ఈ కధ 1 జూలై 2007 నాటి వార్త ఆదివారం అనుబంధం లో ప్రచురితమైంది. పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలను వెల్లడి చేసిన కధ ఇది . మూల కధని అరబిక్ లో Nassar Ibrahim రాసారు. ఈయన పాలస్తీనా లోని ‘బేత్ షహుర్ ‘ పట్టణానికి చెందినవారు. మూల కధ మషరఫ్ అనే పత్రికలో 2005 లో ప్రచురితమైంది. ఈ కధని ఆంగ్లం లో Taline Voskeritchian ‘The Shoes ‘ అనే పేరుతో అనువదించారు. అనువాదకురాలు బోస్టన్ యూనివర్సిటి లో రచనా వ్యాసాంగం పై శిక్షణనిస్తారు. ఆంగ్లానువాదాన్ని www.wordswithoutborders.org అనే వెబ్ సైట్ నవంబర్ 2006 లో ప్రచురించింది.
—————————————————————————————-
రమల్లా వెళ్ళడానికి నిజార్ అంతగా ఎందుకు పట్టుబడుతున్నాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. పరిస్థితి ఏమీ బాగోలేదు – మిలిటరీ చెక్ పోస్టులు, అవమానాలు, దుమ్ము ధూళిల అడ్డంకులు, విపరీతమైన అలసటకి గురిచేసే కొండల మధ్య నడక…….! అయినా సరే, ‘వెళ్ళి తీరాలి’ అని అన్నాడు నిజార్.
“అక్కడ నేను చేయాల్సిన ముఖ్యమైన పనొకటి ఉంది. శ్రమతో కూడిన ప్రయాణాలకి నేనెప్పుడూ సిద్ధమే. అలాంటి వాటికి మనం ఎప్పుడో అలవాటు పడ్డాం. అదిప్పుడు మనకి సర్వసాధారణం! మన జీవితాలలో అసాధారణమనుకునే ప్రతీదాన్నీ సాధారణ విషయంగా మార్చేస్తున్నామని ఇజ్రాయిల్ వాళ్ళు గ్రహించడం లేదు. మనం ఏం చేస్తాం? చచ్చేవరకు మౌనంగా కూర్చోవాలా?” అని అన్నాడు.
కారులో కూర్చుని బయల్దేరాడు. ఎలాగైనా రమల్లా చేరాలి! వేరే లక్ష్యం లేదు. కారు కొండల మధ్యగా ప్రయాణిస్తోంది. మొదటి కిలోమీటరు మేర దారి బురదగాను, మరో కిలో మీటరు మేర దుమ్ము ధూళితోను నిండి ఉంది. ముందుకు చూస్తుంటే దూరంగా చెక్ పోస్టు కనబడుతోంది. చెక్ పోస్టు ను తప్పించుకోడం కోసం పక్కదార్లు ఉన్నాయి. ఈ పక్కదార్లు – చెక్‌పోస్టుల వద్ద జవానుల ఆదేశాల నుంచి తప్పించుకోడం లోనూ, వాళ్ళ ఘాతుకాల నుంచి తమని తాము రక్షించుకోడంలోనూ, అలసి పోకుండా ఉండడంలోనూ పాలస్తీనీయులని నిష్ణాతులుగా చేసాయి. తమ ఇళ్ళని కోల్పోయి, దార్లు మూసుకుపోయినప్పుడు మరో మార్గం వెదుక్కుని, సమస్యలకి పరిష్కారం కనుగొనేదిశగా చుట్టుతిరిగిపోవడంలో వాళ్ళు చీమల బారు లాంటి వాళ్ళు. చీమలు అనేక రోజుల పాటు చిన్న చిన్న మట్టి రేణువులను తమ నోటి తోను, కాళ్ళతోను మోసుకొచ్చి పుట్టలని ఏర్పాటు చేసుకుంటాయి. మొదట ఓ చిన్న కన్నం తయారవుతుంది. కాని అది చాలు. ఏదో ఒక చీమ పొరపాటున గాని, కావాలని గాని ఆ కన్నాన్ని ద్వంసం చేస్తుంది. ఒక్క క్షణం పాటు చీమలు ఆందోళన చెందుతాయి. కాని ఏమీ జరగనట్టే, తమ మార్గాన్ని వదలవు. మళ్ళీ పని ప్రారంభిస్తాయి. పుట్టని పునర్నిర్మించుకుంటాయి. ఈ చీమల లాగే వాళ్ళ ఓర్పు, సర్దుకుపోయే తత్వం… అనంతం!
