అందరూ కూలీలే
ఆనందరావు గారింట్లో ట్రింగ్ ట్రింగ్ మంటూ ఫోన్ మ్రోగింది. ఆనందరావు మాట్లాడి, ఫోన్ పెట్టేసాడు.
” నాన్నా, నీ మనవడికి ఉద్యోగం వచ్చింది. ఇవాళ వెళ్ళిన ఇంటర్వ్యులో నెగ్గాడట” అని అక్కడే కూర్చున్న తన తండ్రి సుందర్రావుకి చెప్పాడు.
” ఏం ఉద్యోగంరా?” అని అడిగారు సుందర్రావు గారు తన కొడుకుని.
” ఓ మల్టీ నేషనల్ కంపెనీ వాళ్ళ కాల్‌సెంటర్ లో” చెప్పాడు ఆనందరావు.
” అదేంట్రా, మన రాముడిది ఈ ఏడాదేగా డిగ్రీ పూర్తయ్యింది, మరి అప్పుడే ఉద్యోగం ఎలా దొరికింది?” అని అడిగారు ఆనందరావు తల్లి సుగుణమ్మ.
” అమ్మా, ఆ కాల్‌సెంటర్ వాళ్ళకి ఇంగ్లీషు బాగా మాట్లాడగలిగిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు కావాలట. మన రామకృష్ణ అప్లయి చేసుకున్నాడు. నాలుగు వడపోతల తర్వాత, ఇవాళ ఆఖరి ఇంటర్వ్యులో సెలక్టయ్యాడు” వివరించాడు ఆనందరావు.
” జీతం ఏమాత్రం ఇస్తారేంటి?” అని అడిగింది ఆనందరావు భార్య వనజ.
” ప్రస్తుతానికి నెలకి 12000 ఇస్తారట. పనితీరు బాగుంటే ఆర్నెల్ల తర్వాత ఇంకా పెంచుతారట” చెప్పాడు ఆనందరావు.
” చిన్న పిల్లలకి అంతంత జీతాలేమిట్రా? పూర్తిగా బాధ్యతలు తెలియని వయసులో వేలకి వేలు జీతాలు అందుకుంటే దుబారా చేసేయ్యరూ?” అన్నారు సుగుణమ్మ.
” కొత్తగా బి.కామ్ పాసయిన వీడికే ఇంత జీతముంటే, ఇంజనీర్లు, లాయర్లు వీళ్ళ కెంత ఇవ్వాలో? అయినా, ఒరే ఆనందం, నువ్వు ఉద్యోగంలో చేరినప్పుడు నీ జీతమెంతో గుర్తుందా? బేసిక్, డి. ఏ. కలిపి నెలకి 1560 రూపాయలొచ్చేవి” అన్నారు సుందర్రావు. ఆనందరావు ‘సర్వే ఆఫ్ ఇండియా’ లో క్లర్కు గా పనిచేస్తున్నాడు.
” అవును నాన్నా, కాని మా రోజులలో ఇలాంటి కాల్ సెంటర్లు, బి.పి. ఓ లు లేవు కదా! పైగా విదేశి కంపెనీలు కదా, డబ్బు బాగానే వెదజల్లుతారు. గత రెండు మూడేళ్ళుగా ఇలాంటి సంస్థలు మన దేశంలో చాలా వస్తున్నాయి. వీటి వల్ల మన దేశపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగి, దేశం ఆర్ధికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందట”.
” ఇది బలుపు కాదు. వాపురా అబ్బాయి. వస్తు తయారీ రంగం మీద కాకుండా, సేవల రంగం పై ఆధారపడడం దీర్ఘకాలంలో దేశానికి అంత మంచింది కాదు. మన లాంటి వర్ధమాన దేశాలు వస్తు తయారీ రంగంపై దృష్టి పెట్టాలి” అన్నారు సుందర్రావు గారు.
” ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ ఆర్ధిక వేత్తలకి వదిలేద్దాం. మనం మన స్థాయిలో చూసుకుంటే, ఏదో వాడి కాళ్ళ మీద వాడు నిలబడుతున్నాడు. అది చాలు మనకి. వాడు వచ్చే వేళకి వాడికిష్టమైన సేమ్యాపాయసం చెయ్యాలి…” అని అక్కడ్నించి కదిలింది వనజ. కాసేపటికి ఇల్లు చేరాడు రామకృష్ణ. ఎంతో ఉత్సాహంగా ఉన్నాడతడు.
