సహృదయ్‌కుమార్ ఆలోచనలు గుర్రాల్లా పరిగెడుతున్నాయి. అతడి కెదురుగా ప్లాస్టిక్ గుండెలను తయారుచేయడంలో పేటెంట్ పొందిన ఓ బహుళజాతి సంస్థ ప్రతినిధి కూర్చుని ఉన్నాడు.
“చూడండి సహృదయ్‌కుమార్, మీ ఆఫీసులో రకరకాల గుండె జబ్బులతో బాధపడుతున్నవారు ఉన్నారు. అంతెందుకు మీకు కూడా రేపు గుండె జబ్బు రావచ్చు. అందుకని నేను చెప్పేదేంటంటే…”
ఎంత మెత్తగా మాట్లాడుతున్నాడు? శరీరంలో కొన్ని వేల జీవకణాలతో తయారైన ఓ సజీవ అవయవాన్ని ప్లాస్టిక్‌తో మార్పిడి చేయడం ఎంత సులభమై పోయింది? ఈ ప్లాస్టిక్ గుండెలు డా. క్రిస్టియన్ బెర్నాడ్ కాలంలోనే ఉంటే, ఎంతమంది గుండెలు బాగుపడి ఉండేవో కదా?
“మామూలు గుండె వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. గుండె ఒత్తిడికి గురై నప్పుడు హైబిపినో లోబిపినో వస్తుంది. కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోయి ప్రాణాలకే ముప్పు రావచ్చు. కవాటంలో లోపాలు, ధమనుల్లో అడ్డంకులు, ఛాతి నొప్పి లేదా గుండెపోటు … ఇన్ని ప్రమాదాలున్నాయి. మరి మీలాంటి సామాన్యులు వీటికయ్యే ఖర్చులను భరించగలరా?” అడిగాడు ఆ ప్రతినిధి.
అతను పలికే ప్రతిమాటా సహృదయ్‌కుమార్ గుండెలోకి సూటిగా దూసుకుపోతోంది.
అతడికి తన కౌమారం గుర్తొచ్చింది. తను రాసిన ప్రేమలేఖలు, చిత్రించిన హృదయపు బొమ్మలు గుర్తొచ్చాయి. అప్పటి గుండెనే కదా ఇప్పటికీ అతని శరీరంలో ఉన్నది!
(అవును. నేను అప్పటి గుండెనే. నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. నీ కోసం ఎంతో చేశాను. ఆ నాటి ఆ సాయంత్రాన్ని జ్ఞాపకం చేసుకో. చెట్టుకింద నువ్వు, నీ ప్రేయసి మాట్లాడుకున్న రోజు. ‘నన్ను విడిచి వెళ్లిపోతే గుండె పగిలి చస్తానని’ నువ్వు ఆ రోజు అన్న మాటలు గుర్తుతెచ్చుకో, నేను అప్పటి గుండెనే – అంది అతడి గుండె. కాని సహృదయ్‌కుమార్ దాన్ని పట్టించుకోలేదు.)
గొల్‌గొతా పర్వతంపైన ఉండే శిలువ తన ముందే ఉన్నట్లు, క్రీస్తు గుండెలో గుచ్చిన మేకు నుంచి రక్తం ఓడుతున్నట్లు అనిపించింది సహృదయ్‌కుమార్‌కి.
అయినా తన సందేహాలు తీర్చుకోవాలనుకున్నాడు.
“అంటే గుండెకి సంబంధించిన ప్రతి సమస్యా దూరమై పోతుందంటారా?”
“ఖచ్చితంగా! మీరు టివీలో మేము చూపించే ‘టెన్షన్ లేని హృదయం’ అనే ప్రకటన చూడలేదా? ఆ ప్రకటనలో మిస్‌వరల్డ్ అయిన బాలీవుడ్ స్టార్ మరీ సెక్సీగా నటిం చిందని కొందరు విమర్శిస్తారు. అదేం పట్టించుకోవద్దు. అసలు విషయమేమిటంటే గుండె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే మనుషులు వంద శాతం సెక్సీగా ఉంటారు …” అని వస్తుంది.
సహృదయ్‌కుమార్ ఆ ప్రకటనని మునుపు చాలా సార్లే చూశాడు. కానీ దానికి సరైన అర్థం ఇప్పుడే తెలిసింది. అతడి మనసులో గజిబిజి తొలగి, స్పష్టత వస్తోంది.