ఈ మట్టి రోడ్ల పైన మనుషులు చిన్న చిన్న నల్ల ముద్దలుగా, వరుసలో కదులుతుంటారు. ఈ మనుషుల గుంపు కాసేపు నడుస్తుంది. కాసేపు ఆగుతుంది. మళ్ళీ కాసేపు నడుస్తుంది. తమ గమ్యం చేరడం కోసం దేన్నైనా ఎక్కడానికి వాళ్ళు తయారే! నరకానికైనా సిద్ధమే. తిన్నగా ఉండే మార్గాలలో వాళ్ళంతా చేతులు పట్టుకుని నడుస్తారు. అడ్డుగా పెట్టిన బండరాళ్ళ మీది నుంచి జాగ్రత్తగా దూకుతారు. ఓ గంట తర్వాత మొదటి గుంపు నడచిన మార్గాన్ని బుల్‌డోజర్లు నాశనం చేయవచ్చు. రాళ్ళు, మట్టి, సిమెంటు దిమ్మలతో అడ్డంకులు కల్పించవచ్చు. ఈ మనుషుల రెండో గుంపు ఆగుతుంది. చుట్టూ చూస్తుంది. తన మీద తనే జాలి పడుతుంది. చెమట పట్టిన ముఖాలపై నుంచి కన్నీళ్ళు కారుతాయి. కాని అంతలోనే మరోదారి వెదుక్కుంటుంది. వాళ్ళు అలుపెరుగని మొండివాళ్ళు.
అందరి లాగే నిజార్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కారు వదిలేసాక చాలా దూరం నడిచాడు. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. కొండ ఎక్కేడప్పుడు జారిపోయాడు. ఓ ముసలాయన చేయి ఆసరా ఇచ్చి పైకి లేపాడు. ఇద్దరు కలసి కొండ ఎక్కసాగారు. నిజార్ రమల్లా వెళ్ళితీరాలి. కాని ఈ శ్రమలో అసలు రమల్లా వెళ్ళవలసిన కారణమేమిటో అతడికి గుర్తు రాలేదు. అయితే అదేమంత పెద్ద విషయం కాదు. రమల్లా చేరగలగడమే గొప్ప. పట్టుదల తో సాధించి, రమల్లా చేరగలిగితే అదే తన విజయం. అది చాలు తనకి!
