వాళ్ళిద్దరూ ఫుట్‌పాత్ మీద దూరం దూరంగా నిల్చున్నారు. ఆమె తన తలను వంచుకుని నిలబడింది. అతనేమో ఆమెకేదో చెబుతున్నాడు. కాని వాళ్ళ కళ్ళు కలవడం లేదు. చివరగా అతడు తల విదిల్చి, రోడ్డు కేసి చూడసాగాడు. దూరంగా ఓ ఆటో వస్తూ కనపడింది. అతడు చెయ్యెత్తి ఆటోని పిలిచే లోపు, ఆ ఆటోలో ఇంకెవరో ఎక్కేసారు.
ఇదంతా చూస్తున్న నంద కిషోర్ తన ఆటోని స్టార్ట్ చేసి యూ-టర్న్ తీసుకుని అతడి ముందు ఆపాడు. ఆమె ఇంకా దూరంగానే నిల్చుని ఉంది. అతడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. నంద కిషోర్ సరేనన్నాడు. నంద కిషోర్ నవ్వినప్పుడు అతడు కిళ్ళీ వేసుకున్నాడని తెలుస్తోంది.
అతడు ఆమె ఆటో ఎక్కుతుందేమోనని చూసాడు. ఆమె కదలలేదు. కాసేపు చూసి, ‘ఆటో ఎక్కు’ అని అన్నాడు. అయినా ఆమె కదలలేదు. ఆమె ఆటో ఎక్కదేమోనని నందకిషోర్‌కి అనిపించింది. ఓ రెండు క్షణాల తర్వాత ఆమె గట్టిగా ఊపిరి తీసుకుని, ముందుకి వచ్చి, ఆటో ఎక్కి సీటు చివరగా జరిగి కూర్చుంది. అతడు కూడా ఎక్కి కూర్చున్నాడు. ఆటో బయల్దేరింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆమె నుదుటన ఉన్న సిందూరాన్ని బట్టి నంద కిషోర్ ఆ విషయం గ్రహించాడు. వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళే.
28-30 సంవత్సరాలలోపే ఉంటుంది వాళ్ళ వయసు. ఆమె కట్టుకున్న పట్టుచీర చూస్తే వారికి ఆర్ధికంగా ఏ ఇబ్బందులు ఉన్నట్లు అనిపిస్తోంది.
ఆమె ఆటో ఎక్కినప్పటికీ, వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదరలేనేది స్పష్టం! ఆమె సీటుకి చివరగా కూర్చోడం, రోడ్డు కేసి దృష్టి సారించి ఉండడం అద్దంలోంచి నంద కిషోర్ గమనిస్తున్నాడు. భర్త ఏదో అడుగుతుంటే ఆమె సమాధానం ఇవ్వడం లేదు. అతడు ఇంగ్లీషులో మాట్లాడుతుండడంతో అతడి మాటలు నంద కిషోర్ కి అర్ధం కావడం లేదు. కాని పెద్దగా నిట్టూరుస్తూ భర్త పక్కకి తిరగడం అతడిలో ఆగ్రహాన్ని సూచిస్తోంది. వాళ్ళు ఏ విషయం మీద పోట్లాడుకుంటున్నారో నంద కిషోర్‌కి అర్ధం కాలేదు.
వాళ్ళిద్దరిని గమనించడంలో నిమగ్నమైన నంద కిషోర్ రెడ్ సిగ్నల్ పడడం ఆలస్యంగా గమనించాడు. హఠాత్తుగా బ్రేక్ వేసాడు. ఒక్క కుదుపుతో ఆటో ఆగింది. వాళ్ళిద్దరికి నంద కిషోర్ క్షమాపణలు చెప్పాడు. ఇంతలో చిరిగిన దుస్తులలో ఉన్న ఓ యువకుడు కుంటుతూ ఆటో దగ్గరికి వచ్చి, భర్తకి నమస్కరిస్తూ, ‘సార్, పొద్దున్నుంచి ఏమీ
తినలేదు. నాకు బి.పి. చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా సాయం చేయండి” అంటూ ప్రాధేయపడసాగాడు.
” ఏంటీ, నీకు హై బి.పి.నా?” అంటూ కనుబొమ్మలు ఎగరేసాడు నంద కిషోర్.
” అవును బాబు”
” ఎందుకు? రీడింగ్ ఎంతుంది?”
” ఏం రీడింగ్?”
” అదే బి.పి. రీడింగ్! 100/60, 120/70, లేక 130/80 – ఎంతుంది?”
ఆ కుర్రాడు గుటకలు మింగాడు. ‘130/80′ అని చెప్పాడు.
” దొంగ వెధవా, నేను నిన్ను తన్నకముందే ఇక్కడి నుంచి పో! నీ ఆరోగ్యం దివ్యంగా ఉంది” అంటూ అరిచాడు నంద కిషోర్.
అప్పటి దాకా కుంటుతూ నడిచిన ఆ కుర్రాడు మాములుగా నడుస్తూ అక్కడినుంచి జారుకున్నాడు. నంద కిషోర్ ఇంజన్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు.
“ఇంతకు ముందు కూడ ఇలాగే జరిగింది సార్! ఒక సారి నేను మా అమ్మాయిని కాలేజికి తీసుకువెడుతున్నాను. మా అమ్మాయి మెడిసిన్ చదువుతోంది. ఒక యువకుడు వచ్చి ఇలాగే హై బిపి ఉందంటూ డబ్బులు అడిగాడు. మా అమ్మాయి వాడిని రీడింగ్ ఎంతని అడిగింది. వాడు సమాధానం చెప్పలేక చల్లగా జారుకున్నాడు…..” అంటూ చెప్పాడు నంద కిషోర్.