” నాన్నా, నాకు రాత్రి షిఫ్ఠ్ ఇచ్చారు. నన్ను తీసుకెళ్ళడానికి ఏడు గంటలకి క్వాలిస్ వస్తుంది. మళ్ళీ తెల్లవారు జామున 4.30కి దింపుతుంది” ఆనందరావుతో చెప్పాడు.
” అక్కడ నువ్వు ఏ పని చేయాల్రా అబ్బాయి?” అడిగారు సుగుణమ్మ.
” మాది అమెరికాలోని ఓ పెద్ద కంపెనీ నానమ్మా. ఆ కంపెనీ ఖాతాదార్ల సందేహాలు తీర్చడం, కంపెనీ ఉత్పత్తుల గురించి, కంపెనీ వివరాల గురించి ఫోన్లో మాట్లాడతూండాలి”.
” కంపెనీ ఇక్కడ ఉండి, ఖాతాదార్లు అక్కడ ఉంటే, ఫోన్లలో మాట్లాడుకోవాలంటే చాలా ఖర్చవుతుంది కదరా?” అని అడిగారు సుగుణమ్మ.
“అది కాదు నానమ్మా, ఇలాంటి ప్రశ్నల కోసం టోల్ ఫ్రీ లైన్లు ఉంటాయి. అంటే ఆ నెంబరుకి మనం ఫోన్ చేస్తే మనకేమీ డబ్బు ఖర్చవదన్న మాట” వివరించాడు రామకృష్ణ.
” మరి నీకేమైనా ట్రైనింగ్ ఇస్తారా?” అడిగాడు ఆనందరావు.
” ఆన్-జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్-పర్సనల్ రిలేషన్‌షిప్స్ వంటివి నేర్పుతారట ” చెప్పాడు రామకృష్ణ.
” బానే ఉంది కానీ, ఈ ఉద్యోగంలో ఇంకా ఎదగడానికి ఏమైనా అవకాశాలున్నాయా?” అని అడిగారు సుందర్రావు గారు.
” ఉన్నాయి తాతయ్యా. కష్టపడి పనిచేస్తే ‘టీం లీడర్’ అవ్వచ్చు. తర్వాత మన అదృష్టం బాగుంటే విదేశాలకి కూడ వెళ్ళచ్చట” చెప్పాడు రామకృష్ణ.
ఆ పూటంతా వీళ్ళింట్లో ఇవే మాటలు కొనసాగాయి. వనజ చుట్టుపక్కల ఇళ్ళల్లో అందరికీ వార్త చేరవేసింది. కొందరు సంతోషిస్తే, మరికొందరు అసూయ పడ్డారు.
* **
ఆనందరావు వాళ్ళది బాగ్ అంబర్ పేటలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలనీ. వీళ్ళు అద్దె కుండే ఇంటికి ఎదురుగా మునిసిపాలిటి వాళ్ళ వార్డు ఆఫీసు ఉంది. రోడ్లు విశాలంగా ఉండడంవల్ల, కాలనీ లో చెట్లు బాగా ఉండడం వల్ల చాలా మంది పొద్దున్నే వాకింగ్, జాగింగ్ చేస్తుంటారు. సుందర్రావు గారికి కూడ నడక అలవాటుంది. ఆయన తన పరిచయస్తులతో నడక ప్రారంభించగానే, మునిసిపాలిటీ సిబ్బంది వీధులు శుభ్రం చేయడం మొదలుపెట్టేవారు.
కొంతమంది శ్రద్ధగా చేస్తే, కొంతమంది మొక్కుబడిగా చేసేవారు. చెత్తని కుప్పలుగా పేర్చేసి ఎత్తకుండా వెళ్ళిపోతుండేవారు. వాటి మీద నుంచి వాహనాలు వెళ్ళినప్పుడల్లా, దారంతా మళ్ళీ చెత్తతో నిండిపోయేది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఎవరూ పట్టించుకునేవారుకాదు. పైగా రెండు మూడు రోజులనుంచి అసలు రోడ్లు ఉడవడమే మానేసారు.
వాకింగ్ నుంచి తిరిగొచ్చిన సుందర్రావు గారు, ” ఒరే ఆనందం, ఈ రోజు మునిసిపల్ ఆఫీసుకి వెళ్ళి మాట్లాడుతానురా. ఈ మధ్య బొత్తిగా రోడ్లు ఉడవడం మానేసారు” అని అన్నారు.
” ఎందుకు నాన్నా, దండగ! ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోరు” అన్నాడు ఆనందరావు.
” అందరూ అలా అనుకోబట్టే, వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. మీరు వెళ్ళి మాట్లాడిరండి మావయ్యగారు” అంది వనజ.
ఇంతలో రామకృష్ణ లోపలికి వచ్చాడు.
” ఏరా, ఈ రోజు ఇంత ఆలస్యమైందే?” అని అడిగాడు ఆనందరావు.
” డ్యూటీ మాములు టైం కే అయిపోయింది నాన్నా. కాని రోజు వచ్చే జీపు హఠాత్తుగా పాడయిపోయిందట. ఇంకో బండి వచ్చేవరకు ఆగాల్సివచ్చింది”.
” నీ ఉద్యోగం ఎలా ఉందిరా అబ్బాయ్?” అడిగారు సుందర్రావు.
” బాగానే ఉంది తాతయ్యా!” అని చెప్పి, ” అమ్మా, బాగా అలసిపోయాను. దాదాపుగా 350 కాల్స్ మాట్లాడానీ రోజు. నిద్రొస్తోంది. నన్ను లేపకండి” అని తన గదివైపు నడవసాగాడు.
” ఆగాగు. టిఫిన్ తినేసి వెళ్ళు” అని అంది వనజ.
” వద్దమ్మా. ఇందాకే చిప్స్ తిన్నాను” అంటూ వెళ్ళి పడుకున్నాడు రామకృష్ణ.
పదిన్నరకి సుందర్రావుగారు మునిసిపల్ ఆఫీసుకి వెళ్ళారు. తమ కాలనీలని శుభ్రం చేయడం లేదని ఫిర్యాదు చేసారు. ‘ప్రభుత్వం సిబ్బందిని తగ్గించుకుంటోదని, స్వీపరు పోస్టులు రద్దు చేసిందని, రోడ్ల శుభ్రత, నిర్వహణని ప్రైవేటు కాంట్రాక్టర్లకి అప్పగిస్తున్నారని’ అక్కడి అధికారి తెలిపాడు. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, ఆ తర్వాత ఇక ఇబ్బందులుండవని చెప్పాడాయన. చేసేదేంలేక, సుందర్రావుగారు ఇంటికి తిరిగొచ్చారు. కాల చక్రంలో ఆరు నెలలు గిర్రున తిరిగాయి.
* * *
ఈ మధ్య రామకృష్ణలో చాలా మార్పు వచ్చింది. మునుపటి ఉత్సాహం, చురుకుదనం లేవిప్పుడు. చిరాకు, పరాకు ఎక్కువయ్యాయి. ఓ రోజు ఉదయం 6.45 కి ఫోన్ మ్రోగింది.
” కెన్ ఐ స్పీక్ టు రాంకీ?” అని ఎవరో అడిగారు.
” ఇక్కడ రాంకీ అనేవాళ్ళెవరూలేరు” అని చెప్పి, ఫోన్ పెట్టేసింది వనజ.
కాసేపయ్యాక మళ్ళీ ఫోన్ మ్రోగింది. మళ్ళీ అదే ప్రశ్న వేసారు.
ఫోనెత్తిన వనజ ” ఇక్కడ రాంకీ అని ఎవరూ లేరని చెప్పానా?” కోపంగా అంది. అవతలి వ్యక్తి తను చేసిన ఫోన్ నెంబరు చెప్పి, అది మీదేనా అని అడిగాడు.
