(Disclaimer: the events and characters in this blog not meant to resemble the real life person or events)
క్యూ అసలే మాత్రం ముందుకు కదలడం లేదు. లైనులో ఉన్నవాళ్ళు ఒకరినొకరు తోసుకుంటున్నారు,తిట్టుకుంటున్నారు. అదేమీ కొత్త సినిమా టికెట్ల కోసం కాదు. నేనేమీ కాలేజి కుర్రాడినీ కాదు. ఈ క్యూ లో ఉన్నవాళ్ళంతా కొత్తగా ప్రారంభించిన ఓ అంతర్జాతీయ హైపర్ మార్కెట్లో సభ్యత్వం కోసం అప్లికేషన్ తీసుకోడానికి నిలుచున్నరు. సభ్యత్వం పొందిన వాళ్ళకి ప్రత్యేక డిస్కౌంట్లు ఉంటాయట. ఓ గంట తర్వాత నా వంతు వచ్చింది. మా బాసు కోసం ఓ అప్లికేషన్ తీసుకుని బయటపడ్డాను. ఇల్లు చేరేసరికి పదయ్యింది. పిల్లలు నిద్రపోతున్నారు. ఆలస్యమెందుకని మా ఆవిద సరిత అడిగితే, జరిగినదంతా వివరించాను.
“సరుకులు చవకగా దొరుకుతాయని, నాచారం నుంచి హబ్సిగుడా దాక వస్తారా మీ బాసు వాళ్ళు”
“అంతేగా మరి. కూరగాయలైతే మరీ చవకట.అందుకే గంటల కొద్దీ లైనులో నిలబడుతున్నారు జనాలు”
“తాజా కూరలు చవకగా దొరికితే ఆ మాత్రం నిలుచుంటార్లెండి. మన కాలనీ చివర్లోని కూరగాయల కొట్లో రేట్లు మండిపోతున్నయి. వాళ్ళ ఆగడాలు ఆగాలంటే ఇలాంటి హైపర్ మార్కెట్లు మరిన్ని రావాలి..”
సంభాషణని పొడిగించడం ఇష్టం లేని నేను మౌనంగా ఉండిపోయాను. భోజనాలు ముగించి నిద్రకుపక్రమించాము. తర్వాత ఓ వారం రోజుల్లోనే ఓ కార్పొరేట్ సంస్థ మా కాలనీలో ఓ హైపర్ మార్కెట్ ని ప్రారంభించింది.
* * *
“కూరలమ్మా కూరలు, టమాటాలు, వంకాయలు,బెండకాయలు….” అంటూ కూరలమ్మి లక్ష్మి మా ఇంటి ముందు ఆగింది. ఆ రోజు క్రిస్టమస్ కావదంతో నేను ఇంట్లోనే ఉన్నాను.
సరిత బయటకి నడిచింది. కూరలను చూస్తూ, ‘టమాటాలెంత?” అని అడిగింది.
“కిలో ఏడు రూపాయలమ్మా”
“చాల ఎక్కువ చెబుతున్నావు. పైగా కాస్త వడలినట్లున్నాయి”
“పొద్దుగాల సంది ఎండలో తిరుగుతున్నా గదమ్మా, అందుకే గట్లున్నయ్. అయినా ఒక్క పుచ్చు కూడా లేదమ్మా”
ఇంతలో మా పై పోర్షన్ లో ఉండే కమల హైపర్ మార్కెట్ నుంచి కూరలు కొనుక్కొచ్చింది. ఆమె భర్త రాఘవ నా బాల్య మిత్రుడు.
“ఎందుకు సరితా? అంత రేటు పెట్టి వడలిపోయిన కూరలు కొనడం? హైపర్ మార్కెట్లో అయితే తాజా కూరలు తక్కువ ధరకే కొనుక్కొవచ్చు, పైగా కాసేపు ఏసిలోనూ ఉండచ్చు” అని మా ఆవిడతో అంది.
“గదేందమ్మో? మాకు పడ్డ రేటు మీద ఓ రూపాయెక్కువేసుకున్నా. మీ ఇళ్ళ దాకా కూరలు తెచ్చి అమ్మినందుకు నాకా మాత్రం గిట్టుబాటు కావద్దా?”
కమల మూతి తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. సరిత కూరలు తీసుకుని, డబ్బులిచ్చి లక్ష్మిని పంపించేసింది.