” మీ అమ్మాయి మెడిసిన్ చదువుతోందా?” ఆశ్చర్యంగా అడిగాడు భర్త.
ఇంతలో గ్రీన్ సిగ్నల్ పడడంతో బండిని ముందుకు పోనిచ్చాడు నంద కిషోర్.
“అవునండి. నమ్మలేక పోతున్నారు కదూ! మా పాప ఎప్పుడూ క్లాసులో ఫస్టే. ఆరో తరగతి నుంచే స్కాలర్‌షిప్ పొందింది. ఆమె పై చదువుల కోసం నేనొక్క పైసా కూడ ఖర్చుపెట్టలేదు. నిన్న మా అమ్మాయి నాతో ఏమందో తెలుసా సార్? తను డాక్టరుగా ప్రాక్టీసు ప్రారంభించగానే నేను ఆటో నడపడం మానేయాలట! ‘ ఏమ్మా, మీ నాన్న ఆటో డ్రైవర్ అని చెప్పుకోడానికి నీకు నామోషీనా’ అని అడిగాను. అప్పుడు మా అమ్మాయి ‘అది కాదు నాన్నా, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు. ఇక నా వంతు’ అని అంది సార్” అంటూ చెప్పుకొచ్చాడు నంద కిషోర్.
భర్త సంభ్రమంగా వింటున్నాడు.
“నిజానికి పాప పుట్టినప్పుడు నేను దాదాపుగా ఏడ్చినంత పని చేసాను. ‘అయ్యో, భగవంతుడా, నేనేం పాపం చేసాను? నాకు ఆడపిల్లనిచ్చావు?’అంటూ దేవుడిని నిలదీసాను. నా మిత్రులంతా నా పై తెగ జాలి చూపించారు. ‘పాపం నంద కిషోర్’ అనేవాళ్ళు. నా స్థానంలో వాళ్ళని ఊహించుకోడానికి కూడ ఇష్టపడలేదు. మా వాళ్ళంతా అంటారు – ఆడపిల్ల శాపం, పరాయి సొత్తు అని! కాని మా విషయంలో అది తప్పయింది. మా పాప మాకు వరం సార్” చెప్పాడు నంద కిషోర్.
కాసేపు ఆటోలో నిశ్శబ్దం రాజ్యమేలింది.
“మరిమీ అమ్మాయి పెళ్ళి గురించి ఏం ఆలోచించావు?” అడిగాడు భర్త.
“డాక్టరుగా బాగా పేరు సంపాదించుకున్నాకనే పెళ్ళి సంగతి ఆలోచిస్తానని అమ్మాయి అంటోంది. మా ఆవిడైతే ఈ మధ్య మా అమ్మాయి పెళ్ళిగురించే బెంగ పడుతోంది. సరైన కుర్రాడు దొరుకుతాడో లేదోనని ఆందోళన. ఒక వేళ మంచి అబ్బాయి దొరికినా వాళ్ళు అడిగేంత కట్నం మేమివ్వగలమో లేమోనని తెగ భయపడతోంది. ‘దేవుడిపై నమ్మకం ఉంచు. ఇప్పటి దాక మనకి మేలు చేసిన ఆ దేవుడు ఇక ముందుకూడా మేలే చేస్తాడు’ అంటూ నేను మా ఆవిడకి ధైర్యం చెబుతుంటాను” అన్నాడు నంద కిషోర్.
కాసేపు ఎవరూ మాట్లాడలేదు.
అద్దం లోంచి చూస్తుంటే, భర్త నుదుటిపై ముడతలు కనపడుతున్నాయి. అతడు దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. భార్య ఇదివరకులా రోడ్డుమీదకి చూడడం లేదు. ఆమె తన భర్త కేసి చూస్తోంది. రోడ్డు మీద రద్దీ పెరగడంతో నంద కిషోర్ తన దృష్టినంతా కేంద్రీకరించి ఆటో నడపసాగాడు. చివరగా ఓ మందుల కొట్టు దగ్గర ఆటోని ఆపాడు. ఆ కొట్టు పక్కనే ఉన్న సందు చివరలో ఓ క్లినిక్ ఉంది. అక్కడున్న బోర్డుపై ‘ ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సౌకర్యం కలదు’ అని వ్రాసుంది. ఈ క్లినిక్ లో చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తారని వినికిడి.
నంద కిషోర్ ఇంజన్ ఆపి, వెనక్కితిరిగి చూసాడు. వాళ్ళిద్దరూ కదలలేదు.
“మీరు చెప్పిన చోటుకి వచ్చేసాం” అన్నాడు నంద కిషోర్.
“అవును” అంటూ ఆ క్లినిక్ దిశగా చూసాడు భర్త. కాని ఆటో దిగే ప్రయత్నం చేయలేదు. తన భార్య కేసి చూస్తూ, ” మేము మనసు మార్చుకున్నాం. మమ్మల్ని మా ఇంటి దగ్గర దింపేయ్” అని అన్నాడు.
వెంటనే భార్య ముఖం పై చిరునప్వు వెలసింది. సంతోషంతో భర్త చేతిని తన చేతిలోకి తీసుకుంది.

ఆంగ్ల మూలం: విక్రం కపూర్

( ఈ కధ 12 నవంబర్ 2006 నాటి వార్త దిన పత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది)