ఆమె దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవలసి వస్తుందని రూప అసలే మాత్రం ఊహించలేదు.  రూప ఈ సంవత్సరపు మిస్ ఇండియా. మరి ఆమె, చిక్కటి నలుపు, ఎత్తైన ముక్కుతో చాలా అనాకారిగా ఉంటుంది. మరి అవిడతో రూప పరిచయం ఎలా జరిందంటే…..

ఇటీవల జరిగిన మిస్ ఇండియా పోటీలలో విజేతగా నిలిచిన రూప పూర్తి పేరు రూప లావణ్య. వాళ్ళ సొంతూరు విజయనగరం. రూప ఆరో తరగతి చదువుతూండగా, తండ్రి రాజేశ్వర్ డిల్లీ లో స్థిరపడిపోడంతో, ఆమె డిల్లీ నివాసి అయిపోయింది. 

అక్కడ ఆమె ఆధునిక విద్యతో పాటు, కాస్మోపాలిటన్ సంస్కృతిని అలవర్చుకుంది. ప్రస్తుతం ఓ సుప్రసిద్ధ కాలేజిలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. డబ్బుకి లోటు లేకపోవడంతోను, సంపూర్ణమైన స్వేచ్చ ఉండడంతోను, చుట్టూ స్నేహితురాళ్ళతో రూప ఓ చైతన్య స్రవంతి లా ఉంటుంది. దేశం గర్వించే ఘనత ఏదైనా సాధించాలనేది ఆమె లక్ష్యం.

డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా ఓ పత్రికలో పడ్డ ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించింది. అది మిస్ ఇండియా పోటీలకి సంబంధించినది.  అప్పటినుంచి రూప ఓ ఫాషన్ ఇన్ స్టిట్యూట్ లో చేరింది. నడక, వ్యాయామం, ఈత వంటి అన్ని అంశాలలోను శిక్షణ పొందసాగింది. దుస్తులు, కేశాలంకరణ, మేకప్ వంటి విషయాల లోను, న్యాయ నిర్ణేతల ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పడంలోను ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మాములుగానే అందంగా ఉండే రూప, ఇప్పుడు అదనపు హంగులతో మరింత ఆకర్షణీయంగా తయారైంది. 

సంవత్సరకాలం ఇట్టే తిరిగింది. ఈ ఏడాది మిస్ ఇండియా పోటీలకు ప్రకటన రాగానే రూప కూడా దరఖాస్తు చేసింది. వేలాదిగా వచ్చిన దరఖాస్తుల్లోంచి 200 మంది దరఖాస్తులను నిశితంగా పరిశీలించి, వాటిల్లోంచి 26 దరఖాస్తులను పోటీలోకి పరిగణనలోకి తీసుకున్నారు నిర్వాహకులు. రూప అన్ని వడపోతలలోను నెగ్గి పోటీలలో పాల్గొనడానికి తగిన అర్హత సాధించింది.  

పోటీలకు వచ్చిన ఒక న్యాయ నిర్ణేత రూప ని  అడిగారు – “అందం అంటే ఏమిటి” అని.
“అందానికి ఎన్నో నిర్వచనాలు ఉన్నయి. నా దృష్టిలో అందమంటే లావణ్యం, మేధస్సుల కలపోత” అని చెప్పింది.
“మిస్ ఇండియా గా ఎంపికైతే ఏ విధంగా ప్రతిస్పందిస్తావు?” అని మరో న్యాయ నిర్ణేత అడిగారు.
నా పై నా నమ్మకం నిజమైనందుకు గర్వ పడతాను. నా తల్లిదండ్రులకు, మా ఊరికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టినందుకు సంతోషిస్తాను” అంది రూప.
ఫలితాలు ప్రకటించారు. మిస్ ఇండియాగా రూప గెలుపొందింది. మిస్ ఇండియాగా ఎంపికైన మొదటి తెలుగమ్మాయిగా రూప చరిత్ర సృష్టించింది. మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనడానికి సిద్ధమవసాగింది.

