గబగబా తన ఇంటిపైపు అడుగులేస్తున్నాడు ఎనిమిదేళ్ళ అమిత్. వీధి లోంచి వస్తున్నప్పుడు తెరచి ఉంచిన కొట్లలో గడియారాలేమయినా కనిపిస్తాయేమోనని చూడసాగాడు. గడియారం ఎందుకంటే సమయం తెలుసుకోడానికి. అప్పటికి సమయం రాత్రి 7.15 అవుతోంది. వాళ్ళ నాన్న ఆఫీసు నుంచి ఇంటికి చేరే సమయం కన్నా పావుగంట ఎక్కువ. అమిత్ నడకలో వేగం పెంచాడు.
అమిత్ కి ఆ పాత రోజు గుర్తొచ్చింది. ఆ రోజు ఇలాగే ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు వాళ్ళనాన్న బాగా తన్నాడు. ‘ ఆ మాత్రం ఆలస్యానికే అంతలా కొట్టాలా? నాన్నెందుకు అంత కోపంగా ఉంటాడు? మరి తమ్ముడ అనిల్‌ని కొట్టడేం? వాడికింకా నాలుగేళ్ళేననా? నాకు మాత్రం టైం ఎలా తెలుస్తుంది? గ్రౌండ్ లో గడియారం లేదే? పైగా సూర్యుడు కూడ వాళ్ళింటికి ఆలస్యంగా వెళ్ళాడు. మరి నేనేం చేసేది? ఆలస్యం అయిందని తెలియలేదు’ ఇలా సాగాయి వాడి ఆలోచనలు.
“దేవుడా, ఈ రోజు నాన్న ఇంటికి కొంచెం ఆలస్యంగా వచ్చేడట్టు చూడు” అంటూ దేవుడిని ప్రార్ధించాడు. మరో ఐదు నిముషాలలో తన ఇంటి ముందున్నాడు అమిత్. నాన్న వచ్చాడో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. తలుపుకి దగ్గరగా నిలుచుని, చెవులు రిక్కించి వినసాగాడు. లోపల్నించి ఎటువంటి మాటలు వినపడడం లేదు. అమిత్ ముఖం పై ఓ చిరునవ్వు విరిసింది. మెల్లిగా తలుపు తీసుకుని, పిల్లిగా లోపలికి అడుగుపైట్టాడు. అమిత్ ని చూస్తూనే అనిల్ ‘అన్నయ్యా’ అంటూ అరిచాడు.
వాడిని అక్కడికక్కడే ఓ మొట్టికాయ వేద్దామనుకున్నాడు అమిత్. ఇంతలో వంటింట్లోంచి ” ఇప్పటి దాక ఎక్కడికి వెళ్ళావు? టైం ఏడున్నర అవుతోంది. ఆలస్యంగా ఇంటికి రావడం నాన్నకిష్టం ఉండదు. నీకు తెలుసుగా” అంటూ అరిచింది అమ్మ.
అమిత్ ఏమీ మాట్లాడలేదు. తనేం మాట్లాడినా అది మరింత గొడవకి దారితీస్తుందని అమిత్ కి తెలుసు. మౌనం రక్షణాత్మకం! కాళ్ళు, చేతులు కడుక్కున్నాడు. నాన్న ఇంకా రాలేదు. ఇది చాలా అసాధారణం. ఎందుకంటే నాన్న ఎప్పుడూ ఏడుగంటల కల్లా ఇంటికి వచ్చేస్తాడు. ఈ పూట దాదాపు ఎనిమిది అవుతున్నా ఇంకా రాలేదు. అమిత్ కి సంతోషంగా ఉంది. తన్నులు తప్పాయని ఆనందంగా ఉంది. టి.వి. ఆ న్ చేసి సాయంత్రం పూట వచ్చే కార్యక్రమాలు చూడసాగాడు. వేసవి సెలవలు కావడంతో చేయడానికి హోం వర్క్ ఏదీ లేదు. అనిల్ కింద నేల మీద బొమ్మలతో ఆడుకుంటున్నాడు. అమ్మేమో నాన్న కోసం ఎదురుచూడసాగింది. ఓ అరగంట గడిచింది. అమ్మకి కంగారు మొదలైంది. టేబుల్ పైన ఉన్న టెలిఫోన్ డైరక్టరీని అందుకుంది.