“కాని నేనిప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను …”
“అదే పొరపాటు! పైగా అలా అనుకోడం చాలా అశాస్త్రీయం! మీకు తెలుసు కదా – చికిత్సకన్నా నివారణ నయమని, ఒక వేళ మీకు గుండె జబ్బు వస్తే ఏంజియోగ్రాం, పేస్ మేకర్, బైపాస్ సర్జరీ … ఇవన్నీ తలనెప్పి కదూ! పైగా మీ మీదే ఆధారపడ్డ మీ వాళ్లేమైపోతారు?” అంటూ సహృదయ్‌కుమార్ ముఖంలోని భావాలని గమనిస్తూ తిరిగి మాట్లాడసాగాడు.
“ఒక్కోసారి అది ప్రాణాంతకం కావచ్చు. అప్పుడు ఎవరం ఏమీ చేయలేం. పైగా మాకు ఎదురయ్యే వ్యక్తులలో 90 శాతం మంది మీలాంటి వాళ్లే. ఆలోచించండి …” అంటూ ఆపాడు.
కొద్ది క్షణాల తర్వాత మళ్లీ మాట్లాడుతూ “ఇప్పుడు కాస్త మా కంపెనీ గురించి చెబుతాను. మేము ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలపైన దృష్టి సారించాం. ఈ దేశాలలో రకరకాల గుండె జబ్బులు ఉంటున్నాయి. అందుకే అక్కడ క్లినికల్ ట్రయిల్స్ నిర్వహిస్తున్నాం. మేము అమాయక ప్రజలను ప్రయోగాల కోసం ‘గినీ పిగ్స్’లా వాడుకుంటున్నామని కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం” అని చెప్పాడు.
(అబద్ధం! న్యూయార్క్‌లో ఓ ఎయిడ్స్ మందును అనాథ శరణాలయంలోని శిశువులపైన, చిన్నారులపైన ప్రయోగించారు. అమెరికాలోనే అలా జరిగితే మరి వర్థమాన దేశాల గతేంటి?” అంటూ అతడి గుండె హెచ్చరించింది. కాని సహృదయ్ కుమార్ పట్టించుకోలేదు.)
తనకి కావల్సిన డబ్బుని ఎలా సమకూర్చుకోవాలని సహృదయ్‌కుమార్ ఆలోచించసాగాడు.
ప్రావిడెంట్ ఫండ్ నుంచి అడ్వాన్స్ తీసుకోవచ్చేమో! విదేశీ రుణం పొందడానికి ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య తగ్గించి, జీత భత్యాలలో కోత విధించాలని నిర్ణయిం చింది. దానికి నిరసనగా ఉద్యోగులు నిరవధిక సమ్మెకి దిగారు. సహృదయ కుమార్ కూడా సమ్మెలో పాల్గొన్నాడు. అందుకని అతడికి జీతమింకా రాలేదు. అతడి భార్య మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టుకున్న కంపెనీ ఇప్పుడు దాన్ని వేలం వేస్తానంటోంది. ఆ మేరకు వాళ్లు రాసిన ఉత్తరం సహృదయ్‌కుమార్ జేబులోనే ఉంది. తను నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నీ గుర్తొచ్చాయి అతడికి. చిన్నగా నిట్టూర్చాడు.
‘ఈ మల్టీ నేషనల్ కంపెనీ ప్రతిపాదన ఏదో బాగానే ఉన్నట్లుంది …’ అనుకున్నాడు. ఆ ప్రతినిధి గొంతు సవరించుకుని మళ్లీ చెప్పసాగాడు.
“మీరు ఆర్డర్ ఇస్తే, పనులు వేగం పుంజుకుంటాయి. మీకు గుండె మార్పిడి ఆపరేషన్ మా పానెల్ లోని ఆసుపత్రిలో జరుపుతాం. మామూలుగా అయితే చాలా ఖర్చవుతుంది. ధనిక దేశాలలో అయితే కనీసం వెయ్యి డాలర్లు! వర్థమాన దేశాలలో కాస్త చవకే. మేము తక్కువ ధరకి అంటే సుమారు ఇరవై ఐదు వేల రూపాయలతోనే సర్జరీ చేయిస్తాం. మరో ఐదువేలు ఆసుపత్రి ఫీజు…! ఇంకేం కట్టనక్కరలేదు. అన్నీ సర్దుకుంటాయి…” అంటూ ఒక క్షణం ఆగాడు.
సహృదయ్‌కుమార్‌కు మరింత నమ్మకం కలిగించేందుకు మళ్లీ ఇలా చెప్పాడు.
