Archive for ఆగష్టు, 2007

అయినా మనిషి మారలేదు

ఆమెని చూసిన క్షణం నుంచి, అతడి దృష్టి మరెక్కడా నిలవలేదు. ఆమె కళ్ళలోని మెరుపు, ఆమె తియ్యటి స్వరం - ఆమె తైల సంస్కారం లేని జుట్టు, చినిగిన బట్టల ముందు వెలవెలబోతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఆమెలో అతనికి తన కూతురి పోలికలు కనబడుతున్నాయి. ఆ పిల్ల వయసు ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాలుండచ్చు. ఆ పిల్ల తన దగ్గరికి రాకూడదని, వచ్చినా డబ్బులు అడగకూడదని అతడు కోరుకున్నాడు. మల్టీ మిలియన్ల డాలర్ల కంపెనీల వ్యవహారాలను చక్కబెట్టిన ఆకాశ్‌కి, ఈ సంఘటనని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాలేదు. అతడు ఆలోచనల్లోకి జారుకున్నాడు.

* * *

చిన్నతనంలో గుడికి వెళ్ళినప్పుడు, బయట రెండు వరుసలలో కూర్చుని అడుక్కునే బిచ్చగాళ్ళు అతడినెంతో ఆకర్షించేవారు. ప్రతి ఒక్కరి చేతిలోను ఓ సత్తు పళ్ళెం ఉండేది. అందులో భక్తులు వేసిన కొన్ని చిల్లర నాణాలు గలగలలాడుతుండేవి. గుడికి వెళ్ళేముందు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన చిల్లర పైసలను జాగ్రత్తగా పంచేవాడు ఆకాశ్
బహుశా కర్ణుడికి ఇంతకంటే మంచి అనుచరుడు దొరికి ఉండడేమో! కాని కాస్త వయసొచ్చేసరికి, ఆకాశ్‌లో మార్పు వచ్చింది. ఆ మార్పు- తల్లిదండ్రుల చేతలను గుడ్డిగా అనుకరించడం మానడం వల్లనా లేక సొంతంగా సంపాదించుకునేసరికి దానం చేయాలంటే కలిగిన అనాసక్తి వల్లనా అనేది తెలియడం లేదు.
మొదట్లో ఎవరు అడిగినా, కాదనకుండా ఒక రూపాయి బిళ్ళ దానం చేసేవాడు. ఎవరైనా బిచ్చగత్తె చంటిపిల్లని ఎత్తుకుని, కనీసం పాలకైనా డబ్బు లేదంటూ అడుక్కుంటుంటే, ఆకాశ్ హృదయం ద్రవించిపోయేది. కాని కాలక్రమేణా చిన్ననాటి జాలిగుణం, యవ్వనంలోని ‘సాయపడాలనే లక్షణం’ అతి త్వరగా చికాకు గా మారిపోయాయి. ‘డబ్బు అడుక్కోడం’ కనపడని ప్రాంతం ఒక్కటి కూడ లేదనిపించింది. బిచ్చగాళ్ళు సర్వవ్యాపులని అతడికి అర్ధమైంది. అతడు ఎక్కడికి వెళ్ళినా - గుడికి కాని, బీచ్‌కి గాని, రైళ్ళలో గాని - ఎక్కడ పడితే అక్కడ బిచ్చగాళ్ళు తారసపడేవారు. మరికొంత మంది చాలా వ్యూహాత్మకంగా, ఇటీవలే కొత్తగా ప్రారంభించిన ఓ బహుళ అంతస్తులోని షాపింగ్ కాంప్లెక్సు ముందు కూర్చుని అడుక్కునేవారు. అరవై రూపాయలు పెట్టి ఓ కప్పు కా ఫి తాగి బయటకి వచ్చిన వారిని అడుక్కుంటూ, వారిలో కొద్దిగానైనా అపరాధభావం తలెత్తేలా చేసేవారు. జనాలు కూడా కొద్దిపాటి చిల్లర వాళ్ళ పళ్ళెంలో వేసి, సులువుగా పుణ్యాత్ములైపోవాలని చూసేవారు.
గత కొద్దికాలంగా తనలో వచ్చిన మార్పులకి ఆకాశ్ ఆశ్చర్యపోయాడు. “నేను చదివిన పుస్తకాలు నన్ను మార్చేసాయా? లేక పెట్టుబడిదారి విధానాన్ని సమర్ధించే నా వాదనలు నాలోని మానవత్వాన్ని దూరం చేస్తున్నాయా?” అని అనుకున్నాడు. ఇతరులని డబ్బు అడగడం చాలా నామోషీ అయిన పని కాబోలని అనుకునేవాడు ఆకాశ్. కాని అందరూ చేస్తున్నది అదే కదా!
కొందరు పొద్దున్నే తమ ఇరుగుపొరుగు వారిని ఓ కప్పుడు పంచదార అడుగుతారు. స్కూళ్ళు కాపిటేషన్ ఫీజు రూపంలో విద్యార్ధులని డబ్బులడుగుతాయి. రాష్ట్రాలు కేంద్రాన్ని డబ్బులడుగుతాయి. విపత్కర పరిస్థితులలో, దేశం మిగతా ప్రపంచం నుంచి ఆర్ధిక సాయం కోరుతుంది. కాబట్టి అడగడం లేదా పుచ్చుకోడం అంత హీనమైనవి కావని ఆకాశ్ గ్రహించాడు. తన సంపాదనలో కొంత భాగాన్ని ఓ ప్రముఖ సంస్ధకి విరాళంగా ఇవ్వడానికి దాచుంచేవాడు.
అతడిని చికాకు పెట్టే అంశం ఏంటంటే, ప్రజలు ముష్టెత్తుకోడాన్ని ఓ వృత్తిగా తీసుకోడం! యాచన - పెట్టుబడి అక్కర్లేని ఓ వ్యాపారంగా మారిపోడం! వికలాంగులా నటించి ముష్టెత్తుకుని, తర్వాత శుభ్రంగా నడచివెళ్ళేవారిని చూసినా, అటువంటి వాళ్ళ గురించివిన్నా ‘దానం’ అంటేనే ఆకాశ్‌కి చిరాకు కలిగేది.
బిచ్చగాళ్ళకి చిల్లర వేసి వదిలించుకునే కన్నా, ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం కనుగొనాలని ఆకాశ్ భావించాడు. అప్పటినుంచి, బిచ్చగాళ్ళు ఎదురైనప్పుడల్లా వాళ్ళ జీవితాలగురించి ఆరా తీసి, బాగు పడడానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వసాగాడు. తమ క్లబ్ సమావేశంలో తన బృహాత్ ప్రణాళికని వివరించి, ప్రశంసలు పొందాడు.

