ఫీడులు:
టపాలు
వ్యాఖ్యలు

పినోకియో ఒట్టి అల్లరి పిల్లడు. చదువు అంటే అతనికి గిట్టదు. కొత్త విషయం నేర్చుకోవడం అంటే విసుగు. పనిచేయడమంటే పడనే పడదు. తిని తిరగాలన్నదే యావ. ఆటలు పాటలు తప్ప అతనికి మరి ఇక ఏమీ అక్కర్లేదు. అమ్మ నాన్న మాట వినడు. ఆకలైనప్పుడే వాళ్ళు గుర్తొస్తారు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళను తలచుకుంటాడు. జీవితం అంటే కేవలం వినోదం అనుకొంటాడు. అతనిది కొయ్యబుర్ర. ఏదీ సరిగా ఆలోచించడు. మంచి సలహా చెప్పేవాళ్ళంటే మంట. పాడైపోయే మాట చెప్పేవాళ్ళంటే ఇష్టం. అయితే చివరికి ఇదంతా మారిపోతుంది. పినోకియో చాలా మంచి పిల్లవాడయి పోతాడు. బాధ్యత నేర్చుకుంటాడు. అందులో ఉన్న సంతోషాన్ని గ్రహిస్తాడు. సరదగా సరదగా మీ పిల్లలకి మంచి నడవడికను నేర్పే కథ, కొంటె బొమ్మ సాహసాలు.

Konte Bomma Sahasaalu

కార్లో కొల్లోడి రాసిన “ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో” అనే చిన్న ఆంగ్ల నవలని నేను కొంటె బొమ్మ సాహసాలు పేరుతో తెలుగులోకి అనువదించాను. ఈ పుస్తకాన్ని పీకాక్ క్లాసిక్స్ వారి అనుబంధ సంస్థ పీచిక్స్ ప్రచురించింది. 128 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ.60/- . ఇది విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్‌లో లభిస్తుంది.

నేను అప్పుడప్పుడు కథలు రాస్తూంటాను. రాసేదెక్కువ, పడేవి తక్కువ అని మా ఆవిడ వేళాకోళం చేస్తూంటుంది. నాకదో బలహీనత అయిపోయింది. ఒకటి అరా పడినా, రాయకుండా ఉండలేను.

ఆ రోజు ఆదివారం. కాఫీ తాగుతూ తీరికగా దినపత్రిక చదువుకుంటున్నాను. మా ఆవిడ ఆదివారం అనుబంధంలో వారఫలాలు చూస్తోంది.

“ఈ వారం మీరేదో శుభవార్త వింటారట” అంటూ నా వారఫలం గురించి చెప్పింది. అప్పుడే ఎదురుగా ఉన్న వేపచెట్టుమీద కాకి కావు కావు మంది. అటు కాకేమో చుట్టాలు వస్తారని హెచ్చరిస్తుంది. ఇటు మా ఆవిడేమో శుభవార్త అంటుంది. రెండింటికీ పొత్తు కుదరదే అని అనుకుంటుంటే – మ్యావ్ మ్యావ్‌మంటూ నా ఫోన్ మ్రోగింది. (మా అమ్మాయి ముచ్చటపడి పెట్టిన రింగ్‌టోన్ అది). మా మావగారు చేసారు. కొత్తగా వచ్చిన ఓ వారపత్రికలో నా కథ పడిందని, కథ బాగుందని చెప్పారు.

బయటకి వెళ్ళి ఆ పత్రిక కొనుక్కుని ప్రింట్‍లో నా కథని చూసుకున్నాను. నా అదృష్టం పుచ్చి పోయింది. ఆ కథని వాళ్ళు ప్రచురించడమే కాక, కథ చివర్లో నా మొబైల్ నెంబరు ముద్రించారు. నా ఆనందం వర్ణనాతీతం. మన వాడేనా లేకపోతే ఈ పేరుతో ఉన్న మరో రచయితా అని అనుమానపడే బంధుమిత్రపరివారం ఆ కథ రాసింది నేనే అని ఫోన్ నంబర్ చూసయినా రూఢీ చేసుకుంటారని సంతోషపడ్డాను.

ఆ తర్వాత చాలా మంది బంధువులు, మిత్రులు ఫోన్ చేసి అభినందించారు. ఏ సాహితీ నేపధ్యం లేని వ్యక్తి రాసిన కథ పత్రికలో రావడం అంటే సామాన్యమైన విషయం కాదంటూ మా మిత్రులు నన్ను ఊదరగొట్టేసి నేను వాళ్ళకి ఓ హోటల్‌లో పార్టీ ఇచ్చేడట్లు హామీ పొందారు. నేను ఆనందాంబుధిలో ఓలలాడసాగాను. నా ప్రమోదం ప్రమాదానికి దారితీసే రోజులు ముందున్నాయని గ్రహించలేకపోయాను.

* * *

నా కథ ప్రచురితమైన మూడు రోజులకి ఓ వ్యక్తి ఫోన్ చేసాడు. అనకాపల్లి దగ్గర ఏదో పల్లెటూరి నుంచి మాట్లాడుతున్నాడట. నా కథ బావుందని చెబుతూ, తను ఓ ఔత్సాహిక రచయితనని, తాను కూడా ఓ కథ రాసానని, దానిని పత్రికల వాళ్ళకి ఎలా పంపించాలో వివరంగా చెబుతారా అని అడిగాడు. నేను క్లుప్తంగా చెప్పాను. ఆ తరువాత కథ మొత్తం నాకు ఫోన్లోనే రేడియో నాటకంలాగా వివరించి ప్రతి ప్యారాకూ బాగుందా సార్ అని అడుగుతూ చివర్లో కథ చేత్తో రాస్తే మంచిదా, టైపు చేస్తే మంచిదా అని అడిగాడు. నాలో ఉత్సాహం నశించింది. నాకు చెబుతున్నట్లే ఫోన్ చేసి చెపితే బాగుంటుంది అని మనసులో అనుకుంటూ, ఎలా అయినా పర్వాలేదంటూ ఫోన్ పెట్టేసాను.

మర్నాడు ఆఫీసులో మా బాసు కాబిన్లో ఉన్నప్పుడు ఫోన్ మోగింది. బాస్ ముందు ఏం మాట్లాడుతామని ఫోనెత్తలేదు. ఆయనతో మాట్లాడి బయటకు రాగానే మళ్ళీ ఫోన్.
‘ఫలానా పత్రికలో ఫలానా కథ రాసింది మీరేనా?’ అని అడిగాడా వ్యక్తి. ఎవరో పెద్దాయనలా ఉన్నాడు. అవునన్నాను. ఆయన ఏదేదో మాట్లాడి చివరికి, ‘నీ పేరేంటి బాబు?’ అని అడిగాడు. నాకు దిమ్మ తిరిగిపోయింది. కనీసం నా పేరయినా తెలియకుండా ఇంతసేపు మాట్లాడడంతో నా హృదయం ముక్కలైంది. నా మీద నాకే జాలేసింది.

ఇంక ఆ పూట పనిచేయబుద్ది కాలేదు. బాస్ చెప్పిన అర్జెంటు పని పూర్తి చేసి, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటికి బయల్దేరాను. బస్ స్టాండ్ కొచ్చేసరికి మా కాలనీకి వెళ్ళే బస్ సిద్ధంగా ఉంది. ఇలా ఎక్కి కూర్చున్నానో లేదో, నా సెల్‌ఫోన్ మ్రోగింది. తాను విజయవాడ నుంచీ మాట్లాడుతున్నానని ఫోన్ చేసిన వ్యక్తి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ‘మీ కథ చదివాను’ అన్నాడు.

‘థాంక్యూ’ అన్నానేను.
‘మీ పూర్తి పేరు చెబుతారా?’ అని అడిగాడు.
‘పత్రికలో ప్రచురితమైనది నా సరైన పేరే’
‘అలా కాదు, మీ పేరుని ఇంగ్లీషులో ఎలా రాస్తారో చెప్పండి’
నేను నా స్పెల్లింగ్ చెప్పాను. అవతలి వైపు నుంచి నిశ్శబ్దం.
ఫోన్ పెట్టేసారేమోననుకొని, నేను ఆఫ్ చేయబోయాను. అప్పుడు వినిపించింది ఆయన మాట.
‘హలో, ఫోన్ పెట్టేయకండి. నేను మీతో మాట్లాడవలసింది ఇంకా ఉంది’ అన్నాడు. ఆ స్వరం దాదాపుగా అరిచినట్లుగా ఉంది.
‘మీ పేరులోని అక్షరాలన్నీ కలిపితే, 19 నెంబరు వస్తోంది…’ అన్నాడాయన.
నాకేం అర్థం కాలేదు.
‘అయితే ఏంటి?’ అని అన్నాను.
‘మీ పేరుకి ఇంకోక అక్షరం తగిలిస్తే బ్రహ్మాండమైన వృద్ధిలోకి వస్తారు’
‘నాకర్థం కాలేదు’
‘మీ పేరు స్పెల్లింగ్‌లో హెచ్ చేర్చండి చాలు, మీ దశ మారిపోతుంది’ అన్నాడు.
‘ఎలాగ?’
‘మీరు ఒకసారి నా దగ్గరకి రండి. విజయవాడ వన్ టౌన్ జండావీధికి వచ్చి నా పేరు చెబితే, ఎవరైనా మా ఆఫీసు చూపిస్తారు. నేను ప్రఖ్యాత న్యూమరాలజిస్టుని. నేను చాలా తక్కువ ఫీజుతో మీకు మేలు చేస్తాను…అదే మీ ఊర్లో అయితే కనీసం రెండు వేలు గుంజుతారు. వచ్చే ఆదివారం నాటికి మీకు అపాయింట్‌మెంటు ఇస్తున్నాను’ అన్నాడు.
అప్పటికి విషయం అర్థమైంది నాకు. నాకు ఇప్పటికి వచ్చిన పేరు చాలు, కొత్త పేరు అక్కర్లేదంటూ సున్నితంగా తిరస్కరించాను. మా సంభాషణ కొనసాగుతున్నంత సేపూ నా ఫోన్‌కి ఇంకో కాల్ వస్తూనే ఉంది.

నేను న్యూమరాలజిస్టుతో మాట్లాడి ఫోన్ పెట్టేయగానే, మళ్ళీ మోగింది. ఈ సారి ఎవరో అమ్మాయి మాట్లాడుతోంది.
‘సార్. నమస్తే… నేను ఫలానా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీతో కొద్ది సేపు మాట్లాడచ్చా?’ అంటూ ఎంతో వినయంగా అడిగింది.
‘చెప్పండి’ అన్నాను.
‘మా కంపెనీ కొత్త ప్రాడక్టు లాంచ్ చేసింది, దాన్ని ఎంపిక చేసిన కస్టమర్లకి అమ్మి వారి విలువైన అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాం. మేము ఎంపిక చేసిన విశిష్ట వ్యక్తులలో మీరు కూడా ఒకరు’ అంటూ ఆ ప్రాడక్టు గురించి ఏదేదో చెప్పింది.

‘ప్రస్తుతానికి నాకవేం వద్దమ్మా’ అంటూ ఆ అమ్మాయికి నచ్చజెప్పేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది.
బస్ దిగి ఇల్లు చేరాను. అంత తొందరగా వచ్చేసరికి మా ఆవిడ కంగారు పడింది. ఒంట్లో బాలేదా అని అడిగింది.
‘ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉందంతే… కాస్త టీ పెట్టు’ అని చెప్పి వెళ్ళి ముఖం, కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాను.
నా ఫోన్ మోగింది.
ఈ సారి ఎవరో రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు. నగరానికి 50 కిమీ దూరంలో ఏదో వెంచర్ ప్లాన్ చేసారట. నన్ను ఓ ప్లాటు కొనుక్కోమని అడుగుతున్నారు. నేను ప్లాటు కొనుక్కోవాలంటే వాళ్లు నగరానికి 50కిమీల దూరంలో కాదు 200 కిమీల దూరంలో వెయ్యాలని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేసరికి తాతలు దిగొచ్చారు.

టీ తాగుతుంటే మళ్ళీ మోగింది నా ఫోన్. జవాబీయకుండానే, స్విచ్ ఆఫ్ చేసేసాను. కాసేపయ్యాక, మా ఇంటి లాండ్‌లైన్ ఫోన్ మోగింది. మా ఆవిడ ఎత్తింది. రెండు క్షణాల తర్వాత, ‘మీ ఆఫీసు నుంచి’ అంటూ ఫోన్ నాకందించింది.

అవతల వైపు నుంచి నా కొలీగ్ మాట్లాడుతున్నాడు…. మా బాస్ నా సెల్‌కి ఫోన్ చేసారట, ‘మీరు ఫోను చేసిన వ్యక్తి ప్రస్తుతం స్పందించడం లేదు’ అనే మెసేజ్ వస్తోందట. “వెంటనే బాస్‌కి ఫోన్ చేయమని” చెప్పాడు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆన్ చేసి బాసుతో మాట్లాడి ఇలా ఫోన్ పెట్టానో లేదో నా సెల్ మోగింది. భయపడతునే హలో అన్నాను.
ఫోన్ చేసినామె ఇంగ్లీషులో దడదడా దంచేస్తోంది. సుప్రసిద్ధ క్లబ్ నుంచి మాట్లాడుతోందామె, క్లబ్ మెంబర్‌షిప్ డిస్కౌంటుతో ఆఫర్ చేస్తున్నారట. నాకు ఆసక్తి ఉందేమోనని ఫోన్ చేసిందట. నాకు ఆసక్తి, ఆ శక్తి రెండూ లేవని చెప్పి తప్పించుకున్నాను.

ఎన్నడూ లేనిది నాకిన్నీ కాల్స్ ఎలా వస్తున్నాయో అర్థం కాలేదు. ఆలోచనలో పడ్డాను. జవాబేమీ దొరకలేదు.
మళ్ళీ మ్రోగింది.
హలో అన్నానో లేదో, ఎవరో తరుముతున్నట్లుగా మాట్లాడడం మొదలుపెట్టాడు అవతలి వ్యక్తి.
“సార్ మీ జుత్తు రాలిపోతోందా? మీకు చుండ్రు ఉందా?” అని అడిగాడు.
నాకేమీ అర్థం కాలేదు. ” ఇంతకీ మీకేం కావలి?” అని అడిగాను.
“నేను డా. రౌత్రాస్ క్లినిక్‌ నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర హెయిర్ ఫాల్‌కి, హెయిర్ థిన్నింగ్‌కి, డాండ్రఫ్‌కి అద్భుతమైన చికిత్స ఉంది…. ఒక సిటింగ్‌కి పన్నెండు వందలు మాత్రమే…” అన్నాడు.
“నాకు అవసరం లేదు” అని ఫోన్ పెట్టేసాను.
కాసేపయ్యాక మళ్ళీ మ్రోగింది. ఈ సారి ఎవరో పాఠకుడు చేసాడు. నా కథ బాగుందని, ఇంకా అలాంటి కథలు ఎన్నో రాయాలని కోరుకున్నాడు. ‘అమ్మయ్య, పనికొచ్చే ఫోన్ ఒక్కటొచ్చింది’ అనుకున్నాను. ఒక ఎస్. ఎం. ఎస్ వచ్చింది – ఓ ఆవిడ నుంచి. కథ బాగుందని రాస్తూ, మెసేజి చివరలో తన పేరు రాసి క్రింద అజ్ఞాత పాఠకురాలు అని రాసింది.