కాలం సుదీర్ఘం. వాతావరణం ఉక్కగాను, ధూళితోను నిండి ఉంది. బారికేడ్లు, జవానులు, తిట్లు, అవమానాలు……. ఇవన్నీ ఒక దానితో ఒకటి అతి సులువుగా కలసిపోతాయి. వెళ్ళేడప్పుడు, వచ్చేడప్పుడు ఈ వ్యధ తప్పదు. వెనుక అవమానాలు… అడ్డంకులు… ముందు కూడా అవే. అందుకే ముందుకే నడిచాడు నిజార్. ఒక జాతి యావత్తూ పక్కదారులు వెదుకుతోందంటే, అక్కడేదో సమస్య ఉందనేది తర్కబద్దమే. ఈ ప్రయాణం అసమానత్వం పై తిరుగుబాటు, వ్యధ యొక్క గెలుపు. ఇలా ఆలోచనలతోనే ఓ కొండ ఎక్కేసాడు నిజార్. ప్రతీ కొండ అతడు అధిగమించాల్సిన ఆటంకమే. మరింత ఉత్సాహాన్ని తెచ్చుకుని నడక సాగించాడు. ముఖంపై కదలాడే చిరునవ్వు అతడి పట్టుదల కి ప్రతిరూపం. పడుతూ లేస్తూ, కొండలని ఎక్కుతూ దిగుతూ, ఒక్కో కారు మారుతూ, చెక్‌పోస్టులను దాటుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు నిజార్. ఆరు గంటల పాటు ప్రయాణించాక, కాలందియా శరణార్ధుల శిబిరానికి చేరాడు. అక్కడి నుంచి తన గమ్యం మరింత దగ్గర. ఆ కాస్త దూరం వెళ్ళగలిగితే తను గెలిచినట్లే. కార్లు వరుసగా బారులు తీరి ఉన్నాయి. చుట్టూ పరిశీలించాడు నిజార్. రోడ్డుకి
అటు ఇటు వాహనాల మధ్య చీమల్లా బారులు తీరి నడుస్తున్నారు – ఆడవాళ్ళు, పిల్లలు, యువకులు, వృద్ధులు, విక్రేతలు, విద్యార్ధులు, గాడిదలు! స్వరాలు, కేకలు, లోగొంతు మాటలు…ప్రాధేయపడడాలు–మనుషుల రకరకాల భావోద్వేగాల మిశ్రమం ఆ ప్రదేశం! వాళ్ళ జీవితంలోని వ్యధకి, చీకటికి పట్టుదలకి ప్రతిరూపం!
నిజార్ లైనులో నిలబడ్డాడు. ఓ మిలిటరీ జీపు వీళ్ళ మీద దుమ్ము రేపుతూ వెళ్ళింది. అది కనుమరుగయ్యేవరకు శాపనార్ధాలు పెట్టారు జనాలు. పైన ఎండ మాడిపోతోంది. జనాల నుదుటిపై నుంచి చెమట ధారాళంగా కారుతూ, వాళ్ళ కళ్ళని మసకగా చేస్తోంది. అయినా వాళ్ళకి ముందుకు వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. నిజార్‌కిక ఏ మాత్రం ఓపిక లేదు. ముందుకి కదిలాడు. “పౌర వ్యవహారాల శాఖ నుంచి అనుమతి పత్రం లేకపోతే నిన్ను వెళ్ళనివ్వరు…” ఎవరో వెనుక నుంచి అరిచారు. “నేను రమల్లా వెళ్ళితీరాలి. అనుమతి ఉన్నా, లేకపోయినా నేను పట్టించుకోను..” అని కదిలిపోయాడు నిజార్.
చెక్ పోస్టు వద్దకి చేరుకున్నాడు. సిమెంటు దిమ్మల ముందు నిలుచుకున్నాడు. అక్కడ కొంత మంది జవాన్లు గస్తీ తిరుగుతున్నారు. వాళ్ళలో కొంత మందికి కనీసం పద్దెనిది ఏళ్ళైనా ఉండి ఉండవు. నూనుగు మీసాలైనా రాలేదు. వాళ్ళముందు వందల సంఖ్యలో స్త్రీ పురుషులు ఎంతో ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. తమ శక్తి మేర జవాన్లని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ఫలితమేమి లేదు. ప్రాధేయపడడాలు, కన్నీళ్ళు, వయసు, జబ్బు, చదువులు…. ఇవేవి జవాన్లని కదిలించ లేకపోయాయి.
” కుదరదంటే కుదరదు. అంతే” ఇదే జవాన్ల సమాధానం.
జనాల గలభా ఎక్కువైతే ఓ జవాను పొగబాంబుని విసిరాడు. జనాలు చెల్లాచెదురైపోయారు. కొందరు దగ్గసాగారు. కొందరు స్పృహ తప్పారు. కాని జవాన్ల గుండె కరగలేదు.
” కుదరదంటే కుదరదు. అంతే” ఇదే జవాన్ల సమాధానం.
