చోటు-2
“మొత్తానికి అంగారకుడిపై ప్లాటు సంపాదించాను. ఇకపై మనకి ఇక్కడ కూరగాయలకి మంచి డిమాండ్ వస్తుందని పేపర్లో వేసారు. నేనక్కడ ‘ఫాం హౌస్ ‘ ఏర్పాటు చేసి, కూరగాయలు పండిస్తాను.’ఎక్స్ ప్రెస్ పార్శిల్ ‘ ద్వారా పండిన పంటను ఇక్కడికే పంపిస్తాను. నువ్విక్కడ వ్యాపారం చెయ్యి” అంటూ తన ప్రణాళికని వివరించాడు విహారి.
“ఎప్పుడు బయల్దేరాలి?” అని అడిగిందామె.
“ఇంకా మూడు నెలల టైం ఉందిలే” చెప్పడు విహారి.
ఇదే సమయంలో అంగారకుడిపై గ్రహాంతరజీవుల జాడ కనిపెట్టినట్లు అగ్ర రాజ్యం ప్రకటించింది. వారి భాషని డీకోడ్ చేసామని, దాన్ని రెండు నెలల్లో నేర్చుకోవచ్చని తెలిపింది. ఎందుకైన మంచిదని విహారి కూడా ఆ భాష నేర్చుకున్నాడు. విహారి అంగారకుడిపైకి వెళ్ళే రోజు రానే వచ్చింది.
అందరితో పాటు విహారి కూడా స్పేస్ షటిల్ ఎక్కాడు. ఒకటిన్నర రోజు తర్వాత అది అంగారకుడిపై దిగింది. కస్టమ్,ఇమ్మిగ్రషన్ వ్యవహారాలు ముగించుకుని తన స్థలం వైపు వెళ్ళాడు విహారి. తీరా వెళ్ళి చూసే సరికి అక్కడ అప్పటికే ఎవరిదో ఇల్లు ఉంది. చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంది. కాలింగ్ బెల్ కొట్టి ఇంటి యజమానిని పిలిచాడు విహారి.
“ఈ స్థలం నాది. మీరిక్కడ ఇల్లెలా కట్టారు?” అని అడిగాడు.
“ఎవడ్రా నువూ? నా స్థలాన్ని నీదంటున్నావు? ఒళ్ళెలా ఉంది?” అంటూ అరిచాడు ఇంటి యజమాని.
“మర్యాదాగా మాట్లాడండి. నేనీ స్థలాన్ని, అగ్ర రాజ్యం ఏజంటు ‘డుష్ బిల్డర్ ‘ దగ్గర కొన్నాను. ఇదిగో డాక్యుమెంట్లు” అంటూ కాగితాలు చూపాడు విహారి.
“అమ్మడానికి వాడెవడు, కొనడానికి నువ్వెవరు? ఎక్కువగా మాట్లాడితే మక్కెలిరగ దంతాను! నోర్మూసుకుని ఇక్కడినుంచి పో” అని అరిచాడు ఇంటి యజమాని.
“మీ మీద పోలీసులకి ఫిర్యాదు చేస్తాను” అంటు అక్కడినుంచి కదిలాడు విహారి. కాని అక్కడ తనలాంటి వాళ్ళే మరి కొందరు కనపడ్డారు. ఒకే స్థలాన్ని, ఒకరికి తెలియకుండా మరొకరికి, పది మంది దాక అమ్మినట్లు తేలింది. విహారి భోరుమన్నాడు. అయితే అతడి ఏడుపుని ఎవరూ పట్టించుకోలేదు.ఇంతలో దూరం నుంచి ఎవరో తనను పిలుస్తున్నట్లనిపించి, అటు ఇటు చూసాడు విహారి. దగ్గరలోని ఒక తోటలోంచి ఒక గ్రహాంతర వాసి తనని పిలుస్తున్నాడు. అటు వైపు నడిచాడు విహారి.
“రండి, ఇక్కడ కాసేపు చల్ల గాలి పీల్చుకోండి. ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం” అన్నడు గ్రహాంతర వాసి. కాసేపు సేద దీరిన తర్వాత, జరిగిన సంగతంతా వివరించాడు విహారి.
“అసలు మీరంతా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు?” అడిగాడు గ్రహాంతర వాసి.
“మా దేశంలో మాకు చోటు తగ్గిపోతోంది. అందుకే దూరమైనా, ఇక్కడి దాక రావల్సి వచ్చింది” చెప్పడు విహారి.
“మా నాన్న చెబుతుండేవారు. వందేళ్ళ క్రితం భారతదేశంలో గ్రామాలు ఉండేవట. చెట్లు, చేమలు, వాగులు, వంకలు, చెరువులు, నదులతో దేశం కళకళ లాడేదట. బోలెడు ఖాళీ స్థలాలు ఉండేవట. మరిప్పుడో, గజం ఖాళీ స్థలం కనపడితే అక్కడో అపార్ట్ మెంట్ కట్టేస్తున్నారు. అడవులు హరించుకుపోయాయి. జీవనదులు ఎండిపోయాయి. ఇదంతా మీ స్వయంకృతం” అన్నాడు గ్రహాంతర వాసి.
“కానీ అభివృద్ధిలో అవన్నీ భాగం” చెప్పాడు విహారి.
”అభివృద్ధి పేరుతో మీరు ప్రకృతిని నాశనం చేసారు. ప్రకృతి ఎప్పుడైనా ఎవరికి ఎంత కావాలో అంతే ఇస్తుంది. బంగారు గుడ్లన్నీ ఒకేసారి పొందాలనే దురాశతో బాతుని కోసేసిన కథ నీ చిన్నప్పుడు వినేవుంటావు. అలగే ఉంది మీ పరిస్థితి ఇప్పుడు” అన్నాడు గ్రహాంతర వాసి.
“నేనిప్పుడు ఏం చేయాలి?” అడిగాడు విహారి విసుగ్గా.
“మీ దేశానికి తిరిగి వెళ్ళు. వెంటనే మొక్కలు నాటడం ప్రారంభించు. నీ తరానికి కాకపోయినా, నీ మనవడి తరానికో అడవి తయారవుతుంది.అందరూ చెట్లని కాపాడండి. భూమి మీద కాలుష్యం తగ్గించే ప్రయత్నం చెయ్యండి.మీ మనసులలో సాటివారికి కాస్త చోటివ్వండి……” చెప్పాడు గ్రహాంతర వాసి.
“ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి. అయినా నా ఒక్కడివల్ల ఏమౌతుంది? ఇదంతా నాకెందుకు గానీ, నా స్థలం సంగతి చూడాలి” అంటూ అక్కడి నుంచి లేచి, తన స్థలం వద్దకి చేరాడు విహారి.
తనలాగే మోసపోయినవళ్ళంతా అక్కడ చేరి గొడవ చేస్తున్నారు. విహారి కూడా వాళ్ళతో చేరి నినాదాలు చేయసాగాడు. ఆ స్థలం యజమానినని చెప్పుకుంటున్న వ్యక్తి, రౌడీలని పిలిపించి వీరందరిని బలవంతంగా తీసుకెళ్ళి భూమికి వెళ్ళే షటిల్ లో కూర్చోబెట్టాడు. అందరూ ఏడుస్తూ కూర్చున్నారు. షటిల్ బయల్దేరింది. వేగం పుంజుకుంటున్న సమయంలో, తలుపు తీసుకుని బయటకి దూకేసాడు విహారి. కాని అంచనా తప్పి సమతల ప్రదేశంలోకి కాకుండా లోయలోకి జారిపోసాగాడు…
***
మంచం మీదినుంచి జారిపడ్డాడు విహారి. తనెక్కడ ఉన్నానా అని చూసుకున్నాడు. భూమి మీదే, భారతదేశంలోనే, హైదరాబాదులో, తన ఇంట్లోనే ఉన్నట్లు గ్రహించాడు. కాలెండర్ కేసి చూసాడు. తేది 10, అక్టోబర్ 2005 అని చూపిస్తోంది. గడియారం కేసి చూసాడు. తెల్లవారు ఝామున మూడు గంటలవుతోంది.
“ఇదంతా కలన్న మాట. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈ కల నిజం కావచ్చు. అందుకని భూమిని కాపాడాలంటే నా వంతు ప్రయత్నం నేను చేయాలి. గ్రహాంతర వాసి చెప్పినట్లు పర్యావరణ పరిరక్షణకై పాటు పడాలి” అనుకున్నడు విహారి.
మంచి నీళ్ళు తాగి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు.
(ఈ కథ ది. 16 నవంబర్ 2005 నాటి నవ్య వారపత్రికలో ప్రచురితం)
Add comment నవంబరు 30, 2007