ప్రముఖ మళయాళ రచయిత శ్రీ ఎం.కె. చాంద్ రాజ్ గారు స్వయంగా “That kind of place” అనే పేరుతో ఆంగ్లం లోకి అనువదించిన మళయాళ కధకి నా తెలుగు అనువాదం ‘రణరంగం కాని చోటు’. ఈ కధ ప్రముఖ దినపత్రిక ప్రజాశక్తి యొక్క ఆదివారం అనుబంధం లో 24 జూన్ 2007 నాడు ప్రచురితమైంది.
——————————————————————————————
” అమ్మా, యుద్ధం మనదాకా రాదు కదా! మనకేమీ ప్రమాదం లేదు కదా?”
దినపత్రికలో రెండు చేతులు పోగుట్టుకుని దయనీయమైన స్థితిలో ఉన్న ఓ అబ్బాయి ఫోటోని వేలితో చూపిస్తూ అడిగింది యమున. ఆ ఫోటో నన్ను కదిలించింది. నన్ను నిర్వేదం ఆవరించింది. అయినా ఏ భావాన్ని వ్యక్తం చేయకుండా, ” ఎవరు చెప్పారమ్మా.” అని అడిగాను.
” నేను స్కూలినుంచి వస్తుంటే సునీతక్క చెప్పింది”.
“అలాగా, సునీత ఇంకా ఏమేం చెప్పింది?”
“అమ్మా, కేబుల్ టివి లో యుద్ధాన్ని చూడడం భలే సరదా గా ఉంటుందట. మనం కూడా కేబుల్ కనెక్షన్ పెట్టించుకుందాం అమ్మా. నాన్నకి చెప్పమ్మా. యుద్ధం గురించి పేపర్లో చదువుతుంటే మజా లేదమ్మా….”
” కేబుల్ లేదు, ఏం లేదు! ఇప్పటికే నువ్వు చదవడం మానేసి టీవీ కి అంకితమైపోతున్నావు…..”
మేము కేబుల్ కనెక్షన్ పెట్టించుకోకపోడమే మంచిదయ్యింది. ఇప్పుడా యుద్ధం జరుగుతున్న ప్రాంతమంతా మాకు సుపరిచితమే. అక్కడి ప్రజలు మా కష్ట సుఖాలలో పాలుపంచుకున్నారు. వాళ్ళు మంటల్లో మాడి మసైపోవడం మేము చూడనక్కరలేదు. రవి కష్టపడి కట్టించిన ఎన్నో భవనాలను శత్రువు నేల మట్టం చేసేసుంటాడు.
” నువ్వెప్పుడు ఇంతేనమ్మా! మాయా, సింధు, డాలీ వీళ్ళందరూ కూడ చెబుతున్నారు……”
“యమునా, ఇంక చాలు. రేపు పరీక్ష ఉందని చెప్పావు కదా, వెళ్ళి చదువుకో…”
యమున పేపరుని పక్కకి పడేసి, నొసలు చిట్లించి వెళ్ళిపోయింది. దాన్ని మందలిద్దామనుకుని, నన్ను నేను నిగ్రహించుకున్నాను. నేల మీద పడున్న పేపరుని తీసుకున్నాను. నిస్సహాయంగా ఉన్న ఆ అబ్బాయి ముఖం చూడగానే నాకు లోలోపలినుంచి నిశ్శబ్దంగా వెక్కిళ్ళు వచ్చాయి. చెమ్మగిల్లిన స్మృతులలో నాకు మరో ముఖం కనపడింది. అవును. అతడు నా ‘యదు’ లానే ఉన్నాడు. ముక్కు, చెవులు, నోరు,.. చివరకి కనురెప్పలు కూడా నా ‘యదు’ లానే ఉన్నాయి. ఈ ఫోటో లోని అబ్బాయి అచ్చం నా కొడుకు ‘యదు’ లానే ఉన్నాడు.