జనాలు మళ్ళీ వరుసలో నిల్చున్నారు. నెమ్మదిగా కదలసాగారు. నిజార్ ముందుకి నడిచాడు. సిమెంటు దిమ్మల ముందు ఆగాడు. రెండు దిమ్మల మధ్య ఉన్న ఇరుకుదారి గుండా వెళ్ళడానికి ప్రయత్నించాడు.
” ఏయ్. ఆగాగు! ఎక్కడికి వెడుతున్నావు?” ఓ జవాను అరిచాడు.
“నేను ముందుకి వెళ్ళాలి”
“అనుమతి ఉందా?”
“లేదు”
“అయితే వెనక్కి వెళ్ళిపో! అనుమతి లేకుండా ముందుకు వెళ్ళడం నిషేధం”
” కాదు మిస్టర్! నేను తప్పనిసరిగా వెళ్ళాలి. ఇంత దూరం వచ్చాను కదా. అక్కడ నాకు చాలా ముఖ్యమైన పని ఉంది”
“నాకనవసరం. అనుమతి లేకుండా వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళిపో. లేదంటే కాల్చేస్తాను”
“నువ్వు కాల్చాలని ఎందుకు అనుకుంటున్నావు? నేను నిరాయుధిడిని, కనబడడం లేదా? వెళ్ళనీ”
“నేను కుదరదని చెప్పాను కదా! నిషేధం ఉంది.”
నిజార్ కాసేపు ఆలోచించాడు. వెనక్కి తిరిగి లైన్లో నిలుచున్న జనాలకేసి చూసాడు. మరోసారి ప్రయత్నించాలనుకున్నాడు.
“ప్లీజ్, కావాలంటే నా ఐడెంటిటీకార్డు నేను తిరిగి వచ్చేవరకు నీ దగ్గర ఉంచుకో. ఇదిగో!”
“నాకది అనవసరం లేదు. అనుమతి లేకుండా ముందుకి వెళ్ళడం నిషేధం. ఇదే నా తుది నిర్ణయం”
” ఎందుకు సోదరా? నీకు ఏం కావాలి? నేను రమల్లా వెళ్ళితీరాలి”
ఆ జవాను ఒక సారి వెనక్కితిరిగి మిగతా జవాన్లవైపు చూసాడు. తిరిగి తన దృష్టిని నిజార్ కేసి మళ్ళించాడు. తమషా చేయడానికి, కాసేపు నవ్వుకోడానికి ఓ అవకాశం కలిగినట్లు అతడు గ్రహించాడు. ఐడెంటిటీకార్డుని ఇవ్వమని అడిగాడు. నిజార్ మాట్లాడకుండా దాన్ని అందించాడు. జవాను దానికేసి, నిజార్ ముఖం కేసి పరీక్షగా చూడసాగాడు. కొన్ని క్షణాలు గడిచాయి.
“విను. నీ టోపీ తీసేస్తే నిన్ను వెళ్ళనిస్తాను”
నిజార్ జవానుకేసి అపనమ్మకంగా చూసాడు. కాని వెంటనే తన టోపీని తీసి దూరంగా గాలిలోకి విసిరేసాడు.
” ఇప్పుడు నేను వెళ్ళచ్చా?”
జవాను గట్టిగా నవ్వాడు. అతడి దృష్టి టోపీ మీదే ఉంది. ఆ టోపీ ఎగిరి జనాల మధ్యలో పడి కనబడకుండా పోయింది.
” అప్పుడే అయిపోలేదు. నువ్వు ముందుకు వెళ్ళాలంటే మరికొన్ని షరతులు ఉన్నాయి” అన్నాడా జవాను.
ఇదివరకటి తిరస్కరణని తాను అధిగమించగలిగానని, జవాను కాస్త మెత్తబడ్డాడని నిజార్‌కి అర్ధమైంది. మరింత ప్రయత్నించసాగాడు
“సరే, నేను ఇంకా ఏమేమి చేయాలి? అని జవానుని అడిగాడు.
