నిజమైన మనిషి
నేనో ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్‌ని. ఇది అసలే వేసవి కాలం! పగలంతా ఉక్కపోత తోను, చెమటతోను చికాకుగా ఉంటోంది. నిన్న రాత్రి ‘కాజువాలిటీ’ విభాగమంతా ‘ట్రామా’ కేసులతో కిటకిటలాడిపోయింది. నాకు జరిగిన అన్యాయానికి నా ముఖం పాలిపోయింది. మా పై అధికారులు, అధిపతులు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతుంటే, క్రింది స్థాయికి చెందిన నా లాంటి వాళ్ళం నలిగిపోతుంటాం. రోగులను పరీక్షించడం, కుట్లు వేయడం, ఆసుపత్రిలో చేర్చుకోడం, కేస్ షీటు రాయడం, వైద్య పరీక్షలు చేయడం, ……. ఇవన్నీ ప్రతీ రాత్రి చేయడం, మళ్ళీ తెల్లారగానే తాజాగా తయారై వచ్చే మా అధిపతుల ఆదేశాల కోసం సిద్ధంగా ఉండడంతోనే మా సమయమంతా సరిపోతుంది. నాకు దొరికే కాస్త సమయమల్లా ఓ అరగంట సేపు మాత్రమే.
ఓ కప్పు టీ తాగి బట్టలు మార్చుకుని రావడానికి సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ‘రౌండ్సు’ కి వెళ్ళాలి. ఇదికూడా దాదాపుగా కట్టు బానిసత్వమే!
ఈ పూట నాకు డ్యూటీ లేదు. ఇంటికి వెడదామని బస్ స్టాపు వైపు నడిచాను. జనాలతో కిటకిటలాడుతున్న ఓ సిటీబస్ లోకి జొరబడి, మెట్ల దగ్గరగా నిలబడ్డాను. బస్సు కదిలింది. జనాలు ఒకరినొకరు తోసుకుంటున్నారు, మోచేతులతో నెట్టుకుంటున్నారు. ఒక వైపు మురికి, చెమట, జిడ్డు, చేపల కంపు,…. మరో వైపు కాలివేళ్ళు తొక్కేసే ప్రయాణీకులు, దురుసుగా ప్రవర్తించే కండక్టర్.
రెండు స్టాపుల తర్వాత, జనం కొద్దిగా పలచబడ్డారు. నేను లోపలికి వెళ్ళగలిగాను. కండక్టర్ గట్టిగా ఈల వేస్తూ, ‘లోపలికి రండి’ అని అరుస్తున్నాడు. ఇంతలో అదృష్టవశాత్తు, రెండు వరుసల అవతల నాకో ఖాళీ సీటు కనిపించింది. అలవాటుగా రద్దీ లోంచి తప్పించుకోడానికి చూసాను. నా మెడలో వేలాడుతున్న స్టెతస్కోపు నాకు కాస్త వెసులుబాటు కలిగించింది. సీటు లో కూర్చోబోతూ, ఎందుకో ప్రక్క సీటు ప్రయాణీకుడిని చూసాను. అతడో కుష్టురోగి. చూపులకి భయంకరంగాను, వికారంగాను ఉన్నాడు. అతడు స్థానిక దినపత్రికలో కుంభకోణాలకు, మోసాలకు సంబంధించిన వార్తలను చదువుతున్నాడు. బహుశా చూపు ఆనడం లేదేమో, పేపరుని చాలా దగ్గరగా పెట్టుకుని చదువుతున్నాడు. నేను ఒక్కసారిగా వెనుకడుగు వేసాను. ఈ కురూపి, రోగిష్టి పక్కన నేనెలా కూర్చుంటాను?
బస్సు మధ్యగా ఉన్న గొట్టాన్ని పట్టుకుని, ఆ సీటుకి ముందుగా నిలుచున్నాను. యధాలాపంగా నా దృష్టి కుష్టురోగి చదువుతున్న పేపరు ముందు పేజీ పై పడింది. రాసక్రీడలు సాగిస్తూ, సాక్షాధారాలతో సహా పట్టుబడ్డ ఓ మంత్రి గారి గురించిన వార్త పెద్దపెద్ద అక్షరాలతో ప్రచురితమైంది. ఫోటోలతో సహా ముద్రించి ఉన్న ఆ వార్తని చదవడానికి కాస్త కిందకి వంగాను. ఆ క్షణంలో మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నాకంత ఆసక్తి కలిగించిన ఆ వార్త ఏమిటో చూద్దామని అతడు పేపరుని తిరగేసాడు. తర్వాత తన పక్క సీటు ఖాళీగా ఉండడం చూసాడు. నాకేసి అదోలా చూసి, మళ్ళీ పేపరు చదువుకోడంలో నిమగ్నమైపోయాడు.
అ విలేఖరి చేసిన పరిశోధన చాలా ఆసక్తికరంగా ఉంది. కాని కుష్టురోగి పేపరుని తిరగేయడంతో కాస్త అంతరాయం కలిగింది. జరిగిన అంతరాయానికి నేను చింతించాను. సాటి ప్రయాణీకుడు చదువుతున్నాడన్న ఆలోచనైనా లేకుండా పేజీ తిప్పేయడం నాకు చికాకు కలిగించింది. నా తెల్లకోటు, స్టెతస్కోపు అతడిపై ఏ ప్రభావం చూపినట్లు లేదు. మళ్ళీ ఏకాగ్రత తెచ్చుకుని ఆ వార్త చదవడానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. ఇంతలో ఏదో స్టాపు వద్ద బస్సు ఆగింది. కొద్ది మంది దిగి, చాలా మంది ఎక్కారు. మళ్ళీ తోపులాట మొదలైంది. ఊర్లో ఇంక బస్సులే లేవా అని నాకనిపించింది. హఠాత్తుగా కుష్టురోగి పేపరు చదవడం ఆపాడు. దాన్ని జాగ్రత్తగా మడతపెట్టి చేతికింద పెట్టుకుని సీట్లోంచి లేచాడు.
“హమ్మయ్య! దేవుడు నా మొర ఇప్పటికి ఆలకించాడు. వీడి బాధ వదిలింది” అని అనుకుంటూ ఆ కుష్టురోగి వెళ్ళడానికి దారి ఇచ్చాను.
అతడు నన్ను దాటుకుని వెడుతుంటే, అసహ్యంతో తల తిప్పుకున్నాను. అతడి చూపులు ఓ క్షణం పాటు నా తెల్లకోటు పైన, స్టెతస్కోపు పైన నిలిచాయి. కొద్దిగా వెనక్కి తిరిగి తను ఖాళీ చేసిన సీటుని చూసాడు. దాంట్లో కూర్చోవలసిందిగా నాకు సైగ చేసాడు.
‘నన్నిక భరించనవసరం లేదు’ అన్న భావన అతడిచూపులో ప్రస్ఫుటమైంది.
అతడు ఏదో చెచెప్పాలనుకుని, పెదాలను కొద్దిగా కదిలించాడు. కాని అంతలోనే ఆ ప్రయత్నం మానుకుని తన చేతి క్రింది దినపత్రికని తీసి సీటు మీద పరిచాడు. నేను నిర్ఘాంతపోయాను. అతడేమీ మాట్లాడకపోయినా, అతడి ఉద్దేశ్యాన్ని నేను గ్రహించాను.
” ఇప్పుడు సుఖంగా కూర్చోండి డాక్టర్! జబ్బులకి దూరంగా ఉండండి. సాటి మనుషుల వేదనకి, బాధకి స్పందించకండి. ఒకప్పుడు ఎంతో ఉన్నతాశయాలు కలిగి నిస్వార్ధమైనదిగా పేరొందిన మీ వృత్తికి కళంకం వచ్చినా పట్టించుకోకండి. హాయిగా ఏకాంతంగా కూర్చుని, ఈ పేపరుని చదువుకోండి” లాంటి భావాలు అతడి ముఖంలో కదలాడాయి.
బస్సు ఒక్క కుదుపుతో ఆగింది. ఆ కుష్టురోగి దిగిపోయాడు. సీటు మీద అతడు పరిచిన దినపత్రిక మాత్రం అక్కడే ఉంది. ఒక్క సారిగా ఏదో తెలియని వ్యధ నన్ను ఆవహించింది. నిస్సత్తువగా అనిపించింది. ఓ వైద్యుడిగా నాకు ఉండాల్సిన ఓర్పు, కరుణ చూపలేనప్పుడు, రోగుల పట్ల ఆదరణా, దయ, జాలి, సానుభూతి చూపలేనప్పుడు, వృత్తిధర్మాన్ని పాటించలేనప్పుడు, నేను పొందిన శిక్షణకి అర్ధమేముంది? ఐదేళ్ళ పాటు మెడికల్ కాలేజిలో చదివినా పొందలేని అనుభవాన్ని, ఈ రోజు ఈ రద్దీ గా ఉన్న బస్సులో పొందగలిగాను.
జీవితం గురించి, అస్వస్థత గురించి ఈ రోజు నాకు అర్ధమైంది. ఓ ఉన్నతమైన వృత్తికి ప్రతినిధులుగా ఉన్న మా మెడికోలం, ముసుగులు ధరించి ఉన్నామని గ్రహించాను. కాని నన్ను నేను తెలుసుకున్నాను.
ఆ కుష్టురోగి తన చిన్న చర్యతో తోటి ప్రయాణీకుడికి కూర్షోడానికి చోటివ్వడమే కాకుండా, ‘సాటి మనుషులకు మీ మనసులోను కాస్త చోటివ్వండి’ అనే సందేశాన్ని అందించాడు.
మనిషి మేధస్సు ఎదగడానికి వేల వేల ఏళ్ళు పట్టిందని విన్నాను. మనిషి పాతరాతియుగం నాటి ఆదిమ మానవుని స్ధాయి నుంచి, విజ్ఞానం సంపాదించిన నాగరిక మానవుడిగా మారడానికి చాలా కాలం పట్టింది. కాని నా తోటి రోగిష్టి ప్రయాణీకుడు నా కోసం తన సీటు పై దినపత్రికని పరిచి, నన్ను కూర్చోమని నిశ్శబ్దంగా సైగ చేసిన క్షణంలోనే ‘నిజమైన మనిషి’ అయ్యాడు.
నేను, మనలో చాలా మంది ఇంకా చేరని మనిషి పరిణామ దశ అది…..!
ఆంగ్ల మూలం: డాక్టర్ అరుణాచలం కుమార్
(ఈ కథ 11 ఆగస్టు 2006 నాటి తేజ వార పత్రికలో ప్రచురితం)
Add comment సెప్టెంబరు 28, 2007