” ఏం మాలతీ, ఈ మధ్య రెండో కూర చేయడం లేదేం? ” భోజనానికి కూర్చుంటూ భార్యని అడిగాడు సుధీర్.
“కూరల రేట్లు మండిపోతున్నాయి. అదీ కాక అసలు మార్కెట్లోకి కూరలు రావడం లేదట” చెప్పింది మాలతి వడ్డిస్తూ.
“రేట్లు పెరుగుతున్నాయని నేనూ విన్నాను. కాని కూరలు మార్కెట్లోకి రాకపోడం ఏంటి?”
“నిన్న మావయ్యగారు చెప్పారు. ఆయననే అడగండి వివరంగా చెప్తారు”
“అవునవును. మీ మావగారు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కదా! ఆయనకి ఇటువంటి విషయాలపై మంచి అవగాహన ఉంటుంది. నాన్నతో రాత్రి మాట్లాడుతాలే”
సుధీర్ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తాడు. వాళ్ళ నాన్న సదానందం గారు ఇంకో కొద్ది రోజులలో రిటైరవబోతున్నారు. మూడేళ్ళ క్రితం రాజేంద్రనగర్ లో ఇల్లు కట్టుకున్నారు. పగటిపూట కుదరదని, రాత్రి పూట మాత్రం కుటుంబ సభ్యులందరూ కలసి భోంచేస్తారు. అనుకున్నట్లుగానే ఆ రాత్రి అన్నం తింటున్నప్పుడు తండ్రి ముందు తన సందేహం వ్యక్తపరిచాడు సుధీర్.
“దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది రాష్ట్రంలో నాట్ల సమయంలో వర్షాలు లేకపోడం వల్ల టమాట, పచ్చి మిర్చి, బెండకాయ, దొండకాయ, వంకాయ, పొట్లకాయ వంటి కూరగాయల సాగు బాగా తగ్గింది. ఇకపోతే రెండో కారణం, మన రాజధాని చుట్టూ ఉన్న సాగుభూమి విస్తీర్ణం తగ్గిపోడం!” చెప్పారు సదానందం గారు.
” మొదటి కారణం అర్ధమైంది. రెండోది అర్ధం కాలేదు” అన్నారు కరుణ. ఆవిడ సుధీర్ అమ్మగారు.
” రాజధాని చుట్టుపక్కల భూముల విలువ హఠాత్తుగా పెరిగిపోయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ జరుగుతోంది. ప్రభుత్వం కన్నా ముందే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులను ప్రలోభ పెట్టి, భూములని సొంతం చేసుకుంటున్నారు. తర్వాత ప్రభుత్వానికి మరింత ఎక్కువ ధరకి అమ్ముకుని లాభాలు పొందుతున్నారు. దానివల్ల సాగు భూమి తగ్గుతోంది. పైగా ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోతున్నది రైతులే” అన్నారు సదానందం.
“మావయ్యగారూ, మరీ విషయం రైతులకి అర్ధం కావడం లేదా?” అడిగింది మాలతి
“తాము మోసపోతున్నామని రైతులు గ్రహించడానికి కొంత సమయం పడుతుంది” చెప్పారు సదానందం.
“తమ భూములని అమ్మమని రైతులు అడ్డు చెప్పచ్చుగా…” అన్నాడు సుధీర్.
” ‘మీ మంచి కోసమేగా ఇదంతా’ అంటూ వట్టిమాటలు చెప్పి అధికారులు నయనా భయానా రైతుల నుంచి భూములని స్వాధీనం చేసుకుంటున్నారు. ఎక్కువ భూమున్న రైతులు లాభపడుతుంటే, కొద్దిపాటి భూమున్న చిన్న, సన్నకారు రైతులు తాము కూడ శ్రీమంతులవ్వాలని ఆశపడుతున్నారు” అన్నారు సదానందం.
” అసలు రైతులు వ్యవసాయం మాని, భూములని ఎందుకు అమ్ముకోవాలని అనుకుంటున్నారు?” అడిగింది మాలతి.