“నీ బూట్లు విప్పేసి, ఇక్కడ వదిలేయాలి. నువ్వు తిరిగి వచ్చాక, వాటిని తీసుకెళ్ళచ్చు”
జవానుకేసి అర్ధంకానట్లు చూసాడు నిజార్. అతడు నిజంగానే అంటున్నాడా లేక పరాచికాలాడుతున్నాడో అర్ధం కాలేదు.
“సాధ్యం కాదు! ఈ మండుటెండలో, గాజు పెంకుల మధ్య, ఉత్తకాళ్ళతో ఎలా వెళ్ళేది?”
“సరే, నీ ఇష్టం! నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు”
నిజార్ తలదించుకున్నాడు. అంతటి తీక్షణమైన ఎండలోను, ధూళిలో సైతం క్యూలో నిలుచుని ఉన్న జనాలందరినీ మరోసారి చూసాడు. జీవిత కాలపు వ్యధంతా ఒక్క క్షణంలో తిరిగి ప్రత్యక్షమైంది.
“సరే. నేను అంగీకరిస్తున్నాను” అన్నాడు నిజార్ స్థిరంగా. వెంటనే వంగి బూట్లు విప్పేసి, సిమెంట్ దిమ్మ పై ఉంచాడు. ఇక ఏ అనుమతి అవసరం లేదనుకుని ముందుకి నడవబోయాడు. ఆప్పటి దాక విస్మయానికి గురైన జవాను తేరుకున్నాడు. ” ఏయ్. ఆగాగు. షరతులు ఇంకా పూర్తవలేదు” అంటూ అరిచాడు.
ఏదో మత్తులో నడుస్తున్న వాడల్లే ఉన్న నిజార్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆగాడు. అతడి పాదాలు కాలసాగాయి.
“నువ్వు వెళ్ళేముందు నాకో కప్పు ‘టీ’ తెచ్చివ్వు”
నిజార్ జవాను కేసి చూసాడు. తన పాదాలకేసి చూసుకున్నాడు. తప్పదేముంది అనుకుంటూ వెళ్ళాడు. కాసేపయ్యాక ఓ పెద్ద టీ కప్పు తో తిరిగి వచ్చాడు. జవాను దాన్ని అందుకుని కొద్ది కొద్దిగా తాగసాగడు. మిగతా జవాన్లతో తను చేసిన ఘనకార్యం గురించి గర్వంగా చెబుతూ నవ్వసాగాడు. నిజార్ చెక్‌పోస్టుని దాటి రమల్లా వైపు నడిచాడు. కీలకమైన ఈ చెక్‌పోస్టుని దాటగలిగినందుకు అతడికి సంతోషమనిపించింది.
నాలుగు గంటల తర్వాత రమల్లా నుంచి నిజార్ తిరిగి చెక్‌పోస్టు వద్దకి వచ్చాడు. కాని చెక్‌పోస్టుని సమీపించే ముందు అప్పటిదాక తాను వేసుకున్న కొత్త బూట్లని విప్పేసి తన సంచిలో దాచేసాడు. అతడు ఉత్త కాళ్ళతో రావాలనేది ఒప్పందం. ఆ జవానుకి ఎదురుగా వెళ్ళి, ” నేను తిరిగి వచ్చేసాను. నా బూట్లు నాకిప్పిచ్చండి” అని అన్నాడు.
జవాను గట్టిగా నవ్వసాగాడు. సిమెంటు దిమ్మలకు ఓ మూలగా ఉన్న నిజార్ బూట్ల కేసి వేలు చూపించాడు. నిజార్ అటువైపు నడిచాడు. కుడిపాదం బూటు లోపలికి దూర్చబోయాడు. అతడి కాలికి వెచ్చటి ద్రవం తగిలింది. ఉలిక్కిపడి కాలు వెనక్కిదీసుకున్నాడు. బూట్లు చేత్తో పట్టుకుని ఆ జవాను కేసి చూసాడు. ఆ జవాను ఇంకో నలుగురితో కలసి బిగ్గరగా నవ్వసాగాడు.
