” అవును. నేను జీరోని. నేను శూన్య భట్టా చార్యని. ఇది నా కధ! ఇరవై ఐదేళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు నా జీవితాన్ని పునశ్చరణ చేసుకుంటున్నాను. అందరు పిల్ల లాగ్లే నాకూ నా తల్లిదండ్రులు ఓ పేరు పెట్టారు. అది ‘శూన్య’ అని. ఏ ప్రబుద్ధుడు సూచించాడో కాని, మా అమ్మా నాన్నలు నాకా పేరు ఖాయం చేసేసారు. ఆ పేరు లోని తియ్యదనాన్ని ఆస్వాదించకుండానే వాళ్ళిద్దరూ కన్నుమూసారు. షీలా ఆంటీ దయతో నన్నో రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించారు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. నేనో సగటు విద్యార్ధిని. చదువులలోనే కాదు, ఇతర రంగాలలోనూ నా ప్రతిభ అంతంతమాత్రమే! నన్ను చూసి ఎవరూ గర్వపడరు. అయినా ఒకళ్ళని చూసి గర్వపడాలంటే చదువులోనైనా, ఆటలలోనైనా లేదా మరే ఇతర రంగంలోనైనా ఏదైనా సాధించి చూపాలి  నా బాల్యం ప్రభావం నా మీద ఇప్పటికీ ఉంది. అప్పటి జ్ఞాపకాలను నేనెప్పటికీ మరవలేను. నా పేరుకి సార్ధకత కల్పించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. బడిలో అందరు నన్ను ‘జీరో’ అని పిలిచేవారు. మిగతా పిల్లలలో కొందరు ‘హరో’లు ఉండేవారు. అయితే పేరులోనేముందో నాకర్ధం కాదు. గర్వపడినా, సిగ్గుపడినా నా పేరు నాదే. కాని నిజం చెప్పాలంటే నా పేరంటే నాకు అసహ్యం. మా పాఠంలో చదివిన పద్యంలా నా జీవితం సాఫీగా సాగలేదు. నేను ఏ ఆటలోను రాణించలేదు. చదువులోను అద్భుతాలని చేయలేదు. అన్ని రంగాలలోను నేనెందుకు విఫలమవుతున్నానో నాకు తెలియలేదు. నా అపజయాలను చూసి అందరూ నవ్వేవారు. తరగతి గదిలోని పదిహేనేళ్ళ అనాసక్త జీవితం, ఆటస్థలంలోని స్వేచ్ఛని తలచుకున్నప్పుడల్లా, మా విద్యార్ధుల చుట్టూ కనపడని కంచెలు ఉన్నట్టు నాకనిపించేది. ఈ రక్షణ కంచెలను అతి జాగ్రత్తతో ఏర్పాటు చేసినట్లు తోస్తుంది. ఈ కంచెని దాటాలను చూసినప్పుడల్లా, నా తోటి విద్యార్ధులు, ఉపాధ్యాయులు నన్ను హేళన చేసేవారు. ” నువ్వు నిజంగా జీరోవే. ఎందుకూ పనికి రాని దద్దమ్మవి! వట్టి సున్నాగాడివి” అని అనేవారు. నాకు ఆకాశమన్నా, గాలి పటాలన్నా బాగా ఇష్టం. కిటికి గుండా, స్కూలు బయట ఉన్న చెట్టు మీది పక్షుల