“అందరు రైతులు అలా అనుకోడం లేదమ్మా. గత కొన్నేళ్ళుగా వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనుకుంటున్న రైతులు మాత్రం, ఏదో ఒక ధరకి భూములని అమ్ముకోవాలనుకుంటున్నారు. పండించిన పంటకి మద్దతు ధర లేకపోడం, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అనుకున్నంత రుణాలు మంజూరు కాకపోడం, రైతుమిత్ర సంఘాలు ఆశించిన స్థాయిలో పనిచేయకపోడం వంటి సంఘటనలు వ్యవసాయం పట్ల కొంతమంది రైతులకి విముఖత కల్గిస్తున్నాయి. మీకు మన ఊర్లో మల్లయ్య తెలుసుగా, అదే మొదటినుంచి అతని పొలంలో మా పరిశోధనలు చేసుకోడానికి అంగీకరించిన రైతు, అతడి పొలం కూడ అమ్మేసారు. ఆ సంగతి వినండి……” అంటూ చెప్పసాగారు సదానందం.
** *
“నాయనా, గీ ముచ్చట ఇన్నావా? కిషన్ గూడలో సూరయ్య మామ జిందగీ మారిపోయింది! బూమంతా లక్షలకి లక్షలకి అమ్మిండట, మోటర్ కారు కొంటున్నాడట…….” చెప్పాడు నర్సింహ.
” ఏంది బిడ్డా, బూమిని అమ్మడం ఏంది? లక్షలు సంపాదించడం ఏంది?” అర్ధం కాక అడిగాడు మల్లయ్య.
” ఔ మల్ల, మామ పొలం చుట్టూ గదేందో అవుటర్ రింగురోడ్డు పడుతుందంట. సర్కారోళ్ళు నోటీసు ఇస్తురంట. బ్రోకర్ మదద్ తో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి బూమిని అమ్మిండంట!”
“గదేందిరో, బూమిని అమ్ముకుంటే యవసాయం ఏం జేస్తాడు?”
” ఇంక యవసాయం దేనికి నాయనా, ఎకరం 12 లక్షలు పలికింది. మామకున్న మొత్తం ఇరవై ఎకరాలు అమ్మిండట. మామ హైదరాబాదుకి పోయి, అక్కడనే ఉండిపోతాడట. ఇల్లు, కారు కొంటాడట”
“గామద్య ఎయిర్‌పోర్టు ఏదో వస్తుందని ఇలాగే చాలా మంది తమ బూములను అమ్ముకున్నారు. ఇది కూడ గసుంటిదేనా ”
“గట్లనే అనిపిస్తుంది. నాయనా, మన ఆరెకరాలు కూడ అమ్ముదామే. మనకెటు పంటలు గిట్టుబాటు గావడం లేదు, లాబ ం అటుంచి, ప్రతీసారి మనం పెట్టిన డబ్బు కూడ రావడం లేదు”
“పొలం అమ్మితే, గెట్ల బతుకుతాం బిడ్డా?”
‘ ఫికర్ దేనికి నాయనా, డబ్బు వస్తది కదా. బ్యాంకుల వేసుకుంటే మిత్తీ వస్తది.దానితో హాయిగా బతకొచ్చు. పైగా మనకి పొలం మీద ఆమ్‌దనీ ఏం వస్తున్నది? మరీ అవసరమైతే నేనేమో హైదరాబాదు పోయి అడ్డా మీద లేబర్ గా పోతా, దినం కి అరవై రూపాయలొస్తాయి. చాలుకదా ”’
“బిడ్డా నేల తల్లి అసుంటిది. జాగ్రత్తగా చూసుకోవాలె. గిప్పుడైతే పొలం మీద ఆమ్‌దనీ తక్కువయింది. కాని మునుపు మస్తుగొస్తుండె. దాంతోనే నువ్వు పది దాక చదివినావు. యాదిలేదా?”
“నాకైతే అమ్మడమే మంచిదనిపిస్తోంది”
“వద్దు బిడ్డా. యవసాయాన్ని వదిలి మరో పనిని సేయడం. ఆసాన్ కాదు. సొంతూరుని వదిలి, పరాయి ఊర్లో కూలీ నాలీ చేసుకుని బతకడం కష్టం”
“కాదు నాయనా, సర్కారే బూములని కొంటుందట. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడ కొంటున్నారు. మన చుట్టు పక్కల రైతులందరూ అమ్ము తుండ్రు. మస్తు పైసలొస్తున్నాయి. నా దోస్తులందరూ కార్లు, ఇండ్లు కొంటుంటే, నేనేమో బేకార్‌గానిలా ఉండిపోవాల్నా?”