యదు! టైఫాయిడ్ రూపంలో వాడిని మృత్యువు కాటేసేడప్పటికి ఆరేళ్ళ వాడు. కొన్నేళ్ళ క్రితం ఓ చల్లటి సూర్యోదయం వేళలో అచేతనంగా ఉన్న యదుని నేను రవి కలసి ‘అల్-అరిఫ్’ ఆసుపత్రికి తీసుకొచ్చాం. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. మేము అసహాయంగా చూస్తుండగానే యదు శరీరం చల్లబడి నిర్జీవమైపోయింది. మాతో పాటు ఎందరో మిత్రులు ఆసుపత్రికి వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. మా అపార్టుమెంటులోని మిగతా కుటుంబాల వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఓదార్చారు, మా బాధని పంచుకున్నారు. ఆ ప్రాంత వాసులు మాతో పంచకున్న నిష్కపటమైన ప్రేమని మేమెలా మరవగలం? అవెంత మంచి రోజులు? బాబిలోనియా సంస్కృతి మాకెంత సాంత్వన కలిగించిందో! అప్పటికింకా ఆ నగరం శత్రువుల దాడికి గురవలేదు. అప్పట్లో బాగ్దాద్ ఎంత అందంగా ఉండేదో.
యదు చనిపోయాక, రవి తను పనిచేసే భవన నిర్మాణ కంపెనీకీ, నేను నా టీచరు ఉద్యోగానికి రాజీనామా చేసేసాం. స్వదేశానికి వచ్చేసి, కొత్త జీవితం గడపాలనుకున్నాం. ఇప్పుడు యదు బీరువాలోని ఫోటో ఆల్బమ్ లో ఉన్నాడు. ఆల్బమ్ తెరిస్తే, మా సజల నయనాలను చూసి నవ్వుతాడు. బహుశా జీవితపు పొలిమేరకి అవతల ఆనందమే ఉంటుందేమో. వేదన, కన్నీళ్ళు జీవితపు ఇటువైపు వాళ్ళకే ఉంటాయి కాబోలు!
బాంబు దాడిలో తన రెండు చేతులని, బంధువులని పోగొట్టుకున్న ఆ పిల్లాడి పేరు అన్సారీ. ఆ ఫోటో అల్-అరిఫ్ ఆసుపత్రిలో తీసినది. తీవ్రంగా గాయపడ్డ పౌరుల మధ్యలో అన్సారీ ఉన్నాడు. వార్తని సేకరించిన విలేఖరి ప్రకారం అన్సారీ ఏడుస్తుంటే అతడి లేత పెదవులు విపరీతంగా వణికిపోయాయట. ఓ విషాదం నా కళ్ళని చెమర్చింది. అన్సారీలో నాకు నా యదు కనపడ్డాడు. బహుశా అప్పుడు యదుని ఉంచిన మంచం మీదే అన్సారీనీ పడుకోబెట్టారెమో? అప్పట్లో యదుని ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు నన్ను ఓదార్చిన నా ఇరుగుపొరుగు స్త్రీలు – అమీనా, సుహ్రా, ఫాతిమా… వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో? శత్రువులు కురిపించిన బాంబుల వాన వాళ్ళ శరీరాలను ఛిద్రం చేసి, యుఫరేటస్ నదీతీరాన పడేసిందా? లేక బతుకు చివరి అంచులలో ఉండి, చావుకు దగ్గరై ఆక్రందనలు చేస్తున్న వేలాదిమందిలో వీళ్ళూ ఉన్నారా? నాకు అయోమయంగా ఉంది. నాకెన్నో విషయాలు తెలుసుకోవాలనుంది.
అందరినీ పోగుట్టుకుని అనాధైన అన్సారీని ఓదార్చాలి. కర్బాలా లోని ఆసుపత్రిలో దీనంగా ఉన్న వాడికి సాంత్వన కలిగించాలి. అతడి గాయం మానుతుంది. కృత్రిమ అవయవాలతో అతడు మళ్ళీ మాములు మనిషవగలడు. అతడు నా బిడ్డే. అతడి గురించి రాసిన వార్తని చదవసాగాను.