” నెంబరైతే ఇదే, కాని ఇక్కడ రాంకీ అని ఎవరూ లేరు” చెప్పింది వనజ. ఈ గోలకి మగత నిద్రలో ఉన్న రామకృష్ణ లేచి వచ్చాడు. ఫోన్ అందుకుని, “యస్, రాంకీ హియర్” అని అన్నాడు. వనజ విస్తుపోయింది. ఫోన్ లో మాట్లాడడం అయ్యాక, ” అమ్మా, నా పేరిప్పుడు రాంకీ. అలా పిలవడమే అమెరికా వాళ్ళకి సులువు. దాంతో మిగిలిన వాళ్ళు కూడ అదే పేరు తో పిలుస్తున్నారు” అని చెప్పాడు. తన అస్ధిత్వాన్ని కోల్పోతున్న కొడుకు వంక జాలిగాచూసిందామె. ఇంతలో వాకింగ్ నుంచి తిరిగొచ్చిన సుందర్రావు గారు మనవడు మేలుకొని ఉండడం చూసి పలకరించారు.
” ఏరా, ఈ మధ్య మరీ డల్‌గా కనపడుతున్నావు? ఒంట్లో బాగుండడం లేదా?” అని అడిగారు.
” అదేం లేదు తాతయ్యా. పని ఒత్తిడి. అంతే” అన్నాడు రామకృష్ణ.
” పోనీ ఓ రెండు రోజులు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవచ్చుగా….” అన్నారు సుందర్రావు గారు.
” కుదరదు తాతయ్యా. సెలవలు ఇవ్వరు. 72 గంటల ముందు చెప్పకుండా సిక్ లీవు కూడ పెట్టకూడదు.” అని చెప్పి, తన గది లోకి వెళ్ళిపోయాడు.
అప్పుడే స్నానం చేసి వచ్చిన ఆనందరావుతో సంభాషణకి దిగారు సుందర్రావు గారు.
” నిన్న మునిసిపల్ ఆఫీసుకు వెళ్ళొచ్చానురా. మన ఏరియాకి కాంట్రాక్టరు కుదిరాడట. ఆ కాంట్రాక్టరు డైలీ వేజెస్ మీద స్వీపర్లని ఏర్పాటు చేసుకుంటాడట. బహుశా ఇంకో రెండు మూడు రోజులలో మన వీధులు శుభ్రం చేయడం ప్రారంభిస్తారట…” అని చెప్పారు.
” మంచిదేగా, చూద్దాం” అంటూ ఆనందరావు పూజ గది లోకి నడిచాడు.
* * *
మర్నాడు సుందర్రావు గారు వాకింగ్ ప్రారంభించగానే, మునిసిపల్ఆఫీసు దగ్గర సందడిగా ఉండడం చూసారు. వీధులు శుభ్రం చేసే మహిళలు ఒక్కొక్కరు గా వచ్చి అక్కడ ఉన్న ఓ వ్యక్తి కి నమస్కరిస్తున్నారు. కార్పోరేషన్ నుంచి కాంట్రాక్టు పొందిన సంస్థ ఉద్యోగి అతడు. వీళ్ళందరిని పర్యవేక్షిస్తుంటాడతడు. స్వీపర్లు అతడిచ్చిన లేత నీలం రంగు కోటు, ఓ చీపురు, బుట్ట తీసుకుని బయటకు వెడుతున్నారు.
” మా ఏరియాను తీసుకున్న కాంట్రాక్టరు పనులను ప్రారంభిస్తున్నాడు కాబోలు” అని అనుకున్నారు సుందర్రావు గారు. స్వీపర్లు ఇద్దరేసి జట్టుగా విడిపోయి వీధులను శుభ్రం చేయసాగారు. ఆయన ఇంటికి వచ్చేసరికి, మనవడు టి.వి. చూస్తూ కనపడ్డాడు.
“ఏరా, నిద్ర రావడం లేదా?” అని అడిగారు ఆయన. రామకృష్ణ మానంగా ఉండిపోయాడు.
” ఏమిటో మావయ్యగారు, ఈ మధ్య వీడి తీరు బొత్తిగా అర్ధం కావడం లేదు. అన్నం సయించడం లేదంటాడు. ఎవరితోను కలవడు. ఓ పండగ లేదు, పబ్బం లేదు. ఉద్యోగం, నిద్ర ఇదే జీవితమై పోయింది” అంటూ వాపోయింది వనజ.
” ఏరా రాముడు, ఏవైనా సమస్యలుంటే మాకు చెప్పచ్చు కదా?” అని అన్నారు సుగుణమ్మ.