“కాలనీ వాళ్ళంతా హైపర్ మార్కెట్లోనే కూరలు కొంటున్నారు. మరి మనమేమో.. ఇంకా బండి మీదే కూరలు కొంటున్నం. సరుకులు వీధి చివరి జై మాతాజి కొట్లోనే కొంటున్నాం. ఎప్పుడండీ మనం హైపర్ మార్కెట్ కి మారడం?” అడిగింది సరిత లోపలికొస్తూ.
‘మా హైపర్ మార్కెట్లో కొనండి. మీ నెలవారీ ఖర్చు ఆదా చేసుకోండీ అనే ప్రచారపు మాయలో పడిపోయింది నా శ్రీమతి.
* * *
రెండు నెలలు గడిచాయి. ఓ రోజు సాయంత్రం ఏవో సరుకులు తెచ్చుకుందామని కొట్టుకెళ్ళాను. లక్ష్మి, ఆమె ఆరేళ్ళ కొడుకు శీను అక్కడున్నారు.
లక్ష్మి అరువు కోసం బ్రతిమాలుతోంది.
“అన్నా, ఈ పెద్ద పెద్ద దుకాణాలొచ్చినాక, నా బండి మీద కూరలు కొనడం బంద్ చేసిన్రు. ఏ రోజు కారోజు కమాయించే నా అసుంటోళ్ళకు చానా కష్టమైతోంది. ఓ పావు కిలో నూకలియ్యరాదే, వారం రొజులలో పైసలిచ్చెస్తా”
“కుదరదమ్మా. అరువు లేదు” అన్నాడు రాంలాల్. అతడు ఆ కొట్టు యజమాని రాకేష్ కి తమ్ముదు వరసవుతాడు.
“గట్లనకే అన్నా, పోరగాడు బువ్వదిని రెండు రోజులైతాంది. నీ కాల్మొక్కుతా”
రాకేష్ ఏదో ఆలోచనలో పడ్డాడు. నేను నా ఖాతాలో ఓ బ్రెడ్డు పాకెట్ రాయించి శీను గాడి చేతిలో పెట్టాను. ఏమనుకున్నాడో ఏమో, “రాంలాల్, దే దేనా” అని చెప్పి నా పద్దు చూడసాగడు రాకేష్. లక్ష్మి కి కావలసిన సరుకులిచ్చి ఖాతా పుస్తకంలో రాసుకున్నాదు రాంలాల్.
“సార్, మీ దోస్తు రాఘవ ఈ మధ్య మా కొట్టుకి రావడం లేదే?” అడిగాడు రాకేష్.
“నీకు తెలియనిది ఏముంది రాకేష్, హైపర్ మార్కెట్ వచ్చిందిగా, అందరూ అక్కడే కొంటున్నారు”
“వాళ్ళ లానే మేము కూదా సరుకులను శుభ్రంగా ప్యాకింగ్ చేస్తున్నాము. హోం డెలివరి కూడా చేస్తున్నాము. అయినా ఈ మధ్య బేరాలు తగ్గుతున్నాయి” వాపోయాడు రాంలాల్.
“పేరున్న ప్రతీ పెద్ద కంపెనీ వాళ్ళు చిల్లర వ్యాపారంలోకి వచ్చేస్తుంటే, మా లాంటి చిన్న వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారు. కొన్ని రోజులైతే మేము షాపు మూసేయాల్సొస్తుంది” అన్నాడు రాకెష్.
పేదా, మధ్య తరగతి వర్గాలవారికీ, చిల్లర వ్యాపారులకి మధ్య ఉండే పరస్పరాధారమైన సంబంధం వేగంగా ఛిద్రమవడాన్ని జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తూ ఇల్లు చేరాను.
మర్నాడు ఆదివారం! స్నానం చేసాక పిల్లలకి చదువు చెప్పాను. కాసేపయ్యాక, రాఘవ వచ్చాడు. కబుర్లు చెప్పసాగాడు.
“ఒరే, పొద్దున్నే ఆరు గంటలకల్లా వెళ్ళి లైన్లో నిలుచున్నాను. లోపలికి వెళ్ళేసరికి ఏడైంది. కావలసిన సరుకులు తీసుకున్నాను. కూరలన్నీ అరకిలో పాకింగులే. పావు కిలో కావాలన్నా ఇవ్వడం లేదు. అవసరం లేక పోయినా అరకిలో కొనాల్సి వచ్చింది. అయితేనేం, ఓ పెప్సీ ఫ్రీగా ఇచ్చారు”
“అయిన నీకెందుకురా అంత క్రేజు? శుభ్రంగా మన రాకేష్ కొట్లోనే కొనుక్కోవచ్చుగా? ఇక్కదైతే నీకు కావలసిన పవు కిలో లే తీసుకోవచ్చు”
“హైపర్ మార్కెట్లో షాపింగ్ చెయడం ఒక్ హోదా తెలుసా? పైగా డబ్బులు ఆదా!”