కూతలను వింటూ కాలం గడిపేవాడిని. కాగితాలతో విమానాలని చేసి గాలిలోకి విసరడం నాకెంతో ఇష్టం. ఎప్పుడూ స్వేచ్ఛావిహంగంలా గాలిలో ఎగరాలనే నా కలలకి అది కొనసాగింపు కావచ్చు. కాని నా తోటి విద్యర్ధులు, ఉపాధ్యాయులు నన్ను హేళన చేసేవారు. ” నువ్వు నిజంగా జీరోవే. ఎందుకూ పనికి రాని దద్దమ్మవి! వట్టి సున్నాగాడివి” అని అనేవారు. ఇతరులకి చెప్పుకోడానికిగాని, ఎవరినైనా అడగడానికిగాని, ధృవీకరించుకోడానికిగాని నాకెవరు లేరు. క్రమంగా నేను వాళ్ళ మాటలను విశ్వసించసాగాను. నిజంగా నేను సున్నాగాడినే. ఎందుకూ పనికిరానివాడినే. కొన్నేళ్ళ తర్వాత, స్కూలు జీవితం ముగిసి, కాలేజిలోకి ప్రవేశించాను. కాని ఇక్కడ కూడ తోటి విద్యార్ధుల నుంచి హేళనలే ఎదురయ్యాయి. చాలా సులువుగా నన్ను జీరోని చేసేసారు. నా ప్రతిభ ఏ మాత్రం మెరుగుపడలేదు. నా మనోభారం తగ్గలేదు. బహుశా గాలిలోకి ఎగరాల్సిన కాగితం విమానం బరువెక్కువైందేమో! కాలేజిలో నాకెదురైన మంచి అనుభవమో లేక దుర్ఘటనో నాకు తెలియదు కాని, కనీసం కొద్ది కాలం పాటైనా నా మనసులోని బాధని చెప్పుకోడానికి ‘అర్పిత’ దొరికిందనుకున్నాను. కాని కొద్ది రోజులలోనే ఆమె రాహుల్ తో జత కట్టి నన్ను వదిలించుకుంది. ” నువ్వు నిజంగానే జీరోవి. పలాయానవాదివి. జీవితంలో నీకో లక్ష్యం లేదు. కనీసం అందమైనఅమ్మాయిలతో ఎలా మాట్లడాలో కూడా తెలియదు. నువ్వు వట్టి సున్నావి” అంటూ మా స్నేహాన్ని (?) త్రుంచేసింది. నా తప్పు – అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియకపోడమా లేక నా వద్ద డబ్బు లేక పోడమా అనేది నాకు తెలియలేదు. బహుశా కొంత కాలం తర్వాత నేనీ చిక్కుముడిని విప్పగలనేమో. ప్రతీ రాత్రి ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ, నా తలిద్లండ్రులను గుర్తు చేసుకుంటాను. ” అమ్మా, నాన్నా మీరెక్కడ ఉన్నారు? నాకీ పేరు ఎందుకు పెట్టారు? నేను నిజంగా దద్దమ్మనా? నన్ను కూడమీ దగ్గరకి తీసకుపొండి” అంటూ బ్రతిమాలుకునేవాడిని. ఎవరూ జవాబిచ్చే వారు కాదు. కాలేజి చదువు తర్వాత, నాకు ఉద్యోగం దొరకడం కష్టమైంది. మనుగడ కోసం చేసే పోరాటం ఎంత దుర్భరమో నాకు అర్ధమైంది. నన్ను నేనే అసహ్యంచుకోసాగాను.

