నేను నా వాచీ కేసి చూసుకున్నాను. సమయం రాత్రి పదవుతోంది. దివ్యకి ఆలస్యం అయిన ట్లుంది. చుట్టుపక్కల చూసాను. షాపింగ్ మాల్ అంతా ఖాళీ అవుతోంది. అప్పటిదాక షాపుల వద్ద తచ్చాడుతున్న జనాలు ఒక్కసారిగా పలచబడసాగారు. ఒక మూల నుంచి శుభ్రపరిచే స్త్రీ తన పనిని మొదలుపెట్టింది. ఒక కర్రకి కట్టిన తడిగుడ్డతో నేలను శుభ్రం చేస్తోంది. ఆ పనిని ఆమె కొన్ని లక్షల సార్లు చేసుంటుంది. మాములుగా నాకీ ‘మాల్స్’ నచ్చవు. కొనుగోలు ఉన్నాదంలో పడికొట్టుకుపోడం…., డబ్బంటే లెక్కలేని తనం… నాకు పడవు.
నేను నా వాచీ కేసి మరో సారి చూసుకున్నాను. దివ్య చెప్పింది నిజం! నాకిష్టం లేనప్పటికీ, ఇక్కడ ఈ మాల్ లో ఉండడం నాకో గొప్ప అనుభవాన్ని ఇచ్చింది.
” ఆ సమయంలో మనం జనాల గురించి పట్టించుకోనక్కరలేదు. కేవలం మనమిద్దరమే ఉంటాం. దాని సహజసిద్ధమైన లక్షణాలను ప్రదర్శించే ఓ స్ధలాన్ని సామాజిక దృష్టి కోణం నుంచి గమనించడం అద్భుతంగా ఉంటుంది…” అంటూ ఎంతో నమ్మకంగా చెప్పింది దివ్య చిరువవ్వుతో. దివ్య చెప్పగా, చెప్పగా చివరికి ఒప్పుకున్నాను. ఫలితమే – నేనిక్కడ… బెంగుళూరు శివార్లలో కొత్తగా వెలసిన ఈ షాపింగ్ మాల్ లో ఉండడం! ఇంకా దీని నిర్మాణం పూర్తి కాలేదు. కాని తచ్చాడడానికి కావలసినన్ని కొట్లు ఇప్పటికే ఈ షాపింగ్ మాల్ లో వచ్చేసాయి.
అక్కడ జరిగే సంఘటనలను సామాజిక దృష్టికోణం నుంచి పరిశీలిస్తూ, దివ్య కోసం ఎదురుచూస్తున్నాను. ఆకలిని, విసుగుని దూరం చేయడానికి ఇక్కడికి వచ్చేముందు కొనుక్కున్న ఫైవ్ స్టార్ చాక్లెట్లలో ఒక దాన్ని నమలసాగాను. ( ఈ చాక్లెట్‌లంటే దివ్యకి కూడా ఇష్టమే). వ్యాపారస్తుల సందేహాస్పదమైన చూపులను తప్పించుకుంటూ, కాలక్షేపం కోసం వివిధ అంతస్తులలో తిరుగుతూ, తెరచి ఉంచిన, మూసేస్తున్న కొట్లని గమనించసాగాను. ఇంతలో శుభ్రం చేసే ఆమె వెనుక నాకో దృశ్యం కనపడింది.
అసంపూర్తిగా ఉన్న మూత్రశాలల వద్ద, మసక వెలుతురులో, ఓ పదేళ్ళ అమ్మాయి, రెండేళ్ళ అబ్బాయికి అన్నం తినిపిస్తోంది. ఆమె, పాత, నలిగిన దుస్తులు ధరించి ఉంది. కాని అవెంతో శుభ్రంగా ఉన్నాయి. ఇంతలో ఆ పిల్ల గబగబా పరిగెత్తుకు వెళ్ళి నేలని శుభ్రం చేస్తున్నామె తో ఏదో మాట్లాడింది. వాళ్ళ హావభావాలను బట్టి చూస్తే, వాళ్ళిద్దరూ తల్లీకూతుళ్ళలా అనిపిస్తున్నారు.
అమ్మ పనిలో ఉండడంతో తమ్ముడి బాధ్యతను తను తీసుకుందా అమ్మాయి. వాడికి తినిపించడం అయ్యాక, అక్కడున్న కాగితాలలోంచి ఒక శుభ్రమైన దాన్ని ఏరి, దాంతో వాడి మూతి తుడిచింది.
అక్కడ అందంగా అలంకరించడబడున్న ఓ బల్లపై కూర్చుని నేను వాళ్ళని గమనించసాగాను. శుభ్రం చేసే ఆమె నా దగ్గరగా వచ్చినప్పుడు, నేను ఆమెకి వీలుగా ఉండేలా నా కాళ్ళు పైకెత్తాను. ఆమె నాకేసి కృతజతగా చూసింది. నేను చిన్నగా నవ్వాను. ఆమె కూడా నవ్వి తన పని చేసుకోసాగింది. ఇంతలో అక్కతో దాగుడుమూతలాడుతున్న ఆమె కొడుకు వచ్చి తల్లిని చుట్టేసుకున్నాడు. ఆమె వాడికేసి వాత్సల్యంగా చూసింది. నేను నా హ్యాండ్ బాగ్ లోంచి ఓ ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసి వాడికందించాను. తీసుకోనా వ ద్దా అన్నట్లు అమ్మ కేసి చూసాడు. అమ్మ ఒప్పుకోగానే వాడి ముఖం వెలిగిపోయింది. స్వచ్ఛమైన ఆనందంతో అక్కని పిలుస్తూ పరిగెత్తాడు.