“ఒరే, ఈ లాభాలు తాత్కాలికం! విదేశి బహుళ జాతి సంస్థలు, దేశీయ కార్పొరేట్ సంస్థలు రిటైల్ వర్తక రంగంలోకి రావడంలో ఓ వ్యూహం ఉంది. వాళ్ళు రైతుల దగ్గరనుంచి, ఫాక్టరీలనుంచి సరుకులు నేరుగా కొనేస్తారు. కొన్నాళ్ళపాటు తక్కువ ధరలకు సరుకులను అమ్ముతారు. మనం అలవాటు పడ్డకా, వాళ్ళ రేటుకే మనం కొనుక్కునేలా చేస్తారు.”
“నువ్వెప్పుడు ఇంతేరా, కొత్త ప్రయత్నాలని విమర్శిస్తునే ఉంటావ్”
“కాదురా. ఈ కొత్త ప్రయత్నాలు అందరి మంచికైతే నాకేం అభ్యంతరం లేదు. కాని వీటి వెనుక స్వలాభం ఉంది. అవ్యవస్థీకృత రంగంలోని వ్యాపారులను దెబ్బతీసే లక్ష్యం ఉంది”
“ఏమోరా, ఇవన్నీ నేను ఆలోచించ లేదు”
“అదే మనం చేసే పొరపాటు. ప్రచారాల హోరులో పడిపోతాం. మహా నగరాలలో వాల్ మార్ట్ లాంటి అంతర్జాతీయ సంస్థలు, పట్టణాలలో దేశీయ కార్పొరేట్ సంస్థలు వచ్చెస్తే మన స్థాయి పెరిగిందని అపోహ పడుతాం. ఇలాంటి హైపర్ మార్కెట్లలో షాపింగ్ ఓ ఉన్మాదంగా మారిపోతుంది”
“నువ్వు ఏమైనా చెప్పు. ఈ హైపర్ మార్కెట్ వచ్చాక నాకు చాలా సుఖంగా ఉంది” అంటూ వెళ్ళిపోయాడు రాఘవ.
* * *
మరో మూడు నెలలు గడిచాయి. రకరకాల స్కీములతో హైపర్ మార్కెట్ ప్రజలని ఆకర్షిస్తోంది. లక్ష్మి కూరల బండి ఏమైందో ఎవరికీ తెలియదు. జై మాతాజి కొట్టు మూతపడింది. రాకేష్ కొట్టు లాంటివి నగరంలో కనుమరుగయ్యాయి. రాంలాల్ హైపర్ మార్కెట్లోనే ఉద్యోగం చూసుకున్నాడు. మా కాలనీ వళ్ళకిప్పుడు హైపర్ మార్కెట్ తప్ప మరో గత్యంతరం లేదు. అక్కడ ధరలు ఉన్నట్టుండి పెరిగిపోయాయి. పప్పులు, నూనెలు, చింతపండు, ఉల్లిపాయలు ……. ఒక్కటేంటి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటాయి.
ఓ రోజు సాయంత్రం, “ఏంటండి ఈ విపరీతం? రెండు నెలలవరకు చౌకగానే ఇచ్చారు. ఈ మధ్య ఇంతల రేట్లు పెంచేసారేంటండి? ఆఖరికి పచ్చిపులుసు చేసుకోవాలన్నా కష్టంగానే ఉంది. ఏది కొనేడట్లు లేదు. తినేడట్లు లేదు”అంటూ నిట్టూర్చింది సరళ.
“ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ‘ఆన్ లైన్ ట్రేడింగ్’ పేరుతో రైతులనుంచి సరుకులను నేరుగా కొనేస్తాయి. పంట వేసిన నాడే అమ్మకం జరిగిపోతుంది. బయట ఇంకెక్కడ సరుకు దొరకదు. పైగా పోటీ ఎటూ లేదు. కనుక వాళ్ళకు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతారు” వివరించాను నేను.
“కూరలమ్మిని, ఖాతా కొట్టుని పోగుట్టుకున్నాం! ఇప్పుడు హైపర్ మార్కెట్లోకి అడుగుపెట్టలేకపోతున్నాం. మన పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారయ్యింది” నిష్టూరంగా అంది సరళ.