‘గట్ల కాదు పోరగా. బ్యాంకులలో ఇచ్చే మిత్తీ రేట్లు ఒక్కతీరుగా ఉండవంట. సదానందం సారు చెప్తుండు. ఆలోచించు”
“లేదు. నేనైతే ఫైసలా తీసేసుకున్నా. అమ్మేద్దాం”
” గట్లనే, నిన్ను యాష్ట పెట్టి నేను బావుకునేది ఏముంది? ”
” ఆ విధంగా వాళ్ళు తమ భూమిని కోల్పోయారు……”అంటూ ముగించారు సదానందం.
“పోన్లెండి! చేను పోయినా, రైతుకి రొక్కం మిగులుతోంది….” అంది మాలతిఆలోచనగా. తర్వాత భోజనాలు ముగించి ఎవరి గదులలోకి వాళ్ళెళ్ళారు.
* * *
కొన్ని రోజులు గడిచాయి. విశ్వవిద్యాలయం రజతోత్సవం హడావుడిలో పడి, తాత్కాలికంగా మల్లయ్య కుటుంబం గురించి మరచిపోయారు సదానందం. ఓ రోజు ఆఫీసయ్యాక ఇంటికి వెడుతుంటే, మారుతీ కారు లో వెడుతున్న నర్సింహ కనిపించాడు. ఆయనని చూడగానే కారు దిగి పలకరించాడు నర్సింహ.
“సారు మా పొలాన్ని సర్కారే కొంది సారు. 14 లక్షలు వచ్చినాయి. అప్పులన్నీ పోగా, ఇంకా 8 లక్షలు మిగిలినాయి. ఈ సెకండ్ హ్యాండ్ కారు కొన్నా సారు. మిగతాది బ్యాంకులో ఏసినా. రియల్ ఎస్టేట్ దందా చేద్దామని అనుకుంటున్నా సారు…” అంటూ ఆనందంగా చెప్పుకొచ్చాడు. అతడి ముఖంలో కొత్తగా డబ్బు తెచ్చిన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది.
” మీ నాన్న ఎలా ఉన్నాడు?” అడిగారు సదానందం.
“బాగానే ఉండు సారు. ప్రస్తుతానికి మా చెల్లి ఇంటి కాడ ఉన్నాడు. ఆడ యవసాయం చేస్తాడంట. కొన్ని దినాలైనాక వస్తాడంట. సారు, మేము గిప్పుడు హైదరాబాదులోనే ఉంటున్నాం. మా ఊర్లో ఇల్లు కిరాయికిచ్చినా, మలక్ పేట లో ఒక అపార్టుమెంటులో దిగినాం…..” అంటూ తమ ఇంటి అడ్రసు చెప్పాడు.
“సరే, ఉంటాను” అంటూ కదిలారు సదానందం. ఈ సంగతంతా కుటుంబ సభ్యులకి ఆ రాత్రి చెప్పారాయన.
* * *
ఒక రోజు నర్సింహ సెవెన్ సీటర్ ఆటో నడుపుతూ కనిపించాడు సుధీర్ కి. అతడిని పలకరిస్తూ, ” అదేంటి నర్సింహా, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావని నాన్న చెప్పారు. మరి ఈ ఆటో ఏంటి?” అని అడిగాడు.
” లేదు సారు, ఆ దందా లో నిండా మునిగినా. మాయ మాటలు నమ్మి రెండు లక్షలు పోగొట్టుకున్నా. బ్యాంకు వాళ్ళిచ్చే మిత్తీ తగ్గిపాయె. అందుకని ఈ ఆటో కిరాయికి తీసుకుని తిప్పుతున్నా. పెట్రోలు ధర పెరిగిపోడంతో మా కొచ్చే ఆమ్‌దనీ బాగా తగ్గింది సారు”
“వ్యవసాయం చేసుకునే రోజులే మీకు బాగుండేవేమో”
” ఔ సారు. గదైతే అలవాటైన పని. కష్టమనిపించలా. ఈడ ఏ పని చేసినా బాగా కష్టమైతాంది”.
“పోనీ మళ్ళీ వ్యవసాయమే చేసుకో”
“బూమి యాడుంది సారు? మళ్ళీ కొనాలంటే నా తాన ఉన్న డబ్బులకి ఏం వస్తాది? అంతా నా బద్‌నసీబ్! వస్తా సారు..” అంటూ ఆటో పోనిచ్చాడు నర్సింహ.
‘ ఊహలకీ, వాస్తవానికీ మధ్య ఉండే తేడాని నర్సింహ ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాడు’ అని అనుకుంటూ కదిలాడు సుధీర్.
కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం తాము సేకరించిన భూమిని, ప్రభుత్వ భూములని కలిపి బహిరంగ వేలం వేసింది. పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడగా, భూముల ధర ఆకాశాన్ని అంటింది. మల్లయ్య వాళ్ళ పొలం 6 కోట్లు పలికింది. మర్నాడు పేపర్లో ఈ వార్తని చదివి హతాశుడయ్యాడు నర్సింహ. గబగబా సదానందం ఇంటికి పరిగెత్తుకొచ్చాడు .
” సారు, మోసం జరిగింది. సర్కారు మాకు లక్షలు ఇచ్చి, బడా కంపెనీలకి మా భూములని కోట్లకి అమ్మింది. నష్టపోయినాం సారు” అని అన్నాడు బాధగా.
” అప్పట్లో మీ నా న్న ఎంత చెప్పినా నువ్వు వినలేదు” అన్నారు సదానందం.
“నా బాధ అదికాదు సారు. నేనొక్కడినే కాదు. మా ఊర్లో అందరం, ఇంకా మా పక్కూర్ల కూడ రైతులందరం మోసపోయినం. గిప్పుడు మాకు పంటలు పండిద్దామన్నా బూమి లేదు. మా దగ్గర ఉన్న డబ్బుతో ఇంకో చోట బూమి కొనలేం… మళ్ళీ మేము యవసాయం చేయలేం…..” అంటూ వాపోయాడు నర్సింహ.
“అవన్నీ ముందుగానే ఆలోచించుకోవాలి” అని అంది కరుణ, నర్సింహకి టీ కప్పు అందిస్తూ.
“లేదమ్మా. మేము అమ్మమని అన్నా, బలవంతంగానైనా మా భూములని సర్కారు గుంజుకునేది. అందుకే కాస్త మంచి రేటు పలికినప్పుడే అమ్మేయాలని నాయనని సతాయించినా. కాని సర్కారు గిట్ల చేస్తాదనిఅనుకోలేదు”
“రైతుల భూములని కొంటామని ప్రకటనలు చేయడం, మార్కెటౖఉ విలువని బట్టి పొలాలకి ఎకరానికి ఇంతని రేటు నిర్ణయించడం, ఆ తర్వాత ఆ భూములని అభివృద్ధి పనుల కోసం ఉపయోగిస్తామని చెబుతూ, అధిక ధరలకి వేలం వేస్తోంది ప్రభుత్వం. దీంతో ప్రభుత్వ ఖజానా నిండుతోంది కానిరైతులు మాత్రం తమ భూములు పోగొట్టుకుంటున్నారు” అన్నారు సదానందం నిట్టూరుస్తూ.
“మరిప్పుడు ఏం చేస్తావు నర్సింహా?” అడిగారు కరుణ.
“చేయ్యాల్సింది చాలా ఉందమ్మా. నా అసుంటి రైతులందరికీ నా కధ చెబుతా. ఇక పై నాలాగా ఎవరు మోసపోకూడదు. మా నాయనతో కలసి జిల్లా లోని రైతులు/రైతు కూలీ సంఘంలో మీటింగు పెట్టిస్తా. డబ్బు కోసం ఆశ పడద్దని, బూమికి బదులు బూమే ఇవ్వాలని అడగమని చెబుతా. అందరిని కూడగడతా……..” అని చె ప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు నర్సింహ.
అతడి ప్రయత్నం ఫలించాలని మనస్పూర్తిగా కోరుకున్నారు సదానందం, కరుణ.
(ఈ కధ 21 జనవరి 2007 నాటి ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం లో ప్రచురితమైంది)
అక్టోబర్ 5, 2007 at 1:18 అపరాహ్నం
బాగుంది. ఇందులో కథకన్న వాస్తవమే ఎక్కువ. భూమికి భూమే మంచి కాన్సెప్ట్. లేకపోతే, అనుకోని డబ్బు ఏం చేసుకోవాలో తెలియక లాభం కన్నా నష్టపోయేవాళ్ళే ఎక్కువ. ఇదే కొనసాగితే, బ.జా.కం లు కమర్షియల్ ఫార్మింగ్ మొదలెడితే, రైతులు పూర్తిగా మునిగిపోతారు.
అక్టోబర్ 6, 2007 at 12:00 అపరాహ్నం
ఈ కథ మీకు నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మీ అభిప్రాయం రాసినందుకు నెనర్లు