మర్నాడు పొద్దున్న ఆఫీసులో సీరియస్‌గా పనిచేసుకుంటుంటే నా సెల్ మ్రోగింది.
“మీకు పాన్ కార్డ్ ఉందా?” అంటూ ఓ ఆడ గొంతు ప్రశ్నించింది.
ఇన్‌కంటాక్స్ ఆఫీసు నుంచేమోనని అనుకుని, “నా రిఫండ్ క్లియర్ అయిందా మేడమ్?” అని అడిగాను.
“మాది ఏ టు జడ్ సర్వీసెస్ అండి. మీకు పాన్ కావాలంటే రెండు వందల రూపాయలకే వారం రోజుల్లో అందిస్తాం”
“నాకు పాన్ కార్డు ఉంది” అని చెప్పి ఫోన్ పెట్టేసాను.
సాయంత్రం క్రెడిట్ కార్డు ఇస్తామని ఓ బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. యాభై వేల రూపాయల వరకు క్రెడిట్ ఇస్తారట, సులభ వాయిదాలలో చెల్లించవచ్చు అంటూ టెంప్టింగ్‌గా మాట్లాడాడు. క్రెడిట్ కార్డు ఉచ్చులో పడకూడదని నేను ముందే నిర్ణయించుకోడం వల్ల అక్కర్లేదని చెప్పేసాను.
నా మొబైల్ ఫోన్‌కి వస్తున్న అవాంఛిత పిలుపులు… అంటే అన్‌వాంటెడ్ కాల్స్ ప్రస్తుతం నాకు సమస్యగా తయారయ్యాయి.

“ఓస్, ఇదో పెద్ద సమస్యా”, అని తేలికగా తీసిపడేస్తూ, “కాల్ బ్లాక్ పెట్టుకుంటే పోలా, లేదా తెలియని నెంబర్లని నుంచి ఫోన్లెత్తకపోతే సరి…” అంటూ మా ఆవిడ సలహా ఇచ్చింది. ఈ సంగతి మా బావమరిదిలో ప్రస్తావిస్తే…. ” స్వయానా కేంద్ర ఆర్ధిక మంత్రి…. పార్లమెంటులో మాట్లాడుతుండగా…. ఆయనకే అప్పిస్తామని ఎవరో ఫోన్ చేసారు బావా, నువ్వు నేను ఎంత…..?” అన్నాడు ఓదార్పుగా.

ఇలా రెండు రోజుల పాటు నా ఫోన్ మ్రోగుతునే ఉంది, ఈ సారి ఫోన్ చేసినతను “నాకు కార్ లోన్ ఇప్పిస్తామని” చెప్పాడు. “ఈ రోజులలో కనీసం లక్ష రూపాయల కారైనా లేకపోవడం పెద్ద లోటు సార్” అన్నాడు.
“మరి పెట్రోల్‌కి కూడా అప్పిస్తారా?” అని అడిగాను. నేనేదో జోక్ చేసినట్లు ఫీలయిపోయి, విరగబడి నవ్వాడు. “దానికి ఎవరూ లోన్ ఇవ్వరు…” అన్నాడు.
“అయితే నాకు అక్కర్లేదు” అని చెప్పి ఫోన్ కట్టేసాను.
నా ఆశ్చర్యం తీరడం లేదు. ఎన్నడూ లేనిది నాకిన్ని ఫోన్‌లు ఎందుకొస్తున్నాయో నాకు తెలియడం లేదు. మళ్ళీ నా ఫోన్ మ్రోగింది. హలో అని అనగానే అవతలి వైపు నుంచి కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం. ఉన్నట్టుండి “అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు” అని ఓ గంభీరమైన కంఠం వినబడింది. ఎవరో పెద్దాయన దీవిస్తున్నాడేమోనని అనుకున్నాను. వెంటనే… తాను బద్రీనాథ్ దగ్గరిలోని బ్రహ్మర్షి ఋష్యాశ్రమం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రతినిధినిని మాట్లాడుతున్నానని ఆయన పరిచయం చేసుకున్నాడు.

వాళ్ళ నలకుబేర యంత్రం కొనుక్కుంటే లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని వివరించాడు. చిన్న మొత్తంతో పెద్ద లాభం పొందచ్చని భరోసా ఇస్తున్నాడయన.
“అలాంటి యంత్రాలలో నాకు నమ్మకం లేదు” అంటూ తప్పించుకున్నాను.
నా బాధలింకా తీరలేదు. జీవిత ధీమా పాలసీలు ఇస్తామని, సరకులు కొంటే ఉచితంగా డోర్ డెలివరీ చేస్తామని ఓ సూపర్ మార్కెట్ వారు…. రకరకాల వాళ్ళు నాకు ఫోన్ చేస్తునే ఉన్నారు.
కొద్ది సేపటి క్రీతం నుంచి ఎవరో మిస్స్డ్ కాలిచ్చి వదిలేస్తున్నారు. నాల్గో సారి అదే నెంబర్ నుంచి రింగ్ ఇచ్చి వదిలేస్తే, ఇక నేనే చేసాను.
“నీ మనసు నాకు తెలుసు…తెలుసు” అనే డయలర్ టోన్ వినిపిస్తోంది. ఎవరు ఫోనెత్తడం లేదు.
కాసేపాగి మళ్ళీ చేసాను. అదే పాట వస్తోంది, కానీ ఎవరూ మాట్లాడడంలేదు. రెండు క్షణాలపాటు ఆ పాట వింటుంటే నాకు నా పాట్లు గుర్తొచ్చాయి.

“నా నెంబరు మీకు తెలుసు…తెలుసు…” అని పేరడీగా పాడుకున్నాను. నాకు ఫోన్ చేసేవారంతా బహుశా “మీ నెంబరు మాకు తెలుసు… తెలుసు…” అని పాడుకుంటారేమో!