“హిల్లా పట్టణంలో ఆ రోజు మాములుగానే తెల్లారింది. అన్సారీ పాలు తేవడానికి బయల్దేరాడు. వరండాలో అమ్మ, నాన్న తో ఏదో చెబుతుండడం అతడికి వినిపించింది. వెనక్కి తిరిగి అమ్మ వైపు చూసాడు. అమ్మ చిరునవ్వు చాటుగా ఏదో ‘జుయ్’మన్న రొద! చెవులు చిల్లులు పడేంత శబ్దం! చుట్టు పక్కలంతా మంటలు, దట్టమైన పొగ…….! అంతకంటే అన్సారీకి ఇంకేమీ గుర్తు లేదు. తిరిగి స్పృహ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాడు. ఆనాటి ఆ క్లస్టర్ బాంబు అన్సారీ అమ్మానాన్నలతో సహా 35 మందిని పొట్టనబెట్టుకుంది. అన్సారీని వాళ్ళ నాన్న డాక్టరుని చెయ్యాలనుకున్నాడట……” ఇక ఆ వార్తని చదవలేక పోయాను. అన్సారీకి కొంచెం దూరంలో ఉన్న ఓ పిల్లని చూస్తే నాకు సఫా గుర్తొచ్చీంది. నన్ను గత స్మృతులు చుట్టుముట్టాయి.
* * *
సఫా అమీనా కూతురు. కేవలం సఫా కోసమే జీవిస్తోందామె. లేకపోతే అమీనా ఏనాడో చనిపోయి ఉండేది. ఆ రోజు సఫా మందుల కోసం బయటకు వెళ్ళింది అమీనా. దట్టమైన చీకట్లలో అబువాస్ వీధిలో శ్వేతజాతి సైనికులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తనకి తెలిసిన అన్ని భాషలలోను వాళ్ళని బ్రతిమాలుకుంది. అయినా వాళ్ళ ఘాతుకం నుంచి తప్పించుకోలేక పోయింది. ఆమెకి స్పృహ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉంది. ఆమె ప్రాంతం వాళ్ళెవరో ఆమెని తెచ్చి ఆసుపత్రిలో చేర్చారు. “దేవుడా, నాకెందుకీ శిక్ష? ఇప్పటికే నా భర్తని, కొడకుని పోగొట్టుకున్నాను. ఇక నేనెందుకు బ్రతకాలి?” అంటూ పసిపిల్ల సఫాని హత్తుకుని గుండెలవిసేలా ఏడ్చింది అమీనా.
యుద్ధం మొదలయ్యాక, అమీనా కుటుంబం అనేక మంది తో కలసి అల్-అమీరియా శిబిరంలో తలదాచుకుంది. ఆ శిబిరంలో దాదాపు 500 మంది ఉండేవారు. ఆ రోజు 13 వ తేదీ ఫిబ్రవరి నెల 1991 సంవత్సరం. ఉదయం నాలుగున్నర గంటల సమయంలో, రెండు 23 టన్నుల బాంబులు, నాలుగు నిమిషాల వ్యవధిలో ఆ శిబిరం పై పడ్డాయి. అమీనా, సఫా, ఇంకో పన్నెండు మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. అమీనా భర్త ఉమర్, కొడకు హష్మీ బ్రతకలేదు. అమీనా ఇప్పటికీ అర్ధం కాలేదు వాళ్ళు మాత్రమే ఎలా మిగిలారో? ఈ బ్రతుకుకి అర్ధం ఏమిటి? బాంబుల వల్ల ఆ ప్రాంతంలో నాలుగు వందల డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వేడికి చాలా మంది గోడకి అతుక్కుపోయి, పోతపోసిన మాంసం ముద్దల్లా అయిపోయారు. ఈ సంఘటన జరిగి పదేళ్ళు గడచినా, ప్రజలు ఆ ప్రాంతాన్ని చూడడానికి వెడుతునే ఉంటారు. అమీనా మాత్రం వెళ్ళలేదు. బహుశా, ఉమర్, హష్మీ కూడా ఆ గోడకి అతుక్కుపోయి ఉన్నారేమో – వాన్ గోగ్ పెయింటింగ్ లా!
చరిత్ర పునరావృత్తమవుతుందని ఎవరు అన్నారు? యుద్ధానికి మరో పేరు చరిత్రా?