“తమ్ముడిని చూస్తూండు. నేను నాన్న వాళ్ళ ఆఫీసుకి ఫోన్ చేసి వస్తాను…” అంటూ బయటకు వెళ్ళడానికి సిద్ధమవసాగింది. ఆమె ముఖంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
అమిత్ ఏమీ మాట్లాడలేదు. అమ్మ ఫోన్ చేయడానికి వెళ్ళింది. ‘నాన్న పక్కింటి షీలా ఆంటీ వాళ్ళింటికి ఫోన్ చేసి రావడం ఆలస్యం అవుతుందని చెప్పచ్చు కదా?’ అని అనుకున్నాడు. ఆ చుట్టూ పక్కల ఇళ్ళలో ఫోన్ ఉన్నది షీలా వాళ్ళింట్లోనే. అమ్మ కష్టపడడం అమిత్ కి ఇష్టం లేకపోయింది. ‘అమ్మ ఎంతో మంచిది. నాన్నే పిసినారి. పైగా ఎప్పుడూ నామీద అరుస్తునే ఉంటాడు. అమ్మని కూడ తిడతాడేమో’ అనుకున్నాడు .
ఓ పావుగంట తర్వాత అమ్మ తిరిగి వచ్చింది. ఆమె ముఖం చూస్తే సంతోషకరమైన వార్త ఏదీ అందినట్లు లేదు. టి.వి. చూస్తూ అమ్మనే గమనించసాగాడు. ఆమె గుమ్మం కేసే చూడసాగింది. సమయం తొమ్మిది కావచ్చింది. నాన్న రెండు గంటలు లేటు!
ఇప్పుడు అమిత్ కి కూడ భయం పట్టుకుంది. టి.వి. చూడబుద్ధి కాలేదు. ఆపేసి అక్కడినుంచి లేచాడు.
” అమిత్, నువ్వు తమ్ముడు అన్నం పెట్టుకుని తినేయండి” అంది అమ్మ.
“నువ్వు తినవా?”
“నాన్న వచ్చాక”
అమిత్ నిశ్శబ్దంగా వంటింట్లోకి వెళ్ళి తనకి , తమ్ముడికి కంచాలలో అన్నం పెట్టుకున్నాడు. అనిల్ ఇవేవి పట్టనట్లు తన బొమ్మ రైలుతో హాయిగా ఆడుకున్నాడు. వాడిని పిలిచి అన్నం పెట్టడానికి అమిత్ చాలా కష్టపడ్డాడు.
అనిల్ గబగబా తల్లి దగ్గరికి పరిగెత్తి, “అమ్మా, నాన్న ఎప్పుడొస్తాడు?” అని అడిగాడు. అమ్మకి అసలే చికాకుగా ఉంది.
“అమిత్, వీడికి అన్నం తినిపించు” అంటూ అరిచింది. ఏడుస్తున్న తమ్ముడిని లాక్కెళ్ళి కుర్చిలో కూర్చోబెట్టి నోట్లో ముద్దలు పెట్టసాగాడు అమిత్. అనిల్ ఏడుస్తుంటే వాడి కన్నీళ్ళు అన్నంలో కలుస్తున్నాయి. వాడికి అన్నం తినిపించి, తానూ తినేసి తమ్ముడిని మంచం మీద పడుకోబెట్టి టి.వి. ఆన్ చేసాడు. వాడు టి.వి. చూడసాగాడు. అమిత్ వెళ్ళి అమ్మ దగ్గర నిలుచున్నాడు. ఆమె భర్త కోసం ఎదురుచూస్తూ ఉంది.
హఠాత్తుగా అమిత్ కి సాయంత్రం తను దేవుడిని కోరిన కోరిక గుర్తొచ్చింది. ‘నేను నాన్న రావడం కాస్త ఆలస్యం అవ్వాలని మాత్రమే కోరుకున్నాను. అంతే. కొద్ది నిముషాలు మాత్రమే ఆలస్యం కావాలని కోరుకున్నాను. గంటల కొద్ది కాదు కదా! ఒక వేళ నాన్నకి ఏమీ కాలేదు కదా? ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా? ఏదైనా ఇబ్బందా? లేదంటే ఒక గంట పట్టే ప్రయాణానికి మూడుగంటల పైన ఎందుకు పడుతుంది?…. ‘ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అమిత్ చిన్ని బుర్రని వేధించాయి.
