వ్యక్తి తో మాట్లాడడం కొనసాగించాను. ఆయన ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి అధిపతి. ఆయన హోటల్ ఇంటీరియర్ డెకరేషన్‌కి తుది రూపు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము.
నేను వృత్తి రీత్యా ఇంటీరియర్ డిజైనర్‌ని. నాకో డెకరేషన్ కంపెనీ ఉంది. పనితీరుని బట్టి చూస్తే మాది ఓ ప్రముఖమైన కంపెనీ గానే చెప్పుకోవచ్చు. ఫైవ్ స్టార్ హోటళ్ళు, అద్భుతమైన బహుళ అంతస్తుల వ్యాపార భవనాలు, అందమైన ఇళ్ళు, నగరంలోని అపార్టుమెంట్లు మా ప్రతిభకి సాక్ష్యాలు. నా వృత్తి మరీ సున్నితమైనది. లౌక్యం చాలా అవసరం. మా ఖాతాదార్ల హోదా, అభిరుచులు, ఇష్టాయిష్టాలు వంటి వాటిని సామాజిక కోణంలోను, మానసిక కోణంలోను చూడగలగాలి. ఏదైనా ప్రాజెక్టులో ఒక తప్పు లేదా ఓ చిన్న పొరపాటు మా సంస్థకు చెడ్డపేరు తెస్తుంది. ఆర్దికంగా ఎలాగు నష్టపోతాం!
ఫైవ్ స్టార్ హోటల్ అధిపతితో సమావేశం ముగిసాక, మిసెస్ అష్రాఫ్ ని లోపలికి పంపమని ఇంటర్‌కమ్‌లో లిల్లీకి చెప్పాను.
హఠాత్తుగా ఓ అద్భుతమైన పరిమళం నా కాబిన్లోకి ప్రవేశించింది. ఓ అందమైన పూదోటలోని నేను అడుగుపెట్టిన అనుభూతి కలిగింది. తలుపువైపు ఆశ్చర్యంగా చూసాను. మిసెస్ అష్రాఫ్ లోపలికి వస్తోంది. అందమైన, ఆకర్షణీయమైన మనోహరమైన ‘స్త్రీ’ ఆమె. నా చూపులామె ముఖారవిందంపైనే నిలిచిపోయాయి. మహిళా ఖాతాదార్లను అలా చూడడం తప్పని నాకు తెలుసు. వెంటనే కళ్ళను కిందకి దించి, నా సీట్లోంచి కొద్దిగా పైకి లేచి, ‘కూర్చోండి’ అంటూ ఆమెకి కుర్చీ చూపించాను.
“థాంక్స్” అంటూ మర్యాదగా పలికిందామె. ఎవరో సంగీత వాయిద్యాన్ని మంద్రంగా మీటినట్టు, నా చుట్టుపక్కల వాతావరణం సంగీతభరితమైనట్లు నాకనిపించింది.
“చెప్పండి మేడం” అన్నాను గంభీరంగా.
” మా బంగళాని అలంకరించడానికి మీ కంపెనీ సేవలు కావాలి” చెప్పిందామె ఎంతో ఆత్మవిశ్వాసంతో.
ప్లాను కాగితాన్నందిస్తూ ” ఇదిగో మా బంగళా ప్లాను” అని అందావిడ ఠీవిగా. దాన్ని నా టేబుల్ మీది గాజు పలకపై పరచి పరిశీలించసాగాను. ప్లింత్ ఏరియా చాలా ఎక్కువగా ఉన్న నిర్మాణమది. గదులు, హాలు ఏర్పాటు, వాటి స్థానాలు చక్కగా కుదిరాయి. ప్లానుని పరిశీలిస్తూ, నేను ఆమెని గమనిస్తున్నాను. ఆమె అందమైన మెడలో తళతళలాడుతున్న నెక్లెస్ ఉంది. ఖచ్చితంగా ఆది నిజమైన వజ్రాలతో చేసినదే. నిజమైన దానికి, నకిలీకి ఉండే తేడాని సులువుగా గ్రహించే నైపుణ్యం మా వృత్తి నాకు నేర్పింది. సాదా మేకప్, భుజాలదాక వచ్చిన జుట్టు, వంపుసొంపుల మేనిపై ఖరీదైన, ఆకట్టుకునే దుస్తులు, కుడి మణికట్టుకున్న బంగారపు కడియం – ఇవన్నీ అసలే అందమైన నా కాబిన్ ని మరింత అందంగా మార్చేసాయి.
“మీ బంగళా అద్బుతంగా ఉంది”
ఆమె పెదాలపై చిరునవ్వు మిలమిలలాడింది. కనురెప్పల చివర మెరపులు మెరిసాయి. వాళ్ళ భవంతిని కాక, ఆమెనే పొగిడాననుకుందో ఏమో. వృత్తి రీత్యా చెప్పిన మాటల్లా కాకుండా, నిజంగానే ఆ భవనం నమ్మశక్యంకాని విధంగా అందంగా ఉంది.
“మీ బంగళాని చూడాలనుకుంటున్నాను” చెప్పానామెతో.