    * * *

రూప సొంత ఊరు విజయనగరంలో ఆమె పేరు మారుమోగిపోయింది. ఆమెకి బాబాయి వరసయ్యే ఒకాయన విజయనగరంలో జరిగే రెండు కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా రూపకి ఆహ్వానం పంపాడు. బంధుత్వమనో,లేదా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవచ్చనో ఆ ఆహ్వానాన్ని మన్నించింది రూప. తన సన్నిహితులైన ఇద్దరు మిత్రురాళ్ళతో కలసి విమానంలో విశాఖపట్నం చేరింది. అక్కడినుంచి ఆమెని జీపులో ఊరేగింపుగా విజయనగరం తీసుకువచ్చరు నిర్వాహకులు. అదే సమయంలో పట్టణంలో “విజయనగర ఉత్సవాలు” జరుగుతున్నాయి.
వీటిలో భాగంగా చిత్రకళా ప్రదర్శనని రూప ప్రారంభించింది. తర్వాత రెండు రోజుల పాటు విజయనగరం లోని కోట, సంగీత కళాశాల, గురజాడ అప్పారావు గారిల్లు, పట్టణానికి కొంచెం దూరంలో ఉన్న బొబ్బిలి కోట, రామతీర్ధం గుడి, తొట్లకొండ లోని బౌద్ధ స్థూపాలు వంటి పర్యాటక ప్రదేశాలను చూసారు. మూడో రోజు రాత్రి రూపకి, ఆమె మిత్రబృందానికి హోటల్ మయూరలో డిన్నర్ ఏర్పాటు చేసారు నిర్వాహకులు. కావలసిన పదార్దాలు ఆర్డరిచ్చి అందరు కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు.  
 ఇంతలో ఆ ఏ.సి. గదిలోకి కొంతమంది వచ్చి వారికి కేటాయించిన కుర్చీలలో కూర్చుని వారికి కావలసిన వంటకాలను ఆర్డర్ చేయసాగారు. వళ్ళలో ఒకావిడ అందరికంటే భిన్నంగా ఉంది. ఆమె వయసు సుమారుగా 35-40 ఏళ్ళ మధ్య ఉండవచ్చు. రంగు చిక్కటి నలుపు. ఏదో ముదురు రంగు చీర కట్టుకుని ఉంది. అయితే ఆమె ముఖంలో మాత్రం ఏదో ఆకర్షణ ఉంది. మానసికంగా ప్రశంతతని అనుభవించే మనిషి ముఖంలో ఉండే కళ ఆమె లో ప్రస్పుటంగా ఉంది.

ఇంతలో రూప, ఆమె స్నేహితురాళ్ళ దృష్టి ఆమె పై పడింది. అంతే ఒక్కసారిగా వాళ్ళ పెదాలపై హేళనతో కూడిన నవ్వులు విరిసాయి. “ఆమెని చూడండే, ఆ రంగు, ఆ కాంప్లెక్షన్… గొప్ప అందగత్తె” అంటూ గుసగుసలాడింది ఓ అమ్మాయి. కాసేపు వీళ్ళ సంభాషణకి కేంద్రబిందువయ్యిందామె.
ఇంతలో ఆమె కి ఎలా తెలిసిందో ఏమో, లేచి రూప దగ్గరకి వచ్చి, “కంగ్రాట్స్! మీరు మిస్ యూనివర్స్ గా కూడా గెలవాలి” అంటూ ఆటోగ్రాఫ్ తీసుకుంది. రూపకి కించిత్ గర్వం కలిగింది.

***

మర్నాడు ఉదయం జిల్లా కలెక్టర్ పాల్గొనే ఒక కార్యక్రమంలో రూప పాల్గొనాలి. ఇదే ఆమె ఆఖరి సభ. రూప, కలెక్టర్ గారు, కొంతమంది పెద్దలు వేదికపై ఆశీనులయ్యారు. ఇంకా ఒక కుర్చీ ఖాళీగా ఉంది.
సభాధ్యక్షుడు మాట్లాడుతూ, “ఉత్తరాంధ్రలో పోలమాంబ గారి పేరు తెలియని వారు లేరు. తన యావదాస్తిని సమాజానికి ధారాదత్తం చేసారావిడ. మన ప్రాంతంలో స్వయం సహాయక బృందాలను స్థాపించి, స్త్రీలకు మేలు చేసారామె. బాల కార్మిక వ్యవస్థని రూపుమాపడానికి కృషి చేస్తున్న ఆవిడకి యు.ఎన్.డి.పి. అవార్డు రావడం మనకి ఎంతో గర్వ కారణం. పోలమాంబ గారిని సగౌరవంగా వేదికమీదికి ఆహ్వానిస్తున్నాను” అని అన్నారు.

వేదికపైకి వస్తున్న ఆమెని చూడగానే రూప నిర్ఘాంతపోయింది. ఆమె ఎవరో కాదు, నిన్న రాత్రి హోటల్లో ఎవరిని చూసి తామంతా నవ్వుకున్నారో ఆమే ఈవిడ!
వక్తలు పోలమాంబ గారిని పొగుడుతున్నరు. ఒకావిడ యు.ఎన్.డి.పి. అవార్డు పొందడం ఎంత కష్టమో వివరిస్తూ, దాన్ని పోలమాంబ గారు సాధించడం ఆంధ్ర రాష్ట్రానికే గర్వ కారణమని అన్నారు. పోలమాంబ చిరునవ్వుతో వినమ్రంగా ఉండిపోయారు. చివరగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, పోలమాంబ గారు సమాజానికి మరింత సేవజేసి, మరిన్ని అవార్డులు పొందాలని కోరారు.
ఆ క్షణంలో రూప కి అందానికి మరో నిర్వచనం స్ఫురించింది. అందమంటే…. దయ, నిస్వార్ధం, త్యాగం! కార్యక్రమం ముగుస్తుండగా, రూప లేచి పోలమాంబ గరి దగ్గరకి వెళ్ళి ఆటోగ్రాఫ్ అడిగింది. 

(ఈ కధ 29 ఏప్రిల్ 2005 నాటి స్వాతి వారపత్రికలో ప్రచురించబడింది)