ఇంతలో మళ్ళీ మోగింది ఫోన్. ఈసారి ఏదో అన్నదాన సత్రం నుంచి. పవిత్రమైన కార్తీక మాసంలో పేదసాదలకి అన్నదానం చేస్తున్నారట. నా తరపున ఓ వంద మందికి అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారట. దానికయ్యే ఖర్చు మొత్తం పంపిస్తే పుణ్యకార్యం జరిపించి, రసీదు పంపుతామన్నారు.
ఆయన చెప్పిన ఫీజు గూబ గుయ్‌మనిపించింది.
‘ఇప్పడు కాదులెండి’ అని తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ, ‘ఇంతకీ నా నెంబర్ ఎవరిచ్చారు మీకు?’ అని అడిగాను.
‘మీ కథ ఫలానా పత్రికలో పడింది కదండి, అందులో మీ నెంబర్ ఇచ్చారుగా…’ అన్నాడాయన.
ఎంత సేపటికీ వదలడే ఆ ఆసామి. చివరికి కాస్త కటువుగా చెప్పాల్సొచ్చింది.
కసురుకుంటే కసురుకున్నాను కానీ నా సమస్యకి అసలు కారణం తెలిసింది. కథ పంపిస్తూ, హామీ పత్రంలో నా మొబైల్ నెంబర్ చేర్చడం చేసిన పని ఇది.
ప్రమోదం కలిగిస్తుందనుకున్న పని, ప్రమాదానికి దారితీసింది. పోనీ నెంబరు మార్చేసుకుందామా అంటే ఎంతో మందికి మళ్ళీ కొత్త నెంబరు ఇవ్వాలి, పత్రికల ఆఫీసు వారెవరనా పాత నెంబరికి ఫోన్ చేస్తే ఇబ్బంది, ఏం చేయాలో పాలు పోలేదు.
చివరగా ఓ ఆలోచన తట్టింది. ఇకపై కథలు పంపేడప్పుడు, హామీ పత్రంలో ఫోన్ నెంబర్ లేకుండా పంపాలని, ఒక వేళ పత్రికల వాళ్ళ దగ్గర నా నెంబరు ఉంటే దానిని ప్రచురించవద్దని కోరాలని నిర్ణయించుకున్నాను. కాస్త ఊరట కలిగింది నాకు.

(సమాప్తం)

(ఈ కథ 14 మార్చి 2012 నాటి సన్‌ఫ్లవర్ వారపత్రికలో ప్రచురితం)

నేను హిందీ నుంచి అనువదించిన “మనిషి లోపలే” అనే కథ పొద్దులో ప్రచురితమైంది. ఈ లింక్ లో కథ చదివి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.

సాహిత్య ప్రస్థానం మాసపత్రిక డిసెంబర్ 2011 సంచికలో నేను అనువదించిన “సంకెళ్ళలో స్వప్నాలు”అనే కథ ప్రచురితమైంది. మూల కథని మలయళంలో ఎం. కె. చాంద్ రాజ్ గారు వ్రాయగా, సుధీర్ ఆంగ్లంలోకి అనువదించారు. ఆంగ్ల అనువాదం ఆధారంగా నేను తెలుగులోకి అనువదించాను.

“chain schemes” నిర్వాహకుల మాటల గారడీలో పడి వలన సామాన్య ప్రజలు ధనాన్ని, పరువుని ఎలా పోగొట్టుకుంటారో ఈ కథ చెబుతుంది.

పత్రికలో కథ చదివి, మీ అభిప్రాయం తెలియజేయండి.

కస్తూరి మురళి కృష్ణ రచించిన “జగమే మారినది” అనే నవలని పరిచయం చేస్తూ నేను రాసిన వ్యాసాన్ని పుస్తకం.నెట్ ప్రచురించింది.
లింక్‌లో వ్యాసాన్ని చదివి మీ అభిప్రాయం తెలియజేయగలరు.

నేను అనువదించిన విద్వేషం అనే కథని పొద్దు ఈ రోజు ప్రచురించింది. ఈ లింక్‌లో కథని చదివి మీ అభిప్రాయం తెలియజేయగలరు

నేనూ మా ఆవిడ విజిటర్స్ రూంలో ఆందోళనగా కూర్చుని ఉన్నాం.
నా నుదుటిపైన చిరు చెమట. నా కాళ్ళు చేతులు కాస్త వణుకుతున్నాయి.
మా ఆవిడ గంభీరంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది.
మా వాడి గురించి మిస్టర్ నూతన్ ఏం చెబుతాడో అని మాకు భయంగా ఉంది.
నూతన్ గారి గదిలోకి వెళ్ళేముందు వరకు కూడా మా వాడు ఏమీ పట్టనట్టు, రెండు కౌంటర్ల అవతల ఓ కాబిన్లో కూర్చుని చేతిలో సెల్లు, చెవిలో ఇయర్ ఫోన్తో వాడి లోకంలో వాడున్నాడు.
సమస్య వాడిది కాదన్నట్లుగా ఉన్నాడు.
మరిప్పుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోందో ఏమో….. ఆయన ఏం చెబుతున్నాడో, వీడేం వింటున్నాడో… నాకేం అర్ధం కావడం లేదు.
ఇంతకీ మేమిక్కడ ఎందుకున్నామో మీకు తెలియదు కదూ? ఇదంతా మా అబ్బాయి కిరణ్ చలవే. అసలేం జరిగిందంటే……
* * *
కిరణ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఈ మధ్య వాడి ప్రవర్తనలో ఏదో తేడా కనబడుతోంది. పొద్దున్నుంచి కాలేజికి బయల్దేరే దాకా బాగానే హుషారుగా ఉంటాడు.
పొద్దున్న పూట మా వాడు కాలేజికి, నేను ఆఫీసుకి, మా ఆవిడ స్కూలికి దాదాపుగా ఒకేసారి బయల్దేరుతాం. మద్యాహ్నం మూడింటికి మా వాడు కాలేజి నుంచి తిరిగొస్తాడు. మా ఆవిడ ఇంటికొచ్చేసరికి నాలుగవుతుంది.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం మా ఆవిడ ఇంటికొచ్చేవరకు కిరణ్ ఏదో పోగొట్టుకున్నవాడిలా, శూన్యంలోకి పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడట.
మా పక్కింటావిడ గమనించి, మా ఆవిడకి చెప్పింది. మొదట మా ఆవిడ పట్టించుకోలేదు.
కానీ పక్కింటబ్బాయి కూడ ఓ సారి అన్నాడట – “ఆంటీ! కిరణ్ ఏదోలా ఉంటున్నాడాంటీ. ఏదేదో గొణుగుతూ ఉంటాడు. చేతి బొటన వేళ్ళు నొక్కుతున్నట్లుగా పైకి, క్రిందకి ఆడిస్తూ ఉంటాడు… చూసే వాళ్ళకి అవేవే పిచ్చి సైగల్లా, రోడ్డు మీద వెడుతున్న అమ్మాయిలకి చేస్తున్న సైగల్లా అనిపిస్తాయి. ఎందుకైనా మంచిది, మీరు ఒక సారి అడిగి చూడండి” అన్నాడట.
మా ఆవిడ నాకు చెప్పింది.
“సరే, ఈ శనివారం నీకు సెలవేగా. ఇంట్లోనే ఉంటావుగా. వాడిని గమనిస్తూ ఉండు. ఏదైనా తేడాగా ఉంటే అప్పుడాలోచిద్దాం” అన్నాను.
శనివారం గడిచిపోయింది. ఆదివారం నాడు నేను కూడా ఏ పని పెట్టుకోకుండా ఇంట్లోనే ఉన్నాను.
“కిరణ్, నా ఫోన్ ఇవ్వు. నేను మా కొలీగ్తో మాట్లాడాలి” అంది మా ఆవిడ లోపలి గదిలోంచి.
నేను హాల్లో పేపర్ చదువుకుంటున్నాను. కిరణ్ పలకలేదు.
వాడు బాల్కనీలో కూర్చుని, వాళ్ళమ్మ సెల్ నుంచి ఎవరికో ఎస్. ఎం. ఎస్ పంపిస్తున్నాడు, చెవిలో ఇయర్ఫోన్. బహుశా ఎఫ్. ఎం ఛానెల్లో పాటలు వింటున్నట్లున్నాడు.
నా సెల్ కొంచెం పాత మోడల్ది. దాంట్లో ఎఫ్. ఎం లేదు, పాటలు రావు. అందుకే మా వాడు దాన్ని ముట్టుకోడు.
మా ఆవిడ సెల్ ఫోన్ కొత్తది. ఈ మధ్యే కొనుక్కుంది….నిజానికి తను కొనుక్కుంది అనే కన్నా, మా వాడు తనకి కావాల్సిన ఫీచర్లున్న ఫోన్ని కొనిపించాడు వాళ్ళమ్మ చేత అనచ్చు.
మా ఆవిడ “కిరణ్… నా ఫోనివ్వు…..” అంటూ ఇంకోసారి గట్టిగా పిలిచింది. ఊహూ, వాడికి వినబడలా.
చివరికి నేను లేచెళ్ళి వాడి భుజం మీద చెయ్యేసి గట్టిగా కుదిపాను.
“అమ్మ ఫోన్ అడుగుతోంది, వినబడడం లేదా?” అన్నాను.
వాడు నాకేసి ఎగాదిగా చూసాడు. కళ్ళు నన్ను చూస్తున్నా, చేతివేళ్ళు కీబోర్డు మీద టకటకలాడుతున్నాయి. ఏంటన్నట్లు సైగ చేసాడు.
నాకు చిర్రెత్తింది. వాడి చెవిలోంచి ఇయర్ఫోన్ తీసేస్తూ, ‘అమ్మ ఫోన్ అడుగుతోంది… వినబడడం లేదా…..” అన్నాను.
“వినబడలేదు….” అంటూ మా వాడు రెండో చెవిలోంచి ఇయర్ఫోన్ తీసేసాడు.
తర్వాత సెల్ స్విచ్ఛాఫ్ చేసి, అందులోంచి ఓ సిమ్ కార్డు బయటకు తీసాడు. వాడి పుస్తకం పక్కనున్న ఇంకో సిమ్ని అందులో వేసి, మళ్ళీ స్విచ్ ఆన్ చేసి, ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళమ్మకి ఇచ్చాడు.
గూట్లో ఇంకో సిమ్ కనబడింది. వాడికిన్ని సిమ్లు ఎక్కడివో నాకర్ధం కాలేదు. అదేమాట వాడినడిగాను.
“కొనుక్కున్నాను”
“నీకన్ని డబ్బులెక్కడివి….?”
“నువ్వే ఇచ్చావుగా……”
“నేనిచ్చానా?” ఆశ్చర్యపోయాను.
కొత్త సిమ్ కనీసం రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది. నేను కొన్నప్పుడు ధర అదే. మరి నేను వీడికి సిమ్ కోసం ఎప్పుడూ అంత డబ్బు ఇవ్వలేదు.
ఏదో దాస్తున్నాడనిపించింది.
“సిమ్ కార్డ్ ఎంతరా….?” అడిగాను.
“నోకామో సిమ్ పదిహేను రూపాయలు నాన్నా… కొత్త కంపెనీది. ముప్పై రూపాయలతో రీఛార్జి చేయిస్తే…. వంద రూపాయల టాక్టైం ఇచ్చారు. పైగా నెలకి ఐదొందలు ఎస్. ఎం. ఎస్లు ఫ్రీ……”
“మరి ఆ గూట్లో సిమ్ ఏంటి?”
“అది వాటర్టెల్ వాళ్ళది. ఆ సిమ్ కూడా పదిహేను రూపాయాలే. మా ఫ్రెండ్స్కి చాలా మందికి ఇదే కంపెనీ కనెక్షన్స్ ఉన్నాయి. వాటర్టెల్ నుంచి వాటర్టెల్కి ఫోన్లు ఫ్రీ. వేరే మొబైల్కి అయితే సెకనుకి అరపైసా మాత్రం ఛార్జ్ చేస్తారు. పైగా వీళ్ళు మొదటి ఐదొందల ఎస్. ఎం. ఎస్లకు డబ్బులు తీసుకోరు…..” మా వాడి గొంతులో ఉత్సాహం.
నేను అవాక్కయ్యాను. మొబైల్ ఫోన్ల రంగంలోకి కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయని విన్నాను కానీ, ధరలింత తక్కువగా ఉన్నాయని నాకు తెలియదు.
“అది సరే, నీకు అన్ని ఎస్. ఎం. ఎస్లు పంపించాల్సిన అవసరం ఏముంటుంది?”
“జాతీయ స్థాయి పాటల పోటీలో ఉన్న తెలుగబ్బాయిని తర్వాతి రౌండ్కి పంపాలా, మామిని టివిలో సినిమా అవార్డుల పోటీ జరుగుతోంది, ఉత్తమ నటుడి కేటగిరీలో మా బాసుని గెలిపించాలా? శుక్ర శనివారాల్లో రాత్రి 9.30 గంటలకి వచ్చే ప్రోగ్రామ్లో పాల్గొనాలంటే వాళ్ళడిగే ప్రశ్నలకి సమాధానం పంపాలా? మనకిష్టమైన పాటలు డౌన్లోడ్ చేసుకోడానికి, నచ్చిన పాటల్ని కాలర్ట్యూన్గా మార్చుకోడానికి… ఐశ్వర్యా రాయ్ని, అభిషేక్ బచ్చన్ని లండన్లో కలుసుకునే అవకాశాన్ని పొందడానికి, మా ఖలేజా చూపించి కుమ్మేయడానికి… ఇంకా చాలా వాటికి ఎస్. ఎం. ఎస్లు కావాలి”
“కుమ్మేస్తావా? ఎవరిని? కాలేజి గొడవల్లో తలదూరుస్తున్నావా?అలాంటి పిచ్చి వేషాలేం వేయకు”
“అబ్బా, అది కాదు నాన్నా, ప్రిన్స్ మహేష్బాబుతో కలిసి ఓ ఫైటింగ్ సీన్లో నటించే అవకాశం కోసం ఎస్. ఎం. ఎస్ చేయాలి…”
నాకు ఏమీ అర్థం కాలేదు.
కాస్త తేరుకున్నాకా, ” ఇటువంటి ఎస్. ఎం. ఎస్లకి ఛార్జిలు ఎక్కువట కదా” అని అడిగాను.
“అవును. ఫ్రెండ్స్తో మాటలు తగ్గించి, ఫ్రీ ఎస్. ఎం. ఎస్లు వాడుకుని టాక్టైం బాలన్స్ మిగుల్చుకుంటాం… ఆ డబ్బుని ప్రీమియం రేట్లు వర్తించే ఎస్. ఎం. ఎస్లకి ఉపయోగించుకుంటాం….” అన్నాడు మా వాడు రహస్యాన్ని వివరిస్తున్నట్లుగా.
“చాలు చాలు సంబరం, ఇంక చదువు….” అంటూ అక్కడినుంచి కదిలాను.
ఉన్నట్లుండి మా వాడు మూడీగా అయిపోయాడు. క్లాసు పుస్తకాలు చదువుతున్నాడనేగాని, ధ్యాస దాని మీద లేదని తెలుస్తోంది.
చేతి బొటనవేళ్ళని అదోలా ఆడిస్తున్నాడు. వాడిలో వాడే ఏదో గొణుక్కుంటున్నాడు. మా ఆవిడ కూడా ఈ విషయం గమనించింది.
“చదువులో ఏమైనా ఒత్తిడిని ఎదుర్కుంటున్నాడేమో….” అన్నాన్నేను అమాయకంగా.
“మన వెధవేమీ రెసిడెన్షియల్ కాలేజిలో చదవడంలేదు, ఐ. ఐ. టికి ప్రిపేరవడం లేదు…. వాడు చదువుతున్నది సి. ఇ. సి గ్రూపు. ఒత్తిడులు, గిత్తిడులు ఏమీ ఉండవు…. హాయిగా చదువుకోవచ్చు…. అయినా వాడికి ఇంగ్లీషులో తప్ప, మిగిలిన వాటిలో మార్కులు బాగానే వస్తున్నాయి. మాట్లాడడం బానే మాట్లాడుతాడు, రాయడంలోనే బోలెడు స్పెల్లింగ్ మిస్టేక్సట……” అంది మా ఆవిడ.
వాడి చదువు మీద మా ఆవిడ ఒక కన్నేసి ఉంచినందుకు నాకు సంతోషం కలిగింది.
మాలాంటి మధ్య తరగతి కుటుంబాలలో పిల్లల చదువుపై తల్లిదండ్రులలో ఎవరో ఒకరు దృష్టి పెట్టాలి.
“వీడిని మరింత గమనించాలి” అంది.
నేనూ అంగీకారంగా తలూపాను. అప్పట్నించి మా ఇంట్లో ‘ఆపరేషన్ అబ్జర్వేషన్’ మొదలైంది.
మా ఆపరేషన్ మొదలై వారం గడిచింది. వాడిని శ్రద్ధగా గమనించడం మాకు శనాదివారాలలో తప్ప మాములు రోజులలో కుదరడం లేదు.
మా వాడు రాత్రిళ్ళు టివి చూస్తూ, హాల్లోనే పడుకుంటాడు. శనివారం రాత్రి వాడేదో గట్టిగా కలవరిస్తుంటే నాకు మెలకువొచ్చింది.
‘హైదరాబాద్కా నెంబర్ వన్ ఎఫ్. ఎం…..’ ‘ఇది చాలా హాట్ గురూ…’ ‘వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా’ ‘విను వినిపించు లైఫ్ అందించు’ ‘ఆడండి ఊంగలీ క్రికెట్…’ ’5555372455కి ఎస్. ఎం. ఎస్ చేయండి… షరతులు వర్తిస్తాయి…’ ‘వాకా…..వాకా….వాకా…..’ ‘వువుజెలా వువుజెలా’ ……అంటూ ఏమిటేమిటో గొణుగుతున్నాడు. కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్ధం కాలేదు.
వాడిని నిద్ర లేపాను. ‘ఏంట్రా.. పీడకలలేమయినా వచ్చాయా? ఏవేవో గొణుగుతున్నావ్…” అన్నాను.
“అబ్బా, పో నాన్నా, మంచి నిద్రని పాడు చేసి పీడకలలంటావేంటి?” అంటూ వాడు ముసుగు పెట్టి పడుకున్నాడు. ఆ తర్వాత నాకు నిద్ర పట్టలేదు.
పొద్దున్నే మా ఆవిడ అరుపులకి నాకు మెలకువొచ్చింది.
“నా ఫోన్ నాకివ్వు కిరణ్. ఈ రోజు నాకు దాంతో చాలా పనులున్నాయి. నీ సిమ్ వేసుకోవద్దు….” అని మా ఆవిడ అంటోంది.
“కాసేపేనమ్మా…. కాసేపేనమ్మా…” అని కిరణ్ బ్రతిమాలుతున్నాడు.
“కుదరదన్నానా?” అంటోంది మా ఆవిడ.
“పోనీ నా ఫోన్లో వేసుకోరా నీ సిమ్”.
“నాన్నా నీది డొక్కు ఫోన్, అందులో ఎఫ్. ఎం రాదు”
“నీకు ఫోన్ ఎందుకురా, మాట్లాడుకోడానికా లేకపోతే, పాటలు వినడానికా?”.
“అన్నిటికీ నాన్నా, పాటలు వినాలి, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి, ఎస్. ఎం. ఎస్లు పంపించాలి….. నువ్వేమో నాకో లేటెస్ట్ మొబైల్ కొనమంటే కొనవు…..”
“నువ్వడిగిన మోడల్ ఫోన్ ఎనిమిది వేలు…. ఇప్పడది నీకవసరం లేదు….”
కిరణ్ ఎంత బ్రతిమాలినా మా ఆవిడ ఫోన్ ఇవ్వలేదు.
వాడి ముఖం మాడిపోయింది. ఒక్క క్షణంలో వాడిలో ఎంతో కోపం…వాడిలో ఓ అపరిచితుడు కనపడ్డాడు.
ఏదో గొణుక్కుంటూ వెళ్ళి టివి ముందు కూర్చున్నాడు. పళ్ళు కొరుకుతూ… రిమోట్తో ఛానెళ్ళను ఇష్టం వచ్చినట్లు మారుస్తున్నాడు.
మా ఆవిడకి సైగ చేసాను. తను కూడా చూస్తున్నానంటూ తలూపింది.
కొంత సేపయ్యాకా, టివి కట్టేసాడు. వెళ్ళి వాడి స్టడీ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వాడిలో వాడే ఏదో పాడుకుంటూ, చేతి బొటనవేళ్ళని ఆడిస్తూన్నాడు.
కాసేపయ్యాక టిఫిన్ సిద్ధం చేసి మా ఆవిడ నన్నూ, వాడిని పిలిచింది. ఎంత పిలిచినా వాడికి వినబడలేదు. చివరికి విసుక్కుంటూ లేచెళ్ళి టిఫిన్ పళ్ళెం వాడి టేబుల్ మీద పెట్టింది.
“ఏరా, ఎన్ని సార్లు పిలిచాను, వినబడడం లేదా?” అంది.
“నిజంగానే వినబడడం లేదమ్మా”
“సరేలే, ఎప్పుడూ ఆ బొటనవేళ్ళలని ఎందుకలా పైకి కిందకి ఆడిస్తావు?”
“బొటనవేళ్ళని ఆడించడమేంటి? నేను మాములుగానే ఉన్నా”
“వీడికేదో అయ్యింది….” అంటూ మా ఆవిడ నా దగ్గరికి వచ్చింది.
నేనప్పపుడు పున:ప్రసారమవుతున్న ఓ టివి షోని యమా సీరియస్గా చూస్తున్నాను.
ఆ కార్యక్రమంలో మన సమస్యలకు తగిన సలహాలిస్తారు. వెంటనే నాకో ఆలోచన తట్టింది.
“పోనీ మన ముగ్గురం కలిసి ఈ ‘జీవితం గుర్రం బండి’ కార్యక్రమానికి వెళితే ఆ యాంకరమ్మ ఏదైనా మంచి పరిష్కారం చెబుతుందేమో?”.
మా ఆవిడ నాకేసి కొరకొరా చూసింది. ఆ చూపులకి నేను తలదించుకున్నాను.
“ఇలాంటి మాటలు మీరు సరదాగా అంటారో, లేదా నిజంగానే అంటారో అర్ధం కాదు” అని అంది.
మళ్ళీ తనే మాట్లాడుతూ, “వీడికి వినికిడి సమస్యేదో వచ్చినట్లుంది. పైగా నరాల బలహీనత కూడా తోడయినట్లుంది. ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి” అంది.
వీలైనంత తొందరలో, ఓ మంచి డాక్టర్కి చూపిద్దామని అన్నాను. సరేనంది మా ఆవిడ.
ఆ మర్నాడు మా ఆవిడ వాళ్ళ బంధువులింట్లో పెళ్ళంటూ ఊరెళ్ళింది. రెండు రోజుల దాకా రాదు.
సెల్ఫోన్ లేకపోయే సరికి పాపం మా వాడికి కాలు చెయ్యి ఆడడం లేదు. తెగ చికాకు పడిపోతున్నాడు.
చివరికి అయిష్టంగానే నా సెల్ తీసుకున్నాడు.
వాడిని చూస్తుంటే నాకు దిగులెక్కువైపోయింది. ఏం చేయాలో పాలుపోడం లేదు. సమయానికి సలహా ఇవ్వడానికి మా ఆవిడ కూడా ఊర్లో లేదు.
పరిష్కారం ఏదైనా చెబుతాడేమోనని మా ఫ్రెండ్ రఘు వాళ్ళింటికి వెళ్ళాను.
వాడు వరండాలో కూర్చుని పేపరు చదువుకుంటున్నాడు. అక్కడున్న ఓ కుర్చీలో కూర్చుని నా సమస్యని ఏకరువు పెట్టాను.
వాడు గట్టిగా నవ్వి నన్ను లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళమ్మాయి, వాళ్ళబ్బాయి ఇద్దరూ మావాడిలానే మొబైల్ ఫోన్ల నుంచి ఎస్. ఎం. ఎస్లు పంపిస్తున్నారు. వాళ్ళావిడ తన మొబైల్లో ఎవరితోనో మాట్లాడుతోంది.
“చూసావుగా, ఇక్కడా అదే సమస్య. మీ వాడు కూడా సెల్ఫోన్కి అడిక్ట్ అయ్యాడని అర్థమవుతోంది. ఎప్పుడూ చెవిలో ఇయర్ఫోన్ పెట్టుకుని ఉండడం వల్ల ఒక్కోసారి సరిగా వినబడదు. పైగా, ఎస్. ఎం. ఎస్లు పంపించి పంపించి చేతిలో మొబైల్ లేనప్పుడు.. వేళ్ళని అలా ఆడించడం మీ వాడికి అలవాటైనట్లుంది. అంతే. డోన్ట్ వర్రీ. దీనికో పరిష్కారం ఉంది” అంటూ ఓ క్షణం ఆపాడు.
నాకంటికి వాడప్పుడు వరాలిచ్చే దేవుడిలా, సమస్యలు తీర్చే మంత్రదండం ఉన్న మునిలా కనిపించాడు.
ఆతృత ఆపుకోలేక, “అదెంటో చెప్పు మరి….” అన్నాను.
“ఈ మధ్య ‘మోసియాలజి’ ఆనే శాస్త్రం ఒకటి చలామణిలోకి వచ్చింది. మొబైల్ ఫోన్ టెక్నాలజీని అతిగా వాడడం వలన ఎదురయ్యే సామాజిక సమస్యలని తెలిపే శాస్త్రమన్న మాట. అదృష్టవశాత్తు మన ఊర్లో నూతన్ అనే మోసియోలజిస్ట్ ‘మొబైలోలజీ కేఫ్’ అనే పేరుతో ఒక సూచనలు-సలహాల కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. మా పిల్లలని అక్కడ చూపించాకే కాస్త నయమయ్యారు….” అంటూ మోసియాలజీ గురించి మరిన్ని వివరాలు, ఆసలహా కేంద్రం అడ్రసు చెప్పాడు.
మా ఆవిడ ఊర్నుంచి వచ్చాక, మోసియాలజీ గురించి, నూతన్ గారి గురించి రఘు చెప్పిన వివరాలన్నీ తనకి చెప్పాను.
“అయితే, ఆయనని వెళ్ళి కలుద్దాం, ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. డాక్టర్ అయితే ఏంటి, ఇంకొకరైతే ఏంటి? మన వాడు మాములుగా అయిపోతే అంతే చాలు” అంది మా ఆవిడ.
రెట్టించిన ఉత్సాహంతో నేను నా సెల్ నుంచి మొబైలోలజీ కేఫ్ నెంబరుకి ఫోన్ చేసి “నూతన్ గారితో అపాయింట్మెంట్ కావాలి” అన్నాను.
“పది రోజుల దాకా సార్ అపాయింట్మెంట్స్ లేవు. కావాలంటే అతర్వాత తేదీ నాటికే బుక్ చేస్తాను” అంది రిసెప్షనిస్టు.
“అలాగే కానివ్వండి” అన్నాను, చేసేదేం లేక.
ఈ పది రోజులు క్షణమొక యుగంలా గడిచింది. ఆ రోజు రానే వచ్చింది.
నిర్ణీత సమయానికి మేము బయల్దేరుతుండగా, ఎక్కడి నుంచో దూరంగా ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం… ఈనాడే ఎదురవుతుంటే….’ అనే పాట వినబడింది.
“ఆహా, శుభ శకునం” అనుకుంటూ మేము ముగ్గురం ఆటోలో నూతన్ గారి ఆఫీసుకి వెళ్ళాం. మేమెళ్ళే సరికి అక్కడ కొండవీటి చాంతాడంత క్యూ ఉంది.
రిసెప్షన్లో నా పేరు చెప్పి, టోకెన్ తీసుకుని, ఫీజు కట్టి మా వంతు కోసం ఎదురు చూడసాగాం.
మిస్టర్ నూతన్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చిన జనాల సంఖ్య రెండు వందలకి పైనేట, రిసెప్షనిస్ట్ చెప్పింది.
కేఫ్ అంటే నేనేదో రెండు గదులు, ఓ చిన్న కాబిన్ లాంటివి ఊహించుకున్నాను, కానీ అది ఓ పెద్ద మేడలో ఉంది.
నూతన్ గారు పైన అంతస్తులో ఉంటారు. క్రింద రిసెప్షన్, విజిటర్స్ రూం ఉన్నాయి. అవి కాక, నలభై దాక చిన్న చిన్న క్యూబికల్స్ ఉన్నాయి.
ఆ నలభై కాబిన్లు జనాలతో కిటకిటలాడిపోతున్నాయి. అక్కడున్న వాళ్ళల్లో చాలా వరకు యువతీ యువకులే ఉండడంతో నాకు ఆశ్చర్యం కలిగింది.
రిసెప్షనిస్టుని వివరాలు అడిగాను.
“కాసేపు ఉండండి సార్…వీళ్ళ కాయితాలు పైకి పంపించాకా, మీ సందేహాలు తీరుస్తాను……” అందా అమ్మాయి.
ఓ పావుగంట తరువాత, హడావుడి కొంచెం తగ్గింది. విజిటర్స్ రూంలోంచి మళ్ళీ వెళ్ళి రిసెష్పనిస్టుని కలిసాను.
కస్టమర్స్తో ఎలా నడుచుకోవాలో ఆ అమ్మాయికి బాగా శిక్షణ ఇచ్చినట్లున్నారు.
నా సందేహాలు తీర్చే క్రమంలో వాళ్ళ కేఫ్ గొప్పతనాన్ని బయటపెట్టింది, “మా సార్ అమెరికాలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇండియాలో ఉన్న అతి కొద్ది మంది మోసియాలజిస్టులలో సార్ ఒకరు” అంది.
“విన్నాను” అని అంటూ, “ఆయన సమస్యని ఎలా పరిష్కరిస్తారు? ” అడిగాను.
“అవన్నీ మేము బయటకి చెప్పకూడదు సార్, అవి మా ట్రేడ్ సీక్రెట్స్..” అందా అమ్మాయి.
“ప్లీజ్…. కాస్త చెప్పండి. నేనెవరికి చెప్పను….” అన్నాను.
“ఇక్కడ సలహాతో పాటు, మొబైల్ ఫోన్లని అద్దెకిస్తాం. మీ సిమ్ అందులో వేసుకుని, కావల్సినంత సేపు వాడుకోవచ్చు. ఇక్కడున్న ప్రతీ కాబిన్లోను, ఇయర్ఫోన్లున్న లేటెస్ట్ మొబైల్ ఫోను ఉంది. నూతన్ గారిని కలవడానికి వచ్చిన వాళ్ళని గంటకింత చొప్పున డబ్బులు కట్టి ఆ కాబిన్ లోని మొబైల్ ఫోన్ని వాడుకోమంటాం. వాళ్ళని చూసారా? కొంత మంది ఎస్. ఎం. ఎస్లు పంపుకుంటుంటే ఇంకొంత మంది పాటలు వింటున్నారు. కొంతమంది తాము అప్పటి దాక తాము పంపిన, తమకొచ్చిన ఎస్. ఎం. ఎస్లను డిలీట్ చేసి, మొబైల్ ఫోన్ని తరువాతి వ్యక్తి కోసం సిద్ధం చేస్తున్నారు” అంది.
నిజమే, మరికొంత మంది తమ వంతు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నూతన్ గారి సలహాలు, సూచనలు తీసుకున్న వాళ్ళు కూడా కాబిన్ల వద్ద చేరుతున్నారు.
“కాని ఇలా చేయడం వలన, వీళ్ళ వ్యసనం మరింత పెరుగుతుందేమో?” అన్నాను.
“అదేం కాదు. ఆర్ధిక శాస్త్రంలోని ‘క్షీణోపాంత ప్రయోజన సూత్రం’ అనే దాన్ని ఇక్కడ వర్తింజేస్తారు మా సార్”.
“ఏంటది?”
“థీరీ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటి! ఆ సిద్ధాంతాన్ని సార్ టెక్నిక్స్లో ఉపయోగిస్తారు. మేము ‘పెరుగుట విరుగుట కొరకే’ అనే సూత్రాన్ని నమ్ముతాం. మా సార్ టెక్నిక్స్తో ఎక్స్ట్రీమ్గా ఉన్న వాళ్ళు, నార్మల్గా మారిపోతారు. సార్ చెప్పిన టెక్నిక్స్ని పాటిస్తూ, మొబైల్ వాడడంలో ఏ ఇబ్బంది ఉండదు. ”
మా సమస్య పరిష్కారమవబోతోందనే విశ్వాసం నాకు కలిగింది. జనాలు చాలా మంది ఉన్నా, ఓపికగా కూర్చున్నాం.
ఓ నలభై నిముషాల తర్వాత, మాకు పిలుపు వచ్చింది. నూతన్ గారికి మా సమస్యంతా వివరించాం.
“ఏం పరవాలేదు, ఇలాంటి వాళ్ళని చాలా మందిని నేను సరిచేసాను. అంతా సర్దుకుంటుంది’ అని భరోసా ఇస్తూ, మా వాడిని లేటెస్ట్ మొబైల్స్ గురించి, ఎస్. ఎం. ఎస్ల గురించి ఏవేవో ప్రశ్నలడిగారు. మావాడు ఉత్సాహంగా జవాబులిస్తున్నాడు.
కాసేపయ్యాక, ‘మీ అబ్బాయితో నేను ఏకాంతంగా మాట్లాడి ‘కౌన్సిలింగ్’ చేయాలి, మీరు కాసేపు క్రింద వెయిట్ చేయండి’ అంటూ నన్ను మా ఆవిడని క్రింద విజిటర్స్ రూంలో కూర్చోమన్నారు నూతన్.
* * *
ఇదీ ఇప్పటిదాక జరిగినది… హఠాత్తుగా విజిటర్స్ రూంలోని టి.వి. సౌండ్ పెరిగిపోవడంతో, ఆలోచనల్లోంచి బయటపడుతూ, వర్తమానంలోకి వచ్చాను.
నా దృష్టి టివిలో వస్తున్న ఓ ప్రకటనపైకి మళ్ళింది.
‘మాకు ఎస్. ఎం. ఎస్ చేయండి, కలర్ టివి బహుమతిగా గెలుచుకోండి. షరతులు వర్తిస్తాయి’ అని చెబుతూ, ఓ తేలికైన ప్రశ్నని టివి తెరపై చూపించారు.
“జవాబు సులువుగా చెప్పగలిగే ఈ ప్రశ్నకి ఎంతో మంది ఎస్. ఎం. ఎస్లు పంపుతారు. బహుమతులను పొందాలనే ఉబలాటంలో చాలామంది షరతులను మర్చిపోతుంటారు. బోలెడు డబ్బు తగలేస్తారు, ఇదీ కూడా ఓ రకంగా జూదమే..” అని అంది మా ఆవిడ.
నిజమేనన్నట్లు తలూపాను. అటువంటి వాళ్ళపై జాలిపడ్డాను. మా అబ్బాయి కూడా అటువంటి వాళ్ళలో ఒకడని గుర్తొచ్చి మనసు చివుక్కుమంది.
టి.వి.లో ప్రకటనలు అయిపోయి, పాటలు వస్తున్నాయి. ‘జుంజుం మాయా..జుంజుం మాయా..ప్రేమిస్తినే ఇంతటి హాయా..’ అనే పాట వినబడింది.
ఆ పాట లోని ‘మాయ’ అనే పదం నన్ను బాగా ఆకర్చించింది.
‘ఎస్. ఎం. ఎస్లు అదే…సంక్షిప్త సందేశాలు ఏం మాయ చేస్తాయో కదా’ అనుకున్నాను.
సంక్షిప్త సందేశాల మాయ – ఈ పదాలని ఎస్. ఎం. ఎస్. పరిభాషలో రాయాలంటే సం. సం. మాయ అని రాయచ్చా?
అప్రయత్నంగా, నా నోట ఆ పాటకి పేరడీ వెలువడింది….’సం సం మాయా….. సం సం మాయా… మెసేజ్ పంపిస్తేనే ఇంతటి లాసా…..”
అయితే, నా గొంతు విని అందరూ దడుసుకుంటారని, నాలో నేనే పాడుకున్నాను.
‘సం సం మాయా…సం సం మాయా’ ఈ పదాలు నన్ను వదలడంలేదు. నా బుర్రలో తిష్ట వేసుకున్నాయి.
ఇంతలో నాకో సందేహం వచ్చింది.
‘అవును… వీటిని మొబైల్లో టైప్ చేయాలంటే ఎలా? some some maya? లేక sum sum mayaa? లేక sam sam maaya?…..’
ఏమో! మా వాడిని అడగనా? లేదా మిస్టర్ నూతన్ని అడిగితే మంచిదా?
ఇంతలో మా వాడు క్రిందకి వచ్చాడు. వాడిలో ఏదో కొత్త ఉత్సాహం!
“ఏరా, నూతన్ గారు ఏం చెప్పారేంటి?” అన్నాను కుతూహలం ఆపుకోలేక.
“ఓహ్. చాలా చెప్పారు. అవన్నీ నీకు అర్ధం కావు నాన్నా. టెక్నాలజీ విషయంలో నువ్వు చాలా వీక్. అమ్మకి చెబుతాలే. చివర్లో మాత్రం… సంస్కృత శ్లోకం….’అతి సర్వత్ర….’ అనేదో చెప్పారు…. నువ్వు, అమ్మా ఇంటికి వెళ్ళిపొండి. నేను కాసేపు ఇక్కడుండి వస్తాను…..” అంటూ అక్కడి కాబిన్స్ వైపు నడిచాడు.
(సమాప్తం)
(ఈ కథ చిత్ర మాసపత్రిక జూన్ 2011 సంచికలో ప్రచురితం.)

Follow

Get every new post delivered to your Inbox.