“మనమే కాదు. అందరం ఇలాగే ఉన్నాము. బడ్జెట్ ని బాలన్స్ చేయడం కష్టమవుతోందని రాఘవ గోల పెడుతున్నడు. కేవలం ఆర్ధిక పరమైన లాభలను దృష్టిలో పెట్టుకుని, మానవ సంబంధాలను నిర్లక్ష్యం చేసాం. దాని ఫలితమే ఇది. మన స్వయంకృతాపరాధమిది” అని చెప్పి వార్తల కోసం టివి ఆన్ చేసాను.
‘ధరల శరాఘాతం’ అంటూ ఓ ప్రత్యెక కధనాన్ని ప్రసారం చేస్తోందా ఛానల్. ధరలు విపరీతంగా పెరగడంతో చివరికి ప్రభుత్వంలో చలనం వచ్చిందని, నగరంలోని అన్ని ప్రముఖ హైపర్ మార్కెట్ల గిడ్డంగుల మీద దాడులు చేసిందని, నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలు చాలా దొరికాయని ఆ వార్తల సారాంశం!
ఆ వార్తాంశాన్ని చూడగానే నా శ్రీమతికి మతి పోయింది. “ఎంత మోసం, కడుపు రగిలిపోతోంది” అని అంది.
వాకింగ్ టైం అవడంతో, టివి కట్టేసి బయల్దేరాను. కాస్త చీకటి పడ్డాక ఇంటికి వస్తూ హైపర్ మార్కెట్ మీదుగా నడుస్తున్నాను. ఇంతలో ఎక్కడించో ఓ రాయి వచ్చి హైపర్ మార్కెట్ గాజు తలుపుకి తగిలింది. వెంటనే ఉద్యోగులు కొందరు బయటకు వచ్చి చూసారు. కాని ఆ రాయి విసిరింది ఎవరో వారికి తెలియలేదు. అది చాలా చిన్న రాయి కావడంతో పెద్దగా నష్టమేమి జరగలేదు. ఎవరికీ గాయలు కాలేదు. గాజు తలుపు మీద ఓ చిన్న పగులు ఏర్పడింది అంతే!
ఆ రాయి విసిరింది లక్ష్మి కొడుకు శీను అని నాకు తెలుసు. వాడు చేసింది తప్పే. కానీ తమ జీవనాధారాన్ని నాశనం చేసినవరిపై చేతనైన నిరసన తెలపడం వాడి ఉద్దెశ్యమేమో!
(ఈ కధ 1 ఏప్రిల్ 2007 నాటి ప్రజా శక్తి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది)
ఆగష్టు 24, 2007 at 6:43 పూర్వాహ్నం
Disclaimers ఏమి పెట్టరా మీ వ్యాసములొ
ఆగష్టు 24, 2007 at 11:32 పూర్వాహ్నం
ఏమోనండి. ఫలానా సైడ్ తీసుకొని మాట్లాడేంత చిన్న విషయం కాదు. ఇది ప్రజాశక్తిలోది అన్నారు కాబట్టి, ఇదంతా కమ్యూనిస్ట్ భావజాలమేమో! ఒక వైపు బజాకం వద్దంటారు. మరోవైపు, ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలంటారు. చిన్న వర్తకులు దెబ్బతింటారన్నది నిజమే అయినా, రేపేదో ఉపద్రవం వస్తుంది అని ఇవ్వాల్టి ఉపయోగాల్ని పక్కనపెట్టటమేమిటి. చిన్న వర్తకులు ఏమైనా అధ్బుతమయిన క్వాలిటీ వస్తువులు అమ్ముతున్నారా? ప్రపంచీకరణలో ఇవన్నీ భాగమే. అంతగా బజాకం వద్దనుకుంటే వెళ్ళమనండి 1990 రోజుల్లోకి తలుపులు మూసుకొని మొత్తం ప్రపంచాన్ని వెలివేసినట్లుగా.
ఆగష్టు 24, 2007 at 12:58 అపరాహ్నం
mee katha bagundi… konni images add cheste inka baguntundi… http://www.kesland.blogspot.com
ఆగష్టు 24, 2007 at 1:01 అపరాహ్నం
క్షమించండి. ఇది ప్రజాశక్తి వాళ్ళ సొంత వ్యాసం అనుకున్నాను. ఇది ప్రజాశక్తి లో అచ్చువేయబడ్డ మీ వ్యాసమని ఇప్పుడే మళ్ళీ చది తెలుసుకున్నాను. ఏది ఏమైనా నా అభిప్రాయాలలో పెద్దగా తేడా ఏమీ లేదు.