” అబ్బబ్బా, నన్ను వదిలేయండి. నా సమస్యలు చెప్పినా మీకు అర్ధం కావు” అన్నాడు రామకృష్ణ విసుగ్గా.
” ఒరే, నీ సమస్యలని మేము పరిష్కరించలేక పోవచ్చు. కాని మాతో పంచుకుంటే, కాస్త నీ బాధ తగ్గుతుంది కదా” అని అన్నాడు ఆనందరావు.
” ఏం లేదు నాన్నా, విరామం లేకుండా మాట్లాడడం చాలా కష్టంగా ఉంటోంది. ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకునిహెడ్‌ఫోన్ పక్కకి పెడితే ఒక కాల్ మిస్ అవుతుంది. వెంటనే కంప్యూటర్ ‘ ఎర్రర్’ నమోదు చేస్తుంది. మా మీద నిరంతర నిఘా ఉంటుంది. పైగా భాష, యాస మరీ ఇబ్బందిగా ఉంటున్నాయి. అదికాక కస్టమర్ చెప్పిందే కరెక్ట్ అంటారు. వాళ్ళెంత అవమానంగా మాట్లాడినా, నోరు మూసుకుని భరించాలి. ఈ రోజు ఒకడు ఫోన్ చేసి, ఇంగ్లీషు లో బూతులు తిట్టాడు. వాణ్ణి ఏమీ అనలేము. అన్నిటి కన్నా దారుణమైన
విషయమేంటంటే, టాయిలెట్‌కి వెళ్ళాలన్నా పర్మిషన్ అడగాలి. అదికూడ వెంటనే దొరకదు…. ఛీ! వెధవ ఉద్యోగం! ఇంత కన్నా రోడ్లు ఊడుచుకోడం చాలా ఉత్తమం” అన్నాడు రామకృష్ణ. రెండు నిముషాల పాటు అందరు మానంగా ఉండిపోయారు.
” పోనీ, ఉద్యోగం మానేయ్ ! హాయిగా ఎం.కామ్ చదువుకో” చెప్పాడు ఆనందరావు.
” వద్దు నాన్నా! మా స్నేహితులందరిలోకి మొదట ఉద్యోగం వచ్చింది నాకే. ఎక్కువ జీతం సంపాదించేదీ నేనే. పైగా ఈ ఉద్యోగం మానేస్తే నేను టెలీమార్కెటింగ్‌కి తప్ప ఇంక దేనికీ పనికిరాను. ఇంకొంత కాలం చూస్తాను” అని చెప్పాడు రామకృష్ణ. తర్వాత ఓ గ్లాసుడు వేడి పాలు త్రాగి నిద్రకి ఉపక్రమించాడు. ఆ సాయంత్రం మాములే గానే డ్యూటీకి వెళ్ళిపోయాడు రామకృష్ణ. తెల్లవారుతుండగా ఇంటికి వచ్చాడు. నిద్ర రాకపోవడంతో కాసేపు టి.వి చూసి సుమారు 5.30కి పడుకున్నాడు. ఒక పావుగంట సేపు పడుకున్నాడో లేదో, మునిసిపల్ ఆఫీసు వద్ద ఏదో గొడవ జరగసాగింది. కొంతమంది స్వీపర్లు గట్టిగా అరుచుకుంటున్నారు. కిటికిలు అన్నీ మూసుకుని, చెవులలో దూది పెట్టుకుని నిద్ర పోయాడు
రామకృష్ణ. అయితే ఈ గొడవ రోజూ జరగడం ప్రారంభమైంది. దాదాపు వారం రోజుల పాటు కొనసాగింది.