దివ్య వచ్చేవర కు నాకేం పనిలేదు. అందుకని ఆమెని మెల్లగా మాటల్లోకి దింపాను. పైగా సమయం కూడా గడవాలి కదా! ఆమె కధ చాలా మంది పేద భారతీయ స్త్రీల లాంటిదే. పేరు శాంతమ్మ. మొగుడు తాగుబోతు. డబ్బు కోసం ఆమెని చితకబాదుతూంటాడు. పాపం శాంతమ్మే పిల్లలను చూసుకుంటోంది. కూతురు అప్పట్లో బడికి వెళ్ళేది. కాని ఈ మధ్య తమ్ముడిని చూసుకోడం కోసం ఇంట్లోనే ఉండిపోతోంది. బతుకు భారమవుతోంది. కూతురు చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించి, క్రమంగా నిలకడగా డబ్బు సంపాదించసాగింది. పిల్లని చదివించలేకపోయినందుకు శాంతమ్మకి బాధగా ఉన్నా, ఆమెకి మరో మార్గం లేదు. ఆ పిల్ల సంపాదించే కొద్ది డబ్బుతోనూ, శాంతమ్మ జీతం తోను ఆ కుటుంబం తమ కనీసావసరాలను తీర్చుకోగలుగుతోంది. వాళ్ళకి సహాయం చేసేవాళ్ళెవరూ లే రు.
శాంతమ్మ తన కధని ముగించి అక్కడినుంచి ముందుకు సాగిపోయింది. దివ్య ఇంకా రాలేదు. నాకు అసహనంగా ఉంది. ఆమె సెల్ కి రింగిచ్చాను. ‘నెంబర్ నాట్ రీచబుల్’ అని జవాబొచ్చింది. ‘వెధవ నెట్‌వర్క్’ అని తిట్టుకున్నాను. మళ్ళీ నా వాచికేసి చూసకుకున్నాను. పది నలభై అయిదు అవుతోంది. అంత లో అక్కడికి వచ్చిన ఆ షాపింగ్ మాల్ సెక్యూరిటీ గార్డు నాకేసి వింతగా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా రెండు కొట్లు తెరిచే ఉన్నాయి.
ఇంతలో ఆ అమ్మాయి తన భుజం మీద ఏదో కాగితాల కట్టని మోసుకుంటూ, తమ్ముడిని వెంటేసుకుని వచ్చింది. ఆడుకోమంటూ, తమ్ముడి చేతిలో కొన్ని కాగితాలు పెట్టి తన పనిలో నిమగ్నమైంది. ఆమె ప్రతీ షాపుకి వెళ్ళి షట్టర్‌కి నేలకి మధ్య ఉన్న ఖాళీ లోంచి లోపలికి కాగితాలను విసరసాగింది. అదేదో నోటీసులా ఉంది. ఇంతలో దివ్య నవ్వుతూ రాసాగింది. నేను ఆమెని ఆగమన్నట్లుగా సైగ చేసాను. నేను నిలుచున్న షాపు దగ్గరికి ఆ పిల్ల రాగానే నేను ఉత్సుకత ఆపుకోలేక ఓ కరపత్రాన్ని తీసుకుని చదవసాగాను.
చదవడం పూర్తి కాగానే, అందులోని అసంబద్దతని గ్రహించాను. నాకు కోపం పెెరిగిపోడం తెలుస్తోంది. అంతలోనే నన్ను నిస్సహాయత ఆవరించింది. ఏమీ చేయలేక గట్టిగా నవ్వేసాను. ఆ పిల్లకేమీ అర్ధం కాలేదు. నన్ను పట్టించుకోకుండా, తమ కుటుంబానికి ‘అన్నం’ పెట్టే ఆ పనిలో నిమగ్నమైపోయింది.
దివ్య నా చేతిలోంచి ఆ నోటీసుని తీసుకుని చదవసాగింది.
” భారత ప్రభుత్వపు హెచ్చరిక…..
14 ఏళ్ళ లోపు బాల బాలికలతో పని చేయించుకోడాన్ని చట్టరీత్యా నిషేధించడమైనది. మీ షాపులలో అటువంటి బాల బాలికలెవరైనా ఉంటే వారిని 30 సెప్టెంబరు 2006 లోగా తొలగించి, ప్రభుత్వంతో సహకరించగలరు…….”
నేను ఆ పిల్ల కేసి నడిచాను. నా దగ్గర మిగిలి ఉన్న ఓ చాక్లెట్ ని ఆమెకిచ్చాను. ఆ పిల్ల ముఖం సంతోషంతో వెలిగిపోయింది. నాకేసి కృతజతగా చూసింది. ఆమె చూపులని తప్పించుకుని, దివ్యని తీసుకుని ఆ మాల్ నుంచి బయటపడ్డాను. నాకీ రోజు ఎదురైన అనుభవాన్ని కొన్నాళ్ళవరకూ, బహుశా కొన్నేళ్ళ వరకూ కూడ మరచిపోలేనేమో! యాభైరెండేళ్ళ వయసులో, నా కూతురి చేయి పట్టుకుని నడుస్తున్న నాకు ఓ సమస్య ఎదురైంది. మరొకరి కూతురి విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబేనా కాదో నేను తే ల్చుకోలేక పోతున్నాను.
ఆంగ్ల మూలం: గౌతం. ఎన్
(ఈ కధ 27 జూన్ 2007 నాటి నవ్య వారపత్రికలో ప్రచురితమైంది)