‘నిజంగా నాన్నకి ఏదైనా ఆయితే అమ్మ ఏమవుతుంది? మా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలి?’ అమిత్ మనసులో ఆలోచనల రైళ్ళు పరిగెడుతున్నాయి. అమిత్ ఏదేదో ఊహించుకోసాగాడు. తమ్ముడికేసి చూసాడు – అనిల్ మంచం మీద పడుకుని తన రైలు బొమ్మతో ఆడుకుంటూ టి.వి. చూస్తున్నాడు. అమ్మేమో రోడ్డుకేసే తీక్షణంగా చూస్తోంది.
అమిత్ కి భయం వేయసాగింది. భవిష్యత్తుపై భయం! నాన్న తో తను గడిపిన సమయాలని గుర్తుచేసుకున్నాడు అమిత్. తన కోసం ఎన్నో బొమ్మలు, ఎన్నో స్వీట్లు తెచ్చేవాడు నాన్న. రోడ్డుని ఎలా దాటాలో నేర్పించాడు నాన్న. నాన్న చేయి పట్టుకుంటే ఎంత రద్దీ లోనైనా తప్పిపోకుండా ఉండచ్చు. ఇంట్లోకి వచ్చి కుర్చిలో కూర్చున్నాడు అమిత్. నాన్న లేకుండా జీవితాన్ని ఊహించుకోడానికే కష్టంగా ఉంది. ఆయన కఠినంగా ఉండేది వాస్తవమే కాని ఆయన తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తాడాయన. తన కుటుంబం కోసం ఎంతగానో కష్టపడతా డాయన.
“దేవుడా, మా నాన్నని త్వరగా ఇంటికి పంపించేయ్. నేను ఇకపై రోజూ ఇంటికి తొందరగా వచ్చేస్తాను” అంటూ వేడుకున్నాడు అమిత్.
మరో పది నిముషాలు గడిచాయి. అమిత్ బాల్కనీలోకి వెళ్ళి తల్లి పక్కన నిలబడ్డాడు. అతడు మౌనంగా ప్రార్ధిస్తున్నాడు.
కొంచెం దూరంగా, వీధి దీపం వెలుగులో ఓ సుపరిచితమైన ఆకారం తమ ఇంటి వైపు రావడం గమనించారు. అమిత్ అమ్మ కేసి చూసాడు. ఆమె ముఖంలో ఆందోళన మాయమైంది. కొన్ని క్షణాల తర్వాత నాన్న లోపలికి వచ్చారు.
“మా బస్ నాలుగు గంటల పాటు రోడ్డు మీద ట్రా ఫిక్ జాం లో చిక్కుకుపోయింది. ఫోన్ చేద్దామంటే పక్క వాళ్ళ నెంబరు ఎంతకీ గుర్తురాలేదు” అని అన్నాడు.
అమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆమెకి ఆనందంతో మాటలు రావడం లేదని గ్రహించాడు అమిత్. భర్త చేతిలోంచి సంచిని అందుకుంది. అనిల్ గబగబా వచ్చి తండ్రి భుజాలపైకి ఎగిరాడు. వాడిని ఎత్తుకుంటూ కుశల ప్రశ్నలు వేసాడు నాన్న. అమిత్ కుర్చిలో కూర్చుని ఇదంతా గమనిస్తున్నాడు. ‘అమ్మయ్య. నాన్నని చూడడం ఎంత హాయిగా ఉందో’అని అనుకున్నాడు.
అమ్మా, నాన్నా భోజనం చేస్తున్నంత సేపు నాన్న ట్రా ఫిక్ జాం గురించే చెబుతునే ఉన్నాడు. అమ్మ అంతా విని నిట్టూర్చింది. టి.వి. ఇంకా మ్రోగుతునే ఉంది. పాత హిందీ సినిమాలోని పాట వస్తోంది.