“తప్పకుండా”
ఈ చిన్న సమాధానంతోనే వాళ్ళ భవంతిని నేను చూడాలని, వాళ్ళ అవసరాలేవో స్వయంగా అర్ధం చేసుకోవాలని ఆమె కోరుకుంటోందని నేను గ్రహించాను. వెళ్ళే ముందు, వాళ్ళ బంగళాకి ఎలా రావాలో గుర్తులు చెప్పిందామె. తప్పకుండా వస్తానని నేను మాటిచ్చాను. ఇంత అందమైన, తెలివైన, ఆత్మవిశ్వాసం కల మహిళను నేను మునుపెన్నడు చూడలేదు. ఆమె లావణ్యం, ప్రవర్తన, నన్నెంతగా ఆకట్టుకున్నాయంటే – ఎట్టి పరిస్థితులలోను నేనీ ప్రాజెక్టుని వదులుకోదలచుకోలేదు. పైగా ఇటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టడం మా కంపెనీ స్థాయిని పెంచుతుంది.
* * *
మర్నాడు నేను మాములుగానే ఆఫీసుకు వెళ్ళాను. సిబ్భందికి పనులు అప్పజెప్పి, మిసెస్ అష్రాఫ్ ఇంటికి బయల్దేరాను. నిన్నటిదాక నా కారు మీద అంగుళం మేర దుమ్ముండేది. మరి ఈ రోజో, శుభ్రంగా కడిగి ఉంది. నాకిష్టమైన సూటు వేసుకున్నాను. నన్ను చూడగానే లిల్లీ చిన్నగా నవ్వింది. ఎలాగైనా మిసెస్ అష్రాఫ్‌కి నా పై మంచి అభిప్రాయం కలిగించాలి. మిసెస్ అష్రాఫ్ వాళ్ళుండేది ధనవంతులుండే ఖరీదైన ప్రాంతం. అక్కడ భూమి విలువ బంగారం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ ప్రాంతంలో ఎందరో ప్రముఖులు, పేరుమోసిన కులీనులు, సుప్రసిద్ధ పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు నివాసముంటారు.
ఆ అద్భుతమైన భవంతి ముందాగాను. భవనానికి ఇంకా రంగులు వేయనప్పటికీ, చుట్టుపక్కల ఇళ్ళ కంటే ఎంతో ఉన్నతంగా కనిపిస్తోంది. ఆ భవంతి ఇనుపగేటు పక్కగా కారాపి దిగాను. గేటు దగ్గర ఉన్న కాపాలా కుర్రాడు వచ్చి అభివాదం చేసాడు. నేను తలాడించి లోపలికి ప్రవేశించాను. వసారాలో, ఇల్లు శుభ్రం చేస్తున్న పనివాళ్ళకి ఆదేశాలిస్తూ కనపడింది మిసెస్ అష్రాఫ్. నన్ను చూడగానే, “రండి. మీ కోసమే ఎదురుచూస్తున్నాను” అని అంది చిరునవ్వుతో.
ఆమెతో పాటు బంగళాలోకి నడిచాను. మాతో పాటు ఆమె మేనిపైనుంచి ఓ గమ్మత్తైన సువాసన బంగళాలోకి ప్రవేశించింది.
” ఇది మా డ్రాయింగ్ రూం” అందామె. జేబు లోంచి ఓ చిన్న పుస్తకం, పెన్ను తీసి ఆమె చెబుతున్న వివరాలను శ్రద్ధగా రాసుకోసాగాను. క్లయింట్ అవసరాలను గ్రహించడంలో ఓ చిన్న పొరపాటు చాలు, మా వృత్తిలో కష్టాలను కల్పించడంకోసం!
” ఈ గది అలంకరణ అత్యుత్తమంగా ఉండాలి……” ఆమె చెబుతునే ఉంది. ప్రక్కనుంచి ‘ధబ్’మన్న చప్పుడు వినిపించింది. ఆమె అక్కడికి గబగబా పరిగెత్తింది. నేను కూడా ఆమెని అనుసరించాను. శుభ్రం చేస్తునప్పుడు ఓ పనివాడి చేతిలోంచి బరువైన వస్తువేదో జారిపడింది. అర్ధచంద్రాకారంలో ఉన్న క్రింది మెట్టు ఓ మూల విరిగింది. అంతే! ఆమె కోపం పట్టలేకపోయింది. ఆమె కళ్ళల్లో నిప్పులు కురిసాయి. ముఖంలోను, మెడపైనా రక్తనాళాలు ఉబికాయి. రక్తం కురుస్తుందేమోననిపించింది. చాలా సేపటి వరకు ఆమె మాములు మనిషి కాలేకపోయింది. అంత అందమైన, సున్నితమైన మాటకారి, దయగల మహిళ – ఇంతగా ఆగ్రహానికి లోనవుతుందని నాకు తెలియదు. ఆమె మనస్తత్వం, అస్పష్ట వైఖరులు మెల్లిమెల్లిగా బహిర్గతం కాసాగాయి.
(రెండో భాగం రేపు)