* * *

తన కోటు అంచుని పట్టుకుని ఎవరో గుంజుతుండడంతో, వర్తమానంలోకి వచ్చాడు ఆకాశ్. ఇందాకటి అమ్మాయి అక్కడ ఉంది. ఆ పాప కళ్ళలోకి సూటిగా చూసాడు ఆకాశ్. ఆమె సత్తు పళ్ళెంలో ఒక పాత రూపాయి నోటు, కొన్ని పావాలా నాణాలు, కొన్ని అర్ధరూపాయి నాణాలు ఉన్నాయి. చెమటతో ఆమె ముఖం నిగనిగలాడుతోంది. రోడ్డు మీద చాలా సేపు నడవడం వల్ల వచ్చిన అలసట ఆమె ముఖంలో కనబడుతోంది. సొంత కూతురికి పాకెట్ మనీ ఇవ్వడంలో రెండో ఆలోచన చేయని ఆకాశ్, ‘అడుక్కోకుండా, కష్టపడి సంపాదించుకోవాలని’ ఈ పాపకి ఎలా చెబుతాడు?
ఆమె గురించి తెలుసుకుని, ఆమెని ఏదైనా స్వచ్ఛంద సంస్ధలో చేర్పించాలని, ఆమె చక్కగా చదువుకునేలా చూడాలని, ఆమెకో మంచి జీవితాన్ని అందించడంలో సాయపడాలని అనుకున్నాడు ఆకాశ్. ఇంతలో కొద్ది నిముషాలలో తాను హాజరవ్వాల్సిన ఓ సమావేశం గురించి అతడి సెల్‌ఫోన్ లోని అలారం అతడిని హెచ్చరించింది.
గతంలో అందరూ చేస్తారని ఎన్నోసార్లు అనుకున్నట్లే, పళ్ళెంలో కొంత చిల్లర వేసి - పేదరికాన్ని, వ్యధని వ్యక్తం చేస్తున్న ఆమె చూపులనుంచి తప్పుకోడం ఎంతో సులువని ఆకాశ్ గ్రహించాడు. ఆ పనే చేసాడు.

అతడు ఎదగడానికి ఇంకా సిద్ధమవలేదు మరి!

ఆంగ్ల మూలం: దీపా సుందరరాజన్

(ఈ కధ ఏప్రిల్ 2007 నాటి ఉషశ్రీ వెలుగు అనే పత్రికలో ప్రచురితమైంది)


1 comment ఆగష్టు 31, 2007

Previous Posts


Blog Stats

ఇటీవలి జాబులు

ఇటీవలి అభిప్రాయములు

Madhu Janjur on “అమృత వర్…
Krant hi on నా గురించ…
కొల్లూ… on విచారగ్రస్…
phani pradeep on విచారగ్రస్…

వర్గములు:

Blogroll

ఖజానాలు