తూర్పు దిక్కున కొండల మధ్య ఉదయ భానుడి కిరణాలు ప్రసరిస్తూ, ఆకాశానికి ఎర్ర రంగుని పులిమాయి. వెలుతురిని ఆహ్వానిస్తూ, చీకటి తప్పుకుంటోంది. లోయలో ఓ మూలగా ఉన్న ఆ కుగ్రామంలో నిన్న రాత్రి జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల, ఎప్పుడూ ఉండే ప్రశాంతత, నిశ్శబ్ద వాతావారణం భగ్నమై, గ్రామమంతా గోలగోలగా ఉంది. ప్రతి ఒక్కరు ఎంతో భయం భయంగా ఉన్నారు. తమ వ్యక్తిగత జీవితాలను వ్రభావితం చేసిన ఆ సంఘటనని పదే పదే తలచుకుంటూ ఆందోళనకి గురవుతున్నారు. గ్రామస్తులందరూ తమ రోజూవారి పనులని మానుకుని, పశువులని మేపే గడ్డి మైదానంలో సమావేశమయ్యారు. తమను ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఓ సమస్యని పరిష్కరించడానికి పూనుకున్నారు. వారంతా ‘టోమ్ చౌ’ రాక కోరకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన గ్రామంలోని అందరిలో కెల్లా వృద్ధుడు, వివేకవంతుడు. తగిన సలహాలు, సూచనలకోసం, గ్రామస్తులందరూ ఆయనని ఆశ్రయిస్తుంటారు.
ఆయన కోసం ఎదురు చూస్తు, ఆందోళనగా ఉన్న పామర జనాలు రాబోయే అవాంతరం గురించి తమలో తాము మాట్లాడుకోసాగారు.
“మనం కలియుగం చివరి దశలో ఉన్నామట. త్వరలో మరో యుగం మొదలవబోతోందట. ఉన్నదంతా నశించి, పునః సృష్టి ప్రారంభమవుతుందని పురాణాలలో చెప్పారట”
“‌భూమి మీది జీవులన్నింటిని లాక్కుపోడానికి యమదూతలు వస్తారట. అందరిని నరకంలో పడేస్తారట. ఎంతటి పుణ్యాత్ములైనా వారి నుంచి తప్పించుకోలేరట”
“అవును. ఈసారి ఎవరూ తప్పించుకోలేరు. నేను రెండో ప్రపంచ యుద్ధంలోనే బతికి బయటపడ్డాను. విమానాలు బాంబుల వాన కురిపిస్తుంటే, నేనైతే ప్రళయం ముంచుకొచ్చిందనుకున్నాను. అప్పట్లో బాంబుల నుంచి రక్షించుకోడానికి కందకాలు తవ్వుకుని ప్రాణాలు కాపాడుకున్నాం. కాని ఇప్పుడు తప్పించుకోడానికి మార్గాలు లేవు”
“ఆ రోజులలో ఎవరు ఎవరితో పోరాడుతున్నారో స్పష్టంగా తెలిసేది. సాధారణ ప్రజలకు ఎలాంటి ముప్పు ఉండేది కాదు”
“‌కాని ఇప్పుడంతా మారిపోయింది. ఎవరు ఏ పక్షమో మనకి తెలియడం లేదు. ఎవరు ఎవరి తరపున పోరాడుతున్నారో అర్ధం కావడల లేదు. తమ వైరి పక్షానికి సాయపడుతున్నామని రెండు వర్గాలు మనలని అనుమానిస్తున్నాయి. రెండు పక్షాల మధ్య మనం నలిగిపోతున్నాం”
“‌మన జీవితాలే వాళ్ళ దయపై ఆధారపడ్డాయి. వారేమైనా చేయగలరు. వాళ్ళని ఆపే నాధుడే లేడు. గతంలో నాకేం జరిగిందో మీకు తెలియదు. నా జీవితంలో నేనెప్పుడు ఎదుర్కోని అవమానాన్ని నాకు రుచి చూపించారు. ఒక దశలో నేనసలు మనిషినేనా లేక జంతువునా అని నాకే సందేహం కలిగింది. ఆ శారీరక, మానసిక శిక్షల నుంచి బయటపడాలంటే, చావే శరణ్యమని భావించాను”
ఇంతలో ఒక వృద్ధుడు వాళ్ళకేసి నడచి రావడం కనిపించింది. వాళ్ళు తమ సంభాషణని ఆపి, దారి వైపు చూడసాగారు. వాళ్ళు ఆ వృద్ధుడిని గుర్తించారు. ఆయనే, వారందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్న ‘ టోమ్ చౌ’. వయోభారం వల్ల వంగిన నడుముతో ఊతకర్ర సాయంతో మెల్లగా నడుస్తున్నారాయన. జనాలతో కిక్కిరిసిన పట్టణాన్ని వదిలి, ఈ కొండల దిగువన ఉన్న లోయలో మొదటగా వచ్చి స్థిరపడిందాయనే. మిగతా వారంతా ఆయనని అనుసరించి వచ్చిన వారే. ఒక రకంగా ఆయన ఈ గ్రామాన్ని ఏర్పరచిందే ఆయన.
ఆయన భవిష్యత్తుని సరిగ్గా ఊహించగలిగే వారని ప్రతీతి. పామరులైన గ్రామస్తులు ఆయన మాటలను తూచ తప్పకుండా పాటించేవారు. ఆధునిక చదువుల ప్రభావానికి గురైన కొంతమంది యువకులు తప్ప ఆ గ్రామంలో ఆయన మాటకి ఎదురు చెప్పేవారేలేరు. ఈ యువకులు గ్రామంలోని మిగతా యువకులని ప్రభావితం
చేయసాగారు. యువతరం వాళ్ళు తమ ప్రాచీన జీవన విధానాన్ని విడనాడి, అధునాతన జీవన శైలిని అలవర్చుకోవాలని భావిస్తున్నారు. వాళ్ళు పెద్దల మాటలు వినడానికి అస్సలిష్ట పడడం లేదు. ఆలోచనలలో వైరుధ్యం, తరాల మధ్య అంతరాలు! సాధారణ జీవనానికి సరిపోయేంత ధనాన్ని అందించ గల పనులు – వరిపొలంలోను, తోటలలోను శ్రమ చేయడం – వంటివి యువతరానికి నచ్చడం లేదు. ప్రలోభాలకి గురై, సులువుగా లభించే ధనం వైపు, విలాసవంతమైన జీవితం కొరకు చాలా మంది యువకులు గ్రామం విడచి వెళ్ళిపోయారు. పెద్దలతో పాటు, ఏ కొద్ది మందో యువ కులు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఆ గ్రామం క్రమంగా తన ఉనికిని కోల్పోసాగింది.
టోమ్ చౌ సమావేశ స్థలానికి చేరగానే, అందరి దృష్టి ఆయనపైకి మళ్ళింది. ఆయన చెప్పేది వినడానికి అందరు తొందర పడుతున్నారు. వణుకుతున్న గొంతుతో ఆయనవీలైనంత గట్టిగా మాట్లాడసాగారు.
” ప్రజలారా! మన గ్రామంలోని పరిస్థితులపై మాట్లాడడానికి నాకీ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ప్రస్తుతం మనం చాలా క్లిస్టమైన దశలో ఉన్నాం. నాకా వయసు మీరిపోతోంది. మన గ్రామంలో ఎప్పుడు శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలనే ఆశతో నేను ఇన్నాళ్ళు జీవించాను. కాని నా ఆశలు అడియాసలయ్యాయి. నా కలలు చెదిరిపోయాయి” అంటూ కాస్త ఊపిరి తీసుకుని మళ్ళీ చెప్పసాగారు.
“ఈ దుస్థితికి ఇతరులని నిందించేముందు, మన పిల్లలు మన కేం చేసారో మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళంతా మనలని వదిలేసారు. మన అవసరాలని కనిపెట్టుకుని ఉండేందుకు ఎవరూ లేరని తెలిసినా,వార్ధక్యంలో, మనలని మనమే కాపాడుకోవాలని అన్నారు”
ఆయన కళ్ళ వెంట ధారాళంగా నీరు కారసాగింది.కళ్ళు తుడుచుకుని మళ్ళీ చెప్పసాగారు.