“ఆపరేషన్ రెండుగంటలలో పూర్తవుతుంది. ఓ వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఎంతో తేలికగా ఉంటుంది. అటు తర్వాత మీరు గుండెని పూర్తిగా మరిచిపోవచ్చు. జీవితాంతం అది హాయిగా ఒకే తీరుగా కొట్టుకుంటుంది…”
(’వద్దు. ఒప్పుకోవద్దు. నీ డబ్బుని దోచుకునే ప్రయత్నమిది. వాడో హృదయం లేని వెధవ. వాడి మాయలో పడొద్దు…’ అంటూ సహృదయ్‌కుమార్ గుండె రోదించసాగింది)
“అంటే ఆ పైన నాకెటువంటి గుండె జబ్బులు రావా?”కించిత్ ఆశ్చర్యంగా అడిగాడు సహృదయ్‌కుమార్. అతను అడిగిన తీరు చూస్తే దాదాపుగా లొంగిపోయినట్లే అనిపిస్తోంది.
“ఊహు … రాదు! ఒకసారి గుండె మార్పిడి చేయించుకుంటే ఇక దాని గురించి మర్చిపోవచ్చు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు – హృదయ దౌర్బల్యాన్ని వదులుకోమనే కదా! ప్లాస్టిక్ హృదయాన్ని సానుభూతి, దయ, ఔదార్యం వంటి పిచ్చి భావనలు కదిలించలేవు. ప్రస్తుతం సమాజంలో మనకు కావల్సింది అదే కదా! అంతేకాదు మీ జీవితంలో ఇక గుండెపోటు వల్ల చనిపోయే అవకాశమే ఉండదు. మిగతా అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తే, మీ ఆయుష్షు మరింత పెరుగుతుంది కూడా …” చెప్పాడు ప్రతినిధి.
మిగతా అవయవాలు కూడా ప్లాస్టిక్‌లో లభిస్తే ఇంకెంత బాగుండు? ఎంత అద్భుతంగా ఉంటుందో! ఇప్పుడైతే గుండె దొరుకుతోంది. తర్వాత తర్వాత ప్లాస్టిక్ లివర్, ప్లాస్టిక్ కిడ్నీ, ప్లాస్టిక్ బ్రెయిన్ … ఇలా ఎన్నెన్నో. సహృదయ్‌కుమార్ ఆనంద సాగరంలో తేలియాడసాగాడు.
(నీ శైశవం నుంచి బాల్యం వరకు, బాల్యం నుంచి యవ్వనం వరకు, నీ వృద్ధిలోనూ, నీ పతనంలోనూ, నీ అనుభవాలన్నీ నాతో పంచుకున్నావే … నీ రహస్యాలు నాకు తప్ప ఇంకెవరికీ తెలియవే – అటువంటి నా మాటే వినవా? ఆక్రోశించింది అతడి హృదయం. సహృదయ్‌కుమార్ హృదయ స్పందన ఎక్కువైంది. అదిప్పుడు విఫల ప్రేమికుడిలా ఏడుస్తోంది.)
ఒకప్పుడు అమరత్వం పొందాలంటే క్షీరసాగర మధనం చేసి అమృతం తాగాల్సొచ్చేది. అందులోనూ అమృతం తాగే హక్కు దేవతలకి మాత్రమే ఉండేది. కాని ఇప్పుడు అమరత్వం పొందడం సులువైపోయింది. తనకి ఎదురుగా కూర్చున్న ఆ ప్రతినిధి ఓ దేవదూతలా కనిపించాడు సహృదయ్‌కుమార్‌కి. అతడి శరీరమంతా ఓ కాంతి వలయంలా కనబడింది. ఆ కాంతి వలయం క్రమేణా తన శరీరాన్ని చుట్టుకుంటున్న భావన కలిగింది సహృదయ్‌కుమార్‌కి.
ఆ కంపెనీవారి అంగీకార పత్రం మీద చేతిలోకి తీసుకుని సంతకం చేశాడు.
(’అయ్యో … మానవుడా! ఎంతపని చేశావు’ అంటూ గుండె, గుండెలు బాదుకుంది. ఆ తర్వాత లబ్‌డబ్ వినిపించలేదు.)
***
ఓ చక్కటి వ్యాపార అవకాశాన్ని పొందిన ఆనందాన్ని దాచుకోలేక ఆ బహుళజాతి సంస్థ ప్రతినిధి మరో శలభాన్ని వెదుక్కుంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు.
-మళయాళం: ఎం.కె. చాంద్‌రాజ్ – ఆంగ్లం: సుధీర్
(ఈ కథ 2 సెప్టెంబర్ 2007 నాటి ఆంధ్ర జ్యోతి దిన పత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం)