అతడు-ఆమె-ఇంటర్ నెట్
అది నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం ఉదయం ఆరున్నర గంటలవుతోంది.
“హైదరాబాదు నుంచి కొత్త ఢిల్లీ వెళ్ళవలసిన ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్ ప్రెస్ రెండవ నెంబరు ఫ్లాట్ ఫారం మీద ఉన్నది” అని మైక్ లోంచి ప్రకటన వినపడుతోంది. తనకి వీడ్కోలు చెప్పడానికి వస్తానన్న మిత్రుడు సందీప్ కోసం అసహనంగా ఎదురు చూస్తున్నాడు నవీన్.
ఇంతలో దూరం నుంచి చెయ్యి ఊపుతూ వచ్చాడు సందీప్.
“ఏరా, ఇంత ఆలస్యమైంది? ఇంకాసేపు అయితే బండి బయల్దేరిపోయేది” అన్నాడు నవీన్.
“ఏం చేయను బాస్, రాత్రి ఇంటర్ నెట్ దాభాలో బాగా ఆలస్యం అయ్యింది. మనం చూసే మసాలా వెబ్ సైట్ లో కొత్త అప్ డేట్లు వచ్చాయి. వాటిని పూర్తిగా చూసి ఇంటికి వెళ్ళేసరికి పదకొండు గంటలయ్యింది. దాంతో పొద్దున్నే నిద్ర లేవడం కొంచెం కష్టమైంది” అంటూ తాను తెచ్చిన డెక్కన్ క్రానికల్ పేపరు నవీన్ చేతిలో పెట్టాడు సందీప్.
“అప్ డేట్లు ఎలా ఉన్నాయి? గిట్టుబాటవుతాయా?” ఆసక్తిగా అడిగాడు నవీన్.
“అదిరాయనుకో, అయినా నువ్వు ఓ వారం లో తిరిగి వస్తావుగా, అప్పుడు చూద్దూగాని. లేకపోతే ఢిల్లీ లో ఏదైన ఇంటర్ నెట్ సెంటర్ కి వెళ్ళు” అని సలహా ఇచ్చాడు సందీప్.
అలాగేనన్నట్లు తలూపుతూ, “ఏమైనా, ఇన్ని గంటల ప్రయాణం విసుగేరా” అన్నడు నవీన్.
“ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేస్తున్నావు. పైగా ఏవో నవలలు, ఇంకా వాక్.మన్ తీసుకువెడుతున్నవ్. మరిక విసుగెందుకు గురు….” అంటూ ” నీ సీట్ నెంబరెంత?” అని అడిగాడు సందీప్.
“36″
సందీప్ వెంటనే బోగీలోకి ఎక్కి చూసి వచ్చి, “నువ్వు లక్కీ ఫెలోరా. నీ ఎదురు సీట్లో ఓ చక్కని చుక్క ఉంది. ఇక నువ్వు ప్రయాణాన్ని హాయిగా ఎంజాయ్ చెయవచ్చు” అన్నాడు.
“అవునా, నేను గమనించ లేదే” అంటూ బోగీలోకి తొంగి చూసాడు నవీన్. అక్కడ తన సీట్ కెదురుగా ఓ అమ్మాయి, ఓ ముసలాయనా కూర్చుని ఉన్నారు. బెంగాల్ కాటన్ చీరలో ఆ అమ్మాయి హుందాగా ఉంది.
“వావ్! స్టన్నింగ్ బ్యూటీరోయ్!” అన్నాడు నవీన్ లోగొంతుకతో. ఇంతలో బండి బయల్దేరుతోందని మైక్ లో ప్రకటన రావడం, మరి కొద్ది నిమిషాలకే బండి బయల్దేరడం జరిగింది.
సందీప్ నవీన్ కి చేతులూపి వీడ్కోలు చెప్పాడు. రైలు మెల్లగా వేగం పుంజుకోడంతో బోగీ తలుపు దగ్గరనుంచి కదిలి, తన సీట్ లో కూర్చున్నాడు నవీన్. బాగ్ లోంచి వాక్ మన్ బయటకి తీసి రికీ మార్టిన్ పాడిన ‘ఉల్వే’ అనే పాటల కాసెట్ దాంట్లో పెట్టాడు. ఇయర్ ఫోన్లు తగిలించుకుని టేప్ ఆన్ చేసాడు. ఆ పాటకి తగ్గట్టుగా, కాళ్ళని లయబద్ధంగా ఊపసాగాడు.
సభ్యత కాదని తెలిసినా,ఆ అమ్మాయి వైపు దొంగ చూపులు చూడసాగాడు. రెండు రోజుల క్రితం టీవీలో చూసిన ‘రంభా ఊర్వశి తలదన్నే రమనీ లలామ ఎవరీమె?’ అనే పాత పాట అతడి పెదాలపై ఆడసాగింది. ఆ అమ్మాయి పొందికగా కూర్చుని ‘బార్న్ టూ విన్ ‘ అనే పుస్తకం చదువుకుంటోంది. పక్కన కూర్చున్న ముసలాయన నవీన్ చేతిలోని దినపత్రికని అడిగి తీసుకుని తీరికగా చదవడం మొదలుపెట్టారు.
ఆ అమ్మాయి ఏదో పుస్తకం చదువుతోంది కదా అని..తనూ ఓ ఇంగ్లీష్ నవల బయటకు తీసాడు నవీన్. దాన్ని చదువుతున్నట్లు నటిస్తూ, ఆమె అందాన్ని కళ్ళతోనే ఆస్వాదించసాగాడు. అతడి చూపులు ఆమె శరీరాన్ని తడుముతున్నాయి.
“ఆహ! ఎంత అందంగా ఉంది! అన్ని అవయవాలు ఏరి కూర్చి అమర్చినట్లుగా ఉన్నాయి. ఫర్ఫెక్ట్ ఫిగర్. ఈమెని పెళ్ళి చేసుకునేవాడు అదృష్టవంతుడు” అని అనుకున్నాడు.
“మేరే సామ్నే వాలి కిడికీ పే ఏక్ చాంద్ కా తుక్డా రహతా హై..”అనె హిందీ పాటని ఆమె మాత్రమే వినపడేలా లోగొంతుకలో పాడసాగాడు.
ఆ అమ్మాయి ఇవేవి పట్టించుకోకుండా, దీక్షగా పుస్తకం చదువుతోంది. ముసలాయన దినపత్రికను ఆములాగ్రం చదివితేగాని వదిలేట్టు లేరు. కొద్ది సేపటికి రైలు కాజిపెట స్టేషన్ లో ఆగింది. కాఫీ, టీ, టిఫిన్లు అమ్మే వాళ్ళ కేకలతో స్టేషనంతా హడావుడిగా ఉంది.
“ఏమ్మా, కాఫీ తాగుదామా?” ఆ అమ్మాయిని అడిగారు ఆ ముసలాయన.
“అలాగే తాతయ్యా” అంటూ పుస్తకం మూసి, ఎదురుగా కూర్చున్న నవీన్ ని చూసి పలకరింపుగా నవ్వింది ఆ అమ్మయి.
బదులుగా, “హాయ్! ఐ యాం నవీన్” చెప్పడు నవీన్.
“నా పేరు విద్య”
ఫ్లాట్ ఫారం పై అమ్ముతున్న పెప్సీ టిన్ కొని కొద్ది కొద్దిగా తాగుతూ “ఎక్కడి దాక వెడుతున్నారు?” అని అడిగాడు నవీన్.
“నాగపూర్ కి” అని చెప్పి తాతయ్య తెచ్చిన్ కాఫీ తాగడం మొదలుపెట్టింది విద్య.
రైలు మళ్ళీ బయల్దేరింది. కాఫీ తాగేసి, తిరిగి పుస్తకం లో తలదూర్చబోయింది విద్య. ఆమె పుస్తకం చదవడంలొ నిమగ్నమైతే తనతో మాట్లాడదని గ్రహించిన నవీన్ సంభాషణని పొడిగించాడు.
“విద్యా, మీరు ఏం చదువుతున్నారు?”
“నేను విజువల్ ఆర్ట్స్ లో పీజీ చేసాను. మరి మీరో?”
“నాది ఈ మధ్యే డిగ్రీ పూర్తయ్యింది. ఎం.బి.ఎ ఎంట్రన్స్ కి ప్రిపేరవుతున్నాను. మెటీరియల్ కోసం ఢిల్లీ వెడుతున్నాను” చెప్పాడు నవీన్. అతడి మాటలలో దర్పం ధ్వనించింది.
“ఆహా, అలాగా” అంటూ పుస్తకం తెరవబోయింది విద్య.
“మీ హాబీస్ ఏమిటి” అడిగాడు నవీన్.
“పెయింటింగ్, రీడింగ్”
” ఐ సీ, ఐ టూ లైక్ రీడింగ్. అందులోనూ, సైన్సు ఫిక్షన్ అంటే మరీ ఇష్టం. పోతే ఇంటర్ నెట్ బ్రౌజింగ్ మరో హాబీ” చెప్పడు నవీన్.
“అలాగా, మీరు ‘ఫ్రం ది ఎర్త్ టు మూన్ ‘ చదివారా?” అడిగింది విద్య.
లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు నవీన్.
“పోని, ‘ జర్నీ టూ ది సెంటర్ ఆఫ్ ఎర్త్ ‘ చదివారా?”
మళ్ళీ ఇంకోసారి తల అడ్డాంగా ఊపాడు. నిజానికా పుస్తకాల పేర్లు కూడా వినలేదతడు. అయినా ఆమె ముందు గొప్పలు పోడం కోసం “లేదండి, నాకు పెద్దగా టైం దొరకదు. అందుకని ఇష్టం ఉన్నా, వాటిని చదవలేకపోయాను…” అంటూ అందం గా అబద్దం చెప్పాడు.
అతడి డాంబికాన్ని పసిగట్టిన విద్య మారు మాట్లాడకుండా, పుస్తకం చదువుకోసాగింది. రైలు గాలిని చీల్చుకుంటూ వేగంగా ప్రయాణిస్తోంది.
ఇంతలో ఇద్దరు వ్యక్త్లులు వచ్చి భోజనాలకు ఆర్డర్ తీసుకోసాగరు. నవీన్ తనకు కావల్సిన పదార్ధాలు చెప్పాడు. ఎదురుగా కూర్చున్న ఇద్దరూ ఏదీ ఆర్డర్ ఇవ్వలేదు.
మధ్యాహ్నం భోజన సమయం అయ్యింది.
“భోజనం చేద్దాం అమ్మా…” అంటూ తాతయ్య వాళ్ళు తెచ్చుకున్న కారేజి అందుకున్నారు.
“చేతులు కడుక్కుని వస్తాను తాతయ్యా” అని విద్య లేచి వాష్ బేసిన్ వైపు వెళ్ళింది.
విద్య వెడుతుంటే ఆమెని చూసి నవీన్ నివ్వెరపోయాడు. ఎందుకంటే ఆమె కుంటుతూ నడుస్తోంది. ఆమె ఎడమకాలికి రబ్బరు పాదం ఉంది. అంతే, నవీన్ ముఖం వివర్ణమైంది. అప్పటి దాక ఆమె పట్ల ఉన్న మోహపు భావనలు మాయమై, వాటి స్థానంలో జాలి చోటుచేసుకుంది.
“అయ్యో, ఇంత అందమైన అమ్మాయికి ఈ లోపం ఏమిటి? ఆడపిల్లలకి అంగవైకల్యం ఉంటే పెళ్ళి ఎలా జరుగుతుంది? అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవాళ్ళే బ్రతకడం కష్టంగా ఉన్న ఈ రోజులలో ఈ అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో?”…. అని స్వగతంలో అనుకున్నాడు నవీన్.
ఇంతలో అతడికి భోజనం వచ్చింది. ముగ్గురు తినడం పూర్తిచేసారు.
విద్య తిరిగి పుస్తకం అందుకుంది. వాళ్ళ తాతయ్య విశ్రాంతిగా వెనక్కి జారిబడి చిన్న కునుకు తీయడానికి ఉపక్రమించారు.
“ఐ యాం సారీ విద్యా, మీరు హాండీకాప్డ్ అని నేను గ్రహించలేదు. ప్రమాదం ఎప్పుడు, ఎలా జరిగింది?” అడిగాడు నవీన్.
“మూడేళ్ళ క్రితం నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగా రోడ్ యాక్సిదెంట్లొ పాదం చితికి పోయింది. అప్పటినుంచి రబ్బరు పాదం పెట్టుకోవాల్సి వచ్చింది”
“ఇట్స్ రియల్లీ సాడ్” విచారం వ్యక్తం చేసాడు నవీన్.
“విచారం దేనికి? జరిగిపోయినదాన్ని మనం మార్చలేం. గతంలో జరిగిన విషాదాన్ని తలచుకుంటూ బాధ పడితే వర్తమానంలో ఆనందంగా జీవించే అవకాశాన్ని పోగొట్టుకుంటాం కదా! ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని రోజులపాటు నేను తీవ్రమైన నైరాశ్యానికి లోనయ్యాను. కాని, నాకున్న మరో హాబీ….అదే… ఇంటర్ నెట్ బ్రౌజింగ్ నేను మానసికంగా కోలుకోడానికి చాలా సహాయపడింది. ఇంటర్ నెట్ లో కొన్ని వెబ్ సైట్లు ఉదాహారణకి అబ్సల్యూట్లీపాజిటివ్ డాట్ కాం, ఇన్స్పిరేషన్ పీక్ డాట్ కాం, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ డాట్ కాం వంటివి నా జీవితంలో తిరిగి ఉత్సాహాన్ని నింపాయి. తర్వాత కొద్ది కాలంలోనే నేను మాములు మనిషినయ్యాను” చెప్పింది విద్య.
“ఏమైనా, అందరిలా లేననే బాధ మీకుంటుంది కదా”
అతడు నిజంగానే తన మీద సానుభూతితో ఉన్నడని గ్రహించిన విద్య మాట మార్చింది.
“ఇంతకీ జీవితంలో మీ లక్ష్యం ఏమిటి?”
“లక్ష్యాలంటూ పెద్దగా ఏమీలేవు. చూడాలి. ఎం.బి.ఎ చేసాక, ఏదైనా కంప్యూటర్ కోర్సు చేస్తాను”
“ఆడపిల్లలైన, మగపిల్లలైనా జీవితంలో ఒక లక్ష్యం కలిగి ఉండాలనేది నా అభిప్రాయం. ఏదైనా సాధించాలనే తపనే మానవజాతి పుతోగతికి పునాది. అసలంటూ ఏ లక్ష్యం లేకపోతే మనం చేరేది ఎక్కడికి? గత కొద్ది కాలంగా నేను నా లక్ష్య సాధనకు నిర్విరామంగా కృషి చేస్తున్నాను. అందులో భాగంగా ‘పర్యావరణం’ పై ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన పోటీలో పాల్గొని, దేశవ్యప్తంగా రెండో బహుమతి గెల్చుకున్నాను. ఆ బహుమతి తీసుకోడానికే ఇప్పుడు నాగపూర్ వెడుతున్నాను. మా ప్రయాణం ఏర్పాట్లు ఆ సంస్థే చేసింది” చెప్పింది విద్య.
సంభ్రమంగా ఆమెనే చూస్తుండిపోయాడు నవీన్.
“ఇంకో మాట చెప్పనా నవీన్, ఏమనుకోవద్దు. మీరు పోకిరి కుర్రడిలా అనిపించడంలేదు. కానీ అమ్మాయిలను కోరిక నిండిన కళ్ళతో దొంగ చూపులు చూడడం కూడ వెకిలి చేష్టలలో భాగమే. బహుశా కళ్ళతో తప్పు చేస్తే ఎవరికీ పట్టుబడమనే ధీమా కాబోలు. ఏమైనా, నా శారీరక వైకల్యం కంటే మీ మనో మాలిన్యం మరీ ప్రమాదకరమైనది. దాన్నుంచి మీరు ఎంత త్వరగా బయటపడితే మీకే అంత మంచిది” అంది విద్య.
తను ఆమెను దొంగచూపులు చూడడం ఆమె గమనించిందని అర్ధం చేసుకున్న నవీన్ సిగ్గుతో తలవంచుకున్నడు.
ఆలోచించగా, ఆమె చెప్పినవన్నీ నిజమేననిపించాయి. ఇప్పుడతని మనసులో ఆమె పట్ల భావాలు మరోసారి మారాయి. జాలి స్థానాన్ని గౌరవం ఆక్రమించింది.
మనుషులు మారడానికి ఒక్కోసారి చిన్న సంఘటన చాలు. కొందరి ఔన్నత్యం ఎదుటి వారి అంతరంగాన్ని పరిశుద్ధం చేసి, వారిలో మరుగున పడిన సంస్కారాన్ని వెలికితీస్తుంది. ఆ మార్పు తాత్కాలికమా, శాస్వతమా అనేది వారి వారి విచక్షణ పై ఆధారపడి ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత నవీన్ తలేత్తి, “నన్ను క్షమించండి విద్యా! ఇంటర్ నెట్ లో నేను తరచూ చూసే పోర్నోగ్రఫిక్ వెబ్ సైట్లు నా మనసుని కలుషితం చేసాయి. నేను వివేకం కోల్పోయి ప్రవర్తించాను. ఇంటర్ నెట్ నన్ను బలహీనుడిగా మార్చింది….” అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా, అతని మాటలకి అడ్డం వస్తూ….
“ఇంటర్ నెట్ ని తప్పుబట్టి ప్రయోజనం లేదు. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనేది మన విజ్ఙత పై ఆధారపడి ఉంటుంది. దాన్ని నేనెలా సద్వినియోగం చేసుకున్నది చెప్పాను కదా. అంతా మన మానసిక పరిణితిలోనే ఉంది” అంది విద్య.
నిజమేనన్నట్లు తలూపాడు నవీన్. తర్వాత వాళ్ళిద్దరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉన్నారు. రైలు నాగపూర్ స్టేషన్లో ఆగింది.
“ఆల్ ది బెస్ట్ నవీన్” అంటూ విద్య తాతయ్య సాయంతో రైలు దిగింది. వెళుతూ వెళుతూ నవీన్ కేసి ఆమె చూసిన చూపులు ‘ఏదైనా సాధించి చూపు ‘ అనే సవాలుని విసిరాయి. నవీన్ ఆ సవాలుని స్వీకరించాడు. రైలు తన గమ్యం దిశగా ముందుకి కదిలింది.
(నా ఈ కధ 27-9-2001 నాటి ఆంధ్ర భూమి వారపత్రికలో ప్రచురితమైంది)
6 comments జూన్ 29, 2007