“‌మన గ్రామ భవిష్యత్తు ఇక అంధకారమే! మన పిల్లలు బాగా కష్టపడి పనిచేసి గ్రామాన్ని బాగు చేస్తారనుకున్నాను. కాని వాళ్ళేం చేసారు? మనల్ని మరణపు లోగిలో వదిలేసి, వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళకి కావలసినదంతా మననుంచి పిండుకున్నారు. వాళ్ళ కోసం, మన గ్రామం అభివృద్ధి కోసం మనం చేయగలిగిందంతా చేసాము. కాని వాళ్ళు మనకేం చేసారు? అభివృద్ధి ఫలాల లో వాటాల కోసం తన్నుకున్నారు. మనం చెమటోడ్చి సంపాదించిన డబ్బునంతా దుబారా చేసారు. మన పిల్లలే మన పాలిట శత్రువులయ్యారు. వాళ్ళ గురించి తలచుకోవాలంటేనే నాకు సిగ్గుగా ఉంది”.
ఈ మాటలని ఆయన ప్రజల స్పందన కోసం చుట్టూ కలయజూసారు. ఎవరూ ఒక్క మాట కూడ మాట్లాడలేదు. అందరూ సిగ్గుతో తలవంచుకుని కూర్చున్నారు.
మళ్ళీ మాట్లాడడం ప్రారంభించగానే టోమ్ చౌ స్వరానికి కొత్త శక్తి చేకూరింది.
” అయినా సరే మనం ఆశ కోల్పోనవసరం లేదు. మనవాళ్ళు చేసిన తప్పులని సరిదిద్దడానికి ఇంకా సమయం ఉంది. కృతఘ్నులకు అన్నం పెట్టడానికి మనమెంతో కష్టపడ్డాం. ఇప్పుడదంతా మర్చిపోయి, మరింత శ్రమిద్దాం. అందరం కలసి కట్టుగా ఉండి, ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కుందాం. మనకింకా పొలాలు తోటలు ఉన్నాయి. దేవుడు మనవైపు ఉన్నాడు. మనకి జరిగిన అన్యాయాలకి దేవుడు వాళ్ళని క్షమించడు. తగిన శాస్తి చేస్తాడు. వాళ్ళని, వాళ్ళ చేష్టలని ఇప్పుడు నేనే మాత్రం పట్టించుకోడం లేదు. మన హెచ్చరికలని వాళ్ళెన్నడు ఖాతరు చేయలేదు. యమదూతలు వాళ్ళని వెంబడిస్తున్నారు. చాలా మంది తాము చేసిన పాపాలకు తగిన శిక్షని అనుభవించారు. మిగతావారికి కూడ అదే గతి పడుతుంది…. తాము సులభంగా సంపాదించినధనంతో దేనినైనా కొనేయగలమని వారు భావిస్తున్నారు. మూర్ఖులు! వాళ్ళు సంపాదించుకునేది ఇబ్బందులనే అని గ్రహించడం లేదు. నాకు బాధ గా ఉంది – వాళ్ళ మీద కాస్తంత దయ చూపినందుకే మనలో కొంత మంది శారీరక, మానసిక బాధలకి గురయ్యాం”
సుదీర్ఘమైన ఈ ఉపన్యాసం టోమ్ చౌకి అలసట కలిగించింది. విశ్రాంతి కోసం మాట్లాడడం ఆపారు. ఇంతలో గుంపు లోంచి ఒకరు లేచి,
“వాళ్ళు మన గ్రామానికి ఇక రారనే అనుకున్నాము. కాని నిన్న రాత్రి మన గ్రామం గుండా ఓ లారి కొండలవైపు వెళ్ళింది. బహుశా తొందరగానే తిరిగి రావచ్చు. యమదూతలు వాళ్ళని వెతుక్కుంటూ రావచ్చు. ఎప్పుడొస్తారో దేవుడికే తెలియాలి” అని అన్నారు.
అదన్న మాట సంగతి! పెద్దగా శబ్దం చేసుకుంటూ గ్రామం గుండా వెళ్ళిన ఓ లారీ వల్ల ఈ గ్రామంలో ఇంత అలజడి రేగిందన్న మాట. లారీ శబ్దానికి గ్రామస్తులు బెదిరిపోడం వెనుక ఓ కథ ఉంది. కొంత మంది సాయుధులు నిషేదిత మాదక ద్రవ్యాలను అక్రమంగా, ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఈ గ్రామం గుండా వెళ్ళే దారిని ఎంచుకున్నారు. వేరే చోట తమ అదృష్టాలను పరీక్షించుకోడానికి వెళ్ళిన స్థానిక యువకులలో చాలా మంది ఈ సాయుధులతో చేతులు కలిపారు. తమ అక్రమ వ్యాపారాలకి పెట్టుబడికోసం తల్లిదండ్రులని వేధించారు.
తల్లిదండ్రులు పొలాలలో ఎండనకా వాననకా కష్టపడుతుంటే, పిల్లలు మాత్రం దగ్గరలోని పట్టణాలలో విలాసాలలో మునిగితేలసాగారు. ఒకసారి గంజాయి లోడు తో వెడుతున్న లారీ ఒకటి వీరి గ్రామంలో పాడయిపోయింది. అమాయకులైన గ్రామస్తులు, అది గంజాయని తె లియక, దాన్ని దింపి, ఒక ఇంట్లో జాగ్రత్తగా భ«ద్రపరచారు. లారీని మరమత్తులకోసం పంపారు. పోలీసులకి ఎవరో సమాచారం అందించారు. పోలీసులు గ్రామంపై దాడి చేసి  జాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తన ఇంట్లో దాచిన గ్రామస్తుడిని అరెస్టు చేసి విచారించారు. సాయుధులకి సాయం చేస్తున్నాడనే నెపం మీద పాపం ఆ అమాయకుడు చాలా రోజులు జైల్లో మగ్గాల్సివచ్చింది.
పులి మీద పుట్రలా, ఇంకో వైపు సాయుధులు కూడ గ్రామస్తులని అనుమానించి, చావగొట్టారు. గ్రామంలోని మహిళలు తిరగబడకపోతే, ఆ రోజు చాలా అనర్ధం జరిగిపోయేది. ఆ తర్వాత చాలా రోజుల వరకు, అంటే నిన్న రాత్రి వరకు, సాయుధులు మళ్ళీ గ్రామంలోకి అడుగుపెట్టలేదు.
గ్రామస్తులందరూ కలసి ముక్త కంఠంతో ఒకే ఒక ప్రశ్న అడిగారు ” మనం ఇప్పుడేం చేయాలి?” అని.
టోమ్ చౌగొంతు సవరించుకున్నారు.
” మనం ఒక త్యాగం చేయాలి. ఎంతో కష్టనష్టాలకోర్చి రవాణా సమస్యని తీర్చడానికి మనం నిర్మించుకున్న రోడ్డుని మూసేయాలి. రోడ్డుని తవ్వేసి, పంట కాలువని ఇటు వైపు మళ్ళిద్దాం. కాలువ మీద వెదురు కర్రలతో వంతెనని కడదాం” అని చెప్పారు టోమ్ చౌ.
” సరే, అలాగే చేద్దాం” అంటూ గ్రామస్తులు తమ ఆమోదం తెలిపారు. వాళ్ళంతా వెంటనే కార్యాచరణకి దిగారు. సాయంత్రానికిల్లా, పని ముగించారు. రోడ్డుని మధ్యగా చీలుస్తు, పంట కాలువని అటు మళ్ళించారు. కాలువ మీద వెదురు కర్రలతో వంతెన నిర్మించారు. వాళ్ళ కది వెదురు కోట!
ఈ వెదురు వంతెన కలకాలం ఉంటుందా, లేక సంధికాలం పాటు మాత్రమే మనగలుగుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.

మణిపురి, ఆంగ్ల మూలం: తయేన్‌జమ్ బిజోయ్‌కుమార్ సింగ్
(ఈ కథ విపుల మాసపత్రికలో ప్రచురితం)