నిజార్ బూట్లని తలక్రిందులుగా చేసాడు. గట్టిగా విదిలించాడు. పసుప్పచ్చటి వెచ్చటి ద్రవం కిందకి కారింది. అక్కడ ఉన్న వార్తా పత్రికలతో బూట్లు తుడుచుకోసాగాడు. వాటినిండా రాజకీయనాయకుల ఫోటోలు, శిఖరాగ్ర శాంతి చర్చల వార్తలు ఉన్నాయి. నిశ్శబ్దంగా పైకి లేచి, బూట్లు ధరించి చెక్‌పోస్టు నుంచి బయటకు నడిచాడు నిజార్.
మూడు అడుగులు వేసాడో లేదో, హఠాత్తుగా ఆగిపోయాడు. వెనక్కితిరిగి మళ్ళీ చెక్ పోస్టు వద్దకి వచ్చాడు. సిమెంట్ దిమ్మల వద్ద కాపలా కాస్తున్న జవాను దగ్గరికి వెళ్ళాడు.
” ఇంకా ఏం కావాలి?” అడిగాడు జవాను హేళనగాను, ఆశ్చర్యంతోను.
నిజార్ మౌనంగా నిలబడ్డాడు. బారులు తీరిన జనాలకేసి, కార్లకేసి చూసాడు. బూట్లని విడిచి, సిమెంటు దిమ్మ పైన పెట్టాడు. జవాను కళ్ళలోకి సూటిగా చూస్తూ, ” ఆఖరి మాట చెబుతాను” అని అన్నాడు.
” మీరు మా బూట్లలో ఉచ్చపోసినంత కాలం, మేము మీ ‘టీ’ లో పోస్తూంటాం. ఈ విద్వేషం సమసిపోయేంతవరకు, మన మధ్య శాంతి ఉండదు. అర్ధమైందా?” అని చెప్పి గబగబా ఉత్త కాళ్ళతో నడచి జనాలలో కలసిపోయాడు.
జులై 10, 2007 at 3:46 అపరాహ్నం
ఇది చాలా బాగుంది. కానీ ఇజ్రయెల్ – పాలస్తీనుల కల్లోలం తెలియని వారికి ఎంత అర్థమవుతుందో అనుమానమే. అక్కడి ఘనీభవించిన వాతావరణాన్ని, అందులోనే బతుకులీడ్చే ప్రజల పట్టుదలనీ సమర్ధవంతంగా చిత్రీకరించారు.
ఒక చిన్న సలహా చెబుతాను. మనం సాధారణంగా వచనాన్ని అనువదించేప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని ప్రమాణంగా (basic unit)గా తీసుకుంటాం. కథల్ని అనువదించడంలో ఈ పద్ధతి అన్ని సార్లూ సహకరించదు. ముఖ్యంగా, ఈ కథలో లాగా, భావావేశం చాలా బలంగా ఉండే చోట్ల. అలాంటి చోట్లని గుర్తించి, వాక్య ప్రమాణంగా కాక భావ ప్రమాణంగా చేసినప్పుడు అనువాదం రాణిస్తుంది. మూలం చదివినప్పుడు మీకు కలిగిన భావోద్రేకం మీ అనువాదాన్ని చదివినప్పుడు పాఠకులకి కలుగుతుందా అని చూసుకోవాలి. వీలుంటే అనువాదం మీద బూదరాజు రాధాకృష్ణగారి పుస్తకం చదవండి.
సెప్టెంబరు 5, 2007 at 5:10 అపరాహ్నం
baagundi, muslims ku support ga raayadam fashion ga kaakunda, vaalu bombs tho prajalni pelchesthunna nijaalu kud samardavanthanga raayandi. palestines pooratam vijayavanthamu agu gaaka.