* * *
సుందర్రావు గారు ఆ రోజు వాకింగ్‌కి వెళ్ళకుండా, ఆ గొడవకి కారణమేమిటో తెలుసుకోవాలునుకున్నారు. సూపర్‌వైజర్‌ని వివరాలు అడిగారు. వీళ్ళ కాలనీలోని వీధులను శుభ్రం చేయడానికి 12 మంది చాలు. కాని ఊడ్చడానికి పోటీ పడేవాళ్ళ సంఖ్య 20 దాక ఉంటోంది. ముందుగా వచ్చిన 12 మందికే ఆ పూట పని దొరుకుతుంది. మిగిలిన వాళ్ళు మరో రోజు ప్రయత్నించుకోవాల్సిందే. అంత చలిలోను ఆడవాళ్ళు పొద్దున్నే వచ్చేసి మునిసిపల్ ఆఫీసు ముందు గుమిగూడుతున్నారు. ఆలస్యంగా వచ్చి పని పోగొట్టుకున్న వాళ్ళు పని
పొందినవాళ్ళపై అరుస్తున్నారు. ఇదీ గొడవకి కారణం.
వారిలో ఒకామె సుందర్రావు గారికి ముందే పరిచయం. ఆమె పేరు అంజమ్మ. రోజూ సుందర్రావు గారు వాకింగ్‌కి వెళ్ళేడప్పుడు, ఆయన తనని దాటుకుంటూ వెడుతుంటే ఆయన వెళ్ళేవరకు ఊడవడం ఆపేది. అంజమ్మ చిరునవ్వుతో, వ.నంగా తనపని తాను చేసుకుపోయేది. కాని ఈరోజు అంజమ్మ కూడ గట్టిగా అరుస్తోంది.
” ఏం జరిగింది అంజమ్మా?” అని అడిగారు సుందర్రావు గారు.
” చూడు సారు! ఎంతో కష్టపడి పనిచేస్తా. మూడు దినాలసంది పానం బాలేక పన్లోకి రాకపోతి. నా బదులు ఇంకో ఆమెని తీసుకుండ్రు. గిప్పుడేమో, జల్దీ వద్దామనుకున్నా, కాని మా పోరగానికి బుఖార్ అయింది. ఒక్కరోజన్నా కూలి దొరుకుతాదని చూస్తున్నా, కాని దొరకడం లేదు సారు. మీరే ఇన్సాఫ్ చెప్పండి సారు” అంది అంజమ్మ.
” పోనీ, అంజమ్మకి ఈ రోజు పని ఇవ్వచ్చుకదా” అని సూపర్‌వైజర్‌తో అన్నారు సుందర్రావు గారు.
” కుదరదు సార్. ఎవరు ముందొస్తే,వాళ్ళకే పని ఇవ్వాలని మా బాస్ చెప్పారు. ఆయన మాటలు లెక్కజేయకపోతే, నా ఉద్యోగం పోతుంది” అన్నాడతడు.
చేసేదేం లేక, నిశ్శబ్దంగా వెనుదిరిగారు సుందర్రావు గారు. స్వీపర్ల అరుపులు, కేకలు ఎక్కువయ్యాయి. మెలకువ వచ్చిన రామకృష్ణ ” అబ్బబ్బా, రోజు ఈ న్యూసెన్సు ఏంటి తాతయ్యా? గొడవకి కారణమేంటో నీకు తెలుసా” అని అడిగాడు. సుందర్రావు గారు సంగతంతా వివరించారు.
” రోజూ ఇలా అరుచుకునేబదులు ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చుగా” అని విసుక్కున్నాడు రామకృష్ణ.
అతడి కేసి చూసి చిన్నగా నవ్వారు సుందర్రావు గారు.
” ఒరే రాముడూ, కొన్నాళ్ళ క్రితం నువ్వేమన్నావో గుర్తుందా? నీ ఉద్యోగం కంటే రోడ్లు ఊడుచుకోడమే నయం అని అన్నావు. కాని ఆ ఉద్యోగం కూడ అంత తేలికగా దొరకడం లేదు. నువ్వు చదువుకున్నవాడివి కాబట్టి నిలకడైన నెలవారీ సంపాదన కోరుకుంటున్నావు. అంజమ్మకి చదువు రాదు కాబట్టి రోజుకూలీ కోసం ఆరాటపడుతోంది. స్థాయీబేధాలున్నా, అభద్రత నిండిన కాంట్రాక్టు బతుకులు మనవి! మనుగడ కోసం జరిపే పోరాటంలో అందరూ కూలీలే!” అని అన్నారు.
రామకృష్ణ మారు మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.
(ఈ కథ 1 మార్చి 2006 నాటి నవ్య వార పత్రికలో ప్రచురితం)
3 comments జులై 28, 2007