సఫాకి కాన్సర్ సోకిందని తెలియగానే, అమీనాకి మరో శరాఘాతం తగిలింది. ఈ రోగం ఇప్పుడు బాగ్దాదు, దాని చుట్టుపక్కలంతా వ్యాపించింది. బాంబులు క్షిపణులలో ఉండే రేడియోధార్మిక పదార్దాలు, ప్లుటోనియం వంటివి కాన్సర్ కారకమవుతున్నాయి. అనేక మంది పిల్లలు సఫాలాగే బాధ పడుతున్నారు. ఆసుపత్రి లోనే అనేక మంది పిల్లలు తమ అంతిమ ఘడియలకోసం ఎదురుచూస్తూ, మృత్యువుపై ‘జోకులు’ వేసుకుంటున్నారు. చాలా మంది ప్రజల దగ్గర కనీసం ఆకలి తీర్చుకోడానికైనా డబ్బు లేదు. జనాలకి మందులు కావాలి. కాని అంతర్జాతీయ ఆంక్షల వల్ల అవి అందుబాటులో లేవు. ఇప్పటికే కనీసం రెండున్నర లక్షల మంది మందులు లభించకపోవడం వల్ల చనిపోయారు. వాస్తవంలో యుద్ధం చనిపోయిన వారి పట్ల కరుణ, క్షతగాత్రులై బ్రతికిపోయిన వారి పట్ల క్రూరత్వం చూపుతుంది.
అమీనా ఆసుపత్రిలో సఫా మంచం దగ్గర ఉన్న కిటికీ వద్ద కూర్చుని అల్-రషీద్ వీధి గుండా వెడుతున్న మిలిటరీ ట్రక్కులను చూస్తోంది. ఆగి ఆగి ‘భం’ అని వినబడుతున్న విస్ఫోటనాలు. దూరంగా ఏదో తగలబడుతోంది. నల్లటి దట్టమైన పొగ ఆకాశాన్ని తాకుతోంది. సఫా కింకా మెలకువ రాలేదు. ఆసుపత్రిలో ‘పెయిన్ కిల్లర్స్’ లేవు. సఫా బాధని భరిస్తూనే నిద్ర పోతోంది. అమీనా కళ్ళు మూసుకుని, కూతురు నిద్ర లేవడం కోసం ఎదురుచూడసాగింది. బహుశా, అమీనా కల కంటోందేమో – ఏదో ఒక రోజున సఫా బడికి వెళ్ళడం కోసం అల్-అరబ్ వీధిలో నడుస్తున్నట్లు, ఉమర్, హష్మీ, ఇంకా ఎందరో సోదర సోదరీమణులు, పిల్లలు తిరిగి ప్రాణం పోసుకున్నట్లు………..
అమీనాని ఎలా ఓదార్చను? ఆమెని అలా ఉజ్వల భవితకై, బంగారు కలలు కననివ్వడమే మంచిదేమో….
* * *
వర్తమానంలోకి వచ్చిన నేను, అన్సారీని అల్-అరీఫ్ ఆసుపత్రిలోంచి బయటకు తెచ్చేసి, ఆ నరకం నుంచి తప్పించి, యమున అన్నట్లుగా యుద్ధం రాని ఏ ప్రాంతానికైనా తీసుకుపోగలిగితే బావుండనిఅనుకున్నాను.
రణరంగం కాని చోటు! ఈ గ్లోబల్ విలేజిలో ప్రతీ దాన్ని ఏదో ఒక నెపంతో తన పాదాక్రాంతం చేసుకోవాలని రాబందు ఆశగా కాచుకుని ఉన్న తరుణంలో అటువంటి చోటు ఎక్కడుంది?
జులై 9, 2007 at 4:09 అపరాహ్నం
సోమశంకర్ గారు, రణరంగం కాని చోటు చదివానిప్పుడే. అనువాదం బాగుంది. ఎక్కడో ఒకచోట “సంఘీభావం చూపించారు” అనే లాంటి కొద్దిగా అసహజమైన వాడుకలు తప్ప, అనువాదపు తీరు బాగుంది. మూల కథే అంత బలంగా లేదేమోనని నా అభిప్రాయం. ఏవో రెండు మూడు సంఘటనలకి సంబంధించిన గజిబిజి దృశ్యాలు తప్ప “కథ” కనపడలేదు.
మీ రెండో అనువాదకథ PDF తెరుచుకోవటల్లేదు.