* * *

” నా ఆక్రోశాన్ని చెప్పుకోడానికి అక్కడ ఎవరూ లేక, ఇంత దూరం కాశ్మీరు దాక రావల్సి వచ్చింది అంకుల్! షీలా ఆంటీ, మీరు తప్ప నాకీ పంచంలో ఎవరున్నారు? షీలా ఆంటీ స్వర్గస్తుప్రలయ్యాక,నాకింక మిగిలింది మీరొక్కరే అంకుల్” అంటూ ప్రహ్లాద్ గారి పాదాల వద్ద కూర్చున్నాడు శూన్య.
ప్రహాద్ల్ గారు శూన్య తలమీద చేయి వేసి, జుట్టు నిమురుతూ అతడికి సాంత్వన కలిగించే ప్రయత్నం చేయసాగారు. కొన్ని క్షణాల తర్వాత
ఆయనచెప్పసాగారు.
” నాయనా, నువ్వు దద్దమ్మవి కాదు. నీపేరు శూన్య. నువ్వు నిజమైన సున్నావి” అని అన్నారు. శూన్యకి ఆయనేం మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు.

” నీకు మీ అమ్మానాన్నలు ఆపేరు పెట్టడంలో ఒక కారణం ఉంది. శూన్యం అంటే ఖాళీ అనే కాదు. ఏమీ లేదనే అర్ధం కూడ ఉంది. సున్నాని కనిపెట్టిన ఆర్యభట్ట ఏమన్నాడో తెలుసా – ‘సున్నా అనేది మానవుల సంగ్రహణ శక్తి ని అభివృద్ధి చేసిన ఓ భావన, ఓ చిహ్నం’ అని అన్నాడు. సున్నా లేక పోతే లెక్కలలో కేవలం ధనాత్మక విలువలే ఉండేవి. సున్నా ఆవిష్కరణతో ఋణాత్మక విలువలు కూడ చేరి గణితానికి ఓ కొత్త కోణాన్ని కల్పించాయి. నిజంగా సున్నా చాలా విలువైన అంకె. చాలా ముఖ్యమైన గుర్తు” అంటూ ఆపారు. మళ్ళీ మాట్లాడుతూ..” సున్నా, ధనాత్మక విలువలకి – ఋణాత్మక విలువలకి, మంచికి చెడుకి మధ్య తేడాని సూచిస్తుంది. దానికంటూ ఏ విలువా లేనప్పటికీ, అదెంతో అమూల్మమైనది” అని అన్నారు. ఈ మాటలంటున్నప్పుడు ఆయన కళ్ళు మెరిసాయి. “సున్నా అనేది ఓ ప్రారంభం! అంతం కాదు. సున్నా ఓటమి కాదు. విజయం యొక్క అగ్రభాగం. సున్నా అనేది లేకపోతే ఎక్కడి నుంచి ప్రారంభించాలో ఎవరూ తెలుసుకోలేరు. నీ జీవితాన్ని నూతన ఆశలతో కొతగా ఆరంభించు. నీకా సామర్ధ్యం ఉంది. ఎందుకంటే నువ్వు ఓ ప్రత్యేక వ్యక్తివి. సున్నావి. తొలి అడుగువి. నీలా కలలు కని, సమాజాన్ని మార్చగలిగే యువకులే దేశానికిప్పుడు కావాలి. నువ్వు నీ మార్గాన్ని ఎంచుకో. కొత్త ప్రారంభానికి కాస్త ఆలస్యమైనా ఏం పర్వాలేదు. అసలు ప్రయత్నమే చేయకపోడం కన్నా, ఆలస్యంగానైనా ప్రయత్నించడం మంచిది” అంటూ ఆపారు. వాళ్ళింటి బయట చిన్నగా మంచు కురుస్తోంది. వీళ్ళిద్దరు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుని జీవితాన్ని అర్ధం చేసుకోడానికి, సార్ధకం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ” చివరగా నేనో మాట చెబుతాను. బయట కురుస్తున్న మంచుని చూడు. అది ఎంత తెల్లగా ఉందో. ఆ తెల్లదనం మురికినంతా శుద్ధం చేసి నేలని స్వచ్ఛంగా చేస్తుంది. ఈ మంచుకి, సున్నాకి సంబంధం ఉంది. మంచు సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద తయారవుతుంది. అంటే సున్నా అంటే స్వచ్ఛతఅన్న మాట!దానికి చెడుని దూరం చేసే శక్తి ఉంది……. ” అని చెప్పి శూన్య నుదుటిపై చిన్నగా చుంబించి, తన గదిలోకి వెళ్ళి నిద్రపోయారాయన. కిటికి లోంచి చేతులు బయటకు చాచి, మంచుని ఆస్వాదించసాగాడు శూన్య. తన చూపులను ఆకాశం కేసి మళ్ళించాడు. పాతికేళ్ళ తర్వాత అతడి ప్రశ్నలకు జవాబు దొరికింది. బయట సన్నగా కురుస్తున్న మంచు అతడి హృదయాన్ని పరిశుద్ధం చేసింది. ‘ ఈ క్షణం నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిసాన్తు’ అని అనుకుంటూ, ‘ ఆలస్యంగా నైనా ప్రయత్నించడం చాలా మంచిది’ అన్న ప్రహ్లాద్ గారి మాటలను గుర్తు చేసుకున్నాడు. “అవును. నేను నిజంగానే ‘సున్నా’నే! నేనంటే నాకెంతో గర్వంగా ఉందీ రోజు”అని అనుకున్నాడు.

ఆంగ్ల మూలం: ప్రసూన్ రాయ్

(ఈ కధ 21 జూన్ 2006 నాటి నవ్య వార పత్రికలో ప్రచురితమైంది)