“పాపా జల్దీ ఆ జానా, గుడియోం కే బాజార్ సే అచ్ఛీసీ గుడియా లానా. గుడియా నా లానా పాపా జల్దీ ఆ జానా”
( నాన్నా తొందరగా వచ్చేయ్. బొమ్మల కొట్లోంచి, ఓ మంచి బొమ్మ తే. బొమ్మ తేకపోతే పోనీ, నువ్వు తొందరగా వచ్చేయ్)
ఇక విశ్రమించే సమయం వచ్చింది. అమ్మ వంటింటి పనులు పూర్తి చేస్తుంటే నాన్న పక్కలు వేసాడు. అమ్మ మనసుకి ఎంతో తేలికగా ఉందిప్పుడు. అమిత్ కి కూడ ఎంతో హాయిగా ఉందిప్పుడు. గడిచిన నాలుగు గంటలలో ఏవేవో ఊహించుకున్నాడు. చాలా పెద్దవాడైపోయినట్లు భావించాడు.
అనిల్ ఇంకా నిద్రపోలేదు. నాన్న వాడిని ఓ కసురు కసిరాడు. అంతే క్షణాలలో పక్క మీదకి చేరి నిద్రలోకి జారుకున్నాడు. అమ్మ కి కూడ పక్క మీద వాలగానే నిద్ర వచ్చేసింది. అమిత్ కూడ పడుకోడానికి సిద్ధమవుతున్నాడు.
” ఈ రోజు అమ్మని సతాయించావా?” నాన్న అడిగాడు అమిత్ ని.
లేదన్నట్లు అడ్డంగా తలూపాడు అమిత్.
” ఇంటికి ఎన్నింటికి వచ్చావు? 7 గంటల కన్నా ముందే వచ్చేసావా?” అంటూ ఇంకో ప్రశ్న వేసాడు నాన్న.
అమిత్ సమాధానం చెప్పే లోపే, “అబ్బా, ఏడింటికల్లా వచ్చేసాడులెండి. ఇక ప్రశ్నలు ఆపి పడుకోండి” అంది అమ్మ నిద్రలోంచే.
ఇంట్లో అధికారమంతా నాన్నదే అయినా, కొన్నిసార్లు వాదనలో అమ్మే గెలుస్తుంది. అమిత్ కి మునుపు అర్ధం కాలేదు కాని ఈ రోజు నాన్నంటే కోపం రాలేదు. రోజు అడిగే ప్రశ్నలే అయినా, నాన్న ఇవాళ కొత్తగా అనిపించాడు. అమ్మ తనంటే ఎంత ప్రేమ చూపిస్తుందో నాన్న కూడ అంతే ప్రేమ కనపరుస్తాడని గ్రహించాడు అమిత్. కాక పోతే వ్యక్తీకరణలో తేడా అంతే! నాన్న దీపాలు ఆర్పేసి పడుకున్నాడు. అమిత్ కళ్ళు తెరచి చీకటిలోంచే చూడసాగాడు.
సాధారణంగా అమిత్ తల్లి పక్కనే పడుకుంటాడు. ఒక వైపు నాన్న, మధ్యలో తమ్ముడు ఇంకో వైపు అమ్మ పడుకున్నారు. అమిత్ కి నాన్న పక్కన పడుకోవాలనిపించింది. వాళ్ళెవ్వరికి నిద్రాభంగం కలగకుండా జాగ్రత్తగా వెళ్ళి తండ్రి పక్కన చేరాడు. తండ్రి నిద్ర పోతున్నాడని భావించి దూరంగా పడుకున్నాడు అమిత్. కాని అమిత్ కి నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ కదలసాగాడు. అలా కదలడంతో, అమిత్ వీపు నాన్నకి తగిలింది. హటాత్తుగా నాన్న చెయ్యేసి ప్రేమగా అమిత్ ని తన దగ్గరగా లాక్కున్నాడు. ఆయన స్పర్శ అమిత్ కి ఎంతో హాయిని, ధైర్యాన్ని, భరోసాని ఇచ్చింది. తండ్రి చూపిన ఆప్యాయతకి, అన్ని భయాలని వదిలి, నాన్నని హత్తుకుని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు అమిత్.
ఎవరైనా గమనిస్తే, తండ్రీకొడుకులిద్దరిముఖాల పైన చిరునవ్వుని చూడొచ్చు.
ఆంగ్ల మూలం: పుండలిక్ ధూరి
(ఈ కథ 27 అక్టోబర్ 2006 నాటి తేజ వార పత్